16, మార్చి 2011, బుధవారం

కాలచక్రంలో శూన్యం నేర్చిన అక్షరం నక్షత్రాల

పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి

మన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని అందరికి తెలుసు. కుంభకోణాలు, అక్రమాలు, విలువల్లేని రాజకీయాలు తప్ప ఇంకేమి లేని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ట్యునీషియాలో, ఈజిప్టులో , యెమెన్లో ప్రజలు అవినీతి ప్రభుత్వాల మీద సమరశంఖం పూరించి ప్రభుత్వాలనే కూలదోస్తున్నారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నియంతలను తమ దేశాలనుండి తరిమి తరిమి కొడుతున్నారు. కాని మనం మాత్రం మన ఇళ్లకో కార్యాలయాలకో పరిమితమై ఏమీ పట్టనట్లుగా మన మానాన మనం రోజులు వెళ్ళదీస్తున్నాం. ఎందుకీ నిర్లిప్తత? లక్షల రూపాయల అవినీతికే కేంద్ర మంత్రుల రాజీనామా చేసే పరిస్థితినుండి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నా ఏమీ పట్టని స్థితికి చేరుకున్నాం. ఎక్కడ చూసినా నల్ల డబ్బు గురించే చర్చ.. కాని ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తాం? మన నోళ్ళు విప్పనంతకాలం , కాళ్ళు కదపనంతకాలం ఈ కుళ్ళు రాజకీయం, ఈ అవినీతి సాగుతూనే ఉంటుంది. దేశం కోసం వీధుల్లోకి వచ్చి సత్యాగ్రహం చేసిన ప్రజలు, దేశం కోసం ఆయుధం పట్టి ఉరికంబానికేక్కిన ప్రజలు ఇప్పుడు ఇళ్ళలో టీవీలలో నేరాలు ఘోరాలు చూస్తూ కాలం వెల్లబోస్తున్నారు. ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాలకే స్ఫూర్తినిచ్చే ఉద్యమాన్ని నిర్మించిన మనం, ప్రపంచ దేశాలలో సాగుతున్న ఉద్యమాలను చూసి కొంచెమైన చలించట్లేదు. ఎవరు ఏమైపోయినా అక్కర్లేదు, ఎక్కడ ఎం జరిగిన మనకి అవసరం లేదు.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక ఉల్లి ధరలు మండినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? ఛీ.. ఇదీ ఒక బ్రతుకేనా!

రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?

ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.

జై హింద్.

చాలించడి మీ దొంగనాటకాలు?

సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు.అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

* పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
* ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
* సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
* వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ
సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం
కాదా ?
* సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
* సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
* సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?


సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?