13, ఏప్రిల్ 2011, బుధవారం

ప్రజలే తప్పులు చేసు ప్రభుత్వం ని నిందించటము ఎంత వరుకు న్యాయము

అన్నిటికన్నా పెద్ద అవినీతి ప్రజల దగ్గరే ఉన్నది అదేమిటి అంటే ఓటు వెయ్యకపోవటం. ఒకవేళ వేసినా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన , అంతకంటే ఘోరం డబ్బులు తీసుకునో ఓటు వెయ్యటం. ఈ అవినీతి నుండి ప్రజలు బయటపడనంత వరకూ ఏ లోక్ పాల్ బిల్లూ మనను రక్షించలేదు.
సరే సవ్యంగా ఓటు వెయ్యటం అనేది పెద్ద విషయం. అతి చిన్న విషయం ఎక్కడన్నానలుగురికి ఒకే చోట పని ఉంటే, ఎవరూ చెప్పకుండా లైన్లో నుంచుని పని చేసుకోవటం మనకు తెలుసా!! కనీసం గొర్రెలు ఒకదాని తరువాత ఒకటి సోలుపుగా వెళ్తాయి. కాని మనం, పెద్ద పెద్ద ఇనప కచ్చడాలు పెట్టి, ఇరుకు సొరంగాలు కడితే కాని వరుసలో నుంచోము. అక్కడకూడ ఔత్సాహికులైన, దృఢకాయులు, కొండకోచో సామాన్యంగా కనపడేవారు కూడా మన భుజాల మీదగా, నెత్తి మీదుగా నడిచి వెళ్లి వరుసలో ముందుకు వెళ్ళిపోవటం కద్దు.
బస్సు కాని రైలు కాని రావటం ఆలస్యం, ఎగబడి ఒకరికొకరు అడ్డం వస్తూ, తోసుకుంటూ ఎక్కకపోతే తృప్తి లేదు. హాయిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కటం అనే క్రమశిక్షణ ఎప్పటికి నేర్చుకుంటాం. ఈ తోసుకు ఎక్కే వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువ తిన్న వాళ్ళు అలా ఆ పక్కకివెళ్లి, చేతిలో పత్రికో, జేబు గుడ్డో, నెత్తిన ఉన్న కాపో లేదా గొడుగో, చేతిలో బాగ్గో, కిటికీలోంచి ఆ సీట్లోపడేసి, అందరూ భుజబలం చూపి లోపలి తోసుకు వెళ్ళినాక "ఆ చోటు నాదండీ" అంటూఅమాయకంగా వస్తారు.
ఒకవేళ కొండవీటి చాంతాడు అంత వరుస ఉంటే, ఆ మొదట్లో కిటికీ దగ్గర తచ్చాట్లాడి మెల్లిగా దూరటం లేకపోతె ఆ ముందుగా ఉన్నవాణ్ణి తన టిక్కెట్టు కూడ తీసుకోమని దేబిరించటం గొప్ప ప్రావీణ్యంగా చలామణీ అవుతున్నది. ఈ మొత్తాన్ని ఏమనాలి, ఏ బిల్లు తెచ్చి ఈ చండాలపు పని ఆపాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది.
ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసు లేకుంటే ఎంతమంది ఆగుతారు! ఆగుతున్నారు? పోలీసు చుట్టుపక్కల లేకపోతె ఒక్క ఆటో వాళ్ళే కాదు, ఏ సి కారు వాళ్ళు కూడ లైటు పట్టనట్టు వెళ్ళిపోతారు. ప్రతి ట్రాఫిక్ లైటు దగ్గరా పోలీసును పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సి వస్తున్నది . దానివల్ల పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం ఈ పనికే సరిపోయే. వాళ్ళు ఇక దొంగల్ని పట్టుకునేది ఎప్పుడు, నేరనిరోధం ఎలాగూ చెయ్యలేకున్నారు, నేర పరిశోధన ఎప్పుడు చేసేట్టు. అందరి దగ్గరా క్రమశిక్షణ ఉండి , కనీసం ట్రాఫిక్ నియమాలు సవ్యంగా, పోలీసు లేకపోయినా పాటించ గలిగితే ఎంతమంది పోలీసులు నేర నియంత్రణ చెయ్యటానికి మిగులుతారు. ఆలోచించాలి, తప్పదు. ఈ విషయంలో అన్నా హజారే గారు ఏమీ చెయ్యలేరు. మనమే, మనం అందరం పూనుకోవాలి.
నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి అన్న నీతి మనలో ఉండాలి. ఆ ఆఫీసులో తెలిసినవాడు ఎవడు? మనకు అర్హత లేకపోయినా మనకు పని ఎలా అవుతుంది, ఎవడిని పట్టుకుంటే పని సులువుగా చేయించుకోవచ్చు. ఎవడికి ఇంత పెడితే ఈ పని చులాగ్గా ఇవ్వాళే చేయించుకోగలం , ఇదే ఆలోచన.
సవ్యంగా ఉన్న నియమాల ప్రకారం ప్రజలందరూ పని చేసుకు పోతుంటే, అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. మనకు అర్హత లేనిదికావాలి, ఉన్న నియమాలు పాటించ కుండా పనులు అయిపోవాలి, అవినీతి ఉండకూడదు. ఎలా? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలే!
నియమాలు పాటించని ప్రజలు ఎక్కువగాఉన్న సమాజంలో అవినీతి ఎప్పటికీ పోదు. కలకాలం నిలిచే ఉంటుంది.
అవినీతి పోగొట్టాలంటే కొంత పని ఆలస్యం అవ్వటానికి, కొన్ని పనులు కాకపోవటానికి, ఆవిధంగా జరిగే నష్టాన్ని భారిమ్చాతానికి సిద్దపడి ఉండాలి. ఇవేమీ లేకుండా, టి వి కెమెరాల ముందు ఆవేశపడితే అవినీతి పోదు, మరింత పెరుగుతుంది. కారణం శిక్షలు ఎక్కువ అవ్వటం వల్ల తీసుకునే వాడు మరింత ఎక్కువ తీసుకుంటాడు. వాడికి రిస్కు ఎక్కువ అయ్యింది కదా మరి.
బంధువుల్లో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులని ఎవరన్నా బహిష్కరించి వాళ్ళఇళ్ళకు వెళ్ళకుండా ఉంటున్నారా. అలాంటి వాళ్ళ పిల్లలను సంబంధాలు చేసుకోకుండా ఉంటున్నారా? "అబ్బ మావాడా, భలే తెలివిగల వాడండీ, రెండుచేతులా సంపాదన" అనిచెప్పుకునే వాళ్ళను ఏమనాలి.
ఈ ఆలోచనా రీతి ఏ చట్టం మార్చగలదు. ఇది చట్టం చెయ్యలేనిపని. ఎవరికి వారు ఆలోచించుకుని చెయ్యాలి.
ఒక సామాన్యమైన కుటుంబంలో పెళ్ళికి ఎదిగిన కూతురు, రెండు సంబంధాలు వచ్చాయి, ఒకటి కుర్రాడు పి జి చేసి జనాభా లెక్కల కార్యాలయంలో పని చేస్తున్నాడు, మరొకడు పట్టభద్రుడు, చెక్ పోస్టులో పని. ఎవరైనా ఏది మంచి సంబంధం అని చేప్పు కుంటారు. ఆ రెండోదే కదా. అక్కడే ఉన్నది అవినీతికి మూలం.
ఎక్కడన్నా ఎర్ర లైటు దాటో, వన్-వేలో ఎదురు వెళ్ళో పోలీసు పట్టుకుంటే, సరే నాది తప్పు, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను రశీదు ఇవ్వండి అనే నీతి ఎంతమందిలో ఉన్నది. తృణమో ప్రణమో ఆ పోలీసుకు ఇచ్చేసి బయటపడదామనే తాపత్రయమే ఎక్కువ.
ఇక మన కళ్ళ ముందు జరిగే అవినీతి, మనం పనిచేసే చోట జరిగే అవినీతి "విజిల్ బ్లోయర్" చేసి అన్నా ఆపగలిగే ధైర్యం ఎంత మందిలో ఉన్నది. గుంపులో గోవిందగా ఎవరికో జైకొట్టుకుంటూ తిరిగేయ్యగలం, కాని మన ఒక్కళ్ళమే కనీసం అజ్ఞాతంగానన్నా జరిగే అవినీతిబయట పెట్టటంలో మనవంతు కృషి చెయ్యగలమా! ఆలోచించుకోవాలి.
ఆఫీసుల్లో పని చెయ్యకుండా బాతాఖానీతో కాలం గడపటం . ఉద్యోగం వచ్చేవరకూ ఒక గోల. ఉద్యోగం వచ్చిన తరువాత ప్రమోషన్ రాలేదని. పనిచేసేప్పుడు మనసు పెట్టి ఇచ్చిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఎంతమంది? ఉద్యోగంలో "కరీర్ ఓరియంటేషన్" పేరుతొ సకల గడ్డీ కరవటం, చెయ్యకూడని పనులు చెయ్యటం అవినీతి కాదూ. వీటితో వచ్చే ఒత్తిడికి బి పిలు షుగర్లు తెచ్చుకోవటం. ఇదేనా మనకు మన పూర్వీకులు నేర్పినది!
చేసే వ్యాపారాల్లో కల్తీ, నాణ్యం లేని వస్తువులను అంటగట్టటం ఎటువంటి నీతి? ప్రతి వాడి దగ్గరకూ వెళ్లి తనిఖీ చేసి ఎవరు ఆపగలరు. ఆ వచ్చినవాడికి "ఆమ్యామ్యా" ఇచ్చేసి పంపటం, వాడు తీసుకోకుండా కేసు వ్రాస్తే, వాడి పైవాడి మరికొంత ఎక్కువ పారేసి కేసు మాఫీ చేయించుకోవటం, ఇదంతా నీతేనా. కాదు నాణానికి మరో పక్కన ఉన్న దృశ్యం. అది కూడ చూడాలి, తప్పదు.
నిజాయితీ లేని వ్యాపార ప్రకటనలు గుప్పించి ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేయ్యటం, వాళ్ళను తోచుకో నివ్వకుండా, తమ వస్తువే కోనేట్టుగా చేసే వ్యాపార ప్రకటనలూ ఈ అవినీతిలో భాగమే.
ఇక ఇంకా అనేకం:- మన దొడ్లో చెత్త వేరే వాళ్ళ వాకిట్లోకి తోయ్యటం, నో పార్కింగ్ అన్న చోట నిర్భీతిగా వాహనాన్ని సైడు స్టాండు వేసి మరీ పార్కింగ్ చేసేయ్యటం, ఏమిరా అంటే అడ్డంగా వాదించటం, ఎట్టాపడితే అలా వాహన చోదకం, సమయ పాలన చెయ్యకపోవటం, వద్దన్న పనులే చెయ్యటం (బాహాటంగా పొగ తాగటం, మద్యం సేవించటం, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం), ఎవరన్న గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించటం, నలుగురిలో లేకితనపు మాటలు మాట్లాడటం ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష.
లంచం ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. పది రూపాయలు ఒకడు లంచం ఇచ్చాడు అంటే, వాడికి ఆ పదిరూపాయల కంటే వెయ్యి రెట్లు లాభం లేకుండా ఇవ్వడు. ఆ లాభం పాటించవలసిన నియమాలు పాటిస్తే రాదు. అందుకని లంచంతో ఆ నియమాలను పాటించకుండా అధిగమించటం. ఇది తగ్గాలి ముందు. అవినీతి నిరోధక శాఖ వారు లంచాలు ఇవ్వచూపే ప్రభుద్దుల్ని కూడ వల పన్ని పట్టుకుని జైళ్ళల్లో పారెయ్యటం మొదలు పెట్టాలి.

మొత్తం మొత్తం మీద, మనిషిలో దురాశే అవినీతికి మూలం. మనకు అర్హత లేనివి సంపాయించాలన్న తపన, అవినీతికి పునాది. ఈ పునాదులను పగలగొట్టాలి. ప్రజలందరిలోనూమార్పు రావాలి. అది చట్టాలతోనూ, బిల్లులతోనూ రాదనీ నా అభిప్రాయం.

అన్నా హజారే ఆ వయస్సులో ఇచ్చిన స్పూర్తితో మన ఆలోచనా విధానం లో మార్పు రావాలి. ఊరికే ఇంకెవరో అవినీతిపరులన్నట్టుగా ఆవేశపడటం తగ్గించి మనలోనే పొంచి ఉన్న అవినీతిని గుర్తించి (ముందు గుర్తించటం ఎంతో ముఖ్యం, అది లేనట్టుగా ఉండటం కల్తీ లేని నటన) అటువంటిఆలోచనలు పోగొట్టుకోవటానికి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అన్నా హజారేకి జై కొట్టటానికి అర్హులం. అటువంటి ఇంగితం లేనప్పుడు ఇప్పుడు టివిల ముందు జరిగేదంతా ఇచ్చకాలే తప్ప మరేమీ కాదు.


అవినీతి నిర్మూలించాలంటే వేలు మరోకరివంక చూపిస్తూ ఆవేశపడినంత మాత్రాన అది పోదు. ప్రజలందరం ఆత్మ విమర్శ నిజాయితీగా చేసుకోవాలి. ప్రతిరోజూ అవినీతి ఆలోచన కూడ దరి చేరనివ్వకుండా జీవించగలగాలి.

"యధాప్రజ తధారాజా"

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం. మనమే ప్రతీ విషయం లో ఇంత స్వార్ధం తో నిజాయితీ లేకుండా అలొచిస్తుంటే ఇక మనల్ని రిప్రజెంట్ చేసే , మనం ఎన్నుకున్న నాయకులు ఇంకెంత స్వార్ధం తొ ఆలోచిస్తారు. డబ్బు, మద్యం, గిఫ్ట్లు లంచం తీసుకుని అవినీతి పరుల్ని ఎన్నుకునేది సామాన్య జనమే (మనమే). బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి, లంచం ఇచ్చి ఓట్లు కొన్న నాయకులు నిజాయితీ గా పనిచెయ్యాలని కొరుకొవడం చాలా అత్యాశ , అన్యాయం కూడా. మరి ఆ లంచం తీసుకునేవాళ్ళకన్నా ఆ లంచం ఆశ చూపించేవారిదే తప్పు అనుకుంటే , మరి లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకన్నా లంచం ఇచ్చే మనది తప్పు అన్నమాట. ఇదొక కరేప్షన్ సైకిల్ అన్నమాట... ఈరోజు లంచం ఇచ్చినవాడు రేపు వాళ్ళదగ్గరే తీసుకుంటాడు..ఆ మర్నాడు మళ్ళీ వాళ్ళకే లంచం ఇవ్వాల్సి రావచ్చు... ఆ సైకిల్ అలానే అనంతం గా సాగిపోతుంది. ఒక రకంగా ఈ సైకిల్ మన కల్చర్ లో భాగం అయిపొయింది. కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్ లోకి రాగానే పాస్వర్డ్ బ్రేక్ చేసేవారిని మహా తెలివైన వాళ్ళగా పోగుడుతాం, డబ్బులిచ్చి ఒరిజినల్ డివిడి కొన్నవాడిని తింగరొడిని చూసినట్టు చూస్తాం. అది ఇప్పటి కల్చర్ ..

ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు....


నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... ఏదో కొన్నాళ్ళు హడావుడి తప్పించి....
మనం చేసే అవినీతి గురించి ఆలోచన లేకుండా , సమాజం మాత్రం అవినీతి రహితం గా ఉండాలనుకోవడం , దానికి పాదయాత్రలు చెయ్యడం, నిరాహార దీక్షలు చెయ్యడం, లెక్చర్లు దంచడం కన్నా అత్మ వంచన ఇంకేమీ లేదు. అన్నా హాజారే కి లక్షకోట్లు తిన్న జగన్, రెండువేల ఎకరాలు ప్రబుత్వ రేట్ కి జాక్ పాట్ కొట్టిన రామోజీ రావు మద్దతు ప్రకటిస్తుంటే ఎంత కామెడీ గా ఉందొ ... మనం మద్దతు ప్రకటించినా అలానే ఉంటుంది....

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్. ఈ రొజు నుండి ఈ పర్టిక్యులర్ అవినీతి నేను త్యజిస్తున్నా ... ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అని.... సంఘానికి పూర్తి వ్యతిరేకంగా ఎదురీదుతూ అపర నిజాయితి పరుడిగా ఒక్కరొజే మారిపొనక్కర్లేదు....మారలేం కూడా... అయితే మనకి చేతనయినంతలొ... మనం కొంచెం కస్టం తొ చెయ్యగలిగినవి చెయ్యగలిగితే చాలు.... మార్పు చాలా స్లొగా వస్తుంది. అయితే ఆ మార్పు ముందు ఎదుటివాడి నుండి ప్రారంభం అవ్వాలనుకోకుండా... మననుండి ప్రారంభం అవ్వాలని నిర్ణయించుకొవడమే నిజమయిన దేశభక్తి...

ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.

ఎన్టీఆర్‌ రే హరికృష్ణను రెచ్చగొట్టాడా!!??

పార్టీలో నిప్పు పెట్టింది సినీ హీరో జూనియర్ ఎన్టీఆరే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తిరుగుబాటు ద్వారా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా తిరుగుబాటు చేసిన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ, శాసనసభ్యుడు కొడాలి నానీ జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందినవారే. వారిద్దరికీ గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టికెట్లు ఇప్పించుకున్నారు. అందువల్ల వారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయించారనే మాట వినిపిస్తోంది.


పార్టీలో సంక్షోభానికి తెర తీసేందుకు తన తండ్రి నందమూరి హరికృష్ణను రెచ్చగొట్టింది కూడా జూనియర్ ఎన్టీఆరేనని అంటున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను చంద్రబాబు నారా లోకేష్‌కు అప్పగించేందుకు, తన తదనంతరం లోకేష్‌ను పార్టీ అధినేతగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానివల్ల పార్టీ పూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వానికి దూరమైపోతుందని జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో అన్నట్లు తెలుస్తోంది. దాంతో నారా లోకేష్‌ను అడ్డగించేందుకు హరికృష్ణ తిరుగుబాటుకు పాదులు వేసినట్లు చెబుతున్నారు.

నారా లోకేష్ వాస్తవానికి వాణిజ్యవేత్త. ఆయన క్రమంగా తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపార సంబంధాల వల్లనే సుజనా చౌదరికి చంద్రబాబు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే విమర్శలు కూడా అప్పుడు వెల్లువెత్తాయి. హరికృష్ణ కూడా తన నిరసనను వ్యక్తం చేశారు. వ్యాపార సంబంధాలను, పార్టీ కార్యకలాపాలను కలగలిపి మెల్లగా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్య స్థానానికి చేరుకుంటారనే అనుమానాలే హరికృష్ణ తిరుగుబాటుకు కారణమని అంటున్నారు.

నారా లోకేష్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టాలనేది హరికృష్ణ ఉద్దేశంగా చెబుతారు. నారా లోకేష్‌కు ప్రజాకర్షణ లేకపోవడం పెద్ద లోటు. ఆ ప్రజాకర్షణ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది. తాత ఎన్టీ రామారావు వారసుడిగా నిలబడాలనే బలమైన ఆకాంక్ష కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ముందుకు నడిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామరావు ఆశయాలకు అనుగుణంగా నడపాలనే హరికృష్ణ ఆకాంక్షకు జూనియర్ ఎన్టీఆర్ కోరిక తోడైనట్లు భావిస్తారు. అయితే, ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీని నడిపించగలిగే సత్తా సంతరించుకుంటారా అనేది అనుమానమే. అనుభవరాహిత్యం జూనియర్ ఎన్టీఆర్‌ను పీడిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును కాదనే ఉద్దేశం హరికృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ లేదని అంటారు. భవిష్యత్తులో పార్టీ నారా లోకేష్ చేతిలోకి వెళ్లకుండా చూసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు. దానివల్లనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంక్షోభం చోటు చేసుకుందని భావిస్తున్నారు

హరి'కథ' ప్రస్తుతానికి కంచికి

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం ముగిసినట్లేనని భావిస్తున్నారు. అయితే, ఇది తాత్కాలికమా, శాశ్వతమా అనేది చెప్పలేని పరిస్థితే ఉంది. హరికృష్ణ కథ ప్రస్తుతానికి కంచికి చేరినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వ్యూహానికి హరికృష్ణ తలవంచక తప్పలేదని అంటున్నారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తొందరపడ్డారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవికి చేసిన వల్లభనేని వంశీ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. చంద్రబాబుకు ఆయన క్షమాపణలు చెప్పినట్లు కూడా సమాచారం.


జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను కలిసిన తర్వాతనే వంశీ చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని కూడా వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామా ఉపసంహరణపై స్పష్టమైన ప్రకటనేది వంశీ నుంచి రాలేదు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు సన్నిహితులైన పార్టీ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయి. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై వంశీ చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

నేను మీ నాయకత్వంలోనే పనిచేస్తానని వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడేది లేదని వంశీ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచన మేరకు వంశీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది