21, మే 2011, శనివారం

అమెరికన్లకు వింత భయం

అమెరికన్లకు వింత భయం పట్టుకుంది. యుగాంతం గురించి ఎన్నో కథనాలు, మరెన్నో ఆసక్తికర విషయాలు పుకార్లుగా షికార్లు చేస్తున్న ఇటీవలి కాలంలో అమెరికాలో మరో ఆసక్తి కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు 2012లో యుగాంతం సంభవిస్తుందని చెబుతుంటే కొందరు అమెరికన్లు మాత్రం ఈ రోజే (మే 21, 2011 శనివారం) యుగాంతం సంభవిస్తుందని ప్రచారం చేస్తున్నారు.

క్రిస్టియన్ మతస్థుల పరమ పవిత్ర గ్రంధమైన బైబిల్ ప్రకారం... శనివారం అంటే మే 21న ప్రపంచం అంతమై పోతుందని హెచ్చరిస్తూ అమెరికాలోని న్యూయార్క్‌లో కొంతమంది కరపత్రాలు, బ్రోచర్లు, పుస్తకాలు మరియు పోస్టర్లతో నగరంలోని కూడలి ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పెను భూకంపం సంభవించి ప్రపంచం అంతమైపోతుందని హెచ్చరిస్తూ న్యూయార్క్ సిటీ సబ్‌వేలో అడ్వర్టయిజ్‌మెంట్లు సైతం వెలిసాయి. అక్కడి ప్రజలు మే 21ని ‘జడ్జిమెంట్ డే’గా పేర్కొంటున్నారు.

మరి బైబిల్ ప్రకారం మే 21, 2011 రోజునే ఈ ప్రళయం ఎలా సంభవిస్తుందని చెప్పగలరు..? ఇందుకు సమాధానం కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన ఫ్యామిలీ రేడియో అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ వద్ద ఉంది ఆయన లెక్కలు వేసి విశ్లేషించిన దాని ప్రకారం.. ఈ ప్రళయం శనివారమే జరుగుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదిస్తున్నారు.

అంతేకాకుండా.. ఏసు ప్రభువు తనకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని చెప్పినట్లు హరోల్డ్ అంటున్నారు, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. కాబట్టి ఈ రోజునే ప్రళయం సంభవిస్తుందని హరోల్డ్ లెక్కలు కట్టారు. ఇంకా అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ అంటున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయి. ఏది జరిగినా భగవంతునిపై భారం వేసి మన జీవన ప్రయాణం కొనసాగించక తప్పదు మరి. అంతా మంచే జరగాలని, అందరూ హాయిగా ఉండాలని కోరుకుందాం.

నాగం జనార్దన్ రెడ్డి కార్నర్

తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో నాగం జనార్దన్ రెడ్డి ఒంటరి అయినట్లే కనిపిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం తెలుగుదేశం తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయాలు జరిగాయి. తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై శుక్రవారం ఈ సమావేశం జరిగింది. సమావేశంలో శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో టిడిపి తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటుతో నాగం జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టాలన్న వ్యూహం ఈ సమావేశంతోనే అమలు కావడం ప్రారంభమైందని చెప్పవచ్చు.

శుక్రవారం జరిగిన తెలంగాణ విస్తృత స్థాయి సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డి హాజరు కాగా, హరీశ్వర్ రెడ్డి గైర్హాజరయ్యారు. పరిగిలో శనివారం జరిగే తెలంగాణ నగారా సభ ఏర్పాట్లలో ఉండడం వల్లనే ఆయన రాలేకోపయారని చెబుతున్నారు. పరిగి సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో చేయాలని తలపెట్టిన నగారా సభలకు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గం బ్రేకులు వేసే కార్యక్రమానికి సిద్ధపడింది. ఈ నెల 25వ తేదీన కరీంనగర్ జిల్లాలో నగారాను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

ఇక ముందు తెలంగాణ నగారా సభలు పార్టీ జెండాలతోనే జరపాలని కూడా నిర్ణయించింది. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇస్తేనే పార్టీ జెండా పెట్టాలని నాగం జనార్దన్ రెడ్డి పెట్టిన మెలికను ఆయన వ్యతిరేకవర్గం తిప్పికొట్టింది. ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నుంచి తలపెట్టిన పాదయాత్ర కూడా సందిగ్ధంలో పడింది. ఈ కార్యక్రమాన్ని భువనగిరి శానససభ్యురాలు ఉమా మాధవ రెడ్డి అభ్యంతరం చెప్పారు. పార్టీలో పదవులు అనుభవించినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా అని ఎర్రబెల్లి దయాకర రావు నాగం జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఒక్కడినే లేనని, తన వెంట చాలా మంది ఉన్నారని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

వెనక్కి తగ్గడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేరు.

తెలంగాణపై తన పోరాటంలో వెనక్కి తగ్గడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేరు. తాను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గానీ పార్టీకి వ్యతిరేకం కాదంటూనే చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. చంద్రబాబు అనుకూల తెలంగాణ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ జెండా లేకుండానే తాను సభలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. రేపు శనివారం పరిగి తెలంగాణ నగారా సభ కూడా పార్టీ జెండా లేకుండానే జరుగుతుందని, ఈ సభకు అందర్నీ ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. రేపటి సమావేశానికి అందరూ వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమావేశంలో పార్టీ జెండా లొల్లే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్లాలనే ఆలోచన చేయలేదని, అటువంటి సమావేశంలో తాను ఎలా కూర్చుంటానని ఆయన అన్నారు. సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగింది కాబట్టి చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. తాను నిర్వహించిన నాగర్ కర్నూలు సభ ప్రకంపనలు సృష్టించిందని, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే సమావేశం నిర్వహించానని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజల సమీకరణకు పార్టీ జెండా పెడితే ఎలా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టే ఉద్యమంలో పార్టీ జెండా పెడితే అన్ని పార్టీలవాళ్లు రారని ఆయన అన్నారు.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా పార్టీ జెండా పెట్టడం లేదని, ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో ఎలా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ సాధించుకోగలుగుతామని ఆయన చెప్పారు. కాలం చెల్లిన ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటే ఎవరు నమ్ముతారని ఆయన అడిగారు. తాము కలిసినప్పుడు చంద్రబాబు నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం సంకేతాలిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ నాయకులు స్పష్టత లేదని ఆయన అన్నారు.