14, ఏప్రిల్ 2011, గురువారం

తమిళనాడులో కరుణానిధి జయలలిత ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ భారతంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉప ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ఇన్ని రోజులు తమ తమ గెలుపు కోసం ప్రచారంలో మునిగి తేలిన ఆయా పార్టీల భవితవ్యం నేడు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే, జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకే కూటమి ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఈవిఎంలలో నిక్షిప్తమవుతున్న సమయంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం జయలలిత, విజయ్‌కాంత్‌లు తమ కూటమి విజయం ఖాయమని ప్రకటించాయి. కాంగ్రెసు, డిఎంకె అవినీతిలో కూరుకు పోయినందని, పాలనలో డిఎంకే విఫలం అయినందున ప్రజలు తమకే పట్టం కడతారని చెప్పింది.


కాగా ఎన్నికల సంఘం తీరును ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పు పట్టారు. ప్రతి పక్ష పార్టీకి లాభం చేకూర్చేలా ఐసి వ్యవహరించిందని నిందించారు. అయినా విజయం తమదే అని చెప్పారు. ఓటమి భయంతోనే జయలలిత తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ముఖ్యమంత్రి కరుణానిధి అంటున్నారు. డిఎంకే ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కడం ఖాయమని చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈసారి సర్వే ఫలితాలు మాత్రం డిఎంకెకు అనుకూలంగా లేవు. అన్నాడిఎంకెకే విజయావకాశాలు ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో డిఎంకెకు ప్రత్యక్ష పాత్ర ఉండటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని సర్వేలు వెల్లడి చేస్తున్నాయి.

అన్నాడిఎంకె పదేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తోంది. అయితే సర్వేలను బట్టి ఇప్పుడు జయలలిత కోరిక నెరవేరనున్నట్టుగా తెలుస్తోంది. సర్వే ఫలితాలలో సుమారు 51 శాతం మంది ఓటర్లు మార్పు కోరుకుంటుండగా, 36 శాతం మంది ఓటర్లు మాత్రమే కరుణానిధికి మద్దతు పలికారు. సర్వే ఫలితాల ప్రకారం డిఎంకె కూటమికి ఈసారి 60 - 70 సీట్లకు మధ్యగా ఉండవచ్చని తెలుపుతున్నాయి. అయితే తమిళ ఓటర్ల తీర్పు గతంలో ఎప్పుడూ సర్వేలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. గతంలో సర్వేలు గెలుస్తాయని చెప్పిన పార్టీ ఓటమి చవి చూడటం విశేషం.

ఇక కేరళ విషయానికి వస్తే ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ కూటమిలలో ఏ కూటమికి గత ముప్పయి అయిదేళ్లుగా కేరళ ఓటర్లు వరుసగా పట్టం కట్టలేదు. ఎల్‌డిఎఫ్‌కు ఆ భయం పట్టుకోగా, యుడిఎఫ్‌కు అది కలిసి వస్తున్న అంశం. అయినప్పటికీ జాతీయస్థాయిలో యుపిఏ తీవ్ర అవినీతిలో కూరుకు పోయిన ఈ సమయంలో కేరళ ఓటర్ల తీర్పులో మార్పు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. కేరళ ఓటర్లలో 25 శాతం మంది క్రిస్టియన్లు, 22 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాబట్టి వారిని మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయాస పడ్డారు. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కూడా మార్పు దిశగా ఓటర్లు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 404 నియోజకవర్గాలు ఉండగా, 3932 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. మూడు రాష్ట్రాలలో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేక పోవడం విశేషం. కాగా ఈ ఎన్నికల సందర్భంగా ఈసీ భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బు సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. కేరళ ప్రవాస భరతీయులకు కూడా ఓటు హక్కు కల్పించింది. మూడు రాష్ట్రాల్లో కలిపి ఏడు కోట్ల వరకు ఓటర్లు ఉంటారు. తమిళనాడు అయినా, కేరళ అయినా, పుదుచ్చేరి అయినా ప్రతి పార్టీకి గెలుపు ముఖ్యమే కావడం విశేషం. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న జయలలిత పీఠం ఎక్కాలని, కుంభకోణాల్లో కూరుకు పోయిన కరుణానిధి తమిళ ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడానికి, కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లు తమ తమ విజయం కోసం చేసిన కృషి ఈ రోజు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. దాని ఫలితం కోసం మాత్రం వచ్చే నెల 13వ తారీఖు వరకు ఆగాల్సింది.

కామెంట్‌లు లేవు: