నేను ప్రతిపక్షంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు కావొస్తోంది. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇంకా కేసులు, విచారణల పేరుతో వేధించడం న్యాయమేనా? నేను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పాతికకు పైగా కేసులు వేశారు. వాటిన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. అనేక విచారణలు చేయించారు. ఎక్కడా తప్పులు పట్టుకోలేకపోయారు. ఇదంతా అయ్యాక మళ్ళీ బురద చల్లుతున్నారు. ఇలా వేధించడం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు మీడియా తో మాట్లాడుతూ తనపై విచారణ విషయం ప్రస్తావనకు రాగా, ఒకింత ఆవేదనతో- కేసులు, విచారణల పేరుతో తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి వెనుకా కాంగ్రెస్ హస్తం ఉందని, భవిష్యత్తులో అన్నీ బయటకువస్తాయని పేర్కొన్నారు. 'అన్ని పార్టీలు కాంగ్రెస్కు లొంగిపోతున్నా మేం మాత్రమే పోరాడుతున్నాం. అందుకే ఈ వేధింపులు. కిరణ్బేడీ, రాందేవ్బాబా వంటివారిపై ఏనాటివో సాంకేతిక అంశాలను తోడి కేసులు పెడుతున్నారు. నేరుగా పోరాడటం చేతకాక దొంగ దెబ్బకు యత్నిస్తున్నారు' అని చెప్పారు.
'రాష్ట్రంకోసం గొడ్డు చాకిరీ చేశాను. చివరకు కుటుంబాన్ని కూడా విస్మరించాను. నేను అధికారంలో ఉండగా నా భార్య, కొడుకు ఏనాడైనా బయటకు వచ్చారా? నా అధికారాన్ని దుర్వినియోగం చేశారా? వారిపైనా కేసులు పెట్టారు. ఇదేం న్యాయం?' అని ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా తన భార్య ఇల్లు...కంపెనీ పని తప్ప మరోదానిలో తలదూర్చలేదని ఆయన పేర్కొన్నారు.
'నా కొడుకు లోకేశ్ అమెరికాలో చదువుకుంటే ఆ ఖర్చు రామలింగరాజు భరించారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు విక్రయించరు. ఆరోపణలు చేసినవారికి అది కూడా తెలియదు. ఆ ఖర్చు కూడా భరించే స్థితిలో మేం లేమా?' అని విస్మయం వ్యక్తం చేశారు.
తాను స్కూల్లో చదువుతున్నప్పుడే వ్యాపారం చేస్తున్న రామోజీరావు తన బినామీ అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. 'హైటెక్సిటీ పక్కన భూమి ఉంది కాబట్టి సినీనటుడు మురళీమోహన్ నా బినామీ అంటున్నారు. అంటే మాదాపూర్, శంషాబాద్ల్లో భూములున్నవారంతా నా బినామీలేనా? సింగపూర్లో నాకు హోటల్ ఉందని ఫొటో పెట్టారు. అదెవరిదో తెలపాలని సింగపూర్ హైకమిషనర్కు లేఖ రాశాను. దాని యాజమాన్యం బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్లో ఉందని జవాబు వచ్చింది.
అక్కడ పన్ను చట్టాలు లేవు కనుక వివరాలు బయటకు రావు. అందువల్ల నాపై బురద చల్లుతూనే ఉండవచ్చన్నది ప్రయత్నం' అన్నారు. డబ్బు పిచ్చితో వేల కోట్లు అక్రమంగా గడించినవారితో నన్ను పోల్చి గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ' అని వాపోయారు. కాగా.. తనకు సీబీఐ నుంచిగానీ, మరే దర్యాప్తు సంస్థ నుంచి గానీ ఎలాంటి నోటీసులూ అందలేదని చంద్రబాబు చెప్పారు. అయితే.. తన కుమారుడు లోకేశ్కు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.
ఇదిలా వుంటే వైఎస్ విజయ వేసిన పిటిషన్ మేరకు తనతోపాటు మరికొందరి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. "నాపై విజయ వేసిన పిటిషన్లో.. మా వాదనలు వినకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకపక్షంగా (ఎక్స్పార్టీ) ఆదేశాలు ఇచ్చింది. వాటికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. ఫలితంగా నా పరువుప్రతిష్ఠలకు తీవ్రనష్టం కలిగింది. ఇటువంటి ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధం. అంతేకాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరం'' అని ఆ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)