11, మే 2011, బుధవారం

సుఖమయమైన నిద్రకు......కొన్ని సలహాలు...

సుఖంగా, హాయిగా నిద్రపోయిన వారు ఎలాంటి సమస్యలు లేకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒక్కరోజు సరైన నిద్ర లేకపోతే రోజంతా చికాకుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు, మెదటసారి ప్రసవం అయిన చాలా మంది వారి వయస్సుతో పాటు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రసవం అయినవారు వారంలో రెండు మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.వర్కింగ్‌డేస్‌లో ఏడుగంటల ఇరవై నిమిషాలపాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాలసేపు నిద్రపోతున్నారు. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, డిప్రెషన్‌ నిద్రపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిద్ర సరిపోని వారు తిండి, పని వంటి విషయాలపై ఆసక్తిని కోల్పోతున్నారని తేలింది.
కొన్ని సలహాలు...

ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవాలి. ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది.
పడుకొనే ముందు కాఫీ, ఆల్కహాల్‌ సేవించడం వంటివి చేయకూడదు.
పడకగదిలో ఆరోమా కాండిల్స్‌ను వెలిగించుకోండి. వీటి నుంచి మంచి సువాసన వస్తుంది. సుఖంగా నిద్ర పడుతుంది.
పడుకునే ముందు మీకిష్టమైన మ్యూజిక్‌ను వినండి. తక్కువ సౌండ్‌తో సంగీతం వింటే ఇట్టే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి

కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాటల్లోని ఒక అంశం మాత్రం నిజమనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇక దినదిన గండమేనని ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని చెప్పవచ్చు. ఉప ఎన్నికలు, ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాస్తా ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇటు జగన్ వ్యవహారం గానీ అటు తెలంగాణ అంశం గానీ ఆయనను తీవ్రంగా వేధించలేదు. ఉప ఎన్నికల్లో తాను చేయాల్సిందంతా చేస్తున్నానని ఆయన ఇంత కాలం అనిపించుకున్నారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి పెరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికల ఫలితాలను చూపించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశాలు చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఆయనను ఇరకాటంలో పెట్టేందుకే వారు ప్రయత్నాలు సాగిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు ముందుకు వస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రం విసిరారు. కడప ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడలను ఆయన తప్పు పట్టారు. మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం సహకరించే అవకాశాలు లేవు. తమ పనేదో తాము చేసుకు పోతున్నామని మాత్రమే అనిపించుకునేందుకు పరిమితమవుతారని చెప్పవచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. తనను కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. పరిస్థితిని చక్కదిద్దడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ఇప్పుటికైతే ఏ విధమైన అస్త్రాలు లేవు. నామినేటెడ్ పదవులు మాత్రమే ఆయన వద్ద ఉన్నాయి. అయితే, వాటిని భర్తీ చేస్తే పార్టీలో అసంతృప్తి మరింత పెరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుంచి డిఎస్‌తో పాటు సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా, ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరోసారి తెలంగాణ అంశం రాజకీయాలను వేడెక్కించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఇవ్వకపోతే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు కూడా ఏదో ఒక కార్యక్రమానికి ముందుకు రాక తప్పదు. దీనివల్ల కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కష్టాలు తప్పేట్లు లేవు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి ముళ్ల మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు.

ఆపద్బాంధవుడు చిరంజీవి జాక్‌పాట్ కొట్టే అవకాశాలు

ఆపద్బాంధవుడు చిరంజీవి జాక్‌పాట్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కయ్యానికి కాలు దువ్వుతూ ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆదుకున్న చిరంజీవికి పార్టీ ఉన్నత స్థానం కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారట. పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి చిరంజీవిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

నిజానికి, పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆలోచించారు. అయితే, కొత్తగా వచ్చిన నాయకుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే సీనియర్లు అసంతృప్తికి గురి కావచ్చుననే ఉద్దేశంతో దొడ్డి దారిలో రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను ఆయన చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిడబ్ల్యుసి సభ్యుడిగా చిరంజీవి రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌తో జగన్ చెలిమి ఎందుకు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు చెలిమి చేయాలని అనుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. అందుకు ప్రాతిపదిక ఏమైనా ఉందా అనేది కూడా ముఖ్యమైన విషయమే. రాజకీయాల్లో తన తండ్రి వారసుడిగా నిలబడేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తుండగా, తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలనేది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం. ఒక రకంగా ఇద్దరి లక్ష్యం ఒకే విధమైంది. అయితే, ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నవారి మధ్య స్నేహం సాధ్యమవుతుందా అనే దానికి ప్రాతిపదిక కూడా ఉంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అధికారాన్ని కూడా ఈ రెండు వర్గాలే పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం సహాయంతో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి బిసీలు రంగం సిద్ధం చేసుకున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు నాయకత్వం కింద చిరంజీవిని అందుకు బిసీ వర్గాలు ఆలంబనగా చేసుకున్నట్లు భావించవచ్చు. అందుకు అనుగుణంగానే చిరంజీవికి కాంగ్రెసు అధిష్టానం పార్టీలో పెద్ద పీట వేసేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పటి వరకు రెడ్ల ఆధిపత్యంలో ఉండేది. దాన్ని క్రమంగా బిసీల దారి పట్టించేందుకు తెర వెనక ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెడ్ల గొడుగు పార్టీగా పరిణామం చెందే ప్రమాదం ఎక్కువగానే ఉంది. జగన్ వెంట ఎస్సీలు, బిసిలు ఉన్నప్పటికీ రెడ్ల పార్టీగానే ముద్ర పడే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీనే కాకుండా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా దెబ్బ తీయడం జగన్ లక్ష్యం. అందుకు బలమైన కమ్మ సామాజిక వర్గం మద్దతు జగన్‌కు అవసరంగా మారిందని చెప్పవచ్చు. చంద్రబాబును వ్యతిరేకిస్తున్న కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెసు వెనక ఉన్నారు. వీరు జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌తో చెలిమి ద్వారా కమ్మ సామాజిక వర్గం మద్దతు కూడగట్టాలనేది జగన్ వ్యూహంగా భావించవచ్చు.

తక్షణమే తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టడం జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం కాదు. చంద్రబాబు లోకేష్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. అందుకు తన బాబాయ్ బాలకృష్ణ మద్దతు లభించే అవకాశాలున్నాయి. అందువల్ల చంద్రబాబు రాజకీయ పథకాలను విఫలం చేయడమే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లక్ష్యం. లోకేష్‌కు పార్టీ పగ్గాలు లభించకుండా చేయడమే ఆయన కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ లక్ష్యం కూడా అదే. తాత్కాలికంగా వైయస్ జగన్‌తో చెలిమి చేసి చంద్రబాబు వ్యూహాలను దెబ్బ తీస్తూ పోవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.