20, మే 2011, శుక్రవారం

జగన్‌ వ్యాపార సామ్రాజ్య రహస్యము ఇదేనా??

జగన్‌దీ అం '' బాణీ ''యే!
కంపెనీలపై కంపెనీల ఏర్పాటు
వేల కోట్లు టర్నోవర్ చేసే అనామక కంపెనీలు
లెక్కచూపని నిధులతో వ్యాపార సామ్రాజ్య నిర్మాణం
దశాబ్దాల కిందటే రిలయన్స్ అనుసరించిన మార్గం
యువనేత చేతుల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వైనం
ఒక ప్రధాన కంపెనీ. దాని చుట్టూ వందల సంఖ్యలో అనామక కంపెనీలు. ఒక కంపెనీలో మరో కంపెనీ పెట్టుబడి.. రెండు కంపెనీల మధ్య పరస్పర పెట్టుబడులు.. ఈక్విటీల జారీ.. రుణాలు ఇచ్చి పుచ్చుకోవడాలు.. అల్లిబిల్లిగా అల్లుకుపోయిన బ్రహ్మజెముడు పొదల వంటి ఒక సంక్లిష్ట వ్యవస్థ! వేల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన అనామక కంపెనీల చేతుల మీదుగా కోట్ల రూపాయల లావాదేవీలు. ఈ అనామక కంపెనీల వెనక ఎవరున్నారో చాలా సందర్భాల్లో ఎవరికీ తెలియదు. ఏమిటిదంతా...? ఇది వ్యాపార సామ్రాజ్య విశేషం కాదు. లెక్క చూపని నిధులతో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించే వ్యూహం.

చట్టం కన్నుగప్పి నల్లధనాన్ని చలామణి చేసే విధానం. ప్రమోటర్ల అక్రమ ప్రయోజనాలను కాపాడే అకౌంటింగ్ మార్గం. యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వ్యాపారాల్లో సహజత్వాన్ని సంతరించుకున్న ఈ కత్తిలాంటి వ్యూహానికి ఆద్యుడు రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ. బడా కార్పొరేట్ సంస్థల్లో అనేకం ఏదో ఒక దశలో ఈ వ్యూహాన్ని అనుసరించినా.. నేడు జగన్మోహన్‌రెడ్డి చేతుల్లో ఈ వ్యూహం కొత్త పుంతలు తొక్కుతోంది.

హైదరాబాద్, మే 17 : హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ సమీపంలో అరడజను ప్లాట్లను సొంతం చేసుకుని, నూరు కోట్లతో మహారాజ ప్రాసాదాన్ని నిర్మిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్లాట్లను సొంతం చేసుకోవడానికి అనుసరించిన వ్యూహంపై 'ఆంధ్రజ్యోతి'లో మంగళవారం వెలువడిన కథనం సంచలనం సృష్టించింది. నిజానికిది, జగన్ కనిపెట్టిన విద్య కాదు.

ఆస్తుల కొనుగోలుకు, సంపద సృష్టికి, సృష్టించిన సంపదను మళ్లించడానికి కంపెనీలపై కంపెనీలు పెట్టే పద్ధతిని పతాక స్థాయికి తీసుకువెళ్లిన తొలి ఘనత ఈ దేశంలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి దక్కుతుంది. రిలయన్స్ వ్యాపార ప్రస్థానంలో అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఈ చిల్లర కంపెనీల పాత్ర చాలా పెద్దది. ఈ కంపెనీలను ఉపయోగించి ఆ రోజుల్లోనే విదేశీ నిధులను తెప్పించిన వైనం... ఇటీవలి కాలంలో పన్నుల ఎగవేతకు పుట్టగొడుగు కంపెనీలనుఅడ్డు పెట్టుకుంటున్న తీరు ఆశ్చర్యచకితులను చేస్తాయి.

నేడు మారిషస్.. నాడు ఐజల్ ఆఫ్ మాన్
ఇప్పుడు మారిషస్‌లాగా.. అప్పట్లో బ్రిటిష్ దీవి ఐజల్ ఆఫ్ మాన్ పన్నుల ఎగవేతదారులకు, రాజమార్గంలో భారత్‌కు నిధులను తరలించే వారికి స్వర్గధామంగా ఉండేది. ఐజల్ ఆఫ్ మాన్ కేంద్రంగా వెలసిన డజన్ల సంఖ్యలోని కంపెనీలు అప్పట్లో రిలయన్స్‌లోకి కోట్లాది రూపాయలను గుప్పించాయి. ఈ కంపెనీల పేర్లు చిత్రంగా ఉండటం, ఈ కంపెనీల ప్రమోటర్లు ఎవరో తెలియకపోవడం వర్తమాన దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తాయి.

రిలయన్స్ షేర్లలో దాదాపు పాతిక కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీల పేర్లు క్రొకడైల్ ఇన్వెస్ట్‌మెంట్, ఐయోటా ఇన్వెస్ట్‌మెంట్, ఫియాస్కో ఇన్వెస్ట్‌మెంట్... కాగా, ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల ప్రమోటర్లందరి పేరు చివరన 'షా' అన్న తోక ఉంది. ఎన్ఆర్ఐలు అని చెప్పడం తప్ప వీరెవరో ఎవరికీ తెలియదు. ఈ కంపెనీలన్నింటికీ మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు రిలయన్స్ షేర్లను అంబానీలు విక్రయించారు. ఈ షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన సొమ్ముతోపాటు బ్యాంకుల నుంచి కూడా భారీ మొత్తాన్ని అంబానీలు సమీకరించారు.

ఇందుకు కూడా మళ్లీ పుట్టగొడుగు కంపెనీల వ్యూహాన్నే అనుసరించారు. యాభై వరకు కంపెనీలను ఏర్పాటు చేసి, వాటికి రిలయన్స్ కన్వర్టెబుల్ డిబెంచర్లను జారీ చేశారు. డిబెంచర్ల కొనుగోలుకు అప్పులిచ్చేందుకు బ్యాంకులను రంగంలోకి దించారు. పోటాపోటీగా అప్పట్లో బ్యాంకులు ఈ రుణ మేళాలో పాల్గొన్నాయి. ఈ రకంగా సమీకరించిన సొమ్మును ఉపయోగించి స్టాక్ మార్కెట్‌ను ధీరూభాయ్ ఆడుకున్నారు. ఈ ఉదంతం మరింత ఆసక్తికరం.

కోల్‌కతా బ్రోకర్లకు చావుదెబ్బ
రిలయన్స్ యాత్ర 1958లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ పేరుతో ప్రారంభమైంది. ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమై ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ 1977లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ షేరులో ట్రేడింగ్ జోరుగా సాగేది. బుల్స్, బేర్స్ మధ్య పోటాపోటీగా క్రయవిక్రయాలు జరిగేవి. ఈ ట్రేడింగ్ నుంచి లాభపడేందుకు రిలయన్స్ ప్రమోటర్లు పుట్టించిన కంపెనీలు ప్రయత్నిస్తుంటే.. వాటిని దెబ్బతీసేందుకు ప్రత్యర్థి సంస్థలు ప్రయత్నించేవి. 1982లో రిలయన్స్ రైట్స్ ఇష్యూ జారీ చేసింది.

రిలయన్స్ షేర్లలో లిక్విడిటీ పెరగడాన్ని అదనుగా తీసుకుని షేరు ధరను చితక్కొట్టేందుకు కొందరు బేర్ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ోల్‌కతాకు చెందిన కొందరు స్టాక్ బ్రోకర్లు (బేర్ ఆపరేటర్లు) జట్టుకట్టి ఎడాపెడా షార్ట్ సెల్లింగ్‌కు దిగారు. ప్రత్యర్థుల ఎత్తును చిత్తు చేసేందుకు ధీరూభాయ్ అంబానీ తన బినామీ కంపెనీలు, అనుకూలురైన బ్రోకర్ల (బుల్ ఆపరేటర్లు)తో అంతకంటే ఉధృతంగా షేర్లను కొనిపించారు. షార్ట్ సేల్ చేసిన ఆపరేటర్లు ఊహించినట్టు షేరు ధర ఏ మాత్రం పడిపోలేదు.

పైగా డెలివరీ ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి మార్కెట్‌లో షేర్లు దొరకని పరిస్థితి. రిలయన్స్ ఫ్రెండ్స్‌గా ప్రచారంలోకి వచ్చిన బ్రోకర్లు, షార్ట్ సేల్ చేసిన ఆపరేటర్లను షేర్లు డెలివరీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసే సరికి సంక్షోభం మొదలైంది. కొందామంటే మార్కెట్‌లో షేర్లు లేవు. ఒక్కో షేరుకు 35 రూపాయల పెనాల్టీ ఇవ్వాలని అంబానీ అనుకూల బ్రోకర్లు డిమాండ్ చేశారు. ఈ సంక్షోభం బీఎస్ఈని కుదిపేసింది. ఎక్స్చేంజ్ మూడు రోజులపాటు మూతపడింది. బీఎస్ఈ మధ్యవర్తిత్వం వహించి షేరుకు 2 రూపాయల పెనాల్టీని నిర్ణయించింది. షేర్ల డెలివరీకి కొంత గడువు ఇప్పించింది.

ఈ పరిణామాలతో రిలయన్స్ షేరు ధర భారీగా పెరిగింది. చేతులు కాలిన కోల్‌కతా బ్రోకర్లకు అంబానీయే కావల్సిన షేర్లను విక్రయించి కోట్లలో లాభాన్ని మూటగట్టుకున్నారని చెబుతారు. ఈ క్రీడలో బేర్ ఆపరేటర్లను దెబ్బతీసేందుకు ధీరూభాయ్ వెదజల్లిన సొమ్ము ఐజల్ ఆఫ్ మాన్ నుంచి, బ్యాంకుల రుణమేళా నుంచి వచ్చిపడ్డవే. స్టాక్ మార్కెట్‌లో కేవలం రిలయన్స్ షేర్లలోనే ట్రేడింగ్ చేసేందుకు వందల సంఖ్యలో కంపెనీలను అంబానీలు సృష్టించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాన్నే సృష్టించింది. తర్వాత పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. ఇప్పటికీ రిలయన్స్ ఇరు గ్రూప్‌లకు సంబంధించి డజన్ల సంఖ్యలోనే చిన్నా చితక హోల్డింగ్ కంపెనీలు ఉన్నాయి.

పన్ను ఎగవేత కోసం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఏడాది, రెండేళ్ల క్రితం పెద్ద సంఖ్యలో లిమిటెడ్ లయబులిటీ పార్టనర్‌షిప్స్ (ఎల్ఎల్‌పీ)లను ఏర్పాటు చేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని తన వాటాలను డజన్ల సంఖ్యలో ఏర్పాటు చేసిన ఈ ఎల్ఎల్‌పీలకు బదిలీ చేశాడు. ఈ సంస్థల చేతుల్లో ఉన్న రిలయన్స్ షేర్ల విలువ అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు. దీనివల్ల ఏమిటీ లాభం. సాధారణ కంపెనీలకు లభించే పన్ను నిబంధనలు ఈ ఎల్ఎల్‌పీలకు వర్తించవు. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ కూడా ఎల్ఎల్‌పీలకు వర్తించదు.

సర్‌చార్జ్ ఉండదు. అందువల్ల పన్నులను తప్పించుకునేందుకు తెలివిగా ముకేశ్ తన షేర్లను ఈ కంపెనీలకు బదలాయించారని అంటారు. రిలయన్స్ మాత్రమే కాకుండా ఇంకా అనేక కార్పొరేట్ సంస్థలు ఇదే బాటపట్టడంతో గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఎల్ఎల్‌పీలపై 18.5 శాతం ప్రత్యామ్నాయ కనీస పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. 2012-13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ దెబ్బకు ఇప్పుడు కార్పొరేట్లు మరో కొత్తదారి కోసం వెతుక్కుంటున్నాయి.

వ్యాపారాల్లో విజయాలకు అనుకూలమైన పాలసీల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం రాజకీయ నాయకులను కనుసన్నల్లో తిప్పుకొన్న ఘనత రిలయన్స్ ప్రమోటర్లది. ఇప్పుడు వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ తానే స్వయంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది. రాజకీయాల్లో ఆయన అనుకున్న లక్ష్యాలను సాధిస్తే వ్యాపారంలో, లక్షల కోట్ల రూపాయల అంబానీల సామ్రాజ్యం కూడా ఆయన ముందు చిన్నబోవడం ఖాయం.

షార్ట్ సెల్లింగ్ అంటే...
చేతుల్లో షేర్లు లేకపోయినా వాటిని అమ్మే వెసులుబాటు. ప్రస్తుతం వంద రూపాయల స్థాయిలో ఉన్న షేరు 50 రూపాయలకు పడిపోతుందని గట్టిగా తెలిస్తే, వెంటనే వంద రూపాయల రేటుకు వాటిని అమ్మేయడం, యాభై రూపాయలకు పడిపోయిన తర్వాత కొని అప్పుడు డెలివరీ ఇవ్వడం షార్ట్ సెల్లర్స్ చేసే పని. వీరిని ఎదురుదెబ్బ తీసేందుకు పొంచుకుని ఉండే బుల్ ఆపరేటర్లు షార్ట్ సేల్ చేసిన షేర్లన్నింటినీ కొనేస్తారు. గడువు తేదీన షేర్ల డెలివరీ ఇవ్వమని డిమాండ్ చేస్తారు. ఊహించినట్టుగా షేర్ల ధర పతనం కాకుండా ధర పెరిగితే మాత్రం బేర్ ఆపరేటర్లు చావుదెబ్బతిన్నట్టే. ఎక్కువ ధర పెట్టి షేర్లను కొనాల్సిందే.

పవిత్రంగా భావించే తిరుమల కొండపై విద్యార్థులు లైంగిక వేధింపులు

ప్రజలు పవిత్రంగా భావించే తిరుమల కొండపై గల ధర్మగిరి వేద పాఠశాల ప్రస్తుతం సెక్స్ కుంభకోణంతో అట్టుడికిడి పోతోంది. వేద పాఠశాలలో సెక్స్‌పరమైన ఆరాచాకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. అధికారులు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిపై పోలీసులు కేసు పెట్టారు. అవినాష్ శర్మ, మహేష్ కన్నన్, చక్రవర్తిలపై కేసు నమోదైంది. నవీన్, నాగేంద్ర అనే విద్యార్థులు 15 రోజుల కింద అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. వేదపాఠశాలలోని కొందరు విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో విచ్చలవిడి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కొందరు విద్యార్థులు సెల్ ఫోన్లలో సెక్స్ దృశ్యాలను చూడటం అలవాటుగా పెట్టుకున్నారు. జూనియర్లకు కూడా ఆ దృశ్యాలు చూపిస్తారు. అంతటితో ఆగకుండా 'ప్రాక్టికల్స్' కూడా మొదలుపెట్టారు. వేద పాఠశాలలో చేరే పేద, జూనియర్ విద్యార్థులను ఎంచుకుంటారు. వారిని లైంగికంగా వేధించడం నిత్యకృత్యకంగా మార్చారు.

మొదట బలవంతపు అత్యాచారాలకు పాల్పడి స్వలింగ సంపర్కాన్ని అలవాటు చేస్తారు. కొందరిని మగ వ్యభిచారులుగా మార్చినట్లు కూడా తెలుస్తోంది. తిరుమల జీయర్ మఠంలోని ఓ ఏకాంగి తరచూ వేద పాఠశాలకు వచ్చి పిల్లలకు డబ్బులిచ్చి స్వలింగ సంపర్కం చేసుకుపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ధర్మగిరిలో 60 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. నిర్దేశిత డ్యూటీ ప్రకారం అధ్యాపకులు రాత్రిళ్లు పాఠశాలలోనే బస చేయాలి. కానీ చేయరు. ఇక సీనియర్ విద్యార్థులే సూపర్‌వైజర్లు. దీంతో జూనియర్లపై లైంగిక వేధింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఘోరాలను ప్రశ్నించడానికి ప్రయత్నించినా, ఫిర్యాదు చేయాలనే ఆలోచన వచ్చినా సీనియర్లు రెచ్చిపోతారు. వారి ట్రంకు పెట్టెల్ని కాళ్లతో తుక్కు చేసి, కాంపౌండ్ బయట పడేస్తారు. కొత్త విద్యార్థులపై వీరే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. ఈ దారుణాలు భరించలేక పది సంవత్సరాల్లో వందలాది మంది కోర్సును మధ్యలోనే వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. అధ్యాపకులను పాఠశాల నిర్వాహకులు నిలదీస్తే సహాయ నిరాకరణకు దిగుతారని వార్తలు వచ్చాయి. తడాఖా చూపిస్తామంటూ సెలవు పెట్టి వెళ్లిపోతారు. ఎంతకూ సిలబస్ పూర్తిచేయరు. దీంతో నిర్వాహకులు కూడా వారితో సర్దుకుపోవటమో, వారికి భాగస్వాములు కావటమో జరుగుతోంది.

ధర్మగిరిలో చేరే విద్యార్థులకు ఇటీవల టీటీడీ భారీ ప్యాకేజీలు ప్రకటించింది. దీని ప్రకారం పిల్లలు చేరగానే మూడు లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తారు. ఆగమాలు నేర్చుకునేవారికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. వారు 12, 8 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఇస్తారు. ఈ సౌలభ్యాన్ని వదులుకోలేక పేద విద్యార్థులు ఇక్కడి దారుణాలపై నోరు మెదపలేక పోతున్నారు. ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు బుధవారం వేద పాఠశాలలో పరిస్థితి చక్కదిద్దేందుకు పరిపాలనాధికారిగా సుబ్రమణ్యాన్ని నియమించారు.

శ్రీవారి ఆలయానికి అవసరమైన వేద పండితులను తయారు చేసుకోవాలనే సంకల్పంతో 1884లో వేద పాఠశాలను ప్రారంభించారు. తొలుత తిరుపతి గోవిందరాజస్వామి ఉత్తర మాడవీధిలోని ప్రస్తుత మ్యూజియంలో ప్రారంభించారు. 1951లో శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి మార్చారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో తిరుమల శిఖరభాగాన ఉన్న నారాయణగిరి కొండల్లో ధర్మగిరి వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. తిరుమల వేద పాఠశాలలో ఒక విద్యార్థిపై సహ విద్యార్థులు లైంగిక వేధింపులు జరిపిన మాట వాస్తవమే టిటిడి కార్యనిర్వాహణాధికారి కృష్ణారావు అంగీకరించారు.

వైయస్ జగన్‌ది చంద్రబాబు వైఖరే, తెలంగాణపై ఇద్దరూ ఏకం

తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశాలు లేవు. ఆయన స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకుంటారని ఇటీవల వచ్చిన వార్తలు అబద్ధాలేనని తెలిసోతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరినే ఆయన అనుసరించే అవకాశాలున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు గురువారం చేసిన ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది. తెలంగాణకు చంద్రబాబు, వైయస్ జగన్ అడ్డు కారని ఆయన చెప్పారు. తెలంగాణపై ఆయన కేంద్ర వైఖరిని తప్పు పట్టారు.గోనె ప్రకాశ రావు ప్రకటనను బట్టి వైయస్ జగన్ తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఆనుసరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు అంటూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణపై ఆయన కాంగ్రెసు వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణను ఇచ్చేది తెచ్చేది తాము కాదని వైయస్ జగన్ చెప్పే అవకాశాలున్నాయి. అసలు జగన్ తెలంగాణపై మాట్లాడుతారా అనేది కూడా అనుమానమే. వైయస్సార్ కాంగ్రెసు నాయకులు మాత్రమే జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ఊదరగొడుతున్నారు. కట్టె విరగకుండా పాము చావకుండా జగన్ వైఖరి ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విషయాల్లో చంద్రబాబుపై కత్తులు నూరుతున్న వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తెలంగాణ విషయంలో మాత్రం ఆయనను సమర్థిస్తున్నారు.