15, జులై 2011, శుక్రవారం

ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే.

ఓ శుభవార్త తెలియగానే ఆనందం, ఆలోచనలు భవిష్యత్ వైపు సాగినప్పుడు తెలీని దిగులూ, మనసు గాయపడిన క్షణం ఆక్రోషం.. ఇలా ప్రతీ భావోద్వేగమూ మనసులోనే సిద్ధంగా ఉంటుంది. తటస్థించే అనుభవానికి తగ్గ భావోద్వేగం మనలో వెన్వెంటనే పెల్లుబుకుతూ కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేసి గమ్మున సర్దుకుంటుంది. మంచిదైనా, చెడ్డదైనా ఓ సంఘటన జరిగిన వెంటనే మదిలొ వేగంగా జరిగే సంఘర్షణ తాలూకు వ్యక్తీకరణలే మన భావోద్వేగాలు. ప్రతీ భావోద్వేగమూ దాని తీవ్రత కొనసాగినంత సేపూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనిలో పనిగా మనసులో ఏ మూలనో ఆ సంఘటన తాలూకు గాఢతని మరువలేని జ్ఞాపకంగా నమోదు చేసి.. తీవ్రత తగ్గిన వెంటనే దూదిపింజెలా ఎగిరిపోతుంది. భావోద్వేగాల మర్మాన్ని గ్రహిస్తే అవి మనపై స్వారీ చేసే ముందే వాటి తీవ్రతని కట్టడి చేసుకోగల విజ్ఞత అలవడుతుంది. ఏ ఆనందానికైనా, ఆవేశానికైనా, విచారానికైనా కల్లోలితం అయ్యే ఆలొచనా ప్రవాహమే మూలం. వాటిని వీలైనంత వేగంగా స్థిరత్వం వైపు మళ్లిస్తే ఆ భావోద్వేగపు గాఢత క్షీణించిపోతుంది. మిన్ను విరిగి మీదపడ్డా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయే నైపుణ్యత అలవడుతుంది. మన ఆలోచనలు నిరంతరం జరిగిపోయిన జీవితాన్నీ, ముందు భవిష్యత్తునీ, వర్తమానపు అనుభవాలనూ, బలంగా నాటుకుపోయిన జ్ఞాపకాలనూ మనసు పొరల్లోంచి వెలికి తీసి వాటిని చిక్కుముళ్ల్లుగా పెనవేసి కుదురుగా ఉన్న మనసుని కూడా ఆందోళనపరుస్తుంటాయి.
ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే. అవసరం అయిన దానికన్నా దాన్ని మరింత విశ్లేషించి, సంఘటనలు, ఆలోచనల్ని క్లిష్టతరం చేసుకుని ఆ ఉద్వేగాన్ని సులభంగా వదిలిపెట్టకుండా మనసుని కుళ్లబెట్టుకుంటూ ఉంటాం. ఈ క్షణం మన మానసిక స్థితి అస్థిరంగా ఉంటే దాన్ని స్థిరపరుచుకోవడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ కిటుకుని గ్రహించలేక పాటించలేకపోతున్నాం. సమస్యల్లో ఉన్న స్థితిలో మనమూ సమస్యలో కూరుకుపోయి బయటపడే మార్గాన్ని ఆలోచించడం మనేసి సమస్యని పెద్దది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటే దానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల వైపు దృష్టిని నిమగ్నం చేయకుండా వీలైనంత ఆవేశాన్ని వెళ్లగక్కుతుంటాం. ఇలా భావోద్వేగం యొక్క మూలాల్ని గుర్తించి వాటిని సరిచేసుకునే మార్గం ఒకటుంటే.. ఏకంగా భావోద్వేగం మనపై స్వారీ చేస్తున్నప్పుడు దాని నుండి బయటపడడానికి మరెన్నో మార్గాలున్నాయి.
ఒక భావోద్వేగాన్ని పరిసరాలపై వెదజల్లడం మన ఉనికిని, మనం ఆశిస్తున్న గమనింపుని పొందడానికి సులువైన మార్గం అనే దురభిప్రాయం బాల్యం నుండి మనకు ఉగ్గుపాలతో అలవర్చబడింది. ఉదా. కు.. మనం ప్రదర్శించిన ఆవేశానికి ఆశించిన స్థాయి స్పందన దాన్ని ఎవరిపై ప్రదర్శించామో వారి నుండి లభిస్తే మన అహం సంతృప్తిపడుతుంది. ఎంత ఆవేశపడినా దాన్ని పట్టించుకునేవారు లేనప్పుడు కాసేపు మనసు రగిలిపోతుంది. మెల్లగా నిస్సహాయత ఆవరిస్తుంది. దిగులు మొదలవుతుంది. చివరకు బేలగా మారిపోతాం. ఇది ఒక ఆవేశమనే భావోద్వేగపు పరిణామక్రమమే. ఇలా ప్రతీ భావోద్వేగానికీ కొన్ని బలమైన కారణాలు, అంచనాలూ, పర్యవసనాలూ ఉంటాయి. వాటన్నింటినీ విశ్లేషించి మన చిత్తం చేసే చిత్రాల్లో ఎంత విచిత్రం దాగుందో అర్ధం చేసుకోగలిగితే ఆ మాయ నుండి అవలీలగా బయటపడగలం !

అమ్మ నాదే...

అంబరాన పూసిన తారలు కోసి
మాలచేసి నీ జడలొ తురుముతానంటే
మురిసిపోయింది అమ్మ ముసిముసి నవ్వులతో

హరివిల్లుని పట్టి తెచ్చి నీకు ఊయలకట్టి ఊపుతానంటే
చిరునవ్వుతో నా తల్లీ అంటూ ముద్దులాడింది

సఖులతో చేరి ఆటలాడగా
బుజ్జగించి, ఊసులెన్నో చెప్పి బొజ్జ నింపింది

నిదురమ్మ రానని మొరాయిస్తుంటే
చందమామని చూపి లాలిపాడి జోకొట్టింది

సూరీడు తాపం చురుక్కుమంటూ బాధిస్తుంటే
తన కొంగునే గొడుగుగా కప్పి పొదుముకుంది

వానజల్లులో తడిసి, మెరుపు గర్జనలకు ఉలిక్కిపడితే
నేనున్నానురా అంటూ వెన్ను తట్టింది లాలనగా

ఆటలలో చిన్ని గాయమై కంటతడిపెడితే
తన గుండెల్లో దిగిన బాకులా విలవిలలాడింది

అమ్మ ఆప్యాయతను ఆలంబనగా చేసుకొని
అందరికంటే ఉన్నతంగా ఎదిగినప్పుడు
అక్కున చేర్చుకుంది అశ్రునయనాలతో...

మరచిపోగలమా? తీర్చుకోగలమా?
అమ్మను. ఆమె ప్రేమని.. నేర్పిన పాఠాలను
అందుకే అమ్మ నాదే...

అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు....

అసలు టైటిల్ విషయానికొస్తే, పాండవ వనవాసం సినిమా చూసినప్పుడు విన్న డవిలాగు అది. సావిత్రి బాగా బాధ పడుతూ చెప్పిన డయిలాగు. ద్రౌపదిని( అదే సావిత్రే లెండి) తీసుకురమ్మని ప్రాతిగామిని పంపిస్తాడు రారాజు. అప్పుడు ఈ విషయం కనుక్కురమ్మని సావిత్రమ్మ చెప్పే డయిలాగు ఇది.
" నా స్వామి తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా,".
ఈ డయిలాగు విన్నప్పుడు నేను, ధుర్యోధనుడు( అదే మన ఎస్ వీ ఆర్) ఒకలాగే ఆలోచించాము. ఎలా అయితే ఎంటి మొత్తానికి ఓడారా లేదా. అంతా టైం వేస్టింగ్ టాక్టిక్స్.
కాని రెండిటికి ఏంత తెడా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. అంటె ధర్మరాజు తను ఓడిపోవడం వల్ల ద్రౌపది ఆటోమేటిక్ గా రారాజుది అవుతుంది. అలాంటప్పుడు ధర్మవిధిత(lawful bid). కాని, ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పెట్టి ఓడిపోతే, అసలు ధర్మ రాజుకు ద్రౌపదిని పెట్టే హక్కు ఎక్కడిది. ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదే, కాబట్టి తను అధర్మవిధిత( unlawful bid). ఇది వికర్ణుడు చెప్పే వాదం. ఏదేమయితేనేం ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది. అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు

మరుసటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న ఈ మనసు ఏమిటో...

అప్పట్లొ కళ్ళ్లోలో స్వప్న మాలికలు,
ఈ గుప్పెడు మనసులో భావకత్వపు డోలికలు,
బ్రతుకొక పాటగా,క్షణమొక కవితగా సాగిపోయేది.....
ఎన్ని కోరికలు,ఎన్ని కలలు,
ఎన్నెన్ని ఆశయాలు, ఎన్నొ ఎన్నొ ఆదర్శాలు....
ఆదర్శాల,ఆశయాల,కోరికల వేటలో
ఇహం కోసం,అహం కోసం అస్తిత్వాన్ని కోల్పోతున్నాను,
అందమైన,నిర్మలమైన ఆ నవ్వుల్ని కొల్పోతున్నాను,
స్వేచ్హ సౌఖ్యం మరచి భాగ్యాన్వేశనలో పడ్డాను,
ఉషోదయం తో ప్రారంభం అయ్యే ఉరుకుల్ని,
నిశార్దం దాకా కొనసాగిస్తున్నాను।
తియ్యనైన ఈ భాదకు, ఉప్పు నీరు ఈ కంట ఎందుకో...
గుప్పడంత ఈ మనసుకు ఇన్ని శిక్షలెందుకో....
చెప్పలేని ఈ భాదకు గుప్పెడంత ఈ గుండె ఏమిటో...
భవ,భావాలు లేని ఈ భాష ఏమిటో....
మది తలుపులకు తాళం వేసి,
మరుసటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న ఈ మనసు ఏమిటో...