28, మే 2011, శనివారం

విసిగించకండి: చంద్రబాబు పనితీరుపై హరికృష్ణ గరం గరం

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం మహానాడులో సీతయ్య అవతారమెత్తారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ నాయకుల మద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనోవేదనను పార్టీ నాయకుల వద్ద వెళ్లబోసుకున్నారు. మహానాడులో మాట్లాడాలని పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తాను మాట్లాడలేనని, తనను విసిగించవద్దని ఆయన వారితో అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఏకపక్ష ధోరణి వల్ల పార్టీ నష్టపోతోందని ఆయన అన్నారు. తాను వారసత్వ పోరు గురించి మాట్లాడడం లేదని, పార్టీని రక్షించుకోవాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. కరీంనగర్ రణభేరీని ఎప్పుడో నిర్వహించాలని తాను సూచించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పులివెందులలో వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని, జగన్‌పై పోరాటం చేయాలని చెప్పానని, తన మాటలను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి కూడా హరికృష్ణ నిరాకరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వల్ల తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు. మహానాడులో ఆయన ముభావంగానే ఉన్నారు. మొదటి రోజు కూడా మహానాడు నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మహానాడు వేదికపై హరికృష్ణ ఫొటో కనిపించలేదు

చంద్రబాబుపై జూ ఎన్టీఆర్ వైరం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పోరు సాగించడానికే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తన తండ్రి నందమూరి హరికృష్ణతో కలిసి ఆయన చంద్రబాబుపై యుద్ధం చేయడానికే సిద్ధపడ్డారని అనిపిస్తోంది. ఆయన మహానాడుకు దూరంగా ఉండడం, నందమూరి హరికృష్ణ మహానాడులో ప్రసంగించకుండా నిరసన వ్యక్తం చేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మహానాడుకు రావాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కూడా జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లనే మహానాడుకు వెళ్లడం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు నమ్మేట్లుగా లేవు. హైదరాబాదులోని ఉన్న ఆయన మహానాడుకు వెళ్లాలంటే పెద్ద సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. మర్యాదపూర్వకంగానైనా అలా ఇలా రావచ్చు. ఓ పది నిమిషాల పాటు మాట్లాడి పోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ మాత్రం సమయం కూడా లేదంటే విశ్వసించే పరిస్థితి లేదు.

ఇకపోతే, హరికృష్ణ మహానాడులో వ్యవహరించిన తీరు కూడా చంద్రబాబుతో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి తగిన బలాన్ని చేకూరుస్తున్నది. మహానాడులో ప్రసంగించాలని కోరిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని ఆయన కసురుకున్నారు. తాను మాట్లాడబోనని తెగేసి చెప్పారు. పైగా, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని కూడా చెప్పారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీలో విభేదాలను బయటపెట్టడం ఇష్టం లేకనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. శుక్రవారం మధ్యలోనే మహానాడు నుంచి ఆయన వెళ్లిపోయారు. శనివారం స్పష్టంగా నాయకుల వద్ద తన అభిమతాన్ని బయటపెట్టారు. బాలకృష్ణ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా నిలబడేట్లే ఉన్నారు. మహానాడు ప్రసంగంలో ఆయన చంద్రబాబును ప్రశంసించారు.

చంద్రబాబు ఆలోచన ఎలా ఉందనేది తెలియడం లేదు. హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోవడం లేదా, కావాలనే పట్టించుకోనట్లు నటిస్తున్నారా అనేది తెలియడం లేదు. అయితే, మహానాడులో మాట్లాడాలని యనమల రామకృష్ణుడిని చంద్రబాబే అడిగించారని తెలుస్తోంది. హరికృష్ణ తీరు పట్ల చంద్రబాబుకు నచ్చడం లేదని కూడా చెబుతున్నారు. మహానాడు నుంచి హరికృష్ణ శనివారం నాడు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. తన వారసుడిగా నారా లోకేష్‌ను తేవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఏమైనా, ప్రస్తుతం తెలుగుదేశంలో వారసత్వ పోరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది.

బాబు స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడేనా?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా అనేది అనుమానమే. ఆయన ఎన్టీ రామారావు పేరును వాడుకున్నప్పటికీ వారసత్వాన్ని మాత్రం కొనసాగించడం లేదని అందరూ చెప్పే మాటే. ఎన్టీ రామారావు బొమ్మ వేరేవారి సొంతం కాకుండా జాగ్రత్త పడుతూ నారా వారసత్వాన్ని స్థాపించడమే చంద్రబాబు లక్ష్యమని చెబుతున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు తన వారసత్వాన్ని అందించాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పార్టీ మహానాడు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని మాత్రం చంద్రబాబు తప్పకుండా పాటిస్తున్నారు.

ఎన్టీ రామారావుకున్న తెగువ, సూటిదనం చంద్రబాబుకు లేవు. పైగా, తన చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ స్వరూప స్వభావాలనే మార్చేశారు. ఇతరులు చెప్పే మాటను వినే అలవాటు ఎన్టీఆర్‌కు ఉంది. ఎవరైనా చెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే దాన్ని ఆచరణలో పెట్టేవారు. కాంగ్రెసుకు బద్ద వ్యతిరేకిగా వ్యవహరించారు. అందువల్ల ఆయన మొండివాడిగా కూడా ముద్ర పడ్డారు. ప్రజల మేలు తప్ప మరోటి ఆయనకు తట్టేది కాదు. పైగా, ప్రజలకు మేలు జరుగుతుందంటే నిబంధనలను కూడా పక్కన పెట్టేవారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు. పార్టీపరంగా తీసుకున్న నిర్ణయానికి నష్టమైనా, కష్టమైనా కట్టుబడి ఉండేవారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సంక్షేమ దిశ నుంచి అభివృద్ధి దిశకు, అదీ పెట్టుబడీదారి దిశకు మళ్లించారు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. వ్యవసాయం దండుగ వంటి మాటలు మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ స్థానికేతరులకు అన్యాయం జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దడానికి 610 జీవోను విడుదల చేశారు. కానీ దాన్ని చంద్రబాబు అమలు చేయలేకపోయారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్న తెలంగాణ అనుకూల వైఖరికి ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పటి తెలుగుదేశం కాదనేది అందరికీ తెలిసిన విషయమే.