తమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై నందమూరి హరికృష్ణ పోరాటం ఖాయమైనట్లే కనిపిస్తోంది. హరికృష్ణ పార్టీని చీలుస్తారా, పార్టీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా దేవినేని ఉమా మహేశ్వర రావును కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించడం, దాని పర్యవసానంగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. గుడివాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఒక పథకం ప్రకారమే కృష్ణా జిల్లా సంక్షోభం చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా మహేశ్వర రావుపై తిరుగుబాటు ప్రకటించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ హరికృష్ణ కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులు. వారు హరికృష్ణకు మద్దతు ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న డ్రామాలో తాము పాత్రధారులం కాదని వంశీ చెబుతున్నా హరికృష్ణ ఆదేశాల మేరకే ఆయన నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయడానికి ముందు తాను హరికృష్ణతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దీన్నిబట్టి హరికృష్ణకు తెలిసి, ఆయన నడుపుతున్న వ్యవహారాల మేరకే వంశీ రాజీనామా చేశారని చెప్పవచ్చు. నందమూరి హరికృష్ణ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన వెంట నడుస్తామని, తానూ కొడాలి నాని కలిసే ముందుకు సాగుతామని వంశీ చెప్పారు. దీన్ని బట్టి హరికృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ కార్యక్రమం తీసుకోవడం ఖాయమని కూడా అనుకోవచ్చు.
మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి పాత్ర కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలతో తనకు ఏ సంబంధం లేదని అంటున్నప్పటికీ పురంధేశ్వరి రచించిన పథకం ప్రకారమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని తమ చేతుల్లోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే పురంధేశ్వరి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో హరికృష్ణను ఎదుర్కోవడానికే చంద్రబాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఉమా మహేశ్వర రావు రాజీనామాను తిరస్కరించడం అందుకు ఒక సూచన అయితే, పురంధేశ్వరి మీద పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తడం మరో సూచన. చంద్రబాబు అనుమతి లేకుండా దగ్గుబాటి పురంధేశ్వరిపై విమర్శలు చేసే సాహసానికి పార్టీలో ఏ నాయకుడు కూడా ముందుకు రాడనేది అందరికీ తెలిసిందే. పురంధేశ్వరిపై విమర్శలు చేయడం ద్వారా హరికృష్ణను రెచ్చగొట్టాలనేది కూడా చంద్రబాబు వ్యూహం కావచ్చు. పురంధేశ్వరిపై ఈగ వాలినా హరికృష్ణ సహించరు. దాన్ని ఆసరాగా తీసుకుని హరికృష్ణను సాధ్యమైనంత త్వరగా బయటకు లాగాలనేది కూడా చంద్రబాబు వ్యూహం కావచ్చు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి