15, జనవరి 2011, శనివారం

శ్రీ శ్రీ

కుక్క పిల్లా.... సబ్బు బిళ్ళా.... అగ్గి పుల్లా....
కదేది కవితకు అనర్హం

అన్నీ నీవైపే చుస్తుంటాయ్....
తమలోతు కనుక్కొమంటాయ్....

హీనంగా చూడకు దేన్ని....
కవితామయమేనొయ్ అన్నీ....

కళ్ళుంటె చూసి....
వాక్కుంటే రాసి....
ప్రపంచం ఒక పద్మవ్యుహం....
కవిత్వం ఒక తీరని దాహం....

ధనార్జన

ధనం కోసం
దర్జా కోసం
కన్న వారిని విడిచి
తన వారిని విడిచి
ఆకలి దప్పికలు మరచి
కూటి కోసం కోటి విద్యలన్న
సూత్రం మరచి
ఎవరి కోసం ? ఎవరి కోసం?
ఎందు కోసం? ఎందు కోసం?
ఈ విచిత్ర పోరాటం
అని
అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే
కాసు కోసం , పచ్చనోటు వాసన కోసం

అంటూ ఆత్మ పరుగు తీసింది
అంతరాత్మ నివ్వెర పోయింది............

డబ్బు.....

ఆత్మ ఉండడానికి మనిషిని కాను
నేను శాశించే నిర్జీవాన్ని....
నిన్ను నడిపించే యంత్రాన్ని
ఏ అధికారానికి నేను తల వంచను
సృష్టి కర్తతో సలాం కొట్టించుకునే నవాబును
మనిషి సృష్టించిన మత్తును నేను
నేను లేని చోటు లేదు
నన్ను తలచని నాధుడు లేడు
అన్నింటిలో నేనే
ఆకలిలో నేనే
చీకటిలో నేనే -- వెలుతురులో నేనే
మనసులొ నేనే -- మాటలలొ నేనే
నీలోనూ నేనే-
నాలోనూ నేనే
నాలో ఈ జగమంతా ఉంది.....
ఉండి తీరుతుంది ---
నా పేరే ధనం....

నా పేరే డబ్బు.......

ఒక ప్రేమికుడి ప్రేమ

నీకు తెలుసా!!!
రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటే
హఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....
నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీ
ప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదు
జీవితానికి జీవం పొసేది ప్రేమ
ఉక్కులాంటి హ్రుదయాన్ని కదిలించేది ప్రేమ
చిలిపి కళ్ళ కదలిక ప్రేమ
చెప్పలేని నా మనస్సే ఒక మూగ ప్రేమ
నీ అందమైన నవ్వులతో నా జీవితం ప్రతి రోజూ ప్రారంభం అవ్వాలని కోరుతూ....
ఒక ప్రేమికుడు.....

గతచిత్రం

కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది।
నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లోఏయే కోర్కెలు దాచుకున్నదీసముద్రం గుర్తుంచుకోదు।
కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకంతుదకంటా వెంటాడుతుంది।
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచిమరల మరల కళ్ళెదుట చూపెడుతుంది।
కలిసి కనుమరుగైన మనుషులు,అంది చేజారిన అవకాశాలు,అపరిపక్వతతో, అమాయకతతోపొంది,
పోగొట్టుకొన్న విలువైన అనుభవాలుకిక్కిరిసిన పలు శకలాలుగా తోచి గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది।
ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,అంతా ముగిసిన గతం లో కూడావింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.

రాయాలని ఉంది!

నందన వనం లో ఎగిరే
రంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేం
కీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నైతేనేం
మనిషి మనస్సులో సదా పరుగులెత్తేకోరికల గురించి రాయాలని ఉంది॥
హేమంతం లో గాలిని నింపే పొగమంచులా నైతేనేం
గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా నైతేనేం
మనిషి మనసున నిండిన ఆర్ద్రత గురించి రాయాలని ఉంది॥
రాయాలని ఉంది.......
మనిషి ఆశలనూ, భావాలనూ,
చెరిగి పోని జీవిత సత్యాలనూ
నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది॥

నీ స్నేహం

కమ్మని కావ్యం నీ స్నేహం,
చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం,
నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం,
హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం,
నా కళ్ళలో ఆశ నీ స్నేహం,
నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......

మళ్ళిరాని అవకాశం

కోల్పోవద్దు మరో అవకాశం
రాకపోవచ్చు తిరిగి నీ కోసం॥
మనసు విప్పి మాట్లాడడానికి,
ఒక మంచి మాటను చెప్పడానికీ,
ప్రేమిస్తున్నానని తెలుపుతూ,
ఒక సందేశం పంపించడానికీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఎంతో దూరాన వున్న,
అమ్మానాన్నల కోసం,
వారం, వారం ఫోనులో,
వార్తలు తెలిపే లేఖలో॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
అందరికీ రానిది ఆ,
అవకాశం వచ్చిందా
అదే ఒక అదృష్టం,
కర్తవ్యం నెరవేర్చే,
స్థితిలో నువ్వుంటే,
నీకు దేవుడు ఇచ్చిన పుణ్యం॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
మనసారా స్పందిస్తూ,
మమతలనే అందిస్తూ,
ఓ “థేంక్‌ యూ”, ఒక “సారీ”,
“ఐ లవ్‌ యూ” చెప్పేందుకు॥ …। కోల్పోవద్దు మరో అవకాశం
వచ్చిన దానిని వదిలీ,
ఎదురుచూడకు మరో సారి,
అతి విలువైన క్షణాల మధ్య,
ఉండొచ్చు కొన్ని జీవిత కాలాల వ్యవధి॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఆలసించబోకుమసలు,
ఆచరణను మరచీ,
కలగా కరిగే బ్రతుకున,
కావచ్చునిదే (నీ) ఆఖరి మజిలీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।

కనిపించడం లేదు

నా మనసు కనిపించడం లేదు
నువ్వేమైన పట్టుకేల్లవా?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నాయి
ఆ భావాత్మక క్షణాలు ఇంకా జ్ఞాపకమే
రంగుల మధ్య రూపు దిద్దుకున్న నా జీవితం జ్ఞాపకమే
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నాయి
విప్లవాలు రగిల్చి ఉద్యమాలు తెచ్చిన పుస్తకాలున్నాయి
పుస్తకాల కోసం పడ్డ ఆ క్షణాలు ఇంకా జ్ఞాపకమే
ఇల్లంతా పరచుకున్న కవిత్వముంది
కవిత్వం మధ్య కదలాడే నా జీవితం ఉంది...
ఆశ్రద్దగా పడేసుకున్న నా గెలుపు భావ చిత్రాలున్నాయి...
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్య
చెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి .....
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
మిత్రమా , నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా..
నా మనసేమైనా పట్టుకేల్లవా ???

నా పేరు స్నేహం!!

పరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను !!!
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి ...
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను....
నీ జీవితంలో ప్రతి విజయానికి
నీ వాళ్ళంతా గర్వించి నప్పుడు కాస్తంత విచ్చుకొనే నీ
పెదవుల నుండి రాలిపడే పూవులోని తావి నేనవుతాను....

నా పేరే స్నేహం!!

ప్రయాణం

ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమో
ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు
ఈ సహప్రయానికులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు
ఇది వేల్లెచోటు నేను అడిగిందే అనుకుంటాను...
ఇది కదిలే దారి నాకు నచ్చేదేనని ఆశిస్తాను
ఇది బయల్దేరిన స్థలం మాత్రం నేను మెచ్చినది కాదు
ఇక్కడంతా చీకటి
ఇక్కడంతా ఇరుకు
ఇక్కడ చిన్న కునుకుకు కూడా అవకాశం లేదు
ఇక్కడంతా హడావుడి...
ఇక్కడంతా కదలిక తెలియని వేగం
ఇక్కడ మనసు విప్పి మాట్లాడడానికి ఎవరు లేరు
నాకు నేను ఉహలోకాన్ని అల్లుకుంటాను
నాకు నేను బెత్తెడు జాగా చెక్కుకుంటాను
నాకు నేను దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను...

నిద్ర

రోజంతా అవిశ్రాంతంగా ఆలోచనల
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది......

నిద్ర కనురెప్పల గవాక్షాలను
తాకే ముందు ఏదో గమ్మత్తైన భావన
బరువైన తామర పూవుల స్పర్శ
ముంగురుల చివర్లను కదిలించినట్లు
నీలాంబరి ఆనంద మందారాలు పూయించినట్లు
సన్నగా పాడే సెలయేటి ప్రవాహంలో
జలకన్యలా నేను సుతారంగా జారిపోతాను
నా దారిలో ఎన్నో సౌగంధికా పుష్పాలు
అనుభవాల పరిమళాలు వీచే సన్నజాజి పూగుత్తులు
రంగు రంగుల స్వప్నాల రెక్కలను
విప్పుతూ ఎగిరే సీతాకోకచిలుకలు....

అందమైన ఆలాపనలా సుళ్ళు తిరుగుతూ
కలల అలల మీద తేలే జ్ఞాపకాల ఆనవాళ్ళతో
జలపాతగీతమై సాగిపోయే నాకు
హఠాత్తుగా ఒక కొండ శిల అడ్డుగా నిలుస్తుంది
చటుక్కున కనులు విప్పేసరికి
ఉమ్మెత్త పువ్వులా ఉదయం తెల్లగా నవ్వుతుంది .....

డైరీలో ఒక పేజి

తొలి పొద్దువై వచ్చావు
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది

ధనమేరా.........

నాకు ఎంతో ఇష్టమైన పాటలలొ, ఇది ఒకటి. ధనము, దాని విలువ గురించి ఎంతో బాగా వ్రాసారు. ముఖ్యంగా కొన్ని వాఖ్యాలు అద్భుతం. "ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా ", "శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం"

వ్రాసినది:(తెలియదు)
పాడినది: ఘంటసాల
చిత్రం: లక్ష్మి నివాసం.

ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

మానవుడె ధనమన్నది సృజియించెనురా
దానికి తానె తెలియని దాసుడాయెరా!
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడపెట్టరా
కొండలైన కరగి పోవు కూర్చొని తింటె
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటె.

కూలివాడి చెమటలోన ధనమున్నది రా
కాలి కాపు కండల్లొ ధనమున్నది రా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీ దేవిని నిరసించుట తీరని దోషం.

బెంగుళూరులో భోజనాల గోల

బెంగుళూరులో " ఆంధ్రా స్టైల్ భోజనం" అన్న బోర్డ్ పెడితే చాలు, జనాలు తండోపతండాలుగా ఎగబడతారు. బోర్డ్ ఒక్కటి చాలు, లోపల మనం పచ్చ గడ్డి పెట్టినా సుబ్బరంగా చెల్లుతుంది. ఇక గొందుకి రెండు ఆంధ్రాస్టైల్ పూటకూళ్ళ దుకాణాలు. ఇక ఆంధ్రాస్టైల్ అని పెట్టాక గోంగూర, ఆవకాయ ఉండాలి కదా. అవి ఒక రెండు డబ్బాలు పడేస్తారు. అవితింటే ఇక జన్మలో వాటి జోళికి వెళ్ళరు . ఇక అరిటాకులో వడ్డనలు స్టార్ట్. అంటె అన్ని అలా అని కాదు . కాని చాలా వరకు అంతే.

ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.

ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)