ఈరోజుల్లో రాజకీయనాయకులకు అందినకాడికి దండుకుని పదవి ఉండగానే ఇల్లు / ఇళ్ళు చక్కబెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య. మరీ పాత తరం కాకపోయినా 60 వ దశకం వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ఇంకా మిగిలి వుండడంవల్లనో ఏమో కానీ రాజకీయ నాయకులు అవినీతే లక్ష్యంగా వుండేవారు కాదు. వారిలో మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ప్రథములని చెప్పుకోవచ్చు.
ఐన్ స్టీన్ గాంధీ గారి గురించి చెప్పినట్లు లాల్ బహదూర్ నిజాయితీని గురించి చెబితే భావితరాలు నమ్మకపోవచ్చు.
చెప్పిన వాణ్ని అజ్ఞానిగా జమ కట్టవచ్చు. కానీ ఇది నిజం. దానికి నిదర్శనంగా ఒక సంఘటన.
కేంద్ర రైల్వే మంత్రిగా వున్న రోజుల్లో 1956 లో మహబూబ్ నగర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తర్వాత 1957 లో జరిగిన ఎన్నికలలో నెగ్గి తొలుత సమాచార, రవాణాశాఖ మంత్రిగా ఆ తర్వాత వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఓ రోజు అనుకోకుండా ఒక మిత్రుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఆ మిత్రునికి మంచి రుచి గల టీ ఇచ్చారు శాస్త్రి. ఆ రుచి చూసి ఆశ్చర్యంతో ఆ మిత్రుడు ' ఇంత రుచి గల టీ నేనెక్కడా తాగలేదు. ఈ రుచి ఎలా వచ్చింది ? ' అని అడిగాడు.
దానికి శాస్త్రి గారు నవ్వుతూ ' ఈ పొడి మీకు బజారులో ఎక్కడా దొరకదు. విదేశాలకు మాత్రమే ఎగుమతి చేసేది. నేను కేంద్ర పరిశ్రమల శాఖకు మంత్రిగా వున్నపుడు టీ బోర్డు వారు బహుకరించారు ' అన్నారు.
దానికా మిత్రుడు ' మీరు ఆ శాఖను నిర్వహించి చాలా కాలమైంది కదా ? ఇన్నాళ్ళదాకా వచ్చిందంటే వాళ్ళు చాలా డబ్బాలు ఇచ్చుండాలి ' అన్నాడు.
' అవును. చాలానే ఇచ్చారు. మొత్తం మూడు డబ్బాలు. రెండు అప్పుడే మా ఆఫీసు వాళ్లకిచ్చాను. ఒకటి నేను దాచుకున్నాను. ఈ టీ అంతే నాకిష్టం. అందుకే దాచుకుని అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను ' అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి గారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి