17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఓ వైపు తన బావమరిది, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ వైపు తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నుంచి, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కోస్తాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు హరికృష్ణ పెట్టిన కుంపటి చల్లారినట్లు కనిపించినా, మళ్లీ ఎప్పుడు ఎగసిపడుతుందో అది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉంది. హరికృష్ణను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను ఎగదోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు పురంధేశ్వరి సహాయ సహకారాలు అందుతున్నట్లు తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చీలికకు కూడా ఇది దారి తీయవచ్చుననే వార్తలు వస్తున్నాయి.


కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చిచ్చుబుడ్డిలా ఎగిసిపడుతున్నారు. ఉండి, ఉండి ఆయన సంచలన ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడానికి ఆయన వెనకాడడం లేదు. నాగం జనార్దన్ రెడ్డి వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఒక వర్గాన్ని చంద్రబాబు ఎగదోస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతకంతకు నాగం జనార్దన్ రెడ్డి రెచ్చిపోతున్నారు. తెలంగాణపై చంద్రబాబును ప్రశ్నించే దాకా ఆయన వచ్చారు.

నాగం జనార్దన్ రెడ్డి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి పంపిస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏదో విధంగా చంద్రబాబు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఈసారి సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో తనపై వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సమావేశంలో చర్చించి నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ ఇచ్చే అవాకశాలున్నాయని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: