19, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ భగవాన్ సత్యసాయి అధ్యక్షుడిగా ఉన్న సత్యసాయి ట్రస్టు ఆస్తులు రూ.1.30 లక్షల కోట్లు అని ఆ ఆస్తుల కోసం ఆయన చుట్టూ చేరిన వారు పలువురు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడం కోసం బాబా నిర్మించిన భక్తి సామ్రాజ్యంలో దొంగలు పడి నిలువుగా దోచుకుంటునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఆదివారం ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. పుట్టపర్తి అంటే భగవాన్ సత్యసాయి బాబా, ఆయన భక్తులు మాత్రమే కాదు! ఇదో విశాల సామ్రాజ్యం! దేశ దేశాల్లో ఉన్న ట్రస్టు స్థిరాస్తులతోపాటు ప్రశాంతి నిలయంలో ఉన్న కోట్లలో నగదు, టన్నుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాల విలువ లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా! ఇది సాయిబాబాను సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా నమ్మి, నివేదించుకున్న భక్తి సంపద. ఇలా భక్తులు సమర్పించుకున్న దానిలో కొంతమాత్రమే ట్రస్టు ఖాతాలో పడుతోంది! మిగిలింది, ట్రస్టులోని కొందరు సభ్యుల సొంత ఖాతాల్లో జమ అవుతోంది. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత ఈ డబ్బును అత్యంత రహస్యంగా, పకడ్బందీ భద్రత మధ్య తరలించే కార్యక్రమం మొదలైంది.


ప్రశాంతి నిలయానికి సమీపంలో ఉండే ఐటీ కోర్ బిల్డింగ్ నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వేదికగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యంతో ఆడుకుంటూ... మరోవైపు ఐటీకోర్ బిల్డింగ్ కేంద్రంగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా హడావుడి పెరిగింది. కంప్యూటర్ల కీ బోర్డులు టకటకలాడుతున్నాయి. సుమారు 165 దేశాల్లోని పలువురు వ్యక్తుల ఖాతాల్లో ఆన్‌లైన్ మార్గంలో డబ్బులు పడిపోతున్నాయి. ఈ బిల్డింగ్ శత్రు దుర్బేధ్యం. నల్లధనమైనా, తెల్లధనమైనా, హవాలా అయినా, ఏ దేశ కరెన్సీ అయినా ఇక్కడి నుంచి క్షణాల్లో ఆన్‌లైన్‌లో సర్దుబాట్లు జరిగిపోతుంటాయి. గత నెల 28న బాబా ఆస్పత్రి పాలయ్యాక ఐటీ కోర్ బిల్డింగ్‌ను దోపిడీ సూత్రధారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నమ్మిన బంట్ల ద్వారా వాటాలు సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది, సెటిల్‌మెంట్లు జరుగుతున్నది భక్తులు కానుకగా సమర్పించుకున్న సంపదే కాదు! ఎందరో ప్రముఖులు దాచుకున్న నల్ల డబ్బు కూడా!

ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. పోలీసులు, ఆదాయపు పన్ను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులెవరూ ప్రశాంతి నిలయం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దీంతో ట్రస్టులోని కొందరు వ్యక్తులు ప్రశాంతి నిలయాన్ని ఒక హవాలా కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి. బడా బడా వ్యక్తులు, ప్రముఖులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు పుట్టపర్తిని అత్యంత సురక్షితమైన స్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల నగదు దాచుకోవడం... అవసరమైనప్పుడు తీసుకోవడం... ఇదో హవాలా బజార్! పుట్టపర్తి వ్యవహారాలను చాలా ఏళ్లపాటు దగ్గరుండి పరిశీలించిన ఒక పోలీసు అధికారి మాటల్లో చెప్పాలంటే... 'ఇది ఒక మినీ స్విస్ బ్యాంక్'. కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఇక్కడ 'ఖాతాలు' తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ 2 వేల కోట్లు దాచుకున్నట్లు సమాచారం.

బాబా అస్వస్థతకు గురి కాగానే ఆ నాయకుడు పరిగెత్తుకుంటూ పుట్టపర్తికి వచ్చారు. అలాగే... మహారాష్ట్రకే చెందిన ఓ మాజీ మంత్రి పుట్టపర్తిలో మరో వెయ్యి కోట్లు పెట్టినట్లు చెబుతున్నారు. సత్యసాయికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలు చూడాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే... ఈ 'నల్ల' కార్యక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ రహస్య లావాదేవీలన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దల్ని, కొందరు అధికారుల్ని ముందుగానే మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది... సూత్రధారుల మధ్య పంపకం!

జగన్నాయకుడు ఓ చిత్రం

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అనంతరం ఆయన పార్టీ వీడటం, ఆ తర్వాత పార్టీ పెట్టడం తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.


శ్రీరామ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మంచి అభిమాని. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మరింత ఆకర్షితుడయ్యాడంట. ఆయనను వైయస్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. అయితే వైయస్ మృతి తర్వాత జగన్‌ను ఆయన బాగా ఆరాధించాడు. అయితే అలాంటి జగన్ ఎంపీగా కాంగ్రెసు పార్టీని విభేదించి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని పెట్టాడు.

ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జగన్నాయకుడులో పొందు పర్చనున్నారని సమాచారం.

జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది. పార్టీ అభ్యర్థిగా గెలిచి జగన్ వెంట నడుస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలకు ముందే వారిపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆదివారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు బాలనాగి రెడ్డి , ప్రసన్నకుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు ప్రకటించే అవకాశం ఉంది.


అయితే తాను శాసన సభ్వత్వానికి రాజీనామా చేసినందున దాన్ని ఆమోదించాలని పోచారం పట్టుబడుతున్నారు. ముందుగానే తాము అనర్హత పిటిషన్‌ వేసినందున దాన్ని తేల్చాలని తెదేపా కోరుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోమవారం దీనికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆదివారం ఏజితో కూడా కలిసి చర్చించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం కూడా ఫిర్యాదుకు సిద్ధం కావడంతో పెండింగ్‌ పిటిషన్లపై తుది నిర్ణయానికి డిప్యూటీ స్పీకర్‌ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అనంతరం జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేసుకునే చర్యలు ప్రారంభించేందుకు ఉదయుక్తమయినట్టుగా సమాచారం.

ఇందులో భాగంగా తొలిదశలో నలుగురిపై చర్యలు తీసుకోవడానికి పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఈ మేరకు నాదెండ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖపై తొలిసారి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కడప ఉప ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌కు బహిరంగంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరితోపాటు కోస్తాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అనర్హత వేటు జాబితాలో చేరవచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి.

దివంగత వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనే ఆమె పార్టీపై, రోశయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి నేరుగా లేఖ రాసి కలకలం సృష్టించారు. వీలైనప్పుడల్లా కాంగ్రెసుపై ధ్వజమెత్తింది. అధిష్టాన్ని ప్రశ్నించింది. వీరితో పాటు జగన్‌తో వెళుతున్న మరికొందరు ఎమ్మెల్యేలపై పార్టీ నేతలంతా చాలా కాలంగా సీరియస్‌గా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు గట్టిగా పార్టీని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌కు అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యం ఉండడం కారణంగా ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో వెళ్లింది. 18 మంది ఎమ్మెల్యేలున్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు పలకడం, ఆ తరువాత కాంగ్రెస్‌లోనే విలీనమయ్యేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు వచ్చింది. కడప ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల తీరును పరిశీలించాక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అధిష్ఠానం నాలుగురోజుల కిత్రం ఢిల్లీలో ఈ విషయంపైనే కీలక చర్చలు జరిపింది. ఆ మేరకే ఇప్పుడు అనర్హత ఫిర్యాదుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిప్యూటీ స్పీకర్‌ వద్ద విచారణలో ఉన్నాయి.

ఇక కాంగ్రెసు పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అనర్హత వేటుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని భావిస్తోంది. ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కార్యకలాపాలు సాగిస్తే స్వచ్ఛందంగా తమ పదవిని వదులకున్నట్లుగా భావించవచ్చనే విధంగా చట్టంలో ఉందని పార్టీ నేతలంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికైన పార్టీని విమర్శిస్తూ, వేరే పార్టీ వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యేలను స్పీకర్లు అనర్హత వేటు వేసిన సందర్భాలను ఉదహరిస్తున్నారు

జగన్‌కు ఆ హీరో దూరమే

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి చాలా దగ్గరగా ఉన్న యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతులు వైయస్ తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి క్రమంగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా రాజశేఖర్ - జీవిత జాడే లేదు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దరి చేరి రాజశేఖర్ దంపతులు వైయస్ మృతి తర్వాత మాత్రం జగన్‌కు మద్దతుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. ప్రజల కోసం దివంగత వైయస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాను కాంగ్రెసు పార్టీలో చేరామని చెప్పిన రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత పార్టీలో ప్రముఖంగా కనిపించారు. 2007లో చిరంజీవి అభిమానులుగా పేర్కొన్న పలువురు రాజశేఖర్ కారుపై దాడి చేయడంతో వైయస్ - రాజశేఖర్ దంపతుల ఆత్మీయ బంధం మరింత ఎక్కువయింది.


వారు కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వైయస్‌ను గానీ, జగన్‌ను గానీ, కాంగ్రెసు పార్టీని కానీ ఎవరైనా విమర్శించినా తిప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వైయస్‌పై ఈగ కూడా వాలనీయలేదు. చిరంజీవిపై ఉన్న కోపంతో గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున భారీగానే ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చిరంజీవిని లక్ష్యంగా చేసుకొని చాలా ఆరోపణలు చేశారు. ఓ సమయంలో కాంగ్రెసు పార్టీలో జీవితకు ఓ ముఖ్యమైన పదవి వస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలో వైయస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతుల నుండి ఎలాంటి సందడి లేదు. వైయస్ ఉన్నన్నాళ్లూ చిరంజీవిపై విరుచుకు పడిన, వైయస్‌కు అండగా ఉన్న రాజశేఖర్ దంపతులు ఆయన మరణం తర్వాత మాత్రం జగన్‌కు అంతగా మద్దతు పలికిన దాఖలాలు లేవు.

గతంలో విజయవాడలో జగన్ చేపట్టిన జలదీక్షలో మాత్రమే రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ నాయకుడి ఇంట్లో జరిగిన విందులో కూడా తాము జగన్ వెంటే ఉంటామని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎక్కడా ఓదార్పులో పాల్గొన్న సందర్భం గానీ, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని సమర్థించినట్టుగా కానీ, కడప ఉప ఎన్నికల ప్రచారంలో కానీ కనిపించింది లేదు. జగన్‌తో ఉంటే ఫలితం లేదనే పునరాలోచనలో వారు పడినట్లుగా తెలుస్తోంది. వైయస్ ఉన్నప్పుడు వీరికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే జగన్ వద్ద తమకు అంతగా ప్రాధాన్యం ఉండదనే ఉద్దేశ్యంతోనే వారు జగన్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పార్టీలో ఇప్పటికే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ, సినీ నటి రోజా, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అలాంటి ప్రధాన నాయకురాళ్లు ఉన్నప్పుడు జగన్ వెంట వెళ్లినా లాభం లేదనే ఉద్దేశ్యంలో రాజశేఖర్ దంపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు వైయస్ బాటలో ఉంటూ కాంగ్రెసు పార్టీలో ఉండాలని ఉన్నప్పుటికి తాను ప్రధానంగా వ్యతిరేకించే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరటం వారికి మింగుడు పడని విషయం. ఇటు చిరంజీవి రాక కారణంగా ఇటు ఇన్నాళ్లు ఉన్న కాంగ్రెసు పార్టీతో ఉండలేక, అటు పలువురు ఫైర్ బ్రాండ్‌లు వైయస్ తనయుడు జగన్ చుట్టూ ఉండటంతో వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు తాము మొదట అడుగిడిగిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపికి బద్ద శత్రువు అయిన కాంగ్రెసులో చిరు ఉండటంతో ఆయనపై నిప్పులు కక్కే అవకాశం వీరికి ఉంటుంది. అంతేకాదు టిడిపిలో అంతగా పేరు బడ్డ మహిళా నేతలు లేక పోవడం కూడా జీవితకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా ?

రాష్ట్ర భద్రతా సలహాదారు పదవికి రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి సలహాదారు సిఎస్ రావు, పారిశ్రామిక సలహాదారు సిసి రెడ్డి చేసిన రాజీనామాలను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. వీరిద్దరు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

కెవిపి రామచందర్ రావు రాజీనామాతో పాటు సలహాదారుల పదవులకు పీటర్ హసన్, సోమయాజులు చేసిన రాజీనామాలు కూడా పెండింగులో ఉన్నాయి. వైయస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కెవిపి రామచందర్ రావు పదవిలో కొనసాగారు. రోశయ్యతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, తాను ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావుతో పాటు మిగతా ప్రభుత్వ సలహాదారులు పదవులకు రాజీనామాలు చేశారు. నెలల క్రితం చేసిన రాజీనామాలు ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి.

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే.

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే. ఒక న్యాయమైన సమాజాన్ని కోరుకోవటం సమంజసమే. కానీ ఆచరణలో అవినీతిని ఎలా నిర్మూలిస్తాం? సత్యాగ్రహాలు, దండియాత్రలు, వినతి పత్రాలతో యీ లక్ష్యం నెరవేరుతోందా? లోక్ పాల్ బిల్లు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా? మనం ఒకసారి ఆలోచించాలి. ఏ రాజకీయ వ్యవస్థలోనైనా అధికార వర్గమే చట్టాలు చేస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలు అవినీతిపరులు, నేరస్థులు, దళారీలతో నిండినప్పుడు, ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది? అధికారంలో, ప్రతిపక్షం లో వున్న అవినీతిపరులు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్లే చట్టాన్ని రాసుకుంటారా? ఒకవేళ రాసిన, ఆ చట్టాన్ని ఆచరణలో నిజంగా అమలు చేస్తారా?


అన్నా హజారే నిజాయితీ కలిగిన సామాజిక నాయకుడే, నిబద్దత గలిగిన పెద్ద మనిషే. కానీ నిరాహార దీక్షలు, సంస్కరణ వాదం ద్వారా సమాజం లో మౌలికమైన మార్పు వస్తుందా? అవినీతి అంతం అవుతుందా? కాగితాల మీద ఎంత మంచి చట్టాలు వున్నా, అసమర్ధ నాయకులు వున్నంత కాలం, ఆచరణలో అవి విఫలమవుతునే వుంటాయి. భూసంస్కరణ, ఎన్నికల సంస్కరణలు, రిజర్వరు ఫారెస్టు చట్టాలన్నీ ఆచరణలో విఫలమైనాయి. సమాచార చట్టం వల్ల యిప్పటిదాకా, ఒక వ్యక్తి కూడా శిక్షింపబడలేదు. కానీ సమాచార చట్టం కోసం దరఖాస్తు చేసిన దత్తా పాటిల్ , అమిత్ జత్వా, రామదాస్ గోడ్వాకర్ హత్యకు గురయ్యారు. ఒకవైపు 45 సంవత్సరాలుగా అన్నా హజారే అవినీతి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్నాడు. కానీ దేశంలో అవినీతి వైయ్యి రెట్లు పెరిగింది. 2జీ టెలికాం కుంభకోణంలో కోట్లు దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న మన్ మోహన్, కరుణానిధి, రతన్ టాటా, అనిల్ అంబనీల పైన ఒక కేసు పెట్టలేదు. విచారణ జరపలేదు.

అవినీతి ఆరోపణ ఎదుర్కుంటున్న జగన్ మద్దతుదారుడు గోనె ప్రకాశరావు, చంద్రబాబు ఆస్తులకు బినామీ మురళీమోహన్ లు, ఐయంజీ-భారత్ భూమి కుంభకోణం నిందితుడు చంద్రబాబు, వెయ్యి కోట్లు ఆస్తి వున్న రామ్-దేవ్ బాబా, కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్థనరెడ్డి నెత్తికి ఎక్కించుకున్నబిజేపీ-ఏబివీపీ నాయకులు అన్నా హజారే కు జైకొడుతూ, అవినీతి పైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అంటే ఉద్యమం ఎలా వక్రమార్గాలు పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. దొంగ ఓట్లు, దొంగ సారా, దొంగ నోట్ల తో రాజకీయ దళారులు రాజ్యం మేలుతున్నంత కాలం, ప్రజాస్వామ్యం పతనం అవుతునే వుంటుంది.

క్యాన్సర్ రోగానికి సరైన వైద్యం కావాలి కదా! కుళ్ళిపోయిన వ్యవస్థను కూకటివేళ్ళ తో పెకిలించి, ప్రజాస్వామిక విలువలతో ప్రతిఫలించే నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజికమైన మౌళిక మార్పుల కోసం పోరాడాలి. గ్రామాలనుండి పట్టణాల దాకా, ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా నిర్వచించుకొని, ఆచరణ లో పెట్టాలి. అన్నా హజారే ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూనే, అవినీతి లేని వ్యవస్థ కోసం, సామాజిక న్యాయం కోసం, రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలి. అవినీతి నాయకులు, రాజకీయ దళారులను సామాజిక బహిష్కరణ చేయాలి. యీ వ్యవస్థను ఓట్ల రాజకీయాలతో మార్చగలుగుతామా? శాంతియుత మార్గంలో అవినీతి ముష్కరుల మనస్సు కరిగించగలుగుతామా? లేకపోతే ప్రజా పోరాటాలతో సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి