30, మార్చి 2011, బుధవారం

""దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది"' కాని నూటొక్క జిల్లాల అందగాడు ఇకా లేరు

ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్ ఈ రోజు(30, మార్చి 2011) ఉదయం అపోలో హాస్పటల్ లో మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అస్వస్ధతో చికిత్స పొందుతున్నారు.నూటొక్క జిల్లాల అందగాడు గా ఫేమస్ అయిన నూతన ప్రసాద్ కెరీర్ అక్కినేని.. అందాల రాముడు(1973) చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత ఆయన నీడలేని ఆడది వంటి చిత్రాలు చేసినా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. నెగిటివ్ పాత్రలను తనదైన శైలిలో పండిస్తూ ఒకానొక స్టేజిలో నూతన ప్రసాద్ లేనిదే తెలుగు సినిమా లేదు అన్న స్ధితికి చేరుకున్నారు. ఆయన డైలాగ్ డెలవరి కామిక్ టచ్ తో విలనిజానకి కొత్త అర్దం చెప్తూ సాగింది.

ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి పెద్ద పెద్ద హీరోలందరితో చేసిన నూతన ప్రసాద్ కామిడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు అన్న తేడా లేకుండా అన్ని పాత్రలకూ న్యాయం చేస్తూ వచ్చారు.ఇక రాజాధిరాజు చిత్రంలో ఆయన కొత్త దేముడండి అనే పాటతో పీక్ స్దాయికి వెళ్ళారు.దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది అంటూ పట్నం వచ్చిన పతివ్రతల్లో ఆయన చెప్పిన డైలాగు ఇప్పటికీ ఓ తరం తెలుగు వారందరికీ పరిచయమే. 1989 లో బామ్మ మాట బంగారు బాట చిత్రం సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయి కెరీర్,శరీరం కుంటుపడినా తన మనోబలంతో జయించి నటనలో కంటిన్యూ అయ్యారు. ఈ టీవీ వారి నేరాలు- ఘోరాలు లో ఆయన చెప్పే వాయిస్ కూడా అద్బుతంగా పేలింది. ఇలా తనకంటూ తెలుగువారి గుండెల్లో స్ధానం ఏర్పడుచుకున్న నూతన ప్రసాద్ మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక తెలుగు వారందిరీ తీర్చేలేని లోటే. ఆయన మరణానికి నేను నా ప్రగాడ సంతాపం తెలియచేస్తోంది

ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి.

తెలుగుదేశం పార్టీ 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30 ఏళ్ల పడిలో అడుగు పెట్టింది. ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు. ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. పుట్టిననాటి లక్షణాలు, లక్ష్యాలు పార్టీకి ఏ మాత్రం లేవు. ప్రాథమిక లక్ష్యాలను కూడా తన చేతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వదిలేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు ప్రధాన నినాదం. దాని గురించే తాము కూడా పాటుపడుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని తెలంగాణ ప్రజలు ప్రశ్నించేంతగా పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో ఎన్టీ రామారావుకు ఎంతగా ఆదరణ ఉండేదో చంద్రబాబుకు అంతగా ఆదరణ తగ్గిపోయింది.


తెలంగాణ ఉద్యమం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో కూకటివేళ్లతో పెకలించే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం ద్వారా తెలంగాణలోని బిసిలు, ఎస్సీలు, ముఖ్యంగా యువకులు రాజకీయాల్లో అడుగు పెట్టారు. రాజకీయానుభవం లేని పలువురు విద్యావంతులైన యువకులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కొత్తరక్తం తెలుగుదేశంలోకి ఇప్పుడు రావడం లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆ పాత్ర నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమం వల్ల తెలుగుదేశం నష్టపోవడమే కాకుండా కొత్తగా వచ్చే వారు లేకుండా పోయారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ నుంచే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఇంతకు ముందు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే, ఇప్పుడు వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తున్నారు. ఎన్టీ రామారావు అందించిన స్ఫూర్తిని రాజకీయ శ్రేణులకు, ప్రజలకు అందించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీకి ప్రాణ వాయువుగా పనిచేస్తూ వచ్చిన చాలా ప్రజా సంక్షేమ పథకాలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. కొన్ని పథకాల రూపురేఖలు మార్చేశారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ వ్యవస్థను ఆయన నమ్ముకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడపాలనే ఉద్దేశంతో కాకుండా తాను చెప్పినట్లుగా, తన విధానాలకు అనుగుణంగా ప్రజలు మారాలనే విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. ఇందులో భాగంగానే ఆయన వ్యవసాయం దండుగ అని, మానవ శాస్త్రాలు చదవడం అనవసరమని కొత్త సూత్రాలను ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో, పునాది స్థాయిలో చంద్రబాబు మద్దతును కోల్పోతూ వచ్చారు. ఇక్కడే, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాపులు కదిపి గ్రామీణ, పేద వర్గాల మద్దతును సంపాదించుకున్నారు. దీంతో 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. తొమ్మిదేళ్ల పాటు అందించిన పాలన వల్ల చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు. దాంతో 2009 ఎన్నికల్లో ప్రజలు ఆయనను విశ్వసించలేకపోయారు. దానివల్ల అధికారం మళ్లీ కాంగ్రెసుకే దక్కింది.

అంతేకాకుండా, చంద్రబాబు తాను చెప్పిందే అందరూ వినాలనే వైఖరిని అవలంబిస్తుండడం వల్ల సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. పార్టీ నాయకులు చంద్రబాబు చెప్పింది వినడం లేదా పక్కకు జరగడం అనే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. వారి సలహాలకు, వారి అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఉండడం లేదు. ఎన్టీ రామారావు చండశాసనుడిలా కనిపించినా, ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మేట్లు చెప్తే వినేవారు. తన వైఖరిని మార్చుకోవడానికి కూడా సిద్ధపడేవారు. ఈ లక్షణం చంద్రబాబులో లేదు. మొత్తంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ పోలిక లేదు. పేరుకు మాత్రమే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీగా మిగిలిపోయింది.

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది.

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ పోరుకు మొహాలీ స్టేడియం వేదిక కానుంది. ఆ ఆటను చూడటానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీతో పాటు పలువురు వివిఐపిలు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్లు అద్భుత పటిమ కనబరుస్తూ సెమీ ఫైనల్‌కు వచ్చి కప్పు కోసం పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ ఆటలో భారత్‌తో పాటు పాక్ జట్టుపై కూడా ఒత్తిడి పని చేస్తుంది. సొంత గడ్డపై ఆడటం, ప్రధాని, సోనియా వంటి హేమాహేమీలు మ్యాచ్ చూడటం తదితర అంశాలు భారత్‌ను ఒత్తిడికి గురి చేస్తే, ఫిక్సింగ్ హెచ్చరికలు పాక్‌ను తప్పకుండా ఒత్తిడికి గురి చేసే అంశం. ఇప్పటి వరకు వారిపై ఒత్తిడి లేకున్నప్పటికీ ఈ అంశం మాత్రం వారిని అన్నింటికంటే ఎక్కువ ఒత్తిడిలోకి నెట్టివేసే అంశం

ఈ దశలో భారత్ శారీరక కసరత్తుతో పాటు మానసిక కసరత్తును కూడా చేస్తోంది. భారత కెప్టెన్ ధోని తన సహచరులకు ఒత్తిడికి గురి కావద్దని సూచనలు చేస్తున్నారు. మ్యాచ్‌ను కూడా ఎక్కువగా ఊహించుకోవద్దని ధోనీ సూచనలు ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన బ్యాట్ బరువు కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. బరువైన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సచిన్ సిద్ధమయ్యారు. గ్రూప్ దశలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకొని సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో మాత్రం ఆడిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు అందరూ సమష్టిగా రాణించి విజయం సాధించారు.
ఆసీస్‌పై సమిష్టి విజయం, యువరాజ్ సింగ్ ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే బౌలింగ్‌లో ఆసీస్ మ్యాచ్‌లో తప్ప మొదటి నుండి జహీర్ తప్ప మిగిలిన ఫేసర్లు ఎవరూ అతనికి తోడ్పాటును ఇవ్వడం లేదు. గ్రూపు దశలో దక్షిణాఫ్రికాతో ఓటమి చెందిన భారత్ ఓ దశలో అందరి అంచనాలలోనుండి తొలగిపోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆసీస్‌పై గెలుపుతో అవే అంచనాలు భారీగా పెంచుకుంది. బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు బలంగానే ఉన్నప్పటికీ ఒక్క వికెట్ కోల్పోతే క్యూలైన్ కట్టడమే భారత్‌ను భయపెడుతున్న అంశం. ఆసీస్ మ్యాచ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇదే మనకు ఊరట. ఆసీస్‌పై చెలరేగుతాడనుకున్న భజ్జీ ఇంత వరకు ప్రపంచ కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన చూపించలేదు.

తన భుజ బలంతో పాటు బుర్రతో బౌలింగ్ చేసే ఉమర్ గుల్ భారత క్రికెర్లను కట్టు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే పాక్ కెప్టెన్ అఫ్రిదీ సచిన్‌ను సెంచరీల సెంచరీలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పుడు సచిన్ వర్సెస్ అక్తర్ పోరు, ఇప్పుడు సచిన్ వర్సెస్ ఉమర్ గుల్ మధ్య సాగనుంది. సచిన్‌ను బోల్తా కొట్టించడంలో అక్తర్ ఫెయిల్ అయినప్పటికీ గుల్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నాడు. గ్రూపు దశలో పాక్ మొదట హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోయింది. అయితే ఆ తర్వాత అతిచిన్న జట్లతో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది.

పాక్‌పై అనిశ్చిత జట్టు అనే ముద్ర కూడా ఉంది. సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌ను బోల్తా కొట్టించినప్పటికీ వెస్టిండీస్‌పై ఎవరికీ అంచనాలు లేవు. అసలు వెస్టిండీస్ గ్రూపు దాటుతుందా అనే పరిస్థితిలో నుండి బయట పడి బంగ్లాదేశ్‌తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రెట్ కారణంగా క్వార్టర్‌కు చేరుకుంది. ఆలాంటి జట్టుపై పాక్ గెలవదని ఎవరూ అనుకోరు. అయితే క్వార్టర్‌నుండి సెమీస్‌కు ఈజీగా వచ్చిన పాక్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన, బలమైన భారత జట్టుతో తలపడి గెలవాలని భావిస్తోంది.

భారతీయత

భారతీయుడై పుట్టినందుకు గర్వించకు.
భారతీయత ఆచరించినప్పుడు గర్వించు.

తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించకు
తెలుగుతనాన్ని చాటి చెప్పినప్పుడు ఆనందించు.

వేదాలతో విద్యావంతుణ్ణని విర్రవీగకు
వెలుపలి వారికి విద్యా దానం చేసినపుడు విర్రవీగు.

తాతలు నేతులు తాగారని నినదించకు
చేతలు నీతిగ సాగినపుడు నినదించు.

ఏదీ కానప్పుడు నోరు మూసుకో
ఎగతాళి మాత్రం చేయకు.

ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!

ఒకానొక రోజున ఒక పూల కొట్టాయన క్షవరం చేయించుకోవటానికి మంగలి కొట్టుకు వెళ్ళాడట. సరే వెళ్ళిన పని అయినాక, డబ్బులు ఎంత ఇవ్వాలి అని ఆయన అడగ్గా, మంగలిగారు, "మీ దగ్గర డబ్బులు తీసుకొను, నేను ప్రస్తుతం ఈ వారం అంతా సోషల్ సర్వీస్ చేస్తున్నాను!" అవటా అనేసాడుట. ఆ పూల కొట్టాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడట.

మర్నాడు కొట్టు తెరవబోయిన మంగాలాయనకు, కొట్టు బయట ఒక డజను చక్కటి గులాబీ పూలు చక్కగా అమర్చి కనబడ్డాయట, వాటితోపాటుగా, పూలకోట్టాయన పంపిన "ధన్యవాదాలు" కార్డు కూడ ఉన్నదట.

మర్నాడు మంగాలాయన తన షాపు తెరిచాడు, ఆ రోజున ఒక పోలీసాయన క్షవరానికి వచ్చాడు, అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోలేదు. పోలీసాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడు. మర్నాడు మంగాలాయన షాపు తెరిచేప్పటికి బయట చక్కటి తినుబండారాలు షాపు బయట ఆయనకోసం పోలీసాయన పంపినవి సిద్ధంగా ఉన్నాయట.

ఈరోజు ఎవరొస్తారో కదా అనుకుంటూ ఉండగా, ఒక రాజకీయ నాయకుడు క్షవరానికి వచ్చాడు. పని అయినాక , అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోను, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను అనేశాడు. ఆ రాజకీయ నాయకుడు కండువా దిద్దుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు.

మర్నాడు మంగాలాయన కొంచెం తొందరగానే వెళ్ళాడు షాపు తెరవటానికి, ఇవ్వాళ ఏమి ఆశ్చర్యం చూడాలో అనుకుంటూ. కానీ షాపు ఇంకా తెరవకుండానే, ఓ పాతిక మంది రాజకీయ నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ షాపు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారుట.

మంగాలాయన అక్కడకు వెళ్లి, "బాబూ, ఏమిటి మీరంతా ఇలా!!?" అన్నాడుట వాళ్ళందరినీ రోజూ పేపర్లో చూస్తున్న ఫొటోలతో గుర్తించి. అప్పటిదాకా ఒకరినొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్న వాళ్ళంతా, ఏక కంఠంతో, అస్సలు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా అన్న భ్రమ కలిగేట్టుగా, "మా సోదరుడు చెప్పాడు, ఇక్కడ ఉచితంగా క్షవరం చేస్తారుటగా, అందుకే వచ్చాం" అన్నారుట నెత్తిమీద టోపీలు వగైరాలు తీస్తూ. ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!