2, ఏప్రిల్ 2011, శనివారం

మనమే విశ్వవిజేతలం, నెరవేరిన సచిన్ కల 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది

శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్‌ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు. యువరాజ్ సింగ్ ఆనందంతో కంట తడిపెట్టాడు.

కులశేఖర వేసిన 47వ ఓవరులో ధోనీ, యువరాజ్ చెరో ఫోర్, సింగిల్స్ ద్వారా 11 పరుగులు చేయడంతో ఆట భారత్ చేతిలోకి వచ్చింది. అంతకు ముందు మలింగ వేసిన ఓవరులో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. కులశేఖర వేసిన ఓవరు తర్వాత 18 బంతుల్లో 16 పరగులు చేయాల్సి ఉండింది. దీంతో డ్రెసింగ్‌ రూంలో భారత ఆటగాళ్లు హర్షాతిరేకాలు చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాతి మలింగ ఓవరులో యువరాజ్ సింగ్ ఓ సింగిల్ తీయగా, ధోనీ బంతిని బౌండరీ అవతలికి తరలించి నాలుగు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా అతను ఫోర్‌గా లమిచాడు. అప్పటికి 15 బంతుల్లో భారత్ ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఇరువురు బ్యాట్స్‌మెన్ తొలుత సంయమనం కుదరక కాస్తా ఇబ్బంది పడ్డారు. రన్నవుట్ కాబోయే ప్రమాదాలను తప్పించుకున్నారు. రెండు ఓవర్లు మిగిలి ఉండగా భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది.
పరుగులేమీ చేయకుండానే భారత డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌కు గౌతం గంభీర్ తోడుగా నిలిచాడు. తొలుత బాగానే బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించిన సచిన్ టెండూల్కర్ లసిత్ మలింగ బౌలింగ్‌లో సంగక్కరకు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 31 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. కప్ ఇండియా చేజారిపోతుందేమో అనిపించింది.

అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ గంభీర్‌తో కలిసి ఆచితూచి షాట్లు కొడుతూ పరుగులు రాబట్టారు. కానీ విరాట్ కోహ్లీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్‌ చేతిలో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 114 పరుగులు. విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగుకు దిగిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్‌ పోటీల్లో తొలిసారి రాణించాడు. పట్టుదలతో ఆడాడు. ధోనీ, గంభీర్ స్కోరును విజయం దిశగా నడిపించారు. శ్రీలంక బౌలర్లు వీరిద్దరిపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సంగక్కర మార్చి మార్చి బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు గౌతం గంభీర్ పెరేరా బౌలింగులో 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోరు 223 పరుగులు ఉంది. విజయానికి 52 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, ధోనీకి తోడుగా యువరాజ్ సింగ్ బ్యాటింగుకు దిగాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన మహేలా జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో శ్రీలంక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. జయవర్ధనే 103 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయినా చివరలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జయవర్ధనేకు చక్కని సహకారం అందించడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను కంగు తినిపించారు. చివరి ఐదు ఓవర్లో బ్యాటింగ్ పవర్ ప్లేలో శ్రీలంక 63 పరుగులు పిండుకుంది. కులశేఖర ఓ సిక్స్ సహాయంతో 32 పరుగులు చేయగా, పెరేరా 22 పరుగులు చేశారు. జహీర్ ఖాన్ బౌలింగ్‌ను కూడా పెరేరా చితకబాదాడు.

తొలుత శ్రీలంక స్కోరు 17 పరుగులు ఉన్నప్పుడు రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఉపుల్ తరంగ వికెట్‌ను జహీర్ ఖాన్ తీసుకున్నాడు. ఆ తర్వాత దిల్షాన్, సంగక్కర స్కోరును ముందుకు కదిలించే పని సాగించారు. అయితే, 60 పరుగుల వద్ద దిల్షాన్ హర్భజన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన జయవర్ధనేతో సంగక్కర నిలకడగా ఆడి స్కోరును పెంచాడు. 122 పరుగుల వద్ద సంగక్కర యువరాజ్ బౌలింగులో అవుటయ్యాడు. సంగక్కర 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే యువీ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా సమరవీర పెవిలినయ్ దారి పట్టాడు. అప్పుడు శ్రీలంక స్కోరు 179 పరుగులు. ఆ తర్వాత మూడు పరుగులకే కపుగెదర అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కులశేఖర, పెరేరా భారత బౌలింగుపై విరుచుకుపడ్డారు. జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లకు రెండేసి వికెట్లు లభించగా, హర్భజన్‌కు ఒక్క వికెట్ లభించింది. శ్రీశాంత్ బౌలింగులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దండిగా పరుగులు రాబట్టుకున్నారు.

అభ్యుదయవాదం, ఆధునికత పేరుతో నూతనమైన జీవనసరళినే సృష్టించాడు.

సత్యాన్వేషణ పథంలో మానవుడు ఇంతవరకు గమ్యస్థానం చేరలేదు. మానవుడి జీవితానికి ఎటువంటి దిశానిర్దేశం లేక, ఒక విధానమంటూ లేక అస్తవ్యస్తంగా ఉన్న రోజులలో ఒకే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, దానికెటువంటి ప్రామాణికత లేకపోయినా దానినే గాఢంగా విశ్వసించి,ఆ మార్గంలోనే జీవించటం ప్రారంభించాడు.'విశ్వాసమే సత్యం' గా భావించాడు.దీనివలన మునుపటి అస్తవ్యస్తత తొలగి మానవజీవితానికి నిర్దిష్ఠ విధానమంటూ ఏర్పడింది. ఒక కట్టుబాటు ఏర్పడింది. అప్పటికి ఇదే మానవుడు సాధించిన విజయం.

ఐతే శాస్త్రీయ దృక్పథం లేని కేవల విశ్వాసం వలన మానవజీవితంలో మూఢత్వం నెలకొంది. వికాసం లేక సమాజం శిలా సదృశంగా మారిపోయింది. ఈ విధంగా సమస్య మరో రూపంలో ముందుకొచ్చింది. ఈ సమస్య నుండి బయటపడటానికి మనిషి మరో రకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. 'ఏ విషయాన్ని గుడ్డిగా విశ్వసించకూడదు.ఏదైనా సరే ప్రత్యక్షంగా మనం చూడాలి లేదా శాస్త్రీయంగా నిరూపించబడాలి 'అనేదే ఆ కొత్త దృక్పథం. ఈ దృక్పథం వలన మనిషి అపరిమితమైన విజ్ఞానశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. ప్రకృతి మీద అదుపు సాధించాడు. అంతులేని విజయాలు సాధించాడు. అభ్యుదయవాదం, ఆధునికత పేరుతో నూతనమైన జీవనసరళినే సృష్టించాడు. 'శాస్త్రీయతే సత్యం'గా ప్రకటించాడు.

కానీ ఈ ధోరణి వలన ఆర్ధిక రంగంలో అనేక హానికర పరిణామాలు పొడసూపాయి. బలవంతుడు బలహీనుణ్ణి దోచి వేసే విషసంస్కృతి దాపురించింది. సామాన్యుల జీవితాలు దుర్భరమైపోయాయి. సంపద, సౌకర్యాలు, సుఖాలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. విజ్ఞానశాస్త్ర ఫలితాలను కొందరే అనుభవించటం ప్రారంభించారు. దీనితో మనిషి మళ్ళీ పునరాలోచనలో పడ్డాడు. పైకి గోచరించేదీ, ప్రత్యక్షంగా మనకు కనిపించేదీ కనికట్టు కావచ్చు, మోసపూరితం కావచ్చు. కాబట్టి 'ఏ విషయమైనా పైకి కనిపించినంతమాత్రాన నమ్మకూడదు. అది హేతుబద్ధమై, తర్కబద్ధమై ఉండాలి ' అనే నిర్ధారణకు వచ్చాడు. 'హేతుబద్ధమైనదే సత్యం' గా ప్రకటించాడు.ఈ ధోరణి వలన సమాజంలోని అతి సామాన్యుడు కూడా పరపీడననుండి విముక్తుడై మేలుపొందాడు. అతి బలహీనుడు కూడా తన ప్రాధాన్యతను గుర్తించి మసలుకోవటం ప్రారంభించాడు.

ఐతే ఈ హేతువాద ధోరణి అంతులేని వాదోపవాదాలకూ, ఎంతకూ కొలిక్కిరాని సిద్ధాంత చర్చలకూ దారితీసింది. ఏకాభిప్రాయనికి తావులేక ఎవరి అభిప్రాయాన్ని వారు సమర్ధించుకునే ధోరణి బయలుదేరింది. మానవుడు కూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలే మహాలక్ష్యాలుగా జీవించాల్సిన పరిస్థితి తల ఎత్తింది. మనిషి ఈ విధంగా దైహిక అవసరాలకే పరిమితమై మానసిక, బౌద్ధిక అవసరాలమాటే తలపెట్టక మనిషిగా తన విశిష్టతనే కొల్పోయే పరిస్థితి దాపురించింది. దీనితో మానవుడు తన హేతువాద దృక్పథాన్ని కూడా విడనాడేందుకు సన్నద్ధుడైనాడు. సరిగా ఇదే నేటి ప్రపంచ దృశ్యం.

సత్యాన్వేషణ పథంలో ఇన్ని శతాబ్దాల మహా యానంలో మానవుడు ఇంకా గమ్యాన్ని చేరలేకపొవటానికి కారణం ఏమిటి....? అని ప్రశ్నించుకోవలసినసమయమిది.

మానవుడికి సత్యస్వరూపం గురించి ఇప్పటివరకూ సరైన అవగాహన లేకపోవటమే దీనికంతటికీ కారణం. సత్యం ఏక రూప విషయం కాదు. అది మూడు అంశల యొక్క సమ్మేళనం.ఏదో ఒకానొక దృక్పథం వలన సంపూర్ణ సత్యం గోచరించదు.మానవుడు సత్యాన్ని చేరలేడు. విశ్వాసం వలన సత్యం లోని ఒక అంశ గోచరిస్తుంది.ప్రత్యక్ష ప్రమాణం లేక ఆధునిక దృక్పథం వలన మరోఅంశ గోచరిస్తుంది. హేతువాద దృక్పథం వలన మరో అంశ గోచరిస్తుంది. ఏదో ఒక దృక్పథాన్నే అంటిపెట్టుకోక సందర్భానుసారంగా మూడురకాల దృక్పథాలనూ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మానవుడు సత్యాన్ని చేరగలడు.

శ్రీలంక, భారత్ జట్ల మధ్య సమయము ఆసన్నమైంది

శ్రీలంక, భారత్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుకు ముంబై పూర్తిగా సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఇటు బౌలర్ ముత్తయ్య మురళీథరన్, అటు బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మోహరిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా ఇదే ఆఖరి ప్రపంచ కప్ పోటీలు కావడం విశేషం. ఇరు జట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు జట్లు కూడా మంచి ప్రదర్శనే సాగించాయి. పైకి రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.

రెండింటిని పోల్చి చూస్తే, శ్రీలంక బౌలింగులో, ఇండియా బ్యాటింగులో బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. భారత్‌కు సంబంధించినంత వరకు బ్యాటింగ్ సైడ్ బలంగా ఉంది. సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ముఖ్యంగా యువరాజ్ సింగ్‌లతో భారత బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. మలింగ, ముత్తయ్య మురళీథరన్, మెండిస్‌లతో శ్రీలంక బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తూ వచ్చింది. అయితే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో బౌలర్లందరూ ఫలితం సాధించారు. ముఖ్యంగా, శ్రీలంక స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది.
భారత, శ్రీలంక ఓపెనింగ్ జంటలు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. భారత ఓపెనర్ సెహ్వాగ్, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్‌లది ఒకే తీరైన ఆట. వీరు దూకుడుగా ఆడి స్కోర్లను పరుగులెత్తించగలరు. వారు ఎంత సేపు క్రీజులో నిలబడతారనే దానిపై ఆయన జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు. అయితే, సెహ్వాగ్‌కు తోడుగా సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్సును ప్రారంభించడం ఇండియాకు కలిసి వచ్చే విషయం.

ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఇప్పటి వరకు ఇన్నింగ్సుకు 274 పరుగుల సగటున 2194 పరగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్సుకు 242 పరగుల సగటున 1933 పరగులు చేసింది. అయితే, భారత్ 58 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 40 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ విషయంలో శ్రీలంకదే పైచేయిగా ఉంది. లోయర్ ఆర్డర్ మాత్రం శ్రీలంక కన్నా భారత్ మెరుగ్గా ఆడినట్లు కనిపిస్తోంది. భారత లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ 304 పరగులు చేయగా, శ్రీలంక బ్యాట్స్‌మెన్ 172 పరుగులు చేశారు. మొత్తంగా చూస్తే, భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్ పార్టీ వెంట్రుకతో సమానం

తాను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తనని, దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానించేవాడినని అలాంటి తాను ఎట్టి పరిస్థితులలోనూ పార్టీ వీడే అవకాశం లేదని, ఎన్టీఆర్ కుటుంబం మీద తనకు ఉన్న అభిమానం, టిడిపి కార్యకర్తగా తనకు ఉన్న నిబద్దత ముందు అన్నీ వెంట్రుకతో సమానమని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నేత వల్లభనేని వంశీ శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు వచ్చిన వాదనలను దృష్టిలో పెట్టుకొని అన్నారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. టిడిపీలోనే ఉంటానని చెప్పారు. తనకు పార్టీలో పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కార్యకర్తగానే పని చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. తమకు ఎప్పుడూ పార్టీ తరఫున పోటీ చేశామని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నప్పటికీ చంద్రబాబు, హరికృష్ణ పర్యటనల విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదన్నారు.


హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు అవమానించారని అన్నారు. హరికృష్ణకే గౌరవం లేకుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని అన్నారు. సుజనా చౌదరికి గౌరవం ఇవ్వడాన్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకే అవమానం జరిగిందన్నారు. తనకు దేవినేని ఉమపై వ్యక్తిగత కక్షలు లేవన్నారు. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవన్నారు. దేవినేని మాత్రం ఒంటెత్తు పోకడలకు వెళుతున్నాడన్నారు. అందరితో కలిసి దేవినేని ఉమ వెళ్లడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీని ఏకపక్ష ధోరణితో జిల్లాలో భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.

పార్టీలో ఎన్నో ఏళ్ల నుండి ఉన్నప్పటికీ కొడాలి నాని, తాను కార్యకర్తలుగా పని చేస్తున్నామని అన్నారు. పార్టీ పట్ల నిబద్దతతో తాము పని చేస్తున్నామన్నారు. నేను పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఎప్పుడైనా పాల్పడ్డట్టు గన్నవరం నియోజకవర్గంలో గానీ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోగానీ చెప్పించాలన్నారు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ విమర్శించలేదన్నారు. దేవినేని ఉమ టిడిపిలో, దేవినేని నెహ్రూ కాంగ్రెసులో, దేవినేని చంద్రశేఖర్ జగన్ వెంట వెళ్లనున్నారని ఇలా మూడు పార్టీలు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉండాలని చూస్తున్నారన్నారు. నందమూరి కుటుంబాన్ని గౌరవించనందుకే ఉమతో విభేదిస్తున్నానని చెప్పారు. నైతిక విలువలకు నేను కట్టుబడి ఉండే వ్యక్తిని అన్నారు.

దేవినేని నాయకత్వంలో తాను పని చేయలేకనే రాజీనామా చేశానని, అయితే ఆయన రాజీనామా చేసినందువల్ల నేను కొనసాగుతానని చెప్పారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆయన టిడిపిలో ఉంటే తనకేమి సమస్య కాదని, అయితే ఆయన నాయకత్వంలో మాత్రం పని చేయనన్నారు. అయితే హరికృష్ణకు క్షమాపణలు చెబితే మాత్రం తాను ఆయన నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమని అన్నారు. పార్టీ కోసమే తాను బయటకు మీడియా ముందుకు వచ్చానని, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం ఏమీ లేవన్నారు. నెహ్రూ జిల్లాలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుపుతున్నప్పటికీ ఉమ స్పందించడం లేదన్నారు. గతంలో సిపి సీతారామాంజనేయులు వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించలేదన్నారు. పార్టీ కోసం తాము ఎన్నో అవమానాలకు గురయ్యానన్నారు. వారిలా పేపర్లలో ఫోటోలు వేయించుకోవాలన్న పిచ్చి నాకు లేదన్నారు.

చంద్రబాబు కూడా నందమూరి కుటుంబంలో సభ్యుడే అని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యే సీటునో, ఎంపీ సీటునో కోరుకోవడం లేదన్నారు. ఉమను టిడిపినుండి తప్పించాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే చాలన్నారు. దేవినేని అయినా, కొడాలి నాని అయినా వ్యక్తిగతంగా ఎవరూ గెలవలేదని అందరూ టిడిపి పైనే గెలిచారన్నారు. తనకు ఒకరిని నిందించే ఉద్దేశ్యం ఉండదన్నారు. గత సాధారణ ఎన్నికలలో ఓడినప్పుడు కూడా ఎవరినీ నిందించకుండా తాను ఏడు నియోజకవర్గాలను సమన్వయం చేసుకోలేకనే ఓడిపోయానని చెప్పానన్నారు. తాను, బాలగోవర్ధన్ రెడ్డి గత ఎన్నికలలో టిక్కెట్ కోసం పోటీ పడినప్పటికీ ఇప్పుడు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. వంగవీటి రాధాకృష్ణతో కేవలం పరిచయం మాత్రమే అన్నారు. కుటుంబం వేరు రాజకీయం వేరని అన్నారు. అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని ఆయన అన్నారు. తాను ఇప్పుడు దేవినేని ఉమపై చేసే వ్యాఖ్యలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పార్టీకి వ్యతిరేకం కాదని పార్టీ ప్రయోజనాల కోసమే అన్నారు.

నువ్వా - నేనా(జూనియర్ ఎన్టీఆర్ - నారా లోకేష్)???!!??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వారసుడిపై చర్చ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ నాయకత్వాన్ని వదులుకునే స్థితిలో లేకపోయినప్పటికీ ఆ చర్చ ముందుకు రావడంలోని ఆంతర్యమేమిటనేది అర్థం కావడం లేదు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. నిజానికి, చంద్రబాబు తప్పుకుంటే ఆ స్థానం స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణకు దక్కాలి. అందుకు బాలకృష్ణ ఉవ్విళ్లూరుతున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఆయనకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.


పార్టీ నాయకత్వం కోసం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీ రామారావు మధ్య పోటీ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు నారా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నారా లోకేష్‌కు తన కూతురును ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తాను నాయకత్వం కోసం పోటీ పడకపోవచ్చునని అంటున్నారు. చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా ఆయన నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నారు. తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురును జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లి చేస్తున్న చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు అడ్డు రాకుండా ఈ పెళ్లి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, పార్టీ కార్యకర్తల నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు లభిస్తుంది. విశేష జనాదరణ ఆయనకు ఉంది. తాత స్వర్గీయ ఎన్టీ రామారావు లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. జనాదరణ విషయానికి వస్తే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడలేరు. కానీ ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తూ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.