30, నవంబర్ 2011, బుధవారం

అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్

ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు. ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు. నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది. ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు. ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం." ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను." ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను."మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు."మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు. సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.

ఎప్పుడైనా ఆలోచించారా !!!!!!!!!!!!!!!!!!!!!!

మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.

మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినా పట్టించు కోవడం లేదట - ఎంత రుచిగా వుందో పాపం.

మిగిలిన వాహనాలు వెళ్ళే వేగంతో కాకుండా, నెమ్మదిగానో, లేకపోతే ఆగి ఆగి వెళ్ళడమో చేస్తాం. మన ఏకాగ్రత సరిగా వుండదు. చూపులు రోడ్డుమీదున్నా, చెవులు ఫోన్లోని మాటలమీద, మనసు ఆ మాటల గురించి ఆలోచిస్తూంటూంది.

మనం ట్రాఫిక్ నడిచే వేగం కన్నా మెల్లగా వెళడంతో వెనక వచ్చే వాహనాల కెంత చిరాకు కలిగింస్తుందో చెప్పనవసరంలేదు - హారన్లతో మోతెక్కిపోతుంటూంది
అంటే ఎదుటి వాహనం అకస్మాత్తుగా ఆగితే, దానికి ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది - ఫలితం - ఢాం

ప్రక్కనో, వెనుకో హారన్ మోగినా వినటానికి చెవులు ఖాళీగా లేకపోవడంతో ఎవణ్ణో ఒకణ్ణి రుద్దో, గుద్దో తిట్లు లేదా తన్నులు తింటాం - హీనపక్షం గీతలూ, సొట్టలూనూ

కనిపించనిదింకొకటుంది - వేగంమీద కంట్రోలు లేకపోవటంతో, మూడునాలుగు గేర్ల బదులు రెండూమూడు గేర్లు వాడతాం - అంటే చమురు వదిలించుకోవడంతో పాటూ ఇంజను పెర్ఫార్మెన్సూ మందగిస్తుంది

ముఖ్యమైంది - ప్రక్కన కుర్చునేవారికి ఎంత ఇర్రిటేటింగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా

మోహం, చపలత్వాల భ్రమ, భ్రాంతి

ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.

కొందరు మనిషిలో స్వార్థం అన్నారు.
ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.
వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు.
మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.

వారిలో వారు గుంపులుగా తయారయ్యి ఎవరికి నచ్చిన వాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారు.

చివరికి ఎటూ తేలక, ఏకాభిప్రాయానికి రాలేక గురువుగారికి విన్నవించారు. అందరి వాదనలూ ప్రశాంతంగా విన్న గురువు గారు ఇలా తేల్చారు.

" అన్ని బాధలకు మూల కారణం మనిషి కదలకుండా ప్రశాంతంగా మౌనంగా వుండలేకపోవడమే "

హద్దులు ఉంటాయి

జీవితం చిన్న చిన్న విషయాలలోనే వికసిస్తుంది, ఆదమరిస్తే హరిస్తుంది కూడా...
చిన్నవి అనేవాటికి హద్దులు ఉంటాయి. ఉండాలి! అందుకే అవి చిన్నవి. ఆ హద్దులు మనం గ్రహించం. అంతే!
పొరపాటున ఎవరైనా గుర్తు చేసినా ఒప్పుకోం, నచ్చదు. మాయ అందించే ఆనందం అలాంటిది మరి!,

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.

నన్ను నాకు నగ్నంగా చూపే పగటి వెలుగుకంటే
నన్ను నాలా ఉండనిస్తూ భద్రతనిచ్చే చిక్కటి చీకటి నాకు నచ్చుతుంది.

నాలో ఘోషని నిర్లక్ష్యం చేసే వెలుగుకు ఏ కొసైనా నా చింత లేదు.
తన నిశ్శబ్దంలో నన్ను ఐక్యం చేసుకునే చీకటి నిశ్చింతలో నాకు స్వాంతన దొరుకుతుంది.

తన కపట మాటలతో చేతలతో మభ్యపెట్టే, రోజు ఆడంబరంకంటే
చంటిపాపలా నన్ను లాలించే రేయిలోని ఆప్యాయత నన్ను నెగ్గుతుంది.

రెండు నిమిషాలు కూడా కుదురుండనివ్వని పగటి ఆర్భాటంకంటే
శాంతం కూర్చుని నా గాధలన్నీ ఓపికగా వినే యామిని స్నేహం ఆహ్లాదంగా ఉంది.

కాదని, కుదరదని, జరగదని అపహాస్యం చేసే వెలుగు రంగులకంటే
'నీకు నచ్చిన రంగులతో నన్ను నింపుకో' అని చీకటిచ్చే చనువు నన్ను కదిలిస్తుంది.

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.
జారిపోతున్న నాకు ఊతం అందించి, ఒడి పరిచి బడలిక తీరుస్తుంది రాత్రి.

పగటి వెలుగులో చీకట్లు ముసిరేస్తున్నాయి. చీకట్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
రేయి పాడిన పాటలలోని రాగాలు, ఉషోదయంతో కూనిరాగలై మాయమైపోతున్నాయి.

రణగొణగా అట్టహాసంగా సాగుతూ, ఎన్ని అపహాస్యాలు చేసి ఎంత కౄరంగా హింసించినా
ఎదిగే ప్రతి పొద్దును ఊపిరి బిగపట్టి ఓర్పుతో దాటేస్తున్నది ఎందుకంటే......
నిరాడంబరమైన నిశి పరిచే చల్లని ఒడిలో వెచ్చని ఊహలతో
నిశ్చింతగా నిదురించే సమయం తిరిగి నాదౌతుందన్న నమ్మకంతో......