గూడవల్లి రామబ్రహ్మం గారి పేరు చెప్పగానే ' మాలపిల్ల ', ' రైతుబిడ్డ ' చిత్రాలు గుర్తుకు వస్తాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనదొక సువర్ణాధ్యాయం. ఇంత పరిణితి చెందిన ప్రేక్షకులున్న రోజుల్లో కూడా చిత్ర నిర్మాతలు, దర్శకులు ధైర్యం చెయ్యలేని సాహసాల్ని, ప్రయోగాలని ఆయన ఆ రోజుల్లోనే చేశారు.
ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన అనుమకొండ సూర్యనారాయణ గారు అకౌంట్స్ లో దిట్ట. అసలు సినిమా రంగంలో నిర్మాణ కార్యక్రమాలకు ప్రొడక్షన్ మేనేజర్ కీలకం. దూషణ, భూషణ, తిరస్కారాలకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికలు రూపొందించడం దగ్గరనుండి చిత్ర నిర్మాణం సక్రమంగా పూర్తవడం వరకూ ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యత వహిస్తాడు.
రామబ్రహ్మం గారు ఉదార స్వభావులుగా పేరు పొందారు. అయితే ఆయనకు ప్రథమ కోపం జాస్తి అని చెప్పుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కస్సు బస్సుమనేవారట. అయితే ఆయన వితరణ ముందు ఇవి తేలిపోయేవి. ఆయన తిట్టినా ఎవ్వరూ అంతగా బాధపడేవారు కాదట.
ఒకసారి ఆయన చిత్రం ఒకటి పూర్తయింది. అందరికీ ఇవ్వవలిసిన పారితోషికాలు పూర్తిగా ఇచ్చేసి పంపే పనిలో ఉన్నారు. అందరివంతూ పూర్తయి సూర్యనారాయణగారి వంతు వచ్చింది. మొత్తం చిత్ర నిర్మాణ ఖర్చులన్నీ అప్పగించమన్నారాయన్ని రామబ్రహ్మం గారు.
సరే ! పక్కాగా రాసి ఉంచిన లెక్కల్ని ఆయన ముందు పెట్టారు సూర్యనారాయణ గారు.
మొత్తం జాబితా అంతా పరిశీలించిన రామబ్రహ్మంగారు చివరగా కనబడ్డ ఒక అంశానికి ఆశ్చర్యపోయారు.
ఆ అంశమేమిటంటే ' ఈ చిత్ర నిర్మాణ సమయంలో మీరు నన్ను తిట్టినా తిట్లు 642 ' అని రాసి ఉంది.
అంతే... గూడవల్లి రామబ్రహ్మంగారికి కోపం..... కాదు... ఆయనలోని ఉదారత బయిటికోచ్చింది.
తిట్టుకి రెండు రూపాయిలు చొప్పున 1284 రూపాయిలు సూర్యనారాయణ గారికి ఇచ్చారుట.
ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరుకుతారా ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి