13, ఏప్రిల్ 2011, బుధవారం

ఎన్టీఆర్‌ రే హరికృష్ణను రెచ్చగొట్టాడా!!??

పార్టీలో నిప్పు పెట్టింది సినీ హీరో జూనియర్ ఎన్టీఆరే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తిరుగుబాటు ద్వారా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా తిరుగుబాటు చేసిన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ, శాసనసభ్యుడు కొడాలి నానీ జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందినవారే. వారిద్దరికీ గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టికెట్లు ఇప్పించుకున్నారు. అందువల్ల వారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయించారనే మాట వినిపిస్తోంది.


పార్టీలో సంక్షోభానికి తెర తీసేందుకు తన తండ్రి నందమూరి హరికృష్ణను రెచ్చగొట్టింది కూడా జూనియర్ ఎన్టీఆరేనని అంటున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను చంద్రబాబు నారా లోకేష్‌కు అప్పగించేందుకు, తన తదనంతరం లోకేష్‌ను పార్టీ అధినేతగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానివల్ల పార్టీ పూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వానికి దూరమైపోతుందని జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో అన్నట్లు తెలుస్తోంది. దాంతో నారా లోకేష్‌ను అడ్డగించేందుకు హరికృష్ణ తిరుగుబాటుకు పాదులు వేసినట్లు చెబుతున్నారు.

నారా లోకేష్ వాస్తవానికి వాణిజ్యవేత్త. ఆయన క్రమంగా తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపార సంబంధాల వల్లనే సుజనా చౌదరికి చంద్రబాబు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే విమర్శలు కూడా అప్పుడు వెల్లువెత్తాయి. హరికృష్ణ కూడా తన నిరసనను వ్యక్తం చేశారు. వ్యాపార సంబంధాలను, పార్టీ కార్యకలాపాలను కలగలిపి మెల్లగా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్య స్థానానికి చేరుకుంటారనే అనుమానాలే హరికృష్ణ తిరుగుబాటుకు కారణమని అంటున్నారు.

నారా లోకేష్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టాలనేది హరికృష్ణ ఉద్దేశంగా చెబుతారు. నారా లోకేష్‌కు ప్రజాకర్షణ లేకపోవడం పెద్ద లోటు. ఆ ప్రజాకర్షణ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది. తాత ఎన్టీ రామారావు వారసుడిగా నిలబడాలనే బలమైన ఆకాంక్ష కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ముందుకు నడిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామరావు ఆశయాలకు అనుగుణంగా నడపాలనే హరికృష్ణ ఆకాంక్షకు జూనియర్ ఎన్టీఆర్ కోరిక తోడైనట్లు భావిస్తారు. అయితే, ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీని నడిపించగలిగే సత్తా సంతరించుకుంటారా అనేది అనుమానమే. అనుభవరాహిత్యం జూనియర్ ఎన్టీఆర్‌ను పీడిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును కాదనే ఉద్దేశం హరికృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ లేదని అంటారు. భవిష్యత్తులో పార్టీ నారా లోకేష్ చేతిలోకి వెళ్లకుండా చూసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు. దానివల్లనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంక్షోభం చోటు చేసుకుందని భావిస్తున్నారు

కామెంట్‌లు లేవు: