25, మే 2011, బుధవారం

కాంగ్రెసులో రెడ్డి వర్సెస్ కాపు

ఇన్నాళ్లూ రెడ్డి ఆధిపత్యం ఉన్న కాంగ్రెసు పార్టీ క్రమంగా తన దిశ మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాం నుండి నిన్నటి వైయస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు రాష్ట్ర కాంగ్రెసులో రెడ్డిలకే ప్రాధాన్యం ఉండేది. కాంగ్రెసులో రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ వైయస్ హయాంలో రెడ్ల ప్రాధాన్యత మరింత పెరిగిందనే వారూ ఉన్నారు. అయితే వైయస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడిచి కొత్త పార్టీ పెట్టడం, ఆయన వైపు పలువురు నేతలు చూస్తుండటంతో కాంగ్రెసు ఇప్పుడు రెడ్డిని కాదని కాపుల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెసుకు అండగా ఉన్న రెడ్లు జగన్ పార్టీ పెట్టడం కారణంగా వారు ఆయన వైపు చూస్తుండటంతో తమకంటూ ఓ సామాజికవర్గం ఓట్లు ఉండాలనే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంలో ఒకటి అయిన కాపులను దరి చేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహంతోనే ప్రజారాజ్యం పార్టీని పార్టీలో విలీనం చేసే దిశలో చిరంజీవిని ఒప్పించి సఫలం చెందిందని తెలుస్తోంది.

కాంగ్రెసు కార్యకర్తల్లో ఎక్కువ కాపులే ఉన్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం రెడ్డిలకే ఇప్పటి వరకు ఉంది. రెడ్లంతా ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న నేపథ్యంలో కాపులకు పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని మరింత దరి చేర్చుకునే వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. రెడ్లు దూరం కావడం ద్వారా 2014లో ఏర్పడే లోటును కాపుల ద్వారా పూడ్చుకునే ఉద్దేశ్యంతోనే చిరును దరి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. చిరును తమ వైపు తిప్పుకోవడం ద్వారా చిరు అభిమానులతో పాటు, కాపు వర్గాన్ని దమ వైపు తిప్పుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా రెడ్డిలదే ముందంజ. కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెడ్ల ప్రాధాన్యం తగ్గించి లాభం పొందాలను అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెడ్లకే ప్రాధాన్యత ఉంది. కిరణ్ కేబినట్లో 15 శాఖలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. అయితే కిరణ్ పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. కాబట్టి క్రమంగా రెడ్లకు ప్రాధాన్యత తగ్గించి కాపులను అందలం ఎక్కించాలనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు చిరంజీవికి సిడబ్ల్యుసిలో స్థానం కేటాయించడం ద్వారా పార్టీ రెడ్లతో పాటు కాపులకు మంచి ప్రాధాన్యం ఇస్తుందనే ధోరణి కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంత్రి బొత్స సత్యనారాయణకు పిసిసి పదవిని కట్టబెడతారని, వట్టి వసంతకుమార్, కన్న లక్ష్మీనారాయణలకు కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఇస్తారనే వార్తల వెనుక కూడా కాపులను మరింత దగ్గరకు చేర్చుకోవాలనే ఉద్దేశ్యమే అని తెలుస్తోంది. టిడిపికి బిసి, కమ్మ, జగన్‌కు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్లు ఇక ముందు ముందు కాంగ్రెసుకు కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.