12, అక్టోబర్ 2009, సోమవారం

ఇట్లు

నేను తలెత్తుకు నడిచి వస్తుంటే
ముందు తలుపులు కిటికీలు
కళ్లు దఢేలును మూసుకుంటాయి

నేను తడుముకుంటూ అడుగులు వేస్తుంటే
వెనుక తలుపులు గవాక్షాలు
లోగిళ్లు ఇదమిద్ధంగా తెరుచుకుంటాయి

శరీరాలకు మట్టి అంటకూడదని
కప్పుకు గోడలకు వాకిలికి
సాక్ష్యాధారాలు లేకుండా సిమెంటు చేయించాను
విలోమం మనసు మాత్రం
అలికిన గద్దెల మీది రుచికరమైన
ఎర్రమన్ను కోసం ఉవ్విళ్లూరుతుంది

క్లిటోరియన్ దరిదాపుల్లో
దిగబడీ దిగబడీ వాడిపోయాక
గుండెల్లో అర్థనిమీలిత టూ యం.జి. కాంపోజ్ ని

దరిమిలా
ఒలక పోస్తుంటాను కానీ
పాదాలకంటిన
మా ఊరి పంట కాలువ నీళ్ల తడి ఆరనే లేదు

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ
అవిధేయ అవిశ్వాస కౌశలంతో
కౌటుంబిక పరిసరాల్లో
పెదవుల్ని బొట్టుబొట్టుగా నాలుకతో తడుపుకుంటున్న ఎన్.ఆర్.ఐ.నే

గాయపడ్డ హృదయం

క్షణాలు యుగాల్లా
గడుస్తున్నాయి
రాత్రి ఒక నరకయాతన...!

హృదయాన్ని కోస్తున్న శబ్దం
చిత్రం! ఏమాత్రం
నొప్పి కలగడం లేదు
హాయిగా ఉంది!

ఆలోచనలు
మెదడులో గడ్డకట్టి
భావాలు హృదయంలో
ముప్పిరిగొని
అక్షరాలు శరపరంపరగా
దూసుకొస్తున్నాయి!

ఇపుడు కొత్తగా
రాయడానికి ఏమిలేదు
అందరు చీకి పారేసిన
భావాలు తప్ప!

ప్రేమ ఇంత కొత్తగా
ఉంటుందని ఈరోజే
తెలిసింది
నా పాత జీవితం లోని
క్రొంగొత్త మనసులా!

స్వప్నం నిషిద్దం
నిజం బహిరంగ స్వప్నసుందరి
ఒక చెలి బట్టలిప్పి
నగ్నత్వాన్ని చూస్తానంటుంది!

గాయపడ్డ హృదయంలో
ఎన్ని గాడాంధకారాలు ఉన్నయో
ఏ గాయకుడు గానం చేయగలడు

మిత్రుడు లేని ఊరు

చాలా కాలానికి వెళ్లాను ఊరికి
ఊరు మొదట్లోనే కాళ్లు కడిగే చెరువులా.....
ప్రేమగా పలకరించే పైరు గాలిలా
ఆత్మీయ రాగమై రావాల్సిన మిత్రుడు రాలేదు
అందరూ రంగుల గాలిపటాలై ఎగురుతున్నారు
ఆకులు రాల్చుకున్న చెట్లు
మొండితలలతో ఆకాశం తట్టు దీనంగా చూస్తున్నాయి
కళ్లనిండా కాంతులతో పాదాలకు రాసుకున్న బాల్యలేపనంతో
చాలా కాలానికి వెళ్లాను ఊరికి
ఊరంటే తల్లివేరుకదా
ఊరంటే అమ్మ పాడే కమ్మని జొలపాటల ఒడికదా
ఊరంటే తెలిసీ తెలియని వయసులో రాసుకున్న
ప్రేమలేఖల పొదరిల్లు కదా
ఊరంటే ఉద్వేగంతో హృదయాన్ని ఊపేసే
బాల్యస్నేహితానుభవాల తడిచిత్రంకదా
చాలాకాలానికి వెళ్లాను ఊరికి
రాగి చెట్టుకింద కరిగిపోయిన బాల్యాన్ని
అప్పుడప్పుడూ వాడు దోసిళ్లతో తాపించేవాడు
యాంత్రికంగా మారిపోయిన నా జీవనవాహికలోకి
ఏ రాత్రో చడీచప్పుడు చేయకుండా దూరి
ఉదయం వరకూ వెచ్చని కలగా
పచ్చని పల్లెగా నన్ను మార్చి
మళ్లీ నన్ను తడి క్షణాలపై నడిపించేవాడు
ఇప్పుడు ఊరికి పోయినా ఎందుకనో వాడు కనిపించలేదు
వెతుక్కుంటున్నాను....
కనిపించిన ఈతలబావుల దరులపై నిలబడి
కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాను
ఎండిపోయిన చెరువు గుండెపై నిలుచుని
గుండెలు పగిలేలా రోధిస్తున్నాను
నేను పారేసుకున్న నా బాల్యపుటుంగరాన్ని
దొంగిలించిందెవరని నాలో నేనే మథన పడుతున్నాను
కనిపించని మితృడికోసం....కరిగిపోయిన కల కోసం ఎక్కడవెతుక్కోను
ఊరు విడిచే ప్రతిసారీ కన్నీటి వీడ్కోలయ్యే
నా ఆత్మీయ స్నేహంకోసం ఏ బాల్యపు దారుల్లో అన్వేషించను
ఇప్పుడు నా మితృడులేడు
ఊరికి దూరంగా ఉన్న స్మశానంలో ప్రశాంతంగా నిదురించే స్నేహం
ఇక నేనెప్పుడూరికి వెళ్లినా చిక్కని చీకటిరాత్రిలా
రహస్యంగా నాతో సంభాషిస్తూనే ఉంటాడు
ఇప్పుడు ఏ సమాధిపై మొలిచిన మొక్కని తాకినా
నా మితృడి హృదయస్పర్శలా అనిపిస్తుంది

11, అక్టోబర్ 2009, ఆదివారం

సమాంతర రేఖలు

గ్లిజరిన్ కన్నీళ్లు
ఆర్టిఫిషియల్ ఆకలి
పట్టు చీరల్లో ప్రదర్శించే
పుట్టెడు దుఖ్కం..
లంకంత కొంపలో
హై క్లాసు దరిద్రం..
నటించే జీవితాలకు
అవార్డులు... రివార్డులు...
కాలుతున్న హృదయాలు
నేల రాలుతున్న బతుకులు
అచ్చమైన జీవన సమరంలో
విచ్ఛిన్నమయ్యే గుండెలు..
ముడిపడ్డ పేగుల్తో..
పిడికిళ్లు బిగుసుకుంటే...
లాఠీలు... తూటాలు...
నా దేశంలో సమానత్వం...
అద్దంలో చందమామ తత్వం

నరకప్రాయం నగరం

ఎంత స్వేచ్ఛగా తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించుకునే వాళ్లం
అపార్ట్ మెంట్ల కాంక్రీట్ మనుషుల మధ్య మూసి వున్న గుమ్మం
వెక్కిరిస్తూ వుంటుంది
కట్టలు తెగే కన్నీళ్ల స్రవంతి...
... బాధలు సరే, విజయాల్ని చెప్పుకునేందుకు
మనిషి కానరాడే
నగరం .... హడావుడి జీవన స్రవంతిలో
సేద తీర్చే ఆలంబన కరువు
మోసం గాలి వీచినంత సులువైనప్పుడు
మానవత్వం బిక్కుబిక్కుమని ఈసుమంటుంది
లెక్కలే నిత్యం లెక్కకు మించి వున్నప్పుడు
మనమూ అలానే మెదిలే జీవనం మరింత నరకప్రాయం
బతకనేర్వడమే అస్తిత్వానికి ఆధారమవుతున్నప్పుడు
గుండె గాయమవుతుంది
ఎరుక ఉంటే చాలు... ఐనా ఆవేదన నిత్యకృత్యమవుతుంది
ఆకాశాన్ని చూడక ఎన్నేళ్లయిందో...
పిచ్చుకల్ని చూడక సంవత్సరమవుతుంది..
ప్రకృతీ ... మానవ ప్రకృతి మృగ్యం, నరకప్రాయం నగరం

కోయిల ప్రాణం దాని పాటలో వుంది

కోయిల దేవదూత
వసంతమొక తోజోవలయం
గాలిలో గాంధర్వం పరిమళాలు పూసే వేళ
యుగాల కిందటి ప్రేమ గీతాలు
శ్రుతులై గతులై కొత్త చైతన్యాలై ప్రకృతిలోవికసిస్తాయి
తీరాలు దాటి దూరాలు దాటి
అనంత సౌందర్యాన్ని రచించుకుంటాయి
చంద్రుడు వెన్నెలై మోడు వేణువై
సరస్సు జలజమై పర్వతం జలపాతమై
కోయిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాయి
యంత్రభూతాలకు బానిసై
కుహూరుతాలకు దూరమైన మానవ అహంకారం
పాతరాతి గుహల ప్రతిస్పందన కూడా కోల్పోతుంది
చుట్టూ కలల ప్రపంచాన్ని సృష్టించిన దేవదూత
రోబోట్ సంస్కృతికి అలిగి
తన పాటలో వెళ్లిపోతుంది
కోయిల ప్రాణం దాని పాటలో వుంది

ఒక ద్రోహపు గాయం

వంచన రగిల్చిన కుంపటి సెగల్లో
హృదయాన్ని వేపుకున్నాక
గాయాల బాధదేముంది చెప్పు -

దేహంలో ప్రవహిస్తున్న
మరణం కరాళ నృత్యాన్ని కళ్లారా చూసాక
కొత్తగా భయాల బాధేముంది చెప్పు -

మనసులు ద్వేషాల పరికి కంపలో చిక్కుకుని
చీము రక్తాలు నిండిన పుండైనాక
అవమానాల బాధేముంది చెప్పు-

మానవీయ బంధాల పూదోటల్ని
అంటువెట్టి బూడిద కుప్ప చేసాక
ఒంటరితనపు గాయాలదేముంది చెప్పు -

నా నీడే నన్ను తాకరాదని
కోర్కెల చిత్రహింసల కొలిమికి బలి చేశాక
కొత్తగా నిర్బంధాల బాధేముంది చెప్పు -

విశ్వాసపు రెక్కలు విరిగి
ద్రోహాల అగాధాల్లో అల్లాడుతున్నప్పుడు
షిజోఫ్రీనిక్ ముద్రలదేముంది చెప్పు -

బతుకు మీద
ఎన్నెన్ని ద్రోహపు గాయాలు
ఎన్నెన్ని అవహేళనపు మాటలు

చెరిపేసుకుందామని చేయి చాస్తానా
మరో పెద్ద గాయం
మరో పెద్ద మచ్చ-

మోయలేనన్ని బాధల బరువులు
చెరిపేసుకోలేనన్ని గాయాల మచ్చలు
ఏ బాధను చల్లార్చుకోవడానికి ఒలుకుతున్నామో
తెలియని కన్నీటి బిందువులు -
ఏ మలుపునిస్తుందో తెలియని
అలుముకుంటున్న ఒంటరి చీకటి రాత్రి.

విత్తనం తండ్లాట...

లు కన్నీళ్లుగా మారిన చోట
ప్రతి ఉలికిపాటు ఒక ఉద్యమం
త్యాగాల నెత్తురులో తడిసిన మట్టి
పోరాట విత్తనం కోసం
కండ్లను భూమిలో పాతుతుంది

భూమిని చీల్చుకుని
ఉద్యమాలు మొలకెత్తడం
ఇక్కడ అనివార్య రసాయనిక చర్య

గడీల మీద వాలిన గబ్బిలం
గతాన్నెందుకో నెమరేస్తున్నది
రాత్రి చలి మంట కాడ కలిసిన సేతులు
బతుకు కొలిమి మంటను యాది చేసుకుంటున్నయ్
అయ్ గుండెల పుట్టిన మాటైన
అవ్వ గొంతుల పురుడు పోసుకున్న పాటైన
బతుకమ్మైన, బోనాల డప్పుల సప్పుడైనా...
ప్రతి కదలికా ఇక్కడ కవిత్వమే

ఊళ్లు కొడవండ్లవడం
మాటలు పాటలుగా మారడం
ఇక్కడ రెండూ ఒక్కటే
జాగ్రత్తగా వింటే....
వినగలిగితే
ఇక్కడి కీచురాళ్లు కూడా
ఏండ్ల నాటి గుండెకోతనంత
పాటలల్లి పాడడం వినిపిస్తుంది
ఊళ్లల్ల గుడిసెల మీది మొలిసిన జెండాలు
మోసపోయినతనానికి ఆనవాళ్లుగా మిగిలిపోతాయి.
తనువంతా పుండ్లైన సెరువు
చేతిని నొసిటికి అతికించుకొని
పొలిమేర దిక్కు పుట్టెడాశతో చూస్తుంటది

ఒక పిడికెడ మట్టిని
కండ్లకద్దుకుంటే చాలు
ఇక్కడి బతుకు బతుకంతా
వీరుల కథలై పెయ్ రోమాలు కత్తులవుతాయి

బక్క రైతు దున్నిన దుక్కినిండా
కొత్తరకం విత్తనాలు
మొలకెత్తడానికి సిద్ధమవుతున్నయ్
ఇగ ఏలెటోళ్లకు అన్నీా నిద్ర లేని రాత్రులే
దోచుక తిన్నోళ్లకు గుండెల నిండా గుబులే

ఊరు బడి

ఊరు బడి
పొద్దున్నే ఒళ్లు విరుచుకుంది
లేత కిరణం వెచ్చదనంతో
పులకరించింది
వెయ్యి రెక్కలను చాచి బాల్యాన్ని
అక్కున చేర్చుకుంది
స్మృతుల్ని ఏరుకుందామని వెళ్లితే
పలకరిస్తుంది అమ్మలా
గుర్తు చేస్తుంది కురిపించిన
ప్రశ్నల జల్లులను
ఒక తరానికి జీవం పోసి
కొండలా నిలిచింది
నిలబడటం గూర్చి నూరిపోసి
విశ్వానికి నమూనాగా నిలిచింది
నిజంగా ఊరుబడి ఇప్పటికీ
ఊరట కలిగిస్తుంది
అందుకే
మా కుర్రాణ్ని అప్పజెప్పి వచ్చాను.

జ్ఞాపకాల గాలివాన

నువ్వూ నేనూ గాలీ వానా కలిసే ఉన్నా గాలి గాలే వాన వానే తడిపో తెరిపో గాలో వానో ఉన్నా లేకున్నా నాకు నువ్వు నీకు నేను జ్ఞాపకాలే

విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...

అవును మేము రిజర్వేషన్ గాళ్ళమే!
మా ప్రతిభను కొలవడానికి
మీరు పారేసే భిక్షపు
మార్కులు మా కక్కరలేదు
చిలుక పలుకులు,బట్టీలు పట్టడం
మాకు చాతకాదు!
సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది
నా తండ్రి వ్యవసాయ పనిముట్లు
తయారు చేయడంలో ఉంది.
నా తల్లి పంట నూర్పిడిలో ఉంది
మీకు చేతనైతే ఒక అక్షరాన్ని
అందంగా చెక్కండి
వ్యాక్యాన్ని నల్లని దళిత
సౌందర్యవతిలా మార్చండి !
కాలం మారిన కొద్ది
కులం రూపు మారిపోతుందనుకున్నాను
కాని...
ఉన్నత విశ్వ విద్యాలయాల్లో
కాల నాగై కాటేస్తుందనుకోలేదు!
మా ప్రతిభను కొలవడానికి
మీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు
అనంతమైన నా తెలివిని
మీ మోకాళ్ళతో కొలువలేరు!

ఇది మన సమాజం

ఎక్కడో
మూలమలపున
రెండు చేతులు
దీనంగా కిందికి పైకి
ఊగుతున్నాయి!

చింపిరి మొహం
తైల సంస్కారం లేని
జుత్తు ఒళ్ళంతా కమురు వాసన

కడుపు వెన్నుకు
ఆనుకు పొయింది
ఆ కనులు వికృత
సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి!!!