17, జూన్ 2011, శుక్రవారం

నీవొస్తావని... నా కలలను నిజం చేస్తావని ఎదురు చూస్తూ ఉండే నీ

ఏ జన్మ బంధమో తెలియదుగానీ నిను చూచిన ఆ మొదటి క్షణం పోగొట్టుకున్న నిధిని మళ్లీ
సొంతం చేసుకున్నట్టు నా మనసు పొంగిపోయింది. నా మనసెందుకు నిను మెచ్చిందో
తెలియదుగానీ మంత్రం వేసినట్టు నా మది నీ తలపులతో నిండిపోయింది. కలనైనా నిను
ఎరగని నేను ఆశ్చర్యంగా నీవే నా ఆశ, శ్వాస అనేంతగా మారిపోయానంటే ఆశ్చర్యంకాక
మరేమిటి.

ప్రేమంటే అర్థమైనా తెలియని నేను ఇప్పుడు నీపేరే జపిస్తున్నానంటే నాకు సైతం
వింతగానే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఒంటరిగా గడిచిపోయిన నాలోకంలోకి నీవొచ్చావని
కాబోలు అప్పుడప్పుడూ మాత్రమే అందంగా కనిపించే ఈ లోకం నాకిప్పుడు నిత్య
శోభాయమానంగా గోచరిస్తోంది.

చెట్టు, పుట్ట, రాయి, రప్ప ఒకటేమిటి ప్రతీదానిలో నీవే కనిపిస్తుంటే ఇన్నాళ్లూ
నేను కోల్పోయిందేమిటో కొంచెం కొంచెంగా తెలిసొస్తోంది. నాకూ మనసుందని, దానిలోనూ
స్పందనుందని నాకు తెలిసిందంటే అది నిను చూశాకే అని నే చెప్పే మాటలు పొగడ్తలుగా
నీకు అనిపించినా అవి నిజంగా నిజాలే సుమా.


స్త్రీలో ఆకర్షణ మాత్రమే ఉంటుందనుకున్న నాకు ఆ ఆకర్షణకు మించిందేదో ఉందని
తెలిసిందంటే దానికి కారణం నీవే. కట్టిపడేసే నీ చూపులు చాలు నా జీవితాంతం నీ
బంధీగానైనా ఉండిపోవాలనిపిస్తుంది. స్వర్గతుల్యమైన నీ సానిహిత్యం చాలు యుగాలు
సైతం గడిపేయొచ్చనిపిస్తుంది. అమృతమై వర్షించే నీ మాటలు చాలు సప్త స్వరాలూ
వద్దనిపిస్తుంది.

పండు వెన్నెలలాంటి నీ నీడలో నేనూ నా జీవితం గడిచిపోతే చాలనిపిస్తుంది....
ఇవన్నీ ప్రేమ లక్షణాలైతే నేస్తం నీ మీద నాకున్నది తప్పకుండా ప్రేమే...... కానీ
నా ప్రేమను అంగీకరించి నీవొస్తావన్న ఆశతో నీకోసం ఎంత కాలమైనా ఎదురు
చూస్తుంటాను... కరుణించి వరమిచ్చినా... కాదంటూ నన్ను శపించినా నీపై నాలో మొగ్గ
తొడిగిన ప్రేమ నిత్యం పెరిగి వికసిస్తుందే తప్ప అది ఎప్పటికీ వాడిపోదు.

నీవొస్తావని... నా కలలను నిజం చేస్తావని ఎదురు చూస్తూ ఉండే నీ

ప్రతిరోజూ ఒక మంచి మాట

రాజకీయాలు అంత అప్రతిష్టపాలైన వ్యాపారం కానే కాదు. కానీ ప్రతిష్టలేని వ్యక్తులే దాన్ని అలా తయారు చేస్తారు.

ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.


మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.