13, జూన్ 2011, సోమవారం

ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు.

సహజ కవి, నిర్మాత మల్లెమాల అలియాస్ ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులపై తన వ్యాఖ్యలతో దుమ్మురేపాడు. ఇదీ నా కథ పేర ఆయన తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో సినీ ప్రముఖలతో తన అనుభవాలను రాశారు. జూనియర్ ఎన్టీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరామాయణం సినిమాలో దర్శకుడు గుణశేఖర్ వద్దంటున్నా జూనియర్ ఎన్టీఆర్‌కు రాముడి పాత్ర ఇచ్చానని, తాను ఓసారి వెళ్తే తనను బయట నిలబెట్టారని, దాంతో తాను వెనక్కి తిరిగి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. గుణశేఖర్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో తాను రాసిన పాటను తీసేసి, తల పొగురు సమాధానం ఇచ్చారని, బడ్జెట్ పెంచేసి తనను కష్టాల పాలు చేశారని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ విజయం సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు తాను వేసిన కృష్ణుడి వేషంలో పౌండ్రక వాసుదేవుడిగా నాగభూషణం గెటప్ చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ పాత్ర అలాగే ఉంటుందని - సినిమాలో నటిస్తే నటించండి, లేకుంటే మానుకోండి అని చెప్పానని, దాంతో ఆయన మారు మాట్లాడకుండా నటించారని ఆయన చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడితో తన కూతురు భువనేశ్వరి పెళ్లి సందర్భంలో తనను గదులు బుక్ చేయాలని ఎన్టీఆర్ అడిగారని, వాటిని బుక్ చేసి బిల్లులు పంపితే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాంటిదే మరో సంఘటనను కూడా ఆయన వివరించారు. ఈ చేదు అనుభవాలతో తాను ఎన్టీ రామారావుతో సినిమాలు తీయడమే మానేశానని ఆయన చెప్పుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవిపై కూడా ఆయన తన చేదు అనుభవాన్ని రాశారు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య తన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారని ఆయన చెప్పారు. తాతయ్య ప్రేమలీలలు సినిమాతో తాను నష్టపోయానని, ఆ సమయంలో చిరంజీవితో సినిమా తీసి నష్టం పూడ్చుకోవాలని అల్లు రామలింగయ్య సూచించారని, చిరంజీవికి అల్లు రామలింగయ్య చెప్పారని, అయినా చిరంజీవి తనకు సమయం కేటాయించలేదని, ఆ విషయం అడగడానికి వెళ్తే మొహం చాటేశారని ఆయన రాసుకున్నారు. శోభన్‌బాబుకు, జమునకు తాను షాక్ ఇచ్చిన విషయాలను కూడా ఆయన రాశారు. రాజశేఖర్‌తో సినిమా తీస్తే అడుక్కు తినాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా మల్లెమాల సినీ ప్రముఖులతో తనకు సంబంధాలపై ఆ పుస్తకంలో రాశారు. జయసుధను మాత్రం ఆయన మెచ్చుకున్నారు. ఈ పుస్తకంలోని రాతలపై సినీ ప్రముఖులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కొన్ని విషయాలపై మౌనం వహించడమే మంచిదని, దానివల్ల విషయాలు మరుగున పడిపోతాయని మన పెద్దలకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు.