27, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు.

ఈనెల 24వ తేదీన నిర్యాణం చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి అంతిమ సంస్కారాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, బాబా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. కోట్లాది మందికి తన ప్రసంగం ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేరజపరిచిన చోటే సమాధికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ద్రాక్షారామం నుంచి వేద పండితులు ప్రత్యేక విమానంలో రకరకాల పుష్పాలు, పుణ్య నదీజలాలు, పవిత్రమట్టితో పుట్టపర్తికి వస్తున్నారు.
ఇదిలావుండగా, అంతిమ సంస్కారాల నిర్వహణపై సత్యసాయి ట్రస్టు కీలక భేటీ నిర్వహించింది. మంగళవారం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంటపాటు ఈ భేటీ జరిగింది. బుధవారం నిర్వహించే అంతిమ సంస్కారం ఎలా చేపట్టాలి, వేదపండితులను ఎక్కడి నుంచి పిలిపించాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఖననంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అన్న అంశాలపై చర్చించారు.

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు. చివరి దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి ట్రస్టు సభ్యులతో కలిసి చర్చించిన పిమ్మట మీడియాకు వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా దాక్షారామం నుంచి ప్రముఖ వేద పండితులను బాబా అంతిమ సంస్కారానికి పిలిపించాలని నిర్ణయించారు. సన్యాసం, బ్రహ్మచర్యం, సర్వమత సమానత్వాన్ని పాటించిన సత్యసాయికి ఏ తరహా అంతిమ సంస్కారాలు నిర్వహించాలో వేద పండితులతో ట్రస్టు వర్గాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రియను నిర్వహించడానికి మూడు పద్దతులు ఉన్నట్లు కూడా వేద పండితులు సూచించినట్లుగా సమాచారం.

సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబర్‌లో 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకున్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు. బాబా గోల్డు రింగ్స్, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు.


కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.

1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్‌లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.

మే 23 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడుగా భావించాడు. బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిర్డీ సాయికి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవడం ప్రారంభం అయింది. పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు.

1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారత దేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్న పాటి గ్రీన్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1963లో బాబాకు నాలుగుసార్లు గుండెనొప్పి వచ్చింది. ఆ సమయంలో బాబా తాను మరణించాకు కర్ణాటకలో ప్రేమసాయి అవతారం ఎత్తుతానని చెప్పారు.

ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగండా, నైరోబీ తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు. తనవైపు ఎవరినీ తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి, ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికే వచ్చానని ఆయా దేశాలలో చెప్పేవారు.

మన రాష్ట్రం రాజధానిలో ప్రసిద్ధి పొందిన శివం మందిరాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. బాబా 2005వ సంవత్సరం నుండి వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. తాను దేహం కలవాడిని కాదని, దేహిని అని చెప్పారు. తాను నిర్మాణం చెందినప్పటికీ మళ్లీ పుడతానని పలు సందర్భాలలో చెప్పారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణం అని కూడా చెప్పారు. ప్రతి దేహం గిట్టక తప్పదని చెప్పారు.

బాబా తన భజనల సీడీలను చాలా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులను, వేల సేవాకేంద్రాలు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబతాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే గత నెల 28న మంచాన పడ్డారు. 28 రోజుల అనంతరం బాబా ఆదివారం ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం చెంది బాబా భక్తులలో విషాదం నింపారు

కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సత్యసాయిబాబా మరణాన్ని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా సత్యసాయికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపించలేని బిజెపి ఎప్పటి నుండో రాష్ట్రంలో ఓ వెలుగు వెలగాలనే ఆశతో ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత బిజెపి బలోపేతానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రెండంకెల అసెంబ్లీ సీట్లను గెలవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక జిల్లాల పర్యటనకు వెళుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. పుట్టపర్తిలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.


సత్యసాయి సేవలు, ఆధ్యాత్మికత ద్వారా పుట్టపర్తి ప్రపంచ వ్యాప్తమైందని, అలాంటి పుట్టపర్తి ఉన్న జిల్లాను సత్యసాయి జిల్లాగా పేరు మార్చాలనే డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాలని బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షించవచ్చునని బిజెపి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సత్యసాయి మతాలకతీతంగా ఆధ్యాత్మికతను నెలకొల్పారు. కాబట్టి సత్యసాయి జిల్లాకోసం డిమాండు తీసుకు వస్తే అందరూ తమకు మద్దతు పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాహార్తిని తీర్చిన ప్రదాతగా సాయిని అందరూ ప్రశంసిస్తారు. ఇప్పుడ అక్కడకు వచ్చే లక్షలాది భక్తుల దృష్టిని బిజెపి వైపు మరల్చేందుకు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సాయి మరణంతో వెనుక పడ్డ పుట్టపర్తి నుండి రాష్ట్రంలో తమ ప్రస్తానం ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మాజీ ఉప ప్రధాని అద్వానీలు వచ్చారు, వస్తున్నారు. ఇక రాష్ట్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయలతో పాటు పలువురు నేతలు పుట్టపర్తిలో బస చేయనున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటక స్ఫూర్తిగా రాష్ట్రంలో కూడా ఆ దిశగా పయనించేందుకు బిజెపి ఉత్సాహ పడుతోంది. బిజెపి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అనంతపురం జిల్లా అనుకొని ఉంటుంది. దీంతో మొదట జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కర్ణాటక మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి అనంతపురంలో గనుల వ్యాపారం కూడా ఉంది. ఇక గాలి జనార్థన్ రెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న కారణంగా జగన్‌ను పార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం కావాలని భావిస్తోంది. అయితే జగన్ వచ్చినా రాకున్నా కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే.

ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అద్భుతాలకు ఈ సంఘటన ఓ నిలువెత్తు నిదర్శనం.


చూడటానికి అదో పాత కారే కావచ్చు, కానీ ఆ కారు యజమాని మాత్రం ప్రత్యకమైన వారు. 1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు రిజిస్ట్రేన్ నంబర్ కూడా విశిష్టమైనదే - ‘DNA 8888’. ఈ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే. బాబా సర్గస్తులైన తర్వాత అతనితో తమకు ఉన్న అనుంబంధాలను, అనుభవాలను కోట్లాది మంది అభిమానులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సత్య సాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

నెమలి వర్ణంలో ఉండే ఈ రాయల్ కారు బాంద్రాకు చెందిన ఇర్ఫాన్ మొఘల్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా టెక్ (ఓ హై-ప్రొఫైల్ కార్ మెకానిక్) యజమాని అయిన ఇర్ఫాన్ ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా, 1972లో బాబా ఈ కారును కౌలాలంపూర్ నుంచి తెప్పించారు. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా, ప్రశాంతి నిలయానిక చెందిన అతని స్కూల్ పేరు "శ్రీ సత్య సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్"తో రిజిస్టర్ అయ్యింది. తర్వాతి కాలంలో ఆ కారును ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త వివేక్ బర్మన్‌కు 1984లో అమ్మేశారు. ఆ తర్వాత 1996లో మా నాన్నగారు అమన్ మొఘల్ ఈ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుండి అది మాతోనే ఉంది" అని చెప్పారు.

ఇంకా.. "ఈ కారును మేం కొనేటప్పుడు వాళ్లు చెప్పిన ధరకు కొనేందుకు అంగీకరించలేదు. కానీ ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా అని తెలియడంతో తర్వాత ఆయన అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు" అని ఇర్ఫాన్ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కారును తెచ్చినపుడు దీని రిజిస్ట్రేషన్ నంబర్ వేరుగా ఉన్నది. "ఈ కారు మొదటి నంబర్ ADA 9, కానీ తర్వాత ఈ కారు సత్య సాయి ఇన్సిట్యూట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తర్వాత ‘DNA 8888’గా మారిపోయింది.

అయితే.. ఈ కారు గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మా వ్యాపారానికి ఎంతో కలిసి వచ్చింది. దీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా వ్యాపారం అంచెలంచెలు ఎదిగింది. బాబా రోజూ కూర్చుని తిరిగే ఈ రోల్స్ రాయిస్ శాలూన్ యజమానిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. బాబా జ్ఞాపకంగా ఈ కారు ఎప్పటికీ తమతోనే ఉంటుందని ఇర్ఫాన్ చెప్పారు. బాబా మృతి పట్ల ఇర్ఫాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.

సత్య సాయిబాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా షిర్డీ సంస్థాన్ అంగీకరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తాను షిర్డీ సాయిబాబా వారసుడినని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తులు కూడా అలాగే భావిస్తారు. కానీ షిర్డీ సంస్థాన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబాను షిర్డీ సాయి బాబా వారసుడిగా అంగీకరించేందుకు షిర్డీ సంస్థాన్ సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉన్నది.


నిజానికి, షిర్డీ సాయిబాబా అశేష భక్త జనానికి ఆకర్షణగా నిలిచింది. షిర్డీ సాయి బోధనలు విశేష ప్రచారం పొందాయి. సత్య సాయిబాబాకు కూడా భక్తజన సందోహానికి తక్కువేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబా విశేష జనాదరణ పొందారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

సత్య సాయి ఎంతగా జనాదరణ పొందినప్పటికీ, భక్తులు ఆశిస్తున్నప్పటికీ షిర్డీ సంస్థాన్ సత్య సాయి బాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధంగా లేదు. రెండు ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేసే ఆలోచన కూడా ఆ సంస్థాన్‌కు ఉన్నట్లు లేదు. జీవించి ఉన్న కాలంలో సత్య సాయిబాబా షిర్డీకి వెళ్లిన దాఖలాలు కూడా లేవంటారు. పైగా, షిర్డీ సంస్థాన్ షిర్డీ సాయిబాబాకు వారసులు ఎవరూ లేరంటూ బోర్డు కూడా పెట్టుకుంది.

తనకు మూడు జన్మలున్నాయని, మొదటి జన్మ షిర్డీ సాయిబాబా కాగా రెండో జన్మ సత్య సాయి బాబా అని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. మూడో జన్మలో ప్రేమ సాయిగా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పుడుతానని ఆయన చెప్పారు. మాండ్యా జిల్లాలోని గుణవర్తి లేదా గుణపర్తిలో సత్య సాయి బాబా ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

అందరూ శ్రీరాముడి జన్మ దినాన్ని ఘనంగా జరుకొంటారు గాని, ఎవరు ఆయన ఎప్పుడు పోయాడో ఎందుకు మాట్లాడరు?

ఎవరి వెర్రి వాళ్ళ కానందం అని పెద్దలు ఉరికే అనలేదు. ఆ రోజుల్లో కూడా మన రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు ఉండనే ఉంటారు గనుక, అలా తీర్మానించేసి ఉంటారు. నేనసలే కొంచెం మెంటల్ అని గర్వంగా చెప్పుకొంటూ బోర విరుచుకు తిరిగే రామ్ గోపాల్ వర్మ, ఆ సంగతిని మనమెక్కడ మరిచిపోతామోనని బెంగ పెట్టుకొని తరచూ తన ట్వీటార్ ద్వారా ఏదో రూపంగా మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటాడు.

తనను తను మహా మేధావిగా భావించుకొంటూ ఎల్లపుడూ భ్రమలో బ్రతికే మన చెడ్డరాముడు, మొన్న మొన్నతన ట్వీటార్లో "అసలీ అన్నాహజారే ఎవరో, అతనెందుకు ఉపవాసాలు చేస్తున్నాడో" తనకసలు తెలీనే తెలీదని తన లోక జ్ఞాన్నాన్ని చాటుకోవడమే గాక, తను అండర్ వరల్డ్ గూండాల పట్ల, తన సినిమా ప్రపంచం పట్ల తప్ప మరేది ఆసక్తి చూపనని సెలవిచ్చాడు. అసలు తానెప్పుడు తిండి మానె ప్రసక్తే లేదని కూడా సెలవిచ్చాడు. తిండి మానక పోయిన ఈ దేశానికి కోత్తగా వచ్చే నష్టం ఏమి లేదుగాని, అలా పిచ్చి సినిమాలు తీయడం మానుకొంటే మాత్రం దేశానికి చాల మేలు చేసినవాడవవుతవని నా వంటి పామరులు చాల మంది అభిప్రాయ పడుతున్నట్లు వినికిడి.

ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ రోజు ఆయనకీ కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. అది కూడా శ్రీ రామ నవమి నాడే అంతే!వెంటనే, తన సెల్ ఎత్తి నాలుగు ట్వీట్లు ట్వీటేసాడు. మీలోఎవరికయినా ఆయన సందేహాలకి సమాధానాలు చెప్పగలిగే జ్ఞానం ఉందని అనిపిస్తే వెంటనే ఈ క్రింద ఇచ్చిన ఆయన గారి ట్వీట్ పేజీలోకి దూరి సరయిన సమాధానాలు వ్రాసి అయన మెప్పు పొందగలరని నా విజ్ఞప్తి.
ఆయన సందేహాలివే:
1 అందరూ శ్రీరాముడి జన్మ దినాన్ని ఘనంగా జరుకొంటారు గాని, ఎవరు ఆయన ఎప్పుడు పోయాడో ఎందుకు మాట్లాడరు?
2. అసలు శ్రీ రాముడు తన స్వంత పని మీద అంటే తన భార్య సీతకోసం లంకకి వెళ్లి రావణుడితో యుద్ధం చేసి రావడం తప్ప, అతను అయోధ్య వాసులకోసం అసలేమి చేసాడు?
3. దశరధుడు తన ప్రజలని గాలికొదిలి, తన భార్య కైకేయి కోసం రాముడిని అడవికి పంపినందుకి స్వర్గంలో ఎలా స్థానం సంపాదించెడో? అందుకు ఎలా అర్హత పొంద గలిగేడో?
4. రాముడి వెంట వనవాసానికి వెళ్ళిన పతివ్రత సీత ఒకవేళ స్వర్గానికి వెళ్ళినట్లయితే మరి లక్ష్మణుడి భార్య నరకానికి వెళ్లి ఉంటుందా?
5. బహుశః స్వర్గం లోదొరికే అమృతం మంచి నిషానిచ్చే మందు అయి ఉంటుందనుకొంట, అంతే గాని అదేదో గొప్ప ఫ్రూట్ జ్యుసు కాదనుకొంటా.
6. స్వర్గంలో దొరికే అమృతం, రంభ, ఊర్వశి, తిలోత్తమ వంటి అందగత్తెలు అన్నీకూడా మగవాళ్ళకోసమే అయితే, మరి ఆడవాళ్ళకి వేరే ప్రత్యేకమయిన ఏర్పాట్లు లేక పోవడం చాల అన్యాయం. ఈ విషయంలో మన మహిళా సంస్థలు దేముడితో సంప్రదింపులు మొదలు పెట్టలిసిన అవసరముంది.
7. ఆ రోజుల్లో అసలు బాణాలు గాని లేకపోయి ఉంటే రాముడు తన తొలియుద్ధం ఎలా చేయగలిగేవాడో మరి?
8. సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ళ వనవాసానికి వెళ్ళేపుడు, దశరధుడు వాళ్లకి అన్నేళ్ళకి సరిపోయే బట్టలు మూట కట్టి ఇచ్చేడా, ఇస్తే వాటన్నిటిని ఆ ముగ్గురిలో ఎవరు మోసి ఉంటారు? ఇవ్వక పోతే, 14 ఏళ్ళ పాటు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే బట్టలు ధరించి వనవాసం చేసేసారా?

వ్రాయవలసినదంత వ్రాసేసిన తరువాత, తన పనికి మాలిన సస్పెన్స్ సినిమాలాగ, చివరన ఇదంతా ముప్పాళ్ళ రంగ నాయకమ్మ వ్రాసిన రామాయణ విష వృక్షంలోని సందేహాలే తప్ప నా స్వంతవి గావని ఓ ట్విస్టు కూడా ఇచ్చి ముగించేడు. తన జీవితంలో చదివిన అతి గొప్ప పుస్తకం కూడా అదేనని సెలవిచ్చేడు కూడా.
ఇప్పుడు మీకు అతని గురించి మంచి అవగాహన ఏర్పడి ఉంటుంది గనుక, మరి ఆయన వంటి మేధావిని కలవాలని తహ తహ కూడా మీలో ఏర్పడి ఉండాలి కదా? మరెందుకు ఆలస్యం వెంటనే త్వీటర్ సైటు లోకి వెళ్లి

@RGVzoomin అనే హ్యండిల్నిఅందుకొంటే మీకు మీ రాముడు ప్రత్యక్షమవుతాడు. మరింకెందుకు ఆలస్యం

తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని

డబ్బు ..డబ్బు ..కడపలో ఎక్కడ చూసిన డబ్బే ......ప్రజలు (ఓటర్లు ) ఎంత అందుకుంటూ న్నారో తెలియదు కాని కట్టలుకట్టాలే అట ....కొన్ని చోట్ల డబ్బును కూడా కాల్చెయ్య దాన్ని బట్టి ఎంత డబ్బు విర్జిమ్ముతున్నారో అర్ధమవుతుంది . ఈపార్టి ..ఆ పార్టి అని లేదు ..అన్ని తమకు అందినంత .....తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని ..ప్రజల సొమ్మేకదా..""పాపం సొమ్ము ""మళ్ళి ప్రజలకే ...ఎన్నికైన తర్వాత ఎలాగు చెయ్యరని కాబోలు ఓటర్లు కూడా చెయ్య చాపుతున్నారుఅంత డబ్బు మాయం ..ఎంత ఖర్చు పెట్టిన ఎవరి ఎన్ని ఓట్లు వస్తాయి ?ఏమో ఆ దేవుడికే తెలియాలి .

నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్

తన కుమారుడు నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం గురించి మీడియా ఊహాగానాలు చేస్తుందని ఆయన అన్నప్పటికీ లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మాత్రం కొట్టి పారేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని తాను లోకేష్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆస్తులు పోగు చేయాలనే ఆలోచన ఉండకూడదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ తమ కుటుంబ వ్యాపారాలను చూస్తున్నాడని, అప్పుడప్పుడు తనకు సలహాలు ఇస్తుంటాడని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు నగదు బదిలీ పథకం గురించి చెప్పింది నారా లోకేషేనని అంటారు.


ఇదిలా పుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబమంతా తనతోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంతో తన బంధం మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్‌కు చేసుకోవడం ద్వారా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తమ సమీప బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుండడం ద్వారా ఆ బంధం మరింత గట్టి పడుతోందని ఆయన అన్నారు. దీన్ని బట్టి నందమూరి కుటుంబ సభ్యులు తన మాట జవదాటకుండా, తనకు అనుకూలంగా ఉండే విధంగా పెళ్లిళ్లతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు.

నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టేందుకు వీలుగానే చంద్రబాబు పెళ్లిళ్ల వ్యవహారాలు నడుపుతున్నారని ఆంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా ముందుకు రాకుండా ఉండడానికి తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ చంద్రబాబును వ్యతిరేకించే స్థితిలో లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనను వ్యతిరేకించకుండా చూసుకోగలితే నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముప్పు ఉండదనేది చంద్రబాబుకు తెలుసు

ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు.

అరచేతుల నుండి బూడిద, నోటి నుండి లింగాలు, గాలి నుండి గొలుసులు తీసే సత్యసాయి బాబా, మాములు మనిషా లేక అతీతశక్తులు కలిగిన దేముడా? బాబా కి రోగం వస్తే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. ప్రాణం కాడికి వచ్చే సరికి వైద్యవిజ్ఞానం పైన ఆధారపడ్డారు. ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు. ఒక వైపు కిడ్నీలు, కాలేయం పాడైపోయి, ఊపిరి పీల్చుకోలేక వెంటిలేటర్ పైన బాబా మనుగడ సాగిస్తుంటే, కొన్ని టీవీ ఛానళ్లు ‘‘బాబా మళ్ళీ దర్శనం” ఇస్తారని’ ప్రచారం చేయటంలో మతలబు ఏమిటి? సత్యసాయి ట్రస్టు నడిపే ఆసుపత్రిలో పనిచేసే డా. సఫయా, బాబా ఆరోగ్య పరిస్థితిపైన తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. యీ ప్రకటనల విశ్వసనీయత పరీక్షించకుండా, కొంత మంది మీడియా, ఛానెళ్లు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం.


ఇరవైయి ఒకటవ శతాబ్దంలో మనిషి ఎంత పురోగతి సాధించినా, శాస్త్రీయ విజ్ఞానం ఎంత ప్రగతి చెందినా,అరచేతి లో స్వర్గం చూపించే బాబాలను నమ్మటం ఎంత శోచనీయం. జనం, ఆధ్యాత్మిక బాబాల మాయజాలం లో చిక్కుకుపోతున్నారు. మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోయినప్పుడు, తన శక్తి సామర్ధ్యాల పైన విశ్వాసం కోల్పోయినప్పుడు, రాతి దేవుళ్ళని, అరచేతి స్వర్గం చూపే బాబాలను నమ్మడం మొదలుపెడతాడు. జనం బలహీనతలమీద బాబా గారు కోట్లాది రూపాయల ఆస్థి పోగేసుకున్నారు.

“చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు కాకులకీ బిచ్చం వేసినట్లు” గా కొంత డబ్బును ఆసుపత్రులు, కాలేజీలపైన ఖర్చుపెట్టారు. బాబా కోటరీ లక్షలాది కోట్ల ఆస్తులతో రాజ భోగాలను అనుభవిస్తుంది. నడవలేని, మాట్లాడ లేని, ఆఖరి కి ఊపిరి తీసుకోలేని బాబాను, ఒక బొమ్మగా చేసి జగన్నాటకం ఆడుతున్నారు. ప్రముఖ తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ పరిశోధనాత్మక రిపోర్టు ప్రకారం సత్యజిత్, డాక్టరు అయ్యర్ మరికొన్ని అదృశ్య శక్తులు బాబాను మత్తులో ముంచెత్తి, ఒక జీవచ్ఛవంగా మార్చారు. వీళ్ళ చుట్టూ బడా రాజకీయనాయకులు, గద్దె నెక్కిన మంత్రులు, పోలీసులు కాపలా కాస్తున్నారు.

కొంతమంది సత్యసాయి ట్రస్టు సభ్యులు, బాబా పైన మత్తుమందులు, డ్రగ్స్ ప్రయోగించారని ఆరోపణలు వున్నాయి. ఏబిన్ – ఆంధ్రజ్యోతి కొంత సాహసం చేసి బాబా బండారాన్ని, సత్యసాయి మందిరం చొరబడిన దొంగల కుట్రలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన బడా నాయకులు, హోమ్-మంత్రి చిదంబరం, రాజకీయ దళారులు, పోలీసు అధికారులకు సత్యసాయి ట్రస్టు కుంభకోణం తో సంబంధం వుందని తీవ్రమైన ఆరోపణలున్నాయి.

సాయిబాబా పేరున జరుగుతున్న తతంగం లోగడ ప్రేమానంద్, ఇన్నయ్య, అబ్రహాం కోవూర్, బయట పెట్టి విచారణ జరపమని కోరారు. ఎన్.టి.రామారావు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయమని ఉత్తరువులు ఇస్తే, చంద్రబాబు నాయుడు , పోలీసు అధికారి దొర లోపాయికారి వ్యవహారంతో ఆపారు. బెంగుళూరు వైస్ ఛాన్సలర్ నరసింహయ్య చాలెంజ్ చేసారు. పి.వి. నరసింహరావు, వాజపేయి, చివరకు అబ్దుల్ కలాం కూడా బాబా కాళ్ళు మొక్కి సెక్యులర్ సూత్రానికి ద్రోహం చేశారు. ఇప్పుడు బాబా విషయంలో జరుగుతున్న దానిని బట్టి అతను సామాన్య వ్యక్తి అని, మహత్తులు బూటకమనీ తేలింది. టి.వి. చానళ్ళు ఆధారాలు లేని ప్రసారాలు ఆపాలి .బాబా చుట్టూ మంత్రుల ప్రదక్షిణ అనుమానాలకు తావిస్తుంది గనుక వారు ప్రజలకు సంజాయిషి చెప్పాలి. తక్షణమే బాబా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని , గూడు పుఠాణి జరగకుండా చూడాలి.

బాబా ఆరోగ్య పరిస్థితి పైన రాష్ట్రప్రభుత్వం వాస్తవ పరిస్థితిని వెల్లడించాలి. సత్యసాయి ట్రస్టులోని లక్షలాది కోట్ల ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేసి, ప్రజల ఆరోగ్య, విద్య అవసరాల కోసం వినియోగించాలి. టీవీ ప్రసారసాధనాలు బాబాలకు గుడ్డిగా భజన చేయకుండా, జర్నలిస్టు విలువలను కాపాడుతూ, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. బాబాలు చెప్పే కట్టుకథలను నమ్మకుండా, శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించి, విచక్షణా జ్ఞానం తో వాస్తవాలను తెలుసుకోవాలి. మానవతా విలువలతో, శాస్త్రీయ ఆలోచన విధానం తో వికసించే సమాజం కోసం కృషిచేయాలి

సత్య సాయిబాబా సజీవ సమాధి

ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందారని ట్రస్టు ప్రకటించే అవకాశాలున్నాయని పుకార్లు పుడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నడిచే దేవుడిగా కొలిచే సత్య సాయిబాబా గత నెల 28 తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న సత్యసాయిబ ఉన్నత వైద్య శాస్త్ర సంస్థ వద్దకు పెద్ద యెత్తున భక్తులు చేరుకున్నారు. ఆయనకిప్పుడు 86 ఏళ్లు.


జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధి చెందడం అంటారు. ట్రస్టు వ్యవహారాలపై చర్చించడానికి సత్యసాయి కేంద్ర ట్రస్టు సభ్యులు గురువారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌కూ ఇతర సభ్యులకు మధ్య విభేదాల కారణంగా కూడా ఆ ప్రచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.

సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తుండడంపై, బాబాకు అందిస్తున్న వైద్యంపై శ్రీసత్య సాయిబాబా భక్తుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రస్టు సభ్యుల వ్యవహార శైలిపై సంఘం అధ్యక్షుడు ధనంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుట్టపర్తిలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పెద్ద యెత్తున బలగాలను దింపింది.

21, ఏప్రిల్ 2011, గురువారం

సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ మధ్య సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కలిసి పని చేస్తామని ఇరువురు నాయకులూ ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితి ఏదీ లేదని అంటున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్రంగా ధ్వజమెత్తిన వంశీ ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి క్షమాపణలు చెప్పారు. అయితే, పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో వంశీ కాస్తా వెనకడుగు వేసినట్లు భావిస్తున్నారు.

చంద్రబాబు 62వ జన్మదిన వేడుకల వేదికపై వంశీ, ఉమ కలిసి కనిపిస్తారని అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితి రాకుండా వంశీ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జన్మదిన వేడుకలకు వంశీ డుమ్మా కొట్టారు. తీరిక లేని పనుల వల్ల తాను చంద్రబాబు చెంతకు వచ్చి శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నానని వంశీ చెప్పారు. కానీ, అంత తీరిక లేని పనులు వంశీకి ఏమున్నాయనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుతో కూడా వంశీ నామమాత్రంగానే సయోధ్యకు అంగీకరించినట్లు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్ సూచన మేరకు తాత్కాలికంగా పార్టీలో పోరుకు వంశీ తెర దించినట్లు కనిపిస్తోంది.

బిజెపిలోకి పవన్ కళ్యాణ్?

అన్నయ్యకు తమ్ముడు దూరం అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అల్లు అరవింద్ బాటలో నడుస్తున్న చిరంజీవి నిర్ణయాలతో విసిగి పోయిన తమ్ముళ్లు పవన్ కల్యాన్, నాగబాబు ప్రస్తుతం అన్నయ్య పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభిమానుల అండదండల కారణంగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడాన్ని పవన్, నాగబాబు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం. ప్రజారాజ్యం పార్టీ కోసం నాగబాబు, పవన్ ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీ స్థాపనకు ముందు నాగబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి చిరు అభిమానులతో రహస్య మంతనాలు చేశారు. అందరినీ ఏకం చేశారు. పార్టీ పెట్టాక కూడా నాగబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఇక ఎన్నికల సమయంలో పవన్, నాగబాబు సోదరులు పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించారు. సామాజిక న్యాయం పిఆర్పీ ద్వారానే సాధ్యమని చెపుతూ బలమైన కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకు పడ్డారు. పవన్ అయితే మరో ముందడుగు వేసి షబ్బీర్ అలీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, కాంగ్రెసు నేతల పంచెలూడదీసి కొట్టాలి అని ధ్వజమెత్తారు. ఒకవిధంగా చెప్పాలంటే గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలుచుకోవడంలో చిరు మీద అభిమానానికి తోడు నాగబాబు, పవన్ ప్రచారం ప్రభావం చూపిందనడం ఎవరూ కాదనలేని నిజం. పిఆర్పీ నిలబడటానికి చిరంజీవి కన్నా పవన్, నాగబాబులే ఎక్కువ కృషి చేశారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.


అలాంటి నాగబాబు, పవన్ నిర్ణయంతో సంబంధం లేకుండానే చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్‌తో కలిసి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని చిరంజీవి బావమరిది, తమ్ముళ్ల ప్రోత్సాహంతోనే వచ్చినట్టు వార్తలు వచ్చాయి. పార్టీ పెట్టాక అల్లు అరవింద్ అజమాయిషీ ఎక్కువైందన్న ఆరోపణలు వచ్చాయి. చిరుకు తెలియకుండా అల్లు టిక్కెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీ పెట్టిన కొద్ది రోజులలోనే మంచి మంచి నాయకులు అల్లు అరవింద్‌తో వేగలేక బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్లిన వారు చిరంజీవిని అల్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత కొన్నాళ్లుగా తమ్ముళ్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అభిమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెసు, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం దిశగా దూసుకు వెళతామని చెప్పిన తాము ఇప్పుడు అభిమానులకు ఏం చెప్పాలని నాగబాబు, పవన్ అంతర్మథనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 18 సీట్లు కొత్తగా వచ్చిన పార్టీ గెలుచుకోవడం సాధారణ విషయం ఏమీ కాదని, ఇలాంటి సమయంలో కాంగ్రెసు, టిడిపిలో ఉన్న సంక్షోభాలను క్యాష్ చేసుకొని 2014 వరకు అధికారంలోకి ఎలా రావాలా అనే విషయంపై దృష్టి సారించకుండా కాంగ్రెసులో పిఆర్పీ విలీనం చేయడంపట్ల తమ్ముళ్లు తీవ్ర నిరాశలో మునిగినట్లుగా తెలుస్తోంది. బావమరిది అల్లు అరవింద్ చిరంజీవిని పార్టీ పెట్టినప్పటినుండి తప్పుదారి పట్టిస్తున్నాడనే యోచనలో వారు ఉండిపోయినట్లుగా సమాచారం. అన్నను తప్పుదారి పట్టిస్తుండటంతో అల్లు అరవింద్‌తో వేగలేక వారు ప్రస్తుతం తమ తమ సొంత వ్యాపకాల్లో మునిగి పోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గత కొన్నాళ్లుగా వారు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసుతో విలీనం ప్రకటన తర్వాత పవన్ సినిమాలపై దృష్టి సారించినట్టుగా సమాచారం. నాగబాబు కూడా తన భవిష్యత్తుపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తమ తమ వ్యాపకాల్లో దృష్టి సారించిన పవన్, నాగబాబు తర్వాత అయినా అన్న బాటలో కాంగ్రెసు వైపు పయనిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చిరు కాంగ్రెసు వైపు వెళ్లడమే ఇష్టం లేని పవన్ కాంగ్రెసులో చేరి అన్నకు మద్దతుగా నిలిచే అవకాశాలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకుండా ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఒకవేళ వస్తే కనుక భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌కు బిజెపి నేతలతో మంచి సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే బిఎస్పీతో వెళ్లే అవకాశాలను కూడా కొట్టి పారేయలేక పోతున్నారు

ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తన అల్లుడు నారా లోకేష్‌కు సినీ హీరో బాలకృష్ణ పూర్తి మద్దతు లభిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలనే చంద్రబాబు ఆలోచనను బాలకృష్ణ సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బాలకృష్ణ చెప్పిన మాటలు దాన్ని బలపరుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు సర్దుబాటు కోసమే ఆయన ఆ మాటలు అన్నా చాప కింద నీరులా లోకేష్‌కు పట్టం కట్టడానికి చంద్రబాబు చేస్తున్న ఏర్పాట్లకు బాలయ్య మద్దతు ఉందని అంటున్నారు.


నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టాలనే చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ తీయడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు దూకి, కృష్ణా జిల్లా పార్టీలో ముసలం పుట్టించారని అంటారు. ఆ తర్వాత సమయం, సందర్భం కలిసి రాకపోవడంతో వారు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. లోలోపల మాత్రం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు ప్లాన్‌ను దెబ్బ కొట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, బాలకృష్ణ మాత్రం చంద్రబాబు వెంట ఉండడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కుటుంబ సభ్యులను చీల్చడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పాలి. తన కుమారుడు లోకేష్‌తో బాలయ్య కూతురు బ్రాహ్మణికి పెళ్లి చేయడంలోని చంద్రబాబు ముందు చూపు అదేనని అంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ పని చేసినట్లు చెబుతున్నారు. తన అల్లుడు లోకేష్‌కు వ్యతిరేకంగా పని చేసి జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య బలపరచడమనేది కలలోని మాటనే. నిజానికి, బాలయ్యకు, ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలను కలిపింది కూడా చంద్రబాబు నాయుడే. ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోవడానికి ఆయన ఆ పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు అంత మేరకే చూస్తారు. అంతకు మించి పార్టీలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు. ప్రస్తుతం బాలయ్యతో కలిసి చంద్రబాబు నడుపుతున్న రాజకీయం అదేనని అంటున్నారు.

20, ఏప్రిల్ 2011, బుధవారం

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తప్పదా? ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, ఈ ఉప ఎన్నికలు మార్పునకు నాంది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప అభ్యర్థి వైయస్ జగన్ తన ఎన్నికల ప్రచారం పదే పదే చెబుతున్నారు. ఆ మార్పు కాంగ్రెసును కూలదోసి తాను అధికారంలోకి రావడానికి అనువైందనేది ఆయన చెప్పకున్నా అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ సువర్ణ పాలనకు తన రాజకీయాలు పాదులు వేస్తాయని ఆయన అంటున్నారు. అయితే, కడప ఉప ఎన్నికల ఫలితాలకు అంత చేవ ఉందా అనేది ప్రశ్న.


నిజానికి కడప, పులివెందుల ఉప ఎన్నికలు వైయస్ జగన్‌కు మాత్రమే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిస్తే జగన్ రాజకీయాలు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. ఓడిపోతే మాత్రం జగన్ రాజకీయాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ విషయం వైయస్ జగన్‌కు తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే మరింత మంది శాసనసభ్యులు తన వెంట వస్తారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు సమకూరుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. బహుశా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అందుకే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని మంగళవారంనాడు వ్యాఖ్యానించి ఉంటారు.

కానీ, ఉప ఎన్నికల తర్వాత జగన్‌కు అంత సీన్ ఉంటుందా అనేది అనుమానమే. ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ జరిగే నష్టం ఏమీ లేదు. గెలిస్తే మాత్రం జాక్‌పాట్ కొట్టినట్లే. అయితే, గెలిచే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు రెండవ స్థానం కోసమే పోటీ పడవచ్చు. రెండో స్థానం సాధించే పార్టీలు కాస్తా ఆనందించడానికి, మూడో స్థానం లభిస్తే కాస్తా కుండిపోవడానికి మాత్రమే ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికలు ఉపయోగపడుతాయి. కాంగ్రెసు మూడో స్థానంలో ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీపై కూడా అటువంటి ప్రభావమే పడుతుంది. ఏమైనా, ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలను మార్చే సీన్ జగన్‌కు లేదని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది. మరో వైపు ఈ రెండు అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి బిసిలు ఏకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆధిపత్యంలో తెలంగాణ ఉద్యమం సాగుతుండడం పట్ల రెడ్డి నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పైగా, కెసిఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ ఉద్యమ నేతలుగా ముందుకు వచ్చారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వారితోనే ఉంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని తమ నాయత్వంలోకి తీసుకోవడానికి రెడ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ని ముందుకు తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన జైపాల్ రెడ్డిపై, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై తెరాస కార్యకర్తలు కోడి గుడ్లు విసిరారు. తెలంగాణ ఉద్యమం పెరిగితే కెసిఆర్ కుటుంబ సభ్యులు, వెలమ కులానికి చెందిన వారే లబ్ధి పొందుతారనే ప్రచారాన్ని రెడ్లు చాప కింద నీరులా సాగిస్తున్నారు. తెలంగాణలో వెలమల జనాభా చాలా తక్కువ. రెడ్ల జనాభా వారికన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆధిపత్యంలో కూడా వారిదే పైచేయి. అయితే, తెలంగాణ ఉద్యమం విషయంలో మాత్రం కెసిఆర్ హవా సాగుతోంది. రాజకీయంగా బలోపేతం కావడానికి కెసిఆర్ కోదండరామ్ నాయకత్వంలోని రాజకీయ జెఎసిని బాగా వాడుకున్నారు. అయితే, మిలియన్ మార్చ్ విషయంలో కోదండరామ్‌కు, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ జెఎసి స్థానంలో మరో వేదికను ఏర్పాటు చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కెసిఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య పొడసూపిన విభేదాల నేపథ్యంలో ఎస్ జైపాల్ రెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోదండరామ్ నాయకత్వంలో రెడ్డి నాయకులు పనిచేయడానికి సిద్ధపడాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా, జైపాల్ రెడ్డి కోదండరామ్‌ను ప్రశంసిస్తున్నారు కూడా. మిలియన్ మార్చ్ విజయవంతమైందని జైపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందువల్లనే తెరాస ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. కోదండరామ్ నాయకత్వంలోని జెఎసిని బలోపేతం చేయాలని జైపాల్ రెడ్డి భావిస్తున్నారట. కోదండరామ్‌ను ముందు పెట్టి రెడ్డి నాయకులను ఏకం చేయడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. జెఎసిలో కీలక పాత్ర వహించేందుకు తగిన రంగాన్ని జైపాల్ రెడ్డి సహకారంతో నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, రెడ్డి, వెలమ నాయకుల ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి బిసి నాయకులు మరో వైపు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందిన రెడ్డి నాయకులు పని చేయడానికి సిద్ధపడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు సిపిఐ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి నాయకులకు కోదండరామ్‌తో కలిసి పనిచేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమం మే నెల నాటికి కీలక మలుపు తిరుగవచ్చునని అనుకుంటున్నారు.

అపర చాణక్యుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు.

రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడు పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు నిరాఘటంగా పాలించిన చంద్రబాబు తన పాలనా కాలంలో అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో భారీ సంస్కరణలు చేశారు. రాష్ట్రం వరకే పరిమితం అయిన హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. ఐటితో యువతకు భారీగా ఉపాది కల్పించారు. రాజకీయ ఎత్తుగడల్లో తనను మించిన వారు లేరని విపక్షాలు, విమర్శకుల చేత సైతం పొగడ్తలు అందుకున్నవాడు. ఇలా తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాల్లో, దివంగత నందమూరి తారక రామారావు తర్వాత అంత పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసి సొంత పార్టీ మాత్రమే కాకుండా ఆయన వైరి పార్టీలు కూడా సైతం జాలిపడే స్థితికి దిగజారడం శోచనీయం.


ప్రస్తుత చంద్రబాబునాయుడు పరిస్థితి చూసిన వారు నాటి రాజకీయ చాతుర్యం ఎక్కడకు పోయిందని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ, మరో వైపు జగన్, ఇంకోవైపు కుటుంబ కలహాల మధ్య బాబు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిత్యం చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటూ రెండు కళ్ల సిద్దాంతంపై ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని మరింత బలపర్చాలంటే కాంగ్రెసు కన్నా టిడిపిని ముందుగా దెబ్బతీయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకే ఆయన టిడిపిని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పలువురి మాటల్లో చెప్పాలంటే కెసిఆర్‌కు ప్రత్యేక తెలంగాణ కన్నా టిడిపి దెబ్బతీయడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిని బయటకు తీసుకు వస్తున్నారు.

ఇప్పటికే బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని టిఆర్ఎస్‌లో లాగారు. ఉప ఎన్నికల కోసం రాజీనామా చేసిన చెన్నమనేని రమేష్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అంతకుముందు రమేష్ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తదుపరి లక్ష్యంగా పాల్వాయి రాజ్యలక్ష్మిని చేసుకున్నారు. ఆమెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాబుకు తెలంగాణలో ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కష్టతరంగా మారింది. అందుకే పోచారం రాజీనామా ఆమోదానికి టిడిపి కూడా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక టిఆర్ఎస్ సంగతి అలా ఉంటే పార్టీలో ఉంటూ నాగం జనార్ధన్ రెడ్డి బాబుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. పార్టీ వీడకుండానే పార్టీని ముప్పుతిప్పలు పెడుతూ కంటిలో నలుసులా మారారు. ఇక టిడిపికి గట్టి పట్టు ఉన్న కోస్తా జిల్లాల్లో జగన్ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బాబును విమర్శిస్తూ జగన్ వెంట వెళుతున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టి బాబును అధికారంలోకి రాకుండా చేశారు. 2014లో అధికారంలోకి వద్దామనుకుంటున్న బాబుకు ఇప్పుడు జగన్ అడ్డు పడేలా కనిపిస్తున్నారు.

ఇవన్నీ సమస్యలు ఇలా ఉంటే బాబుకు ఇటీవలే మరో సమస్య పట్టుకుంది. అది వారసత్వ సమస్య. బాబు తనయుడు లోకేష్ కుమార్‌ను చంద్రబాబు హైప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఉద్దేశ్యంతో హరికృష్ణ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. హరికృష్ణ ప్రత్యక్ష యుద్దానికి దిగకుండా విజయవాడ గలాటాకు తలుపులు తెరిచారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య చల్లబడింది. అయితే సహజంగా ఆవేశ పరుడు అయిన హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎప్పుడు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తారో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో త్వరలో జరగనున్న మహానాడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహానాడుకు హరికృష్ణ రాకుంటే దూరం పెరిగిందని, వస్తే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అనే భయం పచ్చదళంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారసత్వ పోరు సద్దుమణిగినప్పటికీ తెలంగాణ, జగన్, నాగం తదితర సమస్యలు హైటెక్ సిఎంను పట్టి పీడిస్తున్నాయి. అయితే సహజంగా చాణక్య తెలివిగల చంద్రబాబు వీటన్నింటిని అధిగమించగలడని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు జూ.ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసిన సందర్భాన్ని కూడా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులో ప్రయోజం ఉంటుందని కూడా బావిస్తున్నారు.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ భగవాన్ సత్యసాయి అధ్యక్షుడిగా ఉన్న సత్యసాయి ట్రస్టు ఆస్తులు రూ.1.30 లక్షల కోట్లు అని ఆ ఆస్తుల కోసం ఆయన చుట్టూ చేరిన వారు పలువురు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడం కోసం బాబా నిర్మించిన భక్తి సామ్రాజ్యంలో దొంగలు పడి నిలువుగా దోచుకుంటునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఆదివారం ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. పుట్టపర్తి అంటే భగవాన్ సత్యసాయి బాబా, ఆయన భక్తులు మాత్రమే కాదు! ఇదో విశాల సామ్రాజ్యం! దేశ దేశాల్లో ఉన్న ట్రస్టు స్థిరాస్తులతోపాటు ప్రశాంతి నిలయంలో ఉన్న కోట్లలో నగదు, టన్నుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాల విలువ లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా! ఇది సాయిబాబాను సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా నమ్మి, నివేదించుకున్న భక్తి సంపద. ఇలా భక్తులు సమర్పించుకున్న దానిలో కొంతమాత్రమే ట్రస్టు ఖాతాలో పడుతోంది! మిగిలింది, ట్రస్టులోని కొందరు సభ్యుల సొంత ఖాతాల్లో జమ అవుతోంది. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత ఈ డబ్బును అత్యంత రహస్యంగా, పకడ్బందీ భద్రత మధ్య తరలించే కార్యక్రమం మొదలైంది.


ప్రశాంతి నిలయానికి సమీపంలో ఉండే ఐటీ కోర్ బిల్డింగ్ నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వేదికగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యంతో ఆడుకుంటూ... మరోవైపు ఐటీకోర్ బిల్డింగ్ కేంద్రంగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా హడావుడి పెరిగింది. కంప్యూటర్ల కీ బోర్డులు టకటకలాడుతున్నాయి. సుమారు 165 దేశాల్లోని పలువురు వ్యక్తుల ఖాతాల్లో ఆన్‌లైన్ మార్గంలో డబ్బులు పడిపోతున్నాయి. ఈ బిల్డింగ్ శత్రు దుర్బేధ్యం. నల్లధనమైనా, తెల్లధనమైనా, హవాలా అయినా, ఏ దేశ కరెన్సీ అయినా ఇక్కడి నుంచి క్షణాల్లో ఆన్‌లైన్‌లో సర్దుబాట్లు జరిగిపోతుంటాయి. గత నెల 28న బాబా ఆస్పత్రి పాలయ్యాక ఐటీ కోర్ బిల్డింగ్‌ను దోపిడీ సూత్రధారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నమ్మిన బంట్ల ద్వారా వాటాలు సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది, సెటిల్‌మెంట్లు జరుగుతున్నది భక్తులు కానుకగా సమర్పించుకున్న సంపదే కాదు! ఎందరో ప్రముఖులు దాచుకున్న నల్ల డబ్బు కూడా!

ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. పోలీసులు, ఆదాయపు పన్ను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులెవరూ ప్రశాంతి నిలయం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దీంతో ట్రస్టులోని కొందరు వ్యక్తులు ప్రశాంతి నిలయాన్ని ఒక హవాలా కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి. బడా బడా వ్యక్తులు, ప్రముఖులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు పుట్టపర్తిని అత్యంత సురక్షితమైన స్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల నగదు దాచుకోవడం... అవసరమైనప్పుడు తీసుకోవడం... ఇదో హవాలా బజార్! పుట్టపర్తి వ్యవహారాలను చాలా ఏళ్లపాటు దగ్గరుండి పరిశీలించిన ఒక పోలీసు అధికారి మాటల్లో చెప్పాలంటే... 'ఇది ఒక మినీ స్విస్ బ్యాంక్'. కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఇక్కడ 'ఖాతాలు' తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ 2 వేల కోట్లు దాచుకున్నట్లు సమాచారం.

బాబా అస్వస్థతకు గురి కాగానే ఆ నాయకుడు పరిగెత్తుకుంటూ పుట్టపర్తికి వచ్చారు. అలాగే... మహారాష్ట్రకే చెందిన ఓ మాజీ మంత్రి పుట్టపర్తిలో మరో వెయ్యి కోట్లు పెట్టినట్లు చెబుతున్నారు. సత్యసాయికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలు చూడాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే... ఈ 'నల్ల' కార్యక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ రహస్య లావాదేవీలన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దల్ని, కొందరు అధికారుల్ని ముందుగానే మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది... సూత్రధారుల మధ్య పంపకం!

జగన్నాయకుడు ఓ చిత్రం

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అనంతరం ఆయన పార్టీ వీడటం, ఆ తర్వాత పార్టీ పెట్టడం తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.


శ్రీరామ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మంచి అభిమాని. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మరింత ఆకర్షితుడయ్యాడంట. ఆయనను వైయస్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. అయితే వైయస్ మృతి తర్వాత జగన్‌ను ఆయన బాగా ఆరాధించాడు. అయితే అలాంటి జగన్ ఎంపీగా కాంగ్రెసు పార్టీని విభేదించి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని పెట్టాడు.

ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జగన్నాయకుడులో పొందు పర్చనున్నారని సమాచారం.

జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది. పార్టీ అభ్యర్థిగా గెలిచి జగన్ వెంట నడుస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలకు ముందే వారిపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆదివారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు బాలనాగి రెడ్డి , ప్రసన్నకుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు ప్రకటించే అవకాశం ఉంది.


అయితే తాను శాసన సభ్వత్వానికి రాజీనామా చేసినందున దాన్ని ఆమోదించాలని పోచారం పట్టుబడుతున్నారు. ముందుగానే తాము అనర్హత పిటిషన్‌ వేసినందున దాన్ని తేల్చాలని తెదేపా కోరుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోమవారం దీనికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆదివారం ఏజితో కూడా కలిసి చర్చించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం కూడా ఫిర్యాదుకు సిద్ధం కావడంతో పెండింగ్‌ పిటిషన్లపై తుది నిర్ణయానికి డిప్యూటీ స్పీకర్‌ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అనంతరం జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేసుకునే చర్యలు ప్రారంభించేందుకు ఉదయుక్తమయినట్టుగా సమాచారం.

ఇందులో భాగంగా తొలిదశలో నలుగురిపై చర్యలు తీసుకోవడానికి పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఈ మేరకు నాదెండ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖపై తొలిసారి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కడప ఉప ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌కు బహిరంగంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరితోపాటు కోస్తాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అనర్హత వేటు జాబితాలో చేరవచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి.

దివంగత వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనే ఆమె పార్టీపై, రోశయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి నేరుగా లేఖ రాసి కలకలం సృష్టించారు. వీలైనప్పుడల్లా కాంగ్రెసుపై ధ్వజమెత్తింది. అధిష్టాన్ని ప్రశ్నించింది. వీరితో పాటు జగన్‌తో వెళుతున్న మరికొందరు ఎమ్మెల్యేలపై పార్టీ నేతలంతా చాలా కాలంగా సీరియస్‌గా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు గట్టిగా పార్టీని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌కు అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యం ఉండడం కారణంగా ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో వెళ్లింది. 18 మంది ఎమ్మెల్యేలున్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు పలకడం, ఆ తరువాత కాంగ్రెస్‌లోనే విలీనమయ్యేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు వచ్చింది. కడప ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల తీరును పరిశీలించాక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అధిష్ఠానం నాలుగురోజుల కిత్రం ఢిల్లీలో ఈ విషయంపైనే కీలక చర్చలు జరిపింది. ఆ మేరకే ఇప్పుడు అనర్హత ఫిర్యాదుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిప్యూటీ స్పీకర్‌ వద్ద విచారణలో ఉన్నాయి.

ఇక కాంగ్రెసు పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అనర్హత వేటుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని భావిస్తోంది. ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కార్యకలాపాలు సాగిస్తే స్వచ్ఛందంగా తమ పదవిని వదులకున్నట్లుగా భావించవచ్చనే విధంగా చట్టంలో ఉందని పార్టీ నేతలంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికైన పార్టీని విమర్శిస్తూ, వేరే పార్టీ వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యేలను స్పీకర్లు అనర్హత వేటు వేసిన సందర్భాలను ఉదహరిస్తున్నారు

జగన్‌కు ఆ హీరో దూరమే

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి చాలా దగ్గరగా ఉన్న యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతులు వైయస్ తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి క్రమంగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా రాజశేఖర్ - జీవిత జాడే లేదు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దరి చేరి రాజశేఖర్ దంపతులు వైయస్ మృతి తర్వాత మాత్రం జగన్‌కు మద్దతుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. ప్రజల కోసం దివంగత వైయస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాను కాంగ్రెసు పార్టీలో చేరామని చెప్పిన రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత పార్టీలో ప్రముఖంగా కనిపించారు. 2007లో చిరంజీవి అభిమానులుగా పేర్కొన్న పలువురు రాజశేఖర్ కారుపై దాడి చేయడంతో వైయస్ - రాజశేఖర్ దంపతుల ఆత్మీయ బంధం మరింత ఎక్కువయింది.


వారు కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వైయస్‌ను గానీ, జగన్‌ను గానీ, కాంగ్రెసు పార్టీని కానీ ఎవరైనా విమర్శించినా తిప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వైయస్‌పై ఈగ కూడా వాలనీయలేదు. చిరంజీవిపై ఉన్న కోపంతో గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున భారీగానే ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చిరంజీవిని లక్ష్యంగా చేసుకొని చాలా ఆరోపణలు చేశారు. ఓ సమయంలో కాంగ్రెసు పార్టీలో జీవితకు ఓ ముఖ్యమైన పదవి వస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలో వైయస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతుల నుండి ఎలాంటి సందడి లేదు. వైయస్ ఉన్నన్నాళ్లూ చిరంజీవిపై విరుచుకు పడిన, వైయస్‌కు అండగా ఉన్న రాజశేఖర్ దంపతులు ఆయన మరణం తర్వాత మాత్రం జగన్‌కు అంతగా మద్దతు పలికిన దాఖలాలు లేవు.

గతంలో విజయవాడలో జగన్ చేపట్టిన జలదీక్షలో మాత్రమే రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ నాయకుడి ఇంట్లో జరిగిన విందులో కూడా తాము జగన్ వెంటే ఉంటామని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎక్కడా ఓదార్పులో పాల్గొన్న సందర్భం గానీ, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని సమర్థించినట్టుగా కానీ, కడప ఉప ఎన్నికల ప్రచారంలో కానీ కనిపించింది లేదు. జగన్‌తో ఉంటే ఫలితం లేదనే పునరాలోచనలో వారు పడినట్లుగా తెలుస్తోంది. వైయస్ ఉన్నప్పుడు వీరికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే జగన్ వద్ద తమకు అంతగా ప్రాధాన్యం ఉండదనే ఉద్దేశ్యంతోనే వారు జగన్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పార్టీలో ఇప్పటికే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ, సినీ నటి రోజా, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అలాంటి ప్రధాన నాయకురాళ్లు ఉన్నప్పుడు జగన్ వెంట వెళ్లినా లాభం లేదనే ఉద్దేశ్యంలో రాజశేఖర్ దంపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు వైయస్ బాటలో ఉంటూ కాంగ్రెసు పార్టీలో ఉండాలని ఉన్నప్పుటికి తాను ప్రధానంగా వ్యతిరేకించే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరటం వారికి మింగుడు పడని విషయం. ఇటు చిరంజీవి రాక కారణంగా ఇటు ఇన్నాళ్లు ఉన్న కాంగ్రెసు పార్టీతో ఉండలేక, అటు పలువురు ఫైర్ బ్రాండ్‌లు వైయస్ తనయుడు జగన్ చుట్టూ ఉండటంతో వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు తాము మొదట అడుగిడిగిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపికి బద్ద శత్రువు అయిన కాంగ్రెసులో చిరు ఉండటంతో ఆయనపై నిప్పులు కక్కే అవకాశం వీరికి ఉంటుంది. అంతేకాదు టిడిపిలో అంతగా పేరు బడ్డ మహిళా నేతలు లేక పోవడం కూడా జీవితకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.