అన్నిటికన్నా పెద్ద అవినీతి ప్రజల దగ్గరే ఉన్నది అదేమిటి అంటే ఓటు వెయ్యకపోవటం. ఒకవేళ వేసినా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన , అంతకంటే ఘోరం డబ్బులు తీసుకునో ఓటు వెయ్యటం. ఈ అవినీతి నుండి ప్రజలు బయటపడనంత వరకూ ఏ లోక్ పాల్ బిల్లూ మనను రక్షించలేదు.
సరే సవ్యంగా ఓటు వెయ్యటం అనేది పెద్ద విషయం. అతి చిన్న విషయం ఎక్కడన్నానలుగురికి ఒకే చోట పని ఉంటే, ఎవరూ చెప్పకుండా లైన్లో నుంచుని పని చేసుకోవటం మనకు తెలుసా!! కనీసం గొర్రెలు ఒకదాని తరువాత ఒకటి సోలుపుగా వెళ్తాయి. కాని మనం, పెద్ద పెద్ద ఇనప కచ్చడాలు పెట్టి, ఇరుకు సొరంగాలు కడితే కాని వరుసలో నుంచోము. అక్కడకూడ ఔత్సాహికులైన, దృఢకాయులు, కొండకోచో సామాన్యంగా కనపడేవారు కూడా మన భుజాల మీదగా, నెత్తి మీదుగా నడిచి వెళ్లి వరుసలో ముందుకు వెళ్ళిపోవటం కద్దు.
బస్సు కాని రైలు కాని రావటం ఆలస్యం, ఎగబడి ఒకరికొకరు అడ్డం వస్తూ, తోసుకుంటూ ఎక్కకపోతే తృప్తి లేదు. హాయిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కటం అనే క్రమశిక్షణ ఎప్పటికి నేర్చుకుంటాం. ఈ తోసుకు ఎక్కే వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువ తిన్న వాళ్ళు అలా ఆ పక్కకివెళ్లి, చేతిలో పత్రికో, జేబు గుడ్డో, నెత్తిన ఉన్న కాపో లేదా గొడుగో, చేతిలో బాగ్గో, కిటికీలోంచి ఆ సీట్లోపడేసి, అందరూ భుజబలం చూపి లోపలి తోసుకు వెళ్ళినాక "ఆ చోటు నాదండీ" అంటూఅమాయకంగా వస్తారు.
ఒకవేళ కొండవీటి చాంతాడు అంత వరుస ఉంటే, ఆ మొదట్లో కిటికీ దగ్గర తచ్చాట్లాడి మెల్లిగా దూరటం లేకపోతె ఆ ముందుగా ఉన్నవాణ్ణి తన టిక్కెట్టు కూడ తీసుకోమని దేబిరించటం గొప్ప ప్రావీణ్యంగా చలామణీ అవుతున్నది. ఈ మొత్తాన్ని ఏమనాలి, ఏ బిల్లు తెచ్చి ఈ చండాలపు పని ఆపాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది.
ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసు లేకుంటే ఎంతమంది ఆగుతారు! ఆగుతున్నారు? పోలీసు చుట్టుపక్కల లేకపోతె ఒక్క ఆటో వాళ్ళే కాదు, ఏ సి కారు వాళ్ళు కూడ లైటు పట్టనట్టు వెళ్ళిపోతారు. ప్రతి ట్రాఫిక్ లైటు దగ్గరా పోలీసును పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సి వస్తున్నది . దానివల్ల పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం ఈ పనికే సరిపోయే. వాళ్ళు ఇక దొంగల్ని పట్టుకునేది ఎప్పుడు, నేరనిరోధం ఎలాగూ చెయ్యలేకున్నారు, నేర పరిశోధన ఎప్పుడు చేసేట్టు. అందరి దగ్గరా క్రమశిక్షణ ఉండి , కనీసం ట్రాఫిక్ నియమాలు సవ్యంగా, పోలీసు లేకపోయినా పాటించ గలిగితే ఎంతమంది పోలీసులు నేర నియంత్రణ చెయ్యటానికి మిగులుతారు. ఆలోచించాలి, తప్పదు. ఈ విషయంలో అన్నా హజారే గారు ఏమీ చెయ్యలేరు. మనమే, మనం అందరం పూనుకోవాలి.
నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి అన్న నీతి మనలో ఉండాలి. ఆ ఆఫీసులో తెలిసినవాడు ఎవడు? మనకు అర్హత లేకపోయినా మనకు పని ఎలా అవుతుంది, ఎవడిని పట్టుకుంటే పని సులువుగా చేయించుకోవచ్చు. ఎవడికి ఇంత పెడితే ఈ పని చులాగ్గా ఇవ్వాళే చేయించుకోగలం , ఇదే ఆలోచన.
సవ్యంగా ఉన్న నియమాల ప్రకారం ప్రజలందరూ పని చేసుకు పోతుంటే, అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. మనకు అర్హత లేనిదికావాలి, ఉన్న నియమాలు పాటించ కుండా పనులు అయిపోవాలి, అవినీతి ఉండకూడదు. ఎలా? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలే!
నియమాలు పాటించని ప్రజలు ఎక్కువగాఉన్న సమాజంలో అవినీతి ఎప్పటికీ పోదు. కలకాలం నిలిచే ఉంటుంది.
అవినీతి పోగొట్టాలంటే కొంత పని ఆలస్యం అవ్వటానికి, కొన్ని పనులు కాకపోవటానికి, ఆవిధంగా జరిగే నష్టాన్ని భారిమ్చాతానికి సిద్దపడి ఉండాలి. ఇవేమీ లేకుండా, టి వి కెమెరాల ముందు ఆవేశపడితే అవినీతి పోదు, మరింత పెరుగుతుంది. కారణం శిక్షలు ఎక్కువ అవ్వటం వల్ల తీసుకునే వాడు మరింత ఎక్కువ తీసుకుంటాడు. వాడికి రిస్కు ఎక్కువ అయ్యింది కదా మరి.
బంధువుల్లో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులని ఎవరన్నా బహిష్కరించి వాళ్ళఇళ్ళకు వెళ్ళకుండా ఉంటున్నారా. అలాంటి వాళ్ళ పిల్లలను సంబంధాలు చేసుకోకుండా ఉంటున్నారా? "అబ్బ మావాడా, భలే తెలివిగల వాడండీ, రెండుచేతులా సంపాదన" అనిచెప్పుకునే వాళ్ళను ఏమనాలి.
ఈ ఆలోచనా రీతి ఏ చట్టం మార్చగలదు. ఇది చట్టం చెయ్యలేనిపని. ఎవరికి వారు ఆలోచించుకుని చెయ్యాలి.
ఒక సామాన్యమైన కుటుంబంలో పెళ్ళికి ఎదిగిన కూతురు, రెండు సంబంధాలు వచ్చాయి, ఒకటి కుర్రాడు పి జి చేసి జనాభా లెక్కల కార్యాలయంలో పని చేస్తున్నాడు, మరొకడు పట్టభద్రుడు, చెక్ పోస్టులో పని. ఎవరైనా ఏది మంచి సంబంధం అని చేప్పు కుంటారు. ఆ రెండోదే కదా. అక్కడే ఉన్నది అవినీతికి మూలం.
ఎక్కడన్నా ఎర్ర లైటు దాటో, వన్-వేలో ఎదురు వెళ్ళో పోలీసు పట్టుకుంటే, సరే నాది తప్పు, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను రశీదు ఇవ్వండి అనే నీతి ఎంతమందిలో ఉన్నది. తృణమో ప్రణమో ఆ పోలీసుకు ఇచ్చేసి బయటపడదామనే తాపత్రయమే ఎక్కువ.
ఇక మన కళ్ళ ముందు జరిగే అవినీతి, మనం పనిచేసే చోట జరిగే అవినీతి "విజిల్ బ్లోయర్" చేసి అన్నా ఆపగలిగే ధైర్యం ఎంత మందిలో ఉన్నది. గుంపులో గోవిందగా ఎవరికో జైకొట్టుకుంటూ తిరిగేయ్యగలం, కాని మన ఒక్కళ్ళమే కనీసం అజ్ఞాతంగానన్నా జరిగే అవినీతిబయట పెట్టటంలో మనవంతు కృషి చెయ్యగలమా! ఆలోచించుకోవాలి.
ఆఫీసుల్లో పని చెయ్యకుండా బాతాఖానీతో కాలం గడపటం . ఉద్యోగం వచ్చేవరకూ ఒక గోల. ఉద్యోగం వచ్చిన తరువాత ప్రమోషన్ రాలేదని. పనిచేసేప్పుడు మనసు పెట్టి ఇచ్చిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఎంతమంది? ఉద్యోగంలో "కరీర్ ఓరియంటేషన్" పేరుతొ సకల గడ్డీ కరవటం, చెయ్యకూడని పనులు చెయ్యటం అవినీతి కాదూ. వీటితో వచ్చే ఒత్తిడికి బి పిలు షుగర్లు తెచ్చుకోవటం. ఇదేనా మనకు మన పూర్వీకులు నేర్పినది!
చేసే వ్యాపారాల్లో కల్తీ, నాణ్యం లేని వస్తువులను అంటగట్టటం ఎటువంటి నీతి? ప్రతి వాడి దగ్గరకూ వెళ్లి తనిఖీ చేసి ఎవరు ఆపగలరు. ఆ వచ్చినవాడికి "ఆమ్యామ్యా" ఇచ్చేసి పంపటం, వాడు తీసుకోకుండా కేసు వ్రాస్తే, వాడి పైవాడి మరికొంత ఎక్కువ పారేసి కేసు మాఫీ చేయించుకోవటం, ఇదంతా నీతేనా. కాదు నాణానికి మరో పక్కన ఉన్న దృశ్యం. అది కూడ చూడాలి, తప్పదు.
నిజాయితీ లేని వ్యాపార ప్రకటనలు గుప్పించి ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేయ్యటం, వాళ్ళను తోచుకో నివ్వకుండా, తమ వస్తువే కోనేట్టుగా చేసే వ్యాపార ప్రకటనలూ ఈ అవినీతిలో భాగమే.
ఇక ఇంకా అనేకం:- మన దొడ్లో చెత్త వేరే వాళ్ళ వాకిట్లోకి తోయ్యటం, నో పార్కింగ్ అన్న చోట నిర్భీతిగా వాహనాన్ని సైడు స్టాండు వేసి మరీ పార్కింగ్ చేసేయ్యటం, ఏమిరా అంటే అడ్డంగా వాదించటం, ఎట్టాపడితే అలా వాహన చోదకం, సమయ పాలన చెయ్యకపోవటం, వద్దన్న పనులే చెయ్యటం (బాహాటంగా పొగ తాగటం, మద్యం సేవించటం, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం), ఎవరన్న గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించటం, నలుగురిలో లేకితనపు మాటలు మాట్లాడటం ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష.
లంచం ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. పది రూపాయలు ఒకడు లంచం ఇచ్చాడు అంటే, వాడికి ఆ పదిరూపాయల కంటే వెయ్యి రెట్లు లాభం లేకుండా ఇవ్వడు. ఆ లాభం పాటించవలసిన నియమాలు పాటిస్తే రాదు. అందుకని లంచంతో ఆ నియమాలను పాటించకుండా అధిగమించటం. ఇది తగ్గాలి ముందు. అవినీతి నిరోధక శాఖ వారు లంచాలు ఇవ్వచూపే ప్రభుద్దుల్ని కూడ వల పన్ని పట్టుకుని జైళ్ళల్లో పారెయ్యటం మొదలు పెట్టాలి.
మొత్తం మొత్తం మీద, మనిషిలో దురాశే అవినీతికి మూలం. మనకు అర్హత లేనివి సంపాయించాలన్న తపన, అవినీతికి పునాది. ఈ పునాదులను పగలగొట్టాలి. ప్రజలందరిలోనూమార్పు రావాలి. అది చట్టాలతోనూ, బిల్లులతోనూ రాదనీ నా అభిప్రాయం.
అన్నా హజారే ఆ వయస్సులో ఇచ్చిన స్పూర్తితో మన ఆలోచనా విధానం లో మార్పు రావాలి. ఊరికే ఇంకెవరో అవినీతిపరులన్నట్టుగా ఆవేశపడటం తగ్గించి మనలోనే పొంచి ఉన్న అవినీతిని గుర్తించి (ముందు గుర్తించటం ఎంతో ముఖ్యం, అది లేనట్టుగా ఉండటం కల్తీ లేని నటన) అటువంటిఆలోచనలు పోగొట్టుకోవటానికి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అన్నా హజారేకి జై కొట్టటానికి అర్హులం. అటువంటి ఇంగితం లేనప్పుడు ఇప్పుడు టివిల ముందు జరిగేదంతా ఇచ్చకాలే తప్ప మరేమీ కాదు.
అవినీతి నిర్మూలించాలంటే వేలు మరోకరివంక చూపిస్తూ ఆవేశపడినంత మాత్రాన అది పోదు. ప్రజలందరం ఆత్మ విమర్శ నిజాయితీగా చేసుకోవాలి. ప్రతిరోజూ అవినీతి ఆలోచన కూడ దరి చేరనివ్వకుండా జీవించగలగాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
i totally agree with ur post.
maa friend okadiki police avvdam ante istam annadu.
Entha manchi vado kada ,anyam ni ediristademo anukonna.
Anduku kadu,lancham ichi SI post konukontandata,tarvatha baga sampadana vastundi kada annadu.
Naku ayte cheppu teesukoni kottalanipinchindi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి