17, ఏప్రిల్ 2011, ఆదివారం

పుట్టపర్తి సత్యసాయిబాబా బందీ?!@#?

పుట్టపర్తి సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలకు ఇద్దరు మంత్రులను బాధ్యులను చేస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. బాబా బందీ అంటూ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన టీవీ చానెల్ సత్య సాయిబాబా వ్యవహారాల్లో కుట్ర చేస్తున్నవారి విషయంలో ఇద్దరు మంత్రులు భారీగా డబ్బులు తీసుకున్నారని, అందుకే వారు మాట్లాడడం లేదని టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలను దాచి పెడుతూ కోట్లాది రూపాయల వ్యవహారాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.


సత్య సాయిబాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత మంత్రి జె. గీతా రెడ్డి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై సమీక్ష చేశారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఆమె ఎడతెరిపి లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చారు. మంత్రి రఘువీరా రెడ్డి కూడా హడావిడి చేశారు. సత్య సాయిబాబా ట్రస్టుపై, సత్య సాయిబాబా వ్యవహారాలపై వస్తున్న వార్తాకథనాలకు వివరణ ఇవ్వడంలో ఆయన బిజీగా గడిపారు. ఆ తర్వాత ఈ ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడడం మానేశారు. మంత్రుల పేర్లను మాత్రం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వెల్లడించలేదు. గీతా రెడ్డి, రఘువీరా రెడ్డి సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు.

సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పకుండా ఉండడానికి ఓ ఐపియస్ అధికారికి కూడా భారీగా డబ్బులు ముట్టినట్లు చానెల్ ఆరోపించింది. ఆ అధికారికి 200 కోట్ల రూపాయలు ముట్టాయని, వాటిని అతను హవాలా మార్గంలో విదేశాల్లో తన కుమారుడికి తరలించాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా చెప్పుకుంది. కాగా, బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య సేవలకు స్పందిస్తున్నారని సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా శుక్రవారం సాయంత్రం కూడా ప్రకటించారు

కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నిక పరీక్షలాంటిదే.

కడప ఉప ఎన్నిక ఫలితంపైనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కడప లోకసభ స్థానం ఉప ఎన్నికపై కాంగ్రెసు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌ను ఓడించేందుకు ఏ విధమైన అవకాశాన్ని కూడా వదిలి పెట్టకూడదని ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కడప లోకసభ స్థానంలో పావులు కదుపుతూ వస్తున్నారు. వైయస్ జగన్‌కు బలం ఉన్న జమ్మలమడుగు, బద్వేలు వంటి శాసనసభా స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మను తమ వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు.


కాగా, కడపలో వైయస్ జగన్‌ను ఓడించలేకపోయినా కనీసం రెండో స్థానంలోనైనా నిలబడేలా చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు విజయం నల్లేరు మీద బండి నడక కాకూడాదని, భారీగా మెజారిటీ తగ్గించే విధంగా కృషి చేయాలని అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్‌కు మధ్య పోటీ జరిగి, తమ పార్టీ మూడో స్థానానికి పడిపోతే దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని అంటున్నారు. భవిష్యత్తులో దాని వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట అటుంచితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ పోటీలోనే ఉండకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ను ముప్పు తిప్పలు పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి తగిన లక్ష్యాలు నిర్దేశిస్తూనే కాంగ్రెసు అధిష్టానం తన వంతు వ్యూహాన్ని తాను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉండి, ఆయనకు సన్నిహితులుగా మెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులను రంగంలోకి దింపింది. ఉప ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తిప్పలు తప్పవని అంటున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నిక పరీక్షలాంటిదే.

శ్రీరాముడిని విలన్‌గా, మహిళా వ్యతిరేకిగా చూపిస్తూ రామాయణ విషవృక్షం - రామ్‌గోపాల్ వర్మ

భార్య కోసం రావణుడిపై వ్యక్తిగత యుద్ధం చేసిన శ్రీరాముడు దేవుడెలా అవుతాడని ప్రశ్నించిన ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. హిందువులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని విలన్‌గా చూపిస్తూ ఆయన సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారు. రామాయణ విషవృక్షం అనే కథను ఆధారం చేసుకుని ఆయన సినిమా తీయాలని అనుకుంటున్నారు. రామాయణ విషవృక్షం హక్కులు లభిస్తే సినిమా తీస్తానని ఆయన అంటున్నారు. శ్రీరాముడిని విలన్‌గా, మహిళా వ్యతిరేకిగా చూపిస్తూ రామాయణ విషవృక్షం రచన వచ్చింది. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర దుమారం రేపింది.


ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ వాల్మీకి రామాయణాన్ని రామాయణ కల్పవృక్షం పేర తెలుగులో కావ్యం రాశారు. రాముడి కథలు తెలుగు సాహిత్యంలో చాలానే వచ్చాయి. శ్రీరాముడిని మానవోత్తముడిగా, దైవంగా కీర్తిస్తూ రచనలు వచ్చాయి. అయితే, రంగనాయకమ్మ అనే రచయిత్రి రాముడిని విలన్‌గా చూపిస్తూ రామాయణ విషవృక్షం అనే రచన చేశారు. ఈ రామాయణ విషవృక్షం హక్కులు తనకు ఇస్తే సినిమా తీస్తానని రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు.

వాల్మీకి రామాయణం కథను తలకిందులు చేస్తూ రంగనాయకమ్మ తెలుగులో రామాయణ విషవృక్షం రచన చేశారు. రావణుడిని రాక్షసుడిగా కాకుండా సాధారణ మానవుడిగానే భావిస్తూ ఆమె రచన చేశారు. లక్ష్మణుడి చేతిలో ముక్కు చెపులను కోల్పోయిన రావణుడి సోదరి శూర్పణఖను అత్యంత సౌందర్యవతిగా చిత్రించారు. ఆ సౌందర్యానికి సీత అసూయ పడడం వల్లనే శూర్పణఖ ముక్కుచెపులను లక్ష్మణుడు కోసేశాడని ఆమె రాశారు. మొత్తంగా, రావణుడు ఉత్తమ పురుషుడిగా, రాముడు స్వార్థపరుడిగానూ మహిళా వ్యతిరేకిగానూ రామాయణ విషవృక్షం రచనలో కనిపిస్తారు.

ఓ వైపు తన బావమరిది, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ వైపు తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నుంచి, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కోస్తాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు హరికృష్ణ పెట్టిన కుంపటి చల్లారినట్లు కనిపించినా, మళ్లీ ఎప్పుడు ఎగసిపడుతుందో అది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉంది. హరికృష్ణను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను ఎగదోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు పురంధేశ్వరి సహాయ సహకారాలు అందుతున్నట్లు తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చీలికకు కూడా ఇది దారి తీయవచ్చుననే వార్తలు వస్తున్నాయి.


కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చిచ్చుబుడ్డిలా ఎగిసిపడుతున్నారు. ఉండి, ఉండి ఆయన సంచలన ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడానికి ఆయన వెనకాడడం లేదు. నాగం జనార్దన్ రెడ్డి వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఒక వర్గాన్ని చంద్రబాబు ఎగదోస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతకంతకు నాగం జనార్దన్ రెడ్డి రెచ్చిపోతున్నారు. తెలంగాణపై చంద్రబాబును ప్రశ్నించే దాకా ఆయన వచ్చారు.

నాగం జనార్దన్ రెడ్డి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి పంపిస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏదో విధంగా చంద్రబాబు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఈసారి సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో తనపై వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సమావేశంలో చర్చించి నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ ఇచ్చే అవాకశాలున్నాయని అంటున్నారు.