5, మే 2011, గురువారం

నేను అడిగిందల్లా ఆగమేఘాల మీద అధికారంతో అందించావు

నేను అడిగిందల్లా ఆగమేఘాల మీద అధికారంతో అందించావు
కాలు పెట్టిన చోటల్లా క్రమబద్దీకరించావు
తర తరాలకు మనగలిగేలా పునాదులకు సిమెంట్ ఏసావు
పవరు ప్లాంట్లు ఇచ్చి నిరంతర విద్యుత్తు ఉండేలా చేసావు
గాదెల నిండా నింపుకోడానికి గనులు ఇచ్చావు
ఎవరు నోరేట్టినా తిట్టడానికి పేపర్ పెట్టించావు
మన గురించి స్తుంతిచడానికి ఓ చానల్ పెట్టించావు
మన ఆస్తులు కేసి ఆబగా చూస్తారని
మామ బావలకు సర్వే చేసి మరీ
సరిహద్దుల గొడవ లేకుండా జిల్లాలనే రాసిచ్చావు
ఇంతిచ్చిన నువ్వు అసలైన మంత్ర దండం నీ కుర్చీ
నాకు వచ్చేలా ఏర్పాటు చెయ్యకుండా ఏమారావు.

అదే ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నెలబెడుతోంది

లాడెన్ ను తమ దేశంలోనే తనువు చలింపజేసి
వాడి కుటుంబాన్ని వదిలి
వచ్చిన వేగంతో అమెరికా పనికానిచ్చుకుపోతే

మేము నీళ్ళు పోసిన మొక్క తన కొమ్మలతో
మా కొమ్ములనే విరిచిందని
ఉంటే చెప్పండనే అపాత్ర ధర్మ గాళ్ళకు
ఇన్నాళ్ళూ లేదు లేదని
దాన ధర్మాలకు వాళ్ళ వద్దే చేయి చాస్తూ
తమ కలుగులోనే దాచి
ప్రపంచ దేశాల ముందు
గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు
పడరాని పాట్లు పడుతూ

మన దేశానికి
రివాజుగా అపద్దాలు చెప్పి చెప్పి
ఆరితేరిపోయిన పాకిస్తాన్ ఐ ఎస్ ఐ

లాడెన్ దొరికిన ఇంటి పై మేము
2003 లోనే దాడి చేసాము
ఏదో సాధారణ కుటుంబం ఉంటే
తరువాత పట్టించుకోలేదు
అని అందమైన అబద్దం చెప్పింది

అదే ఇప్పుడు ప్రపంచం ముందు
దోషిగా నెలబెడుతోంది
2004లో తీసిన ఉపగ్రహాల చిత్రాలలో
నేల బారుగా ఉన్న ఆ ప్రాంతం పై
ఏమని దాడి చేసారో చెప్పండని
ఎదురుదాడి మొదలయ్యింది

నా కైతే పాపం పండిందేమో అనిపిస్తోంది
అట్టని ఎప్పుడూ అట్టుడుకే దేశంగా దాయాదులను
చూడడం ఊహిచుకోలేక పోతున్నా

రేపటి తరాల తలరాతలు మీ చేతిలో ఉన్నాయని మరవక మనసుతో ఆలోచించి మంచి వాళ్ళను ఎన్నుకోండి

కడప మహానుభావుడే దేవుడైనప్పుడు
కడపకు ఆ దేవుడి పేరే
పెడితే పెట్టుకొనీలే అని
సరి పెట్టుకొన్నారో!

లేదా దేవుడే లేదు
ఉంటే ఆయన కడప పేరును
ఆయనే ఉంచే వాడు కదా
అని దేవుడిని నిందించకుండా

కాటికి కాళ్ళు జాపుకున్న
అన్నా హజారే లాంటి వాళ్ళు
అవినీతి పైన నిరసిస్తుంటే
మాకు నీరసం వస్తోంది అని అనకుండా

సీమ పౌరుషం అనేది ఒకటి
మనకు ఏడ్చింది అని మరువకుండా
దానిని కాపాడడం కోసం

పేరు మార్చిన వాళ్ళను,
అవినీతిలో ఆరి తేరి
దేవుడి కడపకు కళంకం తెచ్చే వాళ్ళను
కనికరించకుండా

ఖర్చులకోసం తీసుకొనే
ఎన్నికల డబ్బుల సాక్షిగా
అది ప్రజల సొమ్మే అని నమ్మి
అది మనందరి సొమ్మే అని
మనస్పూర్తిగా అనుకొని
ఇచ్చిన వాళ్ళ నమ్మకానికి తూట్లు పొడిచి
రేపటి తరాల తలరాతలు
మీ చేతిలో ఉన్నాయని మరవక
మనసుతో ఆలోచించి
మంచి వాళ్ళను ఎన్నుకోండి.

భారత దేశాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి

పాక్ పాలకులు సైన్యం
భారత దేశాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి
అగ్ర రాజ్యాన్నే గడ గడ లాడించిన
ఒసామా ఒక్కడిని రక్షించుకోలేనందుకు
అదీ సైనిక స్థావరాలకు దగ్గరగా ఉన్నా
మీరు దక్కించుకోలేక పోయారు
అదే మా దేశం లో చూడండి
కసాబ్ గారికి కమ్మని భోజనం పెట్టి
కుషీ చేయుస్తూ
కోట్ల ఖర్చుతో
ఎలా రక్షిస్తున్నామో చూసి నేర్చుకోండి

అంత్య ప్రాస తో సరదాగా...................

మీపై నాకు అభిమానం ........................... (మాటల్లో చెప్పలేని )
దానికి లేదు కొలమానం..............................(చెప్పలేనంత పెద్దదో చెప్పకూడనంత చిన్నదో )
అందుకే చేద్దామని సన్మానం...................... ( సుత్తి తో కాదు సుమీ )
ఇద్దామని ఒక బహుమానం....................... (ఇది మాత్రం సీక్రెట్ )
వలదు నాపై అనుమానం.......................... (నమ్మండి నన్ను )
రాకపోతే నాకు అవమానం........................ ( అవునండి )
ఎక్కండి ఇక విమానం............................. ( ఫ్లైట్ టికెట్స్ ఇవ్వబడవు )
అందింది కదా ఆహ్వానం
ఇంకెందుకు మౌనం
మీ రాకే నాకు ప్రధానం

హింసించి ఉంటే సారీ ;)

ఇంటి పేరు కాజ

మారు పేరు నాని

నేనొక పెద్ద మాటకారి

అలాగే కొంచెం చమత్కారి

నా కవిత్వం కావేరి

నా సుత్తి మరి మహమ్మారి
నా ఆలోచనలు భారీ
ప్రస్తుతానికి నేనొక బ్రహ్మచారి

హింసించి ఉంటే సారీ
ఈ పూట కి ఉంటా మరి !
మీరలా మౌనంగా వెళ్ళిపోతే కామెంట్ కొట్టే వారు ఏరి ?

బ్లాగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ బ్లాగ్మిత్రులకు నమస్కారం

మీకిదే నా పురస్కారం

మీకు వలదు తిరస్కారం

నాకు కలదు సంస్కారం

మీపై నాకు మమకారం

అందుకే హాస్యం తో ఈ చిన్న ఉపకారం

కారాదు నా సుత్తి మీకు అపకారం

కొంత చమత్కారం

మరి కొంత వెటకారం.......................

ఆ సుత్తి గీతిక విన్నారు గా తాత్పర్యం మీకోసం

న కత్తి న రణం
న ఒత్తి న పదం
న వత్తి న దీపం
న సుత్తి న జీవితం


ఆ సుత్తి గీతిక విన్నారు గా తాత్పర్యం మీకోసం

ఒకటో లైన్ : కత్తి లేనిదే యుద్ధం లేదు
రెండో లైన్ : ఒత్తులు లేనిదే పదానికి అర్ధం లేదు
మూడో లైన్ : వత్తి లేనిదే దీపానికి అర్ధం లేదు
నాలుగో లైన్ : సుత్తి లేనిదే ఈ జీవితం లేదు

కాలం కవిత

కసీ లేదు

కనికరం లేదు

కల్లాకపటం తెలియదు

ఎన్నెన్నో ప్రశ్నలు అన్నిటికీ అదే సమాధానం

కలకలం రేపుతుంది

కన్నీటిని మిగిలిస్తుంది

కవ్విస్తుంది,నవ్విస్తుంది

అందుకే ఒక్కోరోజు అనిపిస్తుంది

కాలం కలమై రాసిన కమ్మని కధే ఈ జీవితం

మరో రోజు అనిపిస్తుంది

కాలం కలమై రాసిన కలతల కధే ఈ జీవితం

ఏదైనా నీ జీవితం కాలం లో కలిసిపోయే కధ -

ఆంధ్రా నాకు తెలంగాణ నీకు!

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికలు రావద్దని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం, పార్లమెంటు సభ్యుత్వానికి రాజీనామా, పార్టీ నుండి వెళ్లి పోవడం తదితర పరిణామాల దృష్ట్యా ప్రజలలో కలిగిన సానుభూతిని ఓటింగ్‌గా మలుచుకునే ఉద్దేశ్యంతో జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కోరుకుంటున్నారు. అందుకే ఆయన తనకు ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉందనే వ్యాఖ్యలను మరోసారి తెరమీదకు తెస్తున్నారు. అయితే ఇలా ప్రభుత్వాన్ని పడగొడతానని, ఉప ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుందని కడప జిల్లా వోటర్లను మభ్య పెట్టడానికే అలా వ్యాఖ్యానిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగన్‌కు అంత సామర్థ్యం ఉంటే ఇన్నాళ్లు ఎందుకు నిరీక్షిస్తాడనే వారూ ఉన్నారు. కేవలం వోటర్లను బెదిరింపులకు గురిచేసి మభ్య పెట్టడానికే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది.


కడప ఉప ఎన్నికలు అయ్యాక ఆరునెలల్లోగా ఎన్నికలు వస్తాయని జగన్ చెప్పడం అంతా వట్టిదేనని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి జగన్ సిద్ధంగా ఉన్నప్పటికీ జగన్‌తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. తనకు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదని జగన్‌కు తెలిసినప్పటికీ రాజీనామా చేసినప్పటి నుండి ప్రభుత్వాన్ని పడగొడతానని బెదిరించడం ప్రజల్లో అస్పష్టత కల్పించడంలో భాగమేననే పలువురు భావిస్తున్నారు. జగన్ వర్గం వారు ఎన్నికలకు సిద్ధంగా లేక పోవడమే కాకుండా ఎంఐఎం, పిఆర్పీ కలిసి కాంగ్రెసుకు చేయూత నిచ్చేందుకు సిద్ధపడటం జగన్ ఎన్నికల అత్యుత్సాహానికి దెబ్బ కొడుతున్నాయి. అయితే తనపై సానుభూతి విరివిగా ఉన్న సమయంలో ఎన్నికలు వస్తే మాత్రం తనకు అందరికంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయంగా జగన్ భావిస్తున్నారు.

ఇక జగన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కూడా ఎన్నికలను వీలైనంత త్వరగా కోరుకుంటున్నారు. గత సంవత్సరంన్నరగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం కారణంగా టిఆర్ఎస్‌కు పదేళ్లలోలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సీమాంధ్రలో జగన్ హవా కొనసాగితే, తెలంగాణలో టిఆర్ఎస్ హవా కొనసాగుతుంది. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడదోస్తాడా అని గుంటనక్కలా కాచుకు కూచున్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వాన్ని పడదోస్తే టిఆర్ఎస్‌కు 70 సీట్ల వరకు రావచ్చని ఓ అభిప్రాయం. అయితే రెండు మూడు నెలలుగా టిఆర్ఎస్ ప్రభావం 70 నుండి తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ దశలో కెసిఆర్ వీలైనంత త్వరగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

కెసిఆర్, జగన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెసు, టిడిపి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, జగన్ ప్రభావం నేపథ్యంలో టిడిపి, కాంగ్రెసు సంఘర్షణలో పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేవు. రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో టిడిపి ప్రభావం కోల్పోగా, కాంగ్రెసుకు సొంత ఇంటిలోనే తెలంగాణ పోరు, జగన్ హోరు కష్టంగా పరిణమించింది. దీంతో ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ఏమాత్రం రెడీగా లేవు.

సోవియట్‌పై పోరాటానికి అమెరికానే ఒసామా బిన్ లాడెన్‌ను పెంచి పోషించిందనేవారున్నారు.

బహుశా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడి కన్నా ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెనే పాపులర్ అయి ఉంటాడు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11వ తేదీన దాడులు నిర్వహించిన తర్వాత ప్రపంపవ్యాప్తంగా అతని పేరు మారు మోగిపోయింది. అమెరికాను గడగడలాడించిన లాడెన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగాడనేది ఆసక్తికరమైన విషయమే. ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ 1957 మార్చి 10వ తేదీన జన్మించాడు. హింసాత్మకమైన జిహాదీ ఉద్యమం చేపట్టడం వల్ల లాడెన్ సౌదీ అరేబియా పౌరసత్వాన్ని కోల్పోయాడు. అతని బిలియనీర్ ఫ్యామిలీ అతన్ని దూరం చేసుకుంది. అతనితో తమకు సంబంధం లేదని ప్రకటించుకుంది.


లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ అవాద్ లాడెన్ సంపన్నమైన వాణిజ్యవేత్త. సౌదీ రాచకుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలుండేవి. మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ పదో భార్య హమీదా ఆల్ - అత్తాస్ ఏకైక పుత్రుడు లాడెన్. లాడెన్ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఒసామా తల్లి ముహమ్మద్ ఆల్ - అత్తాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. లాడెన్ వారితో కలిసి ఉండేవాడు. లాడెన్ 1968 నుంచి 1976 వరకు వాహబీ ముస్లిం పద్దతుల్లో పెరిగాడు సంపన్నమైన లౌకిక ఆల్ - తాగర్ మోడల్ స్కూల్లో చదివాడు కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక, వాణిజ్య యాజమాన్య శాస్త్రాలు చదివాడు. 1979లో సివిల్ ఇంజనీరింగ్, 1981లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాడని అంటారు. అయితే, మూడో సంవత్సరంలోనే చదువును ఆపేశాడని చెబుతారు. అయితే, విశ్వవిద్యాలయంలో ఖురాన్, జిహాద్, సేవా కార్యక్రమాలను అన్వయం చేసే కార్యక్రమాల్లో మునిగిపోయినట్లు చెబుతారు. లాడెన్ కవిత్వం కూడా రాశాడు.

లాడెన్ తన 18 ఏళ్ల వయస్సులో లటాకియాలో నజ్వా ఘేనంను వివాహం చేసుకున్నాడు. లాడెన్ 2002లో నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. లాడెన్‌కు 25 లేదా 28 మంది పిల్లలు ఉంటారని చెబుతారు. లాడెన్ తండ్రి ముహమ్మద్ బిన్ లాడెన్ 1967లో సౌదీ అరేబియాలో విమాన ప్రమాదంలో మరణించాడు. అమెరికా పైలట్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సంకేతాలు ఇవ్వడంతో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లాడెన్ సవతి సోదరుడు, కుటుంబ పెద్ద సలీం బిన్ లాడెన్ 1988లో అమెరికాలోని టెక్సాస్ సాన్ ఆంటోనియోలో విమాన ప్రమాదంలో మరణించాడు.

షరియా పునరుద్ధరణ వల్ల ముస్లిం ప్రపంచం సరైన మార్గంలో నడుస్తుందని లాడెన్ విశ్వసించేవాడు. పాన్ - అరబిసమ్, సోషలిజం, కమ్యూనిజం, ప్రజాస్వామ్యాలను వ్యతిరేకించాలని ఉపదేశించేవాడు. ఈ విశ్వాసాలతో హింసాత్మక కార్యక్రమాలను విస్తరించిన జిహాదీని తొలుత ఖుట్బిజం అని పిలిచేవారు. ముస్లిం ప్రపంచంలో తాలిబన్ నేత ముల్లా ఒమర్ ప్రభుత్వ హయాంలోని అఫ్షనిస్తాన్‌ను ఏకైక ఇస్లామిక్ దేశమని భావించేవాడు. ఆ ప్రభుత్వ సాయాంతో అమెరికా, ఇతర ముస్లిం వ్యతిరేక దేశాలపై పోరాటం సాగించాలని లాడెన్ ఆల్ ఖైదాను స్థాపించాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, మధ్య ప్రాచ్య దేశాల నుంచి అమెరికా సైన్యాలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశాడు.

అప్షనిస్తాన్‌పై సోవియట్ దాడిని తిప్పికొట్టడానికి లాడెన్ 1979లో అబ్దుల్లా ఆజ్జంతో చేతులు కలిపాడు. కొంత కాలం పెషావర్‌లో ఉన్నాడు. సోవియట్‌పై పోరాటానికి ఏర్పడిన ముక్తబ్ ఆల్ ఖిదమత్‌ను 1988లో చీల్చి ఆల్ ఖైదాను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లో దాడులకు లాడెన్ కుట్ర చేశాడు. సోవియట్‌పై పోరాటానికి అమెరికానే ఒసామా బిన్ లాడెన్‌ను పెంచి పోషించిందనేవారున్నారు. అతనే చివరికి అమెరికాకు కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యాడని చెబుతారు.

నందమూరి తారక రామారావు, నార్నే ప్రణితల వివాహం శుభప్రదంగా సుసంపూర్ణమవాలని మనసారా ఆశీర్వదించుదాం..!

స్వతహాగా సీదా సాదా బట్టల్లో హంగూ ఆర్బాటాలు లేకుండా ఉండాలనే మనస్తత్వంగల జూ ఎన్టీఆర్ తన వివాహానికి మాత్రం ప్రత్యేకమైన వస్త్రాలంకరణ, విశేషమైన ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వివాహం తన ఒక్కడికీ సంబంధించింది కాదు. ఇరువైపులా రెండు వంశాల పేరు ప్రతిష్టలకు అనుగుణంగా, అందరూ కలకాలం గుర్తుంచుకునేట్టుగా, వివాహం వేడుకగా జరగాలన్నది ఎన్టీఆర్ అభిలాష. శుభలేఖలో తాత ఎన్టీరామారావునే కాకుండా ఆయన తల్లిదండ్రుల ఛాయాచిత్రాలను కూడా అచ్చువేయటంలో జూ ఎన్టీఆర్ కి తన వంశస్తుల మీద ఉన్న అభిమానతంతో పాటు తన వెనుక నున్న మూడు తరాల గుర్తు చేసుకోవటం, అందరికీ తెలయజేయటం అన్నది భారతీయ ప్రాచీన సాంప్రదాయాన్ని ఎంత గౌరవింస్తున్నారో తెలుస్తోంది.

ఎన్టీార్ అభిలాషకి దీటుగా ధర్మవరం నుంచి నవరత్నాలు పొదిగి ప్రత్యేకంగా నేసిన చీర వచ్చింది భద్రాచల సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలు వచ్చాయి. అభిమానల ఆనందానికి అవధులు లేవు. ఎన్టీఆర్ ప్రణతిల మీద వసంత్ ఒక మధుర గీతాన్ని రచించగా, అమిర్నేని రామకృష్ణ ఈ గీతా నిర్మాణానికి పూనుకున్నారు, గీతా మాధురి, శ్రీకృష్ణ ఆలపించిన ఈ గీతానికి అర్జున్ స్వరకల్పన చేసారు.

శరవేగంగా సాగుతున్న పెళ్లిపనులలో భాగంగా, హైటెక్స్ లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ రూపొందిస్తున్న కళ్యాణ వేదిక 300మంది కృషితో 18కోట్ల రూపాయల ఖర్చుతో శోభాయమానంగా రూపుదిద్దుకుంటోంది. రేపు మే 5న జరిగే ఈ వివాహానికి విచ్చేసే 10000మంది అతిథుల సౌకర్యాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇక అసలైంది వివాహ భోజనం! ఎంత ఆర్భాటంగా అలంకరించినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా, అతిథులను ఎంత బాగా లోపలికి ఆహ్వానించి వారి సకల సౌకర్యాలనూ చూసుకున్నా, భోజనం ఏర్పాట్లు పెళ్ళిలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే కోనసీమ ప్రత్యేకమైన పనస పొట్టు, దోసఆవ చెయ్యటానికి పాక శాస్త్రంలో సిద్దహస్తులు వచ్చేసారు. నందమూరి తారక రామారావు, నార్నే ప్రణితల వివాహం శుభప్రదంగా సుసంపూర్ణమవాలని మనసారా ఆశీర్వదించుదాం..!

అతని గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ చెబుతూ వస్తోంది

అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఉదంతంతో పాకిస్తాన్ అసలు రంగు బట్టబయలైంది. ఉగ్రవాదులకు, అండర్ వరల్డ్ శక్తులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందనే భారత వాదనకు బలం చేకూరింది. భారత ప్రభుత్వం తగిన సాక్ష్యాధారాలతో తమకు కావాల్సిన దోషుల పేర్లను ఇచ్చినప్పటికీ వారెవరూ తమ దేశంలో లేరని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. కరాచీ నుంచి దావూద్ ఇబ్రహీం తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నా అతని గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. దుబాయ్‌లో దావూద్ కూతురు పెళ్లి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడితో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు. అయినా దావూద్ గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్ మొండిగా చెబుతోంది.

కరాచీలో దావూద్‌తో పాటు అతని సోదరుడు అనీస్, చోటా షకీల్, టైగర్ మెమెన్, అఫ్తాబ్ భక్తి, ఎడ్డా యాకూబ్, ఫాహిమ్ మచ్మచ్ కూడా కరాచీలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. ఆ జాబితా చాలా పెద్దగా ఉంది. ముంబై రైలు పేలుళ్ల నిందితులు రియాజ్ భక్తల్, అతని సోదరుడు ఇక్బాల్ భక్తల్ కూడా పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత్ అప్పగింత ఒప్పందం చేసుకున్న తర్వాత 1990 దశకంలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్తాన్‌కు తరలడం ప్రారంభమైంది.

దావూద్ తన అనుచరులతో పాటు కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడని తగిన సాక్ష్యాధారాలతో భారత్ పాకిస్తాన్‌కు తెలిపింది. లాడెన్ మృతిని బట్టి వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉంటున్నారనేది మరింత స్పష్టమైందని భారత హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. భారత అబూ సలేం, బంటీ పాండే వంటివారిని భారత్‌కు విదేశాల నుంచి తీసుకు రాగలిగింది. కానీ పాకిస్తాన్ విషయంలోనే సమస్య ఎదురవుతోంది. అయితే, అమెరికా లాగా పాకిస్తాన్‌లో దాడులు చేయడం భారత్‌కు సాధ్యం కాదు.

కడపలో తగిన ఫలితం సాధిస్తే చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో తిరుగు ఉండకపోవచ్చు

కడప, పులివెందుల లోకసభ, శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మధ్యన జరుగుతున్నవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ జగన్‌కు పోటీగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం చిరంజీవిని తన పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనకు ప్రధాన ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించి, 2014 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో చిరంజీవి తన దూకుడును, విమర్శల ధాటిని వైయస్ జగన్‌కు చవి చూపించారు.

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి ఓడినా, వైయస్ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించుగలితే దాని క్రెడిట్ చిరంజీవికి దక్కే అవకాశం ఉంది. చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా వైయస్ జగన్‌పై వ్యక్తిగత దాడికి దిగారు. జగన్ వ్యవహారంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డికి పెట్టని కోట అయిన పులివెందులలో అడుగు పెట్టి, తన విమర్శల దాడిని కొనసాగించారు.

చిరంజీవిని కూడా వైయస్ జగన్ తన ప్రత్యర్థిగానే చూస్తున్నారు. చిరంజీవితో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుందనే వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలతో వార్తాకథనాలను ప్రసారం చేయడం ప్రారంభించింది. చిరంజీవిని ఆహ్వానించడంతోనే 2014 ఎన్నికల నాటికి కూడా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు తరఫున ముందుకు వచ్చే అవకాశాలు లేవని జగన్ తేల్చుకున్నట్లు చెప్పవచ్చు. కడపలో తగిన ఫలితం సాధిస్తే చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో తిరుగు ఉండకపోవచ్చు.

హీరో రాజశేఖర్ గొంతెమ్మ కోరిక?

తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత డైలమాలో పడినట్లు తెలుస్తోంది. వారిద్దరు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తాము తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నట్లు వారు వెంటనే ప్రకటించలేదు. వారు అసంతృప్తితోనే చంద్రబాబును కలిసిన తర్వాత బయటకు వచ్చినట్లు వినికిడి. తెలుగుదేశం పార్టీలో చేరితే తమకు కావాల్సినవాటిని రాజశేఖర్ దంపతులు చంద్రబాబును అడిగినట్లు చెబుతున్నారు.

బహుశా, జీవితకు తెలుగు మహిళ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని రాజశేఖర్ చంద్రబాబును అడిగి ఉంటారని చెబుతున్నారు. తనకు షరతులు పెట్టడాన్ని చంద్రబాబు సహించరు. అదే రీతిలో చంద్రబాబు వారి షరతులకు స్పందించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ దంపతులవి గొంతెమ్మ కోరిక అని కూడా చంద్రబాబు కొట్టిపారేసినట్లు చెబుతున్నారు. దీంతో రాజశేఖర్ దంపతులు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలా, వద్దా అనే విషయంపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి జారుకున్నారు

జగన్‌కు ఓటు వేయాలా నిర్ధారించుకోలేని స్థితిలో వోటర్లు ఉన్నారు.

ఉప ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ సమయంలో కడప, పులివెందుల నియోజకవర్గాలలో ఆయా అభ్యర్థుల ప్రచార జోరు ఉధృతం ఉంది. అయితే ఆయా పార్టీల ప్రచారం కొనసాగుతుండగా పులివెందుల వోటర్లు మాత్రం పూర్తిగా డైలామాలో పడిపోయారు. గడిచిన ముప్పయ్యేళ్లుగా పులివెందుల నియోజకవర్గం వోటర్లు నయానో, భయానో, రిగ్గింగో ప్రతిపక్షాల వాదనలు ఏవైనా కాంగ్రెసుతో ఉన్నారు అనడం కంటే వైయస్ కుటుంబంతో ఉన్నారనే చెప్పవచ్చు. కడప లోకసభ విజయం, మెజార్టీ కూడా పులివెందుల నియోజకవర్గంపైనే ఆధారపడి ఉండేది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం, జగన్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్థాపించడం, జగన్ బాబాయి వివేకానందరెడ్డి కాంగ్రెసు పార్టీలోనే కొనసాగడం, అనంతరం ఉప ఎన్నికలు రావడం అలా అలా జరిగిపోయాయి.

అయితే ఉప ఎన్నికలలో ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ ప్రస్తుతం అన్న బాటలో నడుస్తూ తమకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న వివేకానందరెడ్డికి ఓటు వేయాలా లేక తండ్రి నుండి వారసత్వం కోరుతున్న జగన్‌కు ఓటు వేయాలా నిర్ధారించుకోలేని స్థితిలో వోటర్లు ఉన్నారు. ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం కాంగ్రెసులోనే ఉంది. ఆ పార్టీలో ఉండే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇప్పటికిప్పుడు జగన్ బయటకు వచ్చి పార్టీ పెట్టారు. ఇది కూడా వోటర్లను ఆలోచింప చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీగా జగన్, ఎమ్మెల్యేగా విజయమ్మ కొన్నాళ్లు ఉన్నప్పటికీ ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విషయం జగన్‌కు నెగిటివ్‌గా తయారయింది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో పులివెందులలోని దాదాపు సగం కాంగ్రెసు పార్టీ సంప్రదాయ వోటర్లలో సందిగ్ధత నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

అయితే జగన్ కంటే తమకు అందుబాటులో ఉన్న వివేకా వైపు వోటర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే జగన్ కంటే వివేకా రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివేకా గెలిచి మంత్రి అయితే తమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కూడా వారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక జగన్ సానుభూతి కోసం విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండగా వివేకా మాత్రం ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా గెలుపుపై విశ్వాసంతో ఉంది. పులివెందులలో ఉన్న కాంగ్రెసు ఓట్లు జగన్, వివేకాలకు చీలిపోతే తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు.