ఇప్పటి తరం రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే సంస్కారం గత తరం రాజకీయ నాయకుల్లో తరుచుగా కనబడేదనడానికి ఒక ఉదాహరణ.
దామోదరం సంజీవయ్య గారు ఆంద్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. 1960 వ సంవత్సరం నుండి 1962వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఘనత వహించారు. తర్వాత కేంద్రంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పని చేశారు. అంతటి ఉన్నత స్థానానికి చేర్చింది ఆయన సంస్కారమే !
విదేశీ పర్యటనలంటే ఈనాటి రాజకీయనాయకులు ఎగిరి గంతులేస్తారు. సంజీవయ్య గారికి విదేశాలనుంచి చాలాసార్లు ఆహ్వానాలందాయి. అయితే వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో అమెరికా రాయబారి గాల్ బ్రెట్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే తనకు ఈ దేశంలోనే చెయ్యడానికి చాలా పని ఉందని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ రాయబారి ఆయన సంస్కారానికి ముగ్దుడయ్యాడు.
విదేశీ పర్యటనలకు ప్రజాధనం ఖర్చు చెయ్యడం సంజీవయ్య గారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో విదేశాలనుంచి చాలా ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన అవేమీ ఉపయోగించుకునే వారు కాదు. పైగా " సహకార రంగంలో ఇతర దేశాల కంటే మనమే ముందున్నాం. ఇక అక్కడికి వెళ్లి నేర్చుకునేదేమిటి ? అనవసరంగా ప్రజా ధనం వృధా చెయ్యడం తప్ప " అనేవారు. ఈనాటి రాజకీయాల్లో ఈ సంస్కారం అరుదై పోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి