పురాణ పురుషుడంటే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ అటు తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్ర్తాల పంపిణీ, మద్యపాన నిషేధం వంటి అంశాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆ మహానటుని పదిహేనో వర్ధంతి ఇవాళ.
సింహం లాంటి నడక, మాటల్లో గాంభీర్యం, నవ్వులోనూ రాజసం కురిపించడం ఒక్క ఎన్టీరామారావుకే సొంతం. విశ్వవిఖ్యాత నటసార్వబౌముడిగా ఖ్యాతి గడించించిన ఆయన రాజకీయాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరీ, వెంకటరామమ్మ దంపతులకు 1923, మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు
చదువు పూర్తయ్యాక మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించాడు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలువనీయలేదు. మన దేశంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాతాళబైరవితో హీరోగా స్థిరపడ్డారు.
అనంతరం పలు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు టాప్ హీరోగా వెలిగారు. తన సినీ కెరీర్‌లో వందలాది చిత్రాల్లో నటించినా... ప్రజలకు దగ్గర చేసింది మాత్రం పౌరాణిక పాత్రలే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పురాణ పురుషులను ప్రజలు ఆయనలో చూసుకున్నారంటేనే ఎన్టీఆర్ ఆ పాత్రలకు ఎంతగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. ఇక ఎన్టీ రామారావు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే.
అదో చరిత్ర. 1982లో తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాష్ట్రానికే పరిమితంగాక అటు దేశ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రవేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
తన 73 యేట 1996 జనవరి 18న ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తుది శ్వాస విడిచేవరకు పనిచేసిన మహామనిషి ఎన్టీఆర్‌కు తెలుగుజాతి ఘననివాళులు అర్పిస్తోంది
19, జనవరి 2011, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)