కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి వ్యూహం రచించి, అమలు చేసే మిషన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. వైయస్ జగన్‌పై పోరుకు ఆయన ప్రత్యక్షంగా ముందుకు వస్తారా, లేదా అనేది తెలియడం లేదు. కానీ జగన్‌ను ఎదుర్కోవడానికి అధిష్టానం ఆదేశాల మేరకు వ్యూహాన్ని రచించి, అమలు చేయడానికి ఆయన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్‌కు అత్యంత సన్నిహితులైన నాయకుల ద్వారా జగన్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం వ్యూహాన్ని రచించింది.
వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్ జగన్‌ను నిలువరించే మిషన్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు నాయకుడని, వైయస్ ఏ రోజు కూడా సోనియా గాంధీని వ్యతిరేకించలేదని గట్టిగా చెబుతూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైయస్ జగన్ వైయస్సార్ వారసుడు కాడని చెప్పడానికి వారు సిద్ధమయ్యారు.
తమ మిషన్‌లో భాగంగా ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్‌పై ఆదివారంనాడు మొదలు పెట్టిన తన దాడిని సోమవారం కూడా కొనసాగించారు. వైయస్సార్ ఆత్మ కాంగ్రెసుతో ఉందని వైయస్ సన్నిహితులై నాయకులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వైయస్ జగన్‌కు తండ్రి మీద కన్నా పదవి మీదనే ప్రేమ ఎక్కువ అని వారు చెప్పదలుచుకున్నారు. ఇతర విషయాలను కూడా వారు ముందుకు తేవడానికి సిద్ధపడ్డారు.
సుదీర్ఘమైన పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైతే కనీసం చూడడానికి కూడా వైయస్ జగన్ రాలేదని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ వైయస్‌ను పరామర్శించడానికి పెద్ద సంఖ్యలో కదిలి వస్తే జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారని వారు చెప్పదలుచుకున్నారు. అలాగే, వైయస్ మరణించిన తర్వాత వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ సంతకాల సేకరణ గుట్టును కూడా వారు విప్పనున్నారు. ఈ విషయంలో నిందలను కెవిపి రామచందర్ రావు మోశారు. అందులో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి కూడా ఆయన జగన్‌ను ఎదుర్కోవడంలో భాగంగా చేపట్టే కార్యక్రమాన్ని వాడుకుంటారని అంటున్నారు.
వైయస్ మరణించారని తెలిసిన వెంటనే వైయస్ జగన్ పావురాలగుట్టకు వెళ్లకపోవడాన్ని కూడా ప్రధానాస్త్రంగా వాడే ఆలోచనలో కాంగ్రెసు ఉంది. వైయస్ మరణించిన సమయంలో వైయస్ జగన్‌కు మద్దతుగా చేసిన నినాదాలను కూడా ప్రస్తావించాలని వ్యూహం పన్నింది. పావురాలగుట్టలో వైయస్ జగన్ నిర్వహించిన సంతాపసభలో జైజై నినాదాలేమిటని కాంగ్రెసు నాయకులు తప్పు పట్టేందుకు సిద్ధపడ్డారు. ఏమైనా, వైయస్ అనుచరులతోనే వైయస్ జగన్‌ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం వ్యూహరచన చేసింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి