12, ఏప్రిల్ 2011, మంగళవారం

సొదర సొదరీమణులారా మిమ్ములకు శ్రీరామనవమి శుభాకాంక్షులు......

యుగ యుగాలు గడిచినా ఏటేటా కల్యాణమా ఇది నీకు తగునా ఏకపతివ్రత కొదండరామా..........
..... నేటికి శ్రీరామ కల్యాణము జరిగి 1,58,63,871 సంవత్సరాలు... ......

వైయస్ మరణించారని తెలిసిన వెంటనే వైయస్ జగన్ పావురాలగుట్టకు వెళ్లకపోవడాన్ని !!??

కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి వ్యూహం రచించి, అమలు చేసే మిషన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. వైయస్ జగన్‌పై పోరుకు ఆయన ప్రత్యక్షంగా ముందుకు వస్తారా, లేదా అనేది తెలియడం లేదు. కానీ జగన్‌ను ఎదుర్కోవడానికి అధిష్టానం ఆదేశాల మేరకు వ్యూహాన్ని రచించి, అమలు చేయడానికి ఆయన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్‌కు అత్యంత సన్నిహితులైన నాయకుల ద్వారా జగన్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం వ్యూహాన్ని రచించింది.


వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్ జగన్‌ను నిలువరించే మిషన్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు నాయకుడని, వైయస్ ఏ రోజు కూడా సోనియా గాంధీని వ్యతిరేకించలేదని గట్టిగా చెబుతూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైయస్ జగన్ వైయస్సార్ వారసుడు కాడని చెప్పడానికి వారు సిద్ధమయ్యారు.

తమ మిషన్‌లో భాగంగా ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్‌పై ఆదివారంనాడు మొదలు పెట్టిన తన దాడిని సోమవారం కూడా కొనసాగించారు. వైయస్సార్ ఆత్మ కాంగ్రెసుతో ఉందని వైయస్ సన్నిహితులై నాయకులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వైయస్ జగన్‌కు తండ్రి మీద కన్నా పదవి మీదనే ప్రేమ ఎక్కువ అని వారు చెప్పదలుచుకున్నారు. ఇతర విషయాలను కూడా వారు ముందుకు తేవడానికి సిద్ధపడ్డారు.

సుదీర్ఘమైన పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైతే కనీసం చూడడానికి కూడా వైయస్ జగన్ రాలేదని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ వైయస్‌ను పరామర్శించడానికి పెద్ద సంఖ్యలో కదిలి వస్తే జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారని వారు చెప్పదలుచుకున్నారు. అలాగే, వైయస్ మరణించిన తర్వాత వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ సంతకాల సేకరణ గుట్టును కూడా వారు విప్పనున్నారు. ఈ విషయంలో నిందలను కెవిపి రామచందర్ రావు మోశారు. అందులో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి కూడా ఆయన జగన్‌ను ఎదుర్కోవడంలో భాగంగా చేపట్టే కార్యక్రమాన్ని వాడుకుంటారని అంటున్నారు.

వైయస్ మరణించారని తెలిసిన వెంటనే వైయస్ జగన్ పావురాలగుట్టకు వెళ్లకపోవడాన్ని కూడా ప్రధానాస్త్రంగా వాడే ఆలోచనలో కాంగ్రెసు ఉంది. వైయస్ మరణించిన సమయంలో వైయస్ జగన్‌కు మద్దతుగా చేసిన నినాదాలను కూడా ప్రస్తావించాలని వ్యూహం పన్నింది. పావురాలగుట్టలో వైయస్ జగన్ నిర్వహించిన సంతాపసభలో జైజై నినాదాలేమిటని కాంగ్రెసు నాయకులు తప్పు పట్టేందుకు సిద్ధపడ్డారు. ఏమైనా, వైయస్ అనుచరులతోనే వైయస్ జగన్‌ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం వ్యూహరచన చేసింది

పార్టీని చీలుస్తారా, పార్టీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా .

తమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై నందమూరి హరికృష్ణ పోరాటం ఖాయమైనట్లే కనిపిస్తోంది. హరికృష్ణ పార్టీని చీలుస్తారా, పార్టీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా దేవినేని ఉమా మహేశ్వర రావును కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించడం, దాని పర్యవసానంగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. గుడివాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఒక పథకం ప్రకారమే కృష్ణా జిల్లా సంక్షోభం చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది.


చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా మహేశ్వర రావుపై తిరుగుబాటు ప్రకటించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ హరికృష్ణ కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ మద్దతుదారులు. వారు హరికృష్ణకు మద్దతు ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న డ్రామాలో తాము పాత్రధారులం కాదని వంశీ చెబుతున్నా హరికృష్ణ ఆదేశాల మేరకే ఆయన నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయడానికి ముందు తాను హరికృష్ణతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దీన్నిబట్టి హరికృష్ణకు తెలిసి, ఆయన నడుపుతున్న వ్యవహారాల మేరకే వంశీ రాజీనామా చేశారని చెప్పవచ్చు. నందమూరి హరికృష్ణ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన వెంట నడుస్తామని, తానూ కొడాలి నాని కలిసే ముందుకు సాగుతామని వంశీ చెప్పారు. దీన్ని బట్టి హరికృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ కార్యక్రమం తీసుకోవడం ఖాయమని కూడా అనుకోవచ్చు.

మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి పాత్ర కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలతో తనకు ఏ సంబంధం లేదని అంటున్నప్పటికీ పురంధేశ్వరి రచించిన పథకం ప్రకారమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని తమ చేతుల్లోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే పురంధేశ్వరి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో హరికృష్ణను ఎదుర్కోవడానికే చంద్రబాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఉమా మహేశ్వర రావు రాజీనామాను తిరస్కరించడం అందుకు ఒక సూచన అయితే, పురంధేశ్వరి మీద పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తడం మరో సూచన. చంద్రబాబు అనుమతి లేకుండా దగ్గుబాటి పురంధేశ్వరిపై విమర్శలు చేసే సాహసానికి పార్టీలో ఏ నాయకుడు కూడా ముందుకు రాడనేది అందరికీ తెలిసిందే. పురంధేశ్వరిపై విమర్శలు చేయడం ద్వారా హరికృష్ణను రెచ్చగొట్టాలనేది కూడా చంద్రబాబు వ్యూహం కావచ్చు. పురంధేశ్వరిపై ఈగ వాలినా హరికృష్ణ సహించరు. దాన్ని ఆసరాగా తీసుకుని హరికృష్ణను సాధ్యమైనంత త్వరగా బయటకు లాగాలనేది కూడా చంద్రబాబు వ్యూహం కావచ్చు

రూ.150 కోట్లు మిషన్‌ తో కడప సిగ్గు - సిగ్గు

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవిని అంతం చేసేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగలి కృష్ణకు 5 లక్షల రూపాయలు ఇచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సోమవారం ఓ సమావేశంలో అన్నట్టుగా సమాచారం. జగన్ వెంట ఉన్న వారంతా అక్రమాలు, క్రిమినల్స్ చేసే నేరగాళ్లు ఉన్నారని ఆరోపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మంగలి కృష్ణలపై పులివెందులలో క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.

కాగా కాంగ్రెసు పార్టీపై జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో విమర్శలు చేశారు. జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ 15 మంది మంత్రులను కడప జిల్లాలో తిష్ట వేయించిందన్నారు. అయినప్పటికీ గెలుపు మాత్రం జగన్‌, విజయమ్మలదే అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రూ.150 కోట్లు కడపకు మళ్లించారని ఆరోపించారు

నందమూరి హరికృష్ణ అసమ్మతి రాజకీయాలకు చెక్ పెట్టేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది

నందమూరి హరికృష్ణ అసమ్మతి రాజకీయాలకు చెక్ పెట్టేందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానీ అసమ్మతి రాజకీయాల వెనక నందమూరి హరికృష్ణ ఉన్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. హరికృష్ణకు ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సహకరిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, హరికృష్ణ చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా లేరని, తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్‌ను ప్రకటించబోనని చంద్రబాబు ప్రకటిస్తే చాలునని హరికృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు అందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు.


కృష్ణా జిల్లా విభేదాలపై నివేదిక సమర్పించిన పార్టీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు మాటలనే తన నోట వినిపిస్తున్నారని చెబుతున్నారు. వంశీ రాజీనామా చేస్తే ఆమోదిస్తామని ఆయన చెప్పారు. దీన్నిబట్టి వంశీ రాజీనామాను ఆమోదించడానికే చంద్రబాబు సిద్ధపడినట్లు చెబుతున్నారు. వంశీ రాజీనామాను సోమవారం రాత్రి గానీ మంగళవారం గానీ ఆమోదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హరికృష్ణ రాజకీయాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో తనకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే కృష్ణా జిల్లా నాయకుల విమర్శలను ఖాతరు చేయడం లేదని అంటున్నారు. అందుకే, వంశీతో గానీ కొడాలి నానీతో గానీ చంద్రబాబు మాట్లాడలేదని చెబుతున్నారు. వారితో మాట్లాడకుండానే కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన రాజీనామాను చంద్రబాబు తిరస్కరించడం ద్వారా హరికృష్ణకు బలమైన సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు.

హరికృష్ణ ఒత్తిడి రాజకీయాలకు తగ్గబోనని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అంటున్నారు. తాను చెప్పినట్లు నడుచుకుంటే ఉండండి, లేదంటే వెళ్లండనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాజీనామా చేయడానికి సిద్ధపడిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానీ వెనక్కి తగ్గారు. జూనియర్ ఎన్టీఆర్ పది, పదిహేనేళ్ల వరకు సినీ రంగంలో కొనసాగుతారని, లోకేష్ తన వ్యాపారాలు చేసుకుంటున్నారని, అందువల్ల ఇరువురి మధ్య పార్టీ నాయకత్వం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయని మీడియా రాయడం సరి కాదని ఆయన అంటున్నారు.

వంశీ రాజీనామా ద్వారా చంద్రబాబుపై పోరుకే హరికృష్ణ సిద్ధపడినట్లు అర్థమవుతోందని అంటున్నారు. వల్లభనేని వంశీ ఒకటి రెండు రోజుల్లో హరికృష్ణతో చర్చలు జరిపే అవకాశం ఉంది. చంద్రబాబుపై హరికృష్ణ తిరుగుబాటు ప్రకటిస్తారా, అసమ్మతితో సర్దుకుపోతారా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. అయితే, హరికృష్ణ పోరుకే సై అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా, తెలుగుదేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.