12, మే 2011, గురువారం

చిరంజీవి ఇప్పుడు గిలగిలా తన్నుకుంటున్నట్లే

ఏరు దాటాక తెప్పను తగిలేయడం కాంగ్రెసు సంస్కృతి అనే మాట మరోసారి రుజవు అవుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలకు బోల్తా పడిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు గిలగిలా తన్నుకుంటున్నట్లే ఉన్నారు. పిలిచి సింహాసనం ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ ఇప్పుడు చిరంజీవికి మొండిచేయి చూపుతున్నట్లే ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో నెంబర్ వన్‌గా నిలబడాలని అనుకున్న చిరంజీవి ఆశలకు ఆదిలో కాంగ్రెసు అధిష్టానం గండి కొడుతోంది. విలీన సభను అట్టహాసంగా నిర్వహించి తన సత్తాను సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో చూపాలని ఆయన కలలు కంటూ వస్తున్నారు. ఆ కలలను కాంగ్రెసు అధిష్టానం చిదిమేసేదుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.

కాంగ్రెసు చేతికి చిక్కిన చిరంజీవి ఇప్పుడు ఎటూ పోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఒడ్డున పడిన చేపలా విలవిలలాడుతున్నారు. గతంలో అడక ముందే అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా ఇప్పుడు అడిగినా ఇవ్వడం లేదు. విలీన సభకు రాహుల్ గానీ, సోనియా గానీ రారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చిరంజీవికి మొహమాటం లేకుండా చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు, భారీగా విలీన సభను జరపాల్సిన అవసరం లేదని, తమ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంటామని కూడా ఆయన చెప్పారట. దీంతో కంగు తినడం చిరంజీవి వంతైంది. వెనక్కి రాలేక ముందుకు పోలేక చిరంజీవి గిజగిజలాడుతున్నట్లే చెప్పాలి.

చిరంజీవికి రాష్ట్రంలో అంత సీన్ లేదని, అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెసు నాయకులెవరో సోనియాకు పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. అంతేకాదు, చిరంజీవిని ప్రోత్సహిస్తే ఓ వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాని వల్ల బలమైన సామాజిక వర్గం ఒకటి దూరమయ్యే ప్రమాదం ఉందని సోనియాకు చెప్పారని సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య విభేదాలను, వైరాలను చిరంజీవిని దెబ్బ తీయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, రెడ్లు లేకుండా కాంగ్రెసు మనుగడ సాగించడం కూడా కష్టమని చెప్పారని తెలుస్తోంది. చిరంజీవిని ఎక్కువగా ఆదరిస్తే రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వైపు చూసే అవకాశం ఉందని కూడా చెప్పారని అంటారు. ఏమైనా, కాంగ్రెసులో ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు పైకొస్తారో, పాతాళానికి దిగజారుతారో చెప్పడం సాధ్యం కాదని మరోసారి రుజువు అయిందని చెప్పవచ్చు

ఫేస్‌బుక్‌ వినియోగదార్ల ఖాతా వివరాలన్నీ మూడో వర్గానికి(థర్డ్‌ పార్టీ)??@@!!##

మీకు ఫేస్‌బుక్‌లో ఖాతా ఉందా.. అయితే కొంచెం జాగ్రత్త. వందల వేలకొద్దీ ఫేస్‌బుక్‌ వినియోగదార్ల ఖాతా వివరాలన్నీ మూడో వర్గానికి(థర్డ్‌ పార్టీ) ముఖ్యంగా వ్యాపార ప్రకటనల వారికి లీకవుతున్నట్లు డేటా సెక్యూరిటీ సొల్యూషన్ల సంస్థ సిమాంటెక్‌ వెల్లడించింది. కొన్నేళ్లుగా ఇలా జరుగుతోందని ఆ సంస్థ తన అధికారిక బ్లాగులో పేర్కొంది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల 'యాక్సెస్‌ టోకెన్లు' లీక్‌ కావడంతో ప్రకటనదార్లు ఆయా ఖాతాల్లోని ప్రొఫైల్స్‌, ఫొటోలు, చాటింగ్‌ వివరాలను వారు పొందడమే కాకుండా ఆయా ఖాతాల్లోకి సందేశాలను పంపడమూ చేస్తున్నారని వివరించింది. యాక్సెస్‌ టోకెన్లనేవి అదనంగా ఇచ్చే తాళం చెవుల లాంటివి.

వీటి ద్వారా ఖాతాదారు బదులు వేరెవరైనా ఖాతాను యాక్సెస్‌ చేసుకోవచ్చు. కేవలం గత నెలలోనే 1,00,000 అప్లికేషన్లు లీకేజీ పాలయ్యాయని సిమాంటెక్‌ అంచనా. కొన్నేళ్లుగా చూస్తే లక్షల కొద్దీ టోకెన్లు వారిబారినపడి ఉండొచ్చని ఆ సంస్థ తన బ్లాగులో తెలిపింది. ఫేస్‌బుక్‌ సంస్థకు ఈ విషయాన్ని తెలిపామనీ.. లీకేజీ గురించి ఆ సంస్థ సైతం అంగీకరించిందని.. అందుకు తగ్గ చర్యలు తీసుకోనున్నట్లు కూడా తమకు వివరించిందని అందులో పేర్కొంది

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాo

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి గురువారం ఎంపీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ, తెలంగాణ అంశంపై పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి హాజరు కావడం పలువురుని విస్మయానికి గురి చేసింది. గత కొంతకాలంగా హరికృష్ణ - చంద్రబాబు మధ్య వారసత్వ పోరు నడుస్తున్నట్టుగా వాదనలు వస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తర్వాత టిడిపి వారసుడిగా నందమూరి వంశమే ఉండాలనిచూస్తున్న హరికృష్ణ, చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడం జీర్ణించుకోలేక పోతున్నారనేది వార్తల సారాంశం. బాబు తర్వాత నారా వంశానికి చెక్ పెట్టేందుకు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఎక్కడా ప్రత్యక్షంగా గొడవలు జరగనప్పటికీ పరోక్షంగా మాత్రం ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. అది నిజమేనన్నట్లు పెళ్లి సంబంధాన్ని సెట్ చేసిన చంద్రబాబే జూ.ఎన్టీఆర్ పెళ్లిలో ముక్తసరిగా కనిపించడం వారి మధ్య వారసత్వ పోరు నడుస్తున్నదనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి.

ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా గత కొన్నాళ్లుగా పార్టీలో ఉంటూనే కాలికి ముల్లులా తయారయ్యాడు. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే మనుగడ సాగించలేవని టిడిపిలో ఉంటూనే విమర్శలు చేశారు. అధినేత చంద్రబాబుపై కూడా పరోక్షంగా ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాగం, హరికృష్ణలు పార్టీ సమావేశానికి రారని అందరూ భావించారు. కానీ వారిద్దరూ సమావేశాలకు రావడం అందరికీ విస్మయం కలిగించింది. అయితే సమావేశంలో, తర్వాత వారు ఏమి మాట్లాడుతారో అనే దానిపై ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఉన్నారు.

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు.

మాస్ట్రో ఇళయరాజా తన అద్వితీయమైన సంగీత జ్ఞానంతో అజరామరమైన పాటలను రూపొందించి సంగీత ప్రియులను మైమరపించారు. ఇప్పుడు ఆ స్వరబ్రహ్మ తన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ రేపటితరం సంగీత కళాకారులను తయారు చేసే పనికి పూనుకున్నారు. ఈ ప్రయత్నానికి ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ డా. మోహన్ బాబు చేయూతనందించనున్నారు.

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు. వారిరువురు సోమవారం రాత్రి తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిదిలో ఈ విషయాన్నీ విలేకరులకు తెలియజేసారు. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంతవరుకు సంగీత విశ్వ విద్యాలయం లేదు, తిరుపతిలో తాను ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోనే ఈ సంగీత యునివర్సిటీ స్థాపన జరుగుతుందని అన్నారు. ఈ అంశానికి సంబందించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఎన్నికల తర్వాత భారీ మార్పులు???

కడప ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటూ వచ్చారు. ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు, వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఊదరగొడుతూ వస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ విజయం ఖాయమని కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఓ నిర్ధారణకు వచ్చినట్లే కనిపిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఫలితాలపై పెద్దగా ఉత్కంఠ లేదు. జగన్‌కు లభించే మెజారిటీపై, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల్లో ఏది రెండో స్థానంలో నిలుస్తుందనేది విషయంపై మాత్రమే ఆసక్తి ఉంది.

జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తాయని గ్యారంటీగా చెప్పలేం. జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులకు మాత్రమే కాంగ్రెసు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి ఆ శాసనసభ్యులు వివరణలు కూడా ఇచ్చారు. కానీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదు. జగన్ వెంట దాదాపు 23 మంది కాంగ్రెసు శాసనసభ్యులు వెళ్తున్నారు. వారందరిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. అదే సమయంలో కాంగ్రెసును పూర్తిగా కాదని వెళ్తారా అనేది సందేహమే.

కాగా, ఉప ఎన్నికల ఫలితాలు జగన్‌కు కొత్త ఊపునిచ్చే అవకాశాలున్నాయి. అయితే, జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు ఉప ఎన్నికల తర్వాత రాజీనామాలకు సిద్ధపడతారనే వార్త గత కొద్ది రోజులుగా వస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా అదే మాట చెప్పారు. అయితే, వ్యూహాన్ని జగన్ ఆహ్వానిస్తారా, లేదా అనేది సందేహమే. షోకాజ్ నోటీసులు జారీ చేసిన నలుగురు శాసనసభ్యులపై చర్యలు తీసుకుని, మిగతావారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటే మాత్రమే ఆ పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. అందుకు కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తుందా అనేది సందేహమే.

రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడానికే ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, తెలంగాణ అంశం కిరణ్ కుమార్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే అవకాశాలున్నట్లు వైయస్ జగన్ వర్గం భావిస్తోంది. అయితే, తెలంగాణ శాసనసభ్యులు అంత దూరం పోతారని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వచ్చే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఆయన సత్వరం తెలంగాణ అంశంపై తేల్చుకోవడానికి ఏమీ తొందర పడడం లేదని అంటున్నారు. ఈ స్థితిలో కడప ఉప ఎన్నికల తర్వాత భారీ మార్పులు సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. అయితే, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.

ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం??

తన బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు కోపం చల్లారలేదని అంటున్నారు. అధికార మార్పిడి సందర్బంగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు, ఆ తర్వాత తనకు జరిగిన అవమానం పట్ల ఆయన రగిలిపోతూనే ఉన్నారట. లక్ష్మీపార్వతిపై తమకు ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు వాడుకుని తన తండ్రిని పదవీచ్యుతుడ్ని చేశాడని, అందుకు తమను వాడుకుని ఆ తర్వాత తమను కూడా వదిలేశారని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు తగిన ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే హరికృష్ణ ఉన్నారని అంటున్నారు. పైగా, నందమూరి కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీని తమకు కాకుండా చేసేందుకు మరో పథకాన్ని చంద్రబాబు రచించడం కూడా ఆయనకు నచ్చడం లేదు.

నందమూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా లేరని, పార్టీని తన కుమారుడు నారా లోకేష్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించిన హరికృష్ణ పార్టీని సొంతం చేసుకుని, స్వర్గీయ ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లో నిలబడాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ముందు పెట్టేందుకు ఆయన సిద్ధపడ్డారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ తాత లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అందుకు కలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీ రామారావుపైకి వైస్రాయ్ హోటల్ వద్ద చంద్రబాబు మనుషులు చెప్పులు విసరడాన్ని హరికృష్ణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో తనకు, తన మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు అధికార మార్పిడి తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రధానమైన పాత్ర లభిస్తుందని హరికృష్ణ ఆశించారు. ఆ మేరకు చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని అంటున్నారు. అయితే, అధికారం తన చేతికి రాగానే చంద్రబాబు వారిద్దరని పక్కన పెట్టేశారు. దాంతో అసంతృప్తికి గురైన వారిద్దరు బయటకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొంత కాలం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంతో ఉన్నారు. అదీ పొసగలేదు. దీంతో దగ్గుబాటి, హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది తగిన ఆదరణ పొందలేదు.

అన్న తెలుగుదేశం పార్టీ తగిన ఫలితాలు సాధించకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలోకి, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. హరికృష్ణ మాత్రం చంద్రబాబుతో సర్దుకుపోతూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, ఆయన పెద్దగా పార్టీ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రచారానికి దిగలేదు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ సందర్భంగా బాలకృష్ణ కన్నా జూనియర్ ఎన్టీఆర్‌కే ఆదరణ ఎక్కువగా లభించింది. స్పష్టమైన వాచకం, విషయాల అవగాహన ఎన్టీఆర్‌ను బలంగా తయారు చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆలంబనగా చేసుకుని తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబ సభ్యుల సొంతం చేయడం హరికృష్ణ లక్ష్యంగా చెబుతున్నారు

తెలుగు క్రికెటర్ల హవా జోరుగానే ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపియల్4లో తెలుగు క్రికెటర్ల హవా జోరుగానే ఉంది. జాతీయ జట్టులో వారికి తగిన ప్రాతినిధ్యం లభించకపోవయినప్పటికీ ఐపియల్‌లో మాత్రం ఓ వెలుగు వెలుగుతున్నారు. వివిధ జట్లలో వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడి సంగతి చెప్పనే అవసరం లేదు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మన్ననలు అందుకున్నాడు. ఓ నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. దానికితోడు కీపింగ్ కూడా చేస్తున్నాడు. ట్వంటీ20 అంటే గుడ్డిగా బంతిని బాదడమనేది అతను చేయడం లేదు. ఆటలో చక్కటి సాంకేతికతను ప్రదర్శిస్తున్నాడు. చెప్పాలంటే, అలాంటి శాస్త్రీయమైన ఆట తెలుగు క్రికెటర్లకు వెన్నతో అబ్బిందని చెప్పవచ్చు.

కాగా, ముంబై ఇండియన్స్‌లోనే మరో ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. అతను భారీ షాట్లకు పెట్టింది పేరు. రోహిత్ శర్మ తల్లి అన్నపూర్ణది విశాఖపట్నం. అందువల్ల, ఇతడ్ని కూడా తెలుగువాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. గత ఐపియల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు బ్యాట్‌తోనూ బంతితోనూ అద్భతంగా రాణించాడు. భారత వన్డే జట్టులో అతను నిలకడగా ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్న వేణుగోపాల రావు కూడా ఐపియల్‌లో బాగా రాణిస్తున్నాడు. మాజీ క్రికెటర్లు అతన్ని గుండప్ప విశ్వనాథ్‌తో పోలుస్తున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపియల్‌లో పరాజయం పాలవుతుండడంతో వేణుగోపాల్ రావు ప్రతిభ వెలుగులోకి అంతగా రావడం లేదు. అయితే, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అతను రాణిస్తున్నాడనే మాటను మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టులో సంచలనం సృష్టిస్తున్న పాల్ వాల్తాటీ మన తెలుగువాడే. అతను కర్నూలు జిల్లా నంద్యాలకు చెందినవాడు. అయితే, అతని తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా ముంబైకి వెళ్లారు. అతను ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేవనే చెప్పవచ్చు. కానీ, ఐపియల్‌లో మాత్రం అతని పేరు మారుమోగుతోంది. అయితే, ఇటీవలి మ్యాచుల్లో అతను వెనకబడి పోయాడు.

ఇక, హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడుతున్నాడు. అయితే, లక్ష్మణ్ ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికి రాడనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ, ఆడిన ఒకటి, రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కాగా, హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ తరఫున స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడుతున్నాడు. నిరుడు కూడా అతను ఇదే జట్టులో ఉన్నాడు. నిరుడు రాణించిన స్థాయిలో అతను ఇప్పుడు రాణించడం లేదు.

ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని??

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒత్తిడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆపరేషన్ 500 కోట్లు అనే శీర్షికతో ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అవసరమైతే శాసనసభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ నాయకుల నుంచి జగన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో శాసనసభ్యుడికి ఐదు కోట్ల వరకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జగన్ వర్గం ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యం చేస్తే పార్టీ బలహీనతలు బయటపడతాయని, వేడిలో వేడిగా ప్రభుత్వాన్ని కూల్చే ప్రణాళికను అమలు చేయాలని అంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ కూడా 2014 వరకు వేచి చూసే ఉద్దేశంతో లేరని అంటున్నారు. ప్రస్తుతం జగన్ వెంట 25 మంది దాకా శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలంటే 70 మందికి పైగా శానససభ్యుల అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి గానీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు.

తెలంగాణలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలను చంద్రబాబు కోరుకోవడం లేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోక ముందే ప్రభుత్వాన్ని కూల్చాలని వైయస్ జగన్ వర్గం భావిస్తుండగా, తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. పైగా, జగన్ వైపు నుంచి శాసనసభ్యులు క్రమంగా వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాం రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో జాప్యం చేస్తే మరింత ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి వస్తుంది. అయితే, ఆ పార్టీ 11 మంది సభ్యుల బలం అందుకు సరిపోదు. పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా ??

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటించినవారు ప్రమాదాలకు గురి కావడంతో ఆయనను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. డీహైడ్రేషన్‌తో రజనీకాంత్ గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేరి, అదే రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన ఆస్పత్రిలో చేరి మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. ఈ సమయంలో ఆయన స్వాముల ధ్యాన మందిరానికి ఆశ్రమానికి వెళ్లి గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత కాళికాంబ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. దీంతో రాణా చిత్రానికి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

కాగా, రాణా చిత్రంలో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నారు. అరవై ఏళ్ల వయస్సు పైబడిన రజనీకాంత్ రాణా చిత్రంలో ఓ యువకుడి పాత్ర పోషిస్తున్నారు. దానికోసం ఆయన డైట్ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు 20 రోజులు డైట్ చేయడంతో అది రజనీ ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. దాదాపు 75 కిలోల బరువు ఉన్న రజనీ డైట్‌తో 15 కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా, ఆల్కహాల్ కూడా మానేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. రజనీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, రజనీని మాత్రం సెంటిమెంట్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రముఖి సినిమాలో నటించడం వల్లనే కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్, నటి సౌందర్య ప్రమాదంలో చనిపోయారనే సెంటిమెంట్ ప్రబలంగా ప్రచారంలో ఉంది. దీని ప్రభావం రజనీకాంత్ మనసుపై పనిచేస్తుందని చెబుతున్నారు. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రజనీకాంత్‌కు అదే ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా, రాణా చిత్రం కథకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తుండడం వల్ల కూడా రజనీకాంత్‌కు కష్టాలు తెచ్చిపెడుతుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. దానివల్ల రాణా చిత్రం ముందుకు సాగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, స్థిరచిత్తం, దృఢసంకల్పం గల రజనీకాంత్ వాటిని అధిగమిస్తారని అశిస్తున్నారు