పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునే దమ్ము, బలం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఉందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో చంద్రబాబు అపర చాణుక్యడిగా పేరు పొందారు. పావులు కదపడంలో చంద్రబాబును మించినవారు లేరని అంటారు. ఇప్పటికే హరికృష్ణ ఓసారి చంద్రబాబు దెబ్బను రుచి చూశారు. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసిన సమయంలో హరికృష్ణతో పాటు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అధికారం తన చేతుల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వారి స్థాయిని తగ్గిస్తూ వచ్చారు. దాంతో అసంతృప్తికి గురైన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకుని అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని నడపలేక హరికృష్ణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలోకి, ఆ తర్వాత కాంగ్రెసులోకి వెళ్లారు.
ఇప్పుడు చంద్రబాబుపై నందమూరి హరికృష్ణ యుద్ధం ప్రకటించినప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర మంత్రి, ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు గానీ, పురంధేశ్వరిపై ఎర్రంనాయుడు చేసిన విమర్శలు గానీ ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. ఈ వాతావరణంలో నందమూరి కుటుంబంలో కూడా చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. సినీ హీరో, హరికృష్ణ సోదరుడు చంద్రబాబుకు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరికృష్ణకు కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి వెనక నుంచి కథ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ హరికృష్ణకు చంద్రబాబును ఎదుర్కునే బలాన్ని అందిస్తాయా అనేది సందేహమే.
కాగా, నారా లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా చంద్రబాబు నిలబెట్టడానికి సమాయత్తం అవుతుండడం వల్లనే హరికృష్ణ తిరుగుబాటు ప్రకటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బాలకృష్ణ తన అల్లుడు నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచినా ఆశ్చర్యం లేదు. అయితే, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వర్గం ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ పురావైభం సంతరించుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఆ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొంత మంది నాయకులు వాదిస్తున్నారు. బాలకృష్ణను పార్టీ అధ్యక్షుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు యువత సారథిగా నియమించాలని వారు వాదిస్తున్నారు.
హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చి, దగ్గుబాటి పురంధేశ్వరి వస్తే చంద్రబాబుకు కష్టాలు ఎదురు కావచ్చునని అంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే దిశగా పరిణామాలను నడిపించాలనేది కొంత మంది అభిమతంగా తెలుస్తోంది. పురంధేశ్వరిని ఎన్టీ రామారావు రాజకీయ వారసురాలిగా చూస్తారని అంటున్నారు. తెలుగుదేశంలోని కుటుంబ పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది వెల్లడి కావడానికి మరింత సమయం పడుతుదని చెప్పవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి