6, మే 2011, శుక్రవారం

కడప మహిళా నేతలు ప్రచారం

పులివెందుల, కడప ఉప ఎన్నికల బరిలో అధినేతలకు ధీటుగా ఆయా పార్టీల మహిళా నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నుండి మహిళా నేతలు జిల్లాలోనే తిష్ట వేసి తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాప్తాడా శాసనసభ్యురాలు పరిటాల సునీత, తెలుగు మహిలా అధ్యక్షురాలు శోభా హైమావతి, కేంద్రమంత్రి పురందేశ్వరి, రోజా, షర్మిళ, లక్ష్మీపార్వతి తదితరులు ధాటిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైయస్ వివేకానందరెడ్డి గెలుపు కోసం ఆయన కూతురు, మరికొంతమంది కాంగ్రెసు మహిళా నేతలు పులివెందుల ప్రచారానికి పరిమితం అయ్యారు.

దివంగత పరిటాల రవీంద్ర సతీమణి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతది అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు, పరిటాల అభిమానులు భారీగా ఉన్న గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తుంది. అభిమానాన్ని ఓటుగా మలుచుకోగలుగుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పరిటాల సునీత ప్రచారానికి మిగతా వారి కంటే అనూహ్య స్పందన వస్తుంది. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైసూరారెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఆమె పరిటాల అభిమానులను, ప్రచారాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలను కోరుతోంది. సునీత ప్రచారం చేస్తున్న గ్రామాలలో ప్రజా స్పందన చూసిన టిడిపి కార్యకర్తలు మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారంట. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కడప జిల్లా పార్టీ అధ్యక్షురాలు కుసుమకుమారితో పాటు పలువురు మహిళా నేతలు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. వీరు జగన్ అవినీతిపై, కాంగ్రెసు అభ్యర్థులపైన కాకుండా టిడిపి గెలిస్తే ఏం చేస్తుంది, ఎందుకు ఓటెయ్యాలో చెప్పడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటున్నారు.

ఇక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున రోజా, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే వీరు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై తీవ్రంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం విశేషం. అయితే రోజా ప్రచారానికి ప్రజలు భారీగా వస్తున్నప్పటికీ లక్ష్మీపార్వతి ప్రచారానికి మాత్రం అంతగా ఆధరణ కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక జగన్ చెల్లెలు షర్మిళ కూడా తల్లి, అన్నయ్య విజయానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. తన అన్నయ్యను కుట్రతో కాంగ్రెసు నుండి బయటకు పంపించారని వోటర్లను నమ్మించడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ప్రచార తీరు పూర్తిగా సానుభూతి కలిగించేలా ఉంటోంది. ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ సతీమణి ఎలాగూ అభ్యర్థి కాబట్టి ఆమె పులివెందులలో గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. అయితే వైయస్ ఉన్నప్పుడు ఇంటిని విడిచి బయటకు రాని విజయమ్మ, షర్మిళాలను మాత్రం జగన్‌ తన స్వార్థం కోసం మండుటెండలో వారిని కష్ట పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెసు తరఫున ప్రముఖంగా ఎవరూ లేక పోయినప్పటికీ కేంద్ర మంత్రి పురందేశ్వరి బుధవారం పులివెందులలో వైయస్ వివేకా అభ్యర్థన మేరకు ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె కూడా జగన్‌పై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో వైపు వివేకానంద భార్య, కూతురు కూడా పులివెందుల నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ వివేకానందకు వోటేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే వారు కాంగ్రెసు కార్యకర్తలుగా కాకుండా వివేకా కుటుంబ సభ్యులుగా ప్రచారం చేస్తుండటం విశేషం.

పోలింగ్ సమీపించే కొద్దీ జగన్‌లోని లోపాలు బయటపడుతున్నాయి

పులివెందుల, కడప ఉప ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాయశక్తులా తమ తమ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఒకరిది సెంటిమెంట్ అస్త్రం కాగా, మరొకరిది అభివృద్ధి, సాంప్రదాయ ఓటింగ్ అస్త్రం, వేరొకరిది ప్రత్యర్థి చీలి పోవడంతో గెలుపు ఉంటుందనే ఆశ. ఇలా ఏ పార్టీ ఆ పార్టీ తమ గెలుపు ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే గెలుపుపై జగన్ వర్గం అతి విశ్వాసంతో ఉండగా, కాంగ్రెసు, టిడిపిలు మాత్రం ఆశాభావంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజుల్లో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచార హోరు నుంచి గట్టి పోటీని ఇస్తున్నామన్న ధీమాను వ్యక్తం చేసే స్థాయికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్రమంగా ఎదిగారు.

కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన కడప లోక్‌సభ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి విజయం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి తరఫున రంగంలోకి దిగిన కడప లోక్‌సభ అభ్యర్థి ఎంవి మైసూరా రెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభర్థి బిటెక్ రవి కూడా తమ విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గత కలహాలు లేకుండా తమ శ్రేణులను కాపాడుకుంటూ ముందుకు సాగడం ఈ రెండు పార్టీలకూ కలసి వచ్చే అంశం. అయితే అదే సమయంలో జగన్ వర్గం మాత్రం అంతర్గత కుమ్ములాటలో మునిగి పోయినట్లుగా తెలుస్తోంది. డబ్బుల పంపకం కారణంగా ఓ ముఖ్య ఎమ్మెల్యే అసంతృప్తికి గురి కాగా, స్థానికేతరులు కడప, పులివెందులలో పెత్తనం చెలాయించడం స్థానిక జగన్ వర్గం నేతలకు నచ్చక పోవడం మరో వైపు అంతర్గత సమస్యలకు దారి తీసింది.

ఇక కాంగ్రెసు పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి జనం హాజరు బాగా ఉండడంతో అధికార పార్టీలోనూ ఉత్సాహం పెరిగింది. ఆఖరి నిమిషంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన మూడు సభల్లో చేసిన ప్రసంగాలకు మంచి స్పందనే వచ్చింది. రోజుకో ప్రకటన చేస్తూ చిత్తచాపల్యాన్ని ప్రదర్శించకుండా ప్రభుత్వాన్ని పడగొడతావో నిలబెడతావో ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ జగన్‌ను కిరణ్ సవాల్ చేయడం ముఖ్యమైన అంశంగా మారింది. ఇక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కడప లోక్‌సభ పరిధిలో చేపట్టిన రోడ్‌షోలు విజయవంతమై ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడమే కాకుండా కార్యకర్తల్లో చలనం తీసుకురాగలిగాయి. రెండు ఎద్దుల భీకర పోరులో లేగ దూడ కూడా విజయం సాధించే అవకాశాలు లేకపోలేదన్న చందంగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీటెక్ రవి తాను విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉప ఎన్నికలకు సంబంధించి ముందుగానే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగిన జగన్‌లో చివరి నిమిషంలో కొంత ఆత్మస్థయిర్యం దెబ్బతిన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజుల్లో నువ్వు ఎన్నికల్లో తిరిగితే తిరిగావు. కానీ నీ తల్లి విజయలక్ష్మి చేత రాజీనామా చేయించి ఆమెను ఎర్రని ఎండలో ఎందుకు తిప్పుతున్నావ్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వని జగన్ ఇప్పుడు మాత్రం అందరికీ అన్నం పెట్టే తల్లి ఇప్పుడు ఓట్ల కోసం ఊరూరా తిరుగుతోంది అంటూ సానుభూతిని సొమ్ము చేసుకునే ప్రయత్నాలను మొదలెట్టిన వైనంపై వైరి పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపితో అవగాహన అంశం కూడా జగన్‌ను దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే జగన్ గెలిచినా గతంకన్నా తక్కువ మెజార్టీ వస్తే ఆయన ఇమేజ్ పడిపోయినట్టేనని పలువురు భావిస్తున్నారు.

పోలింగ్ సమీపించే కొద్దీ జగన్‌లోని లోపాలు బయటపడుతున్నాయని మంత్రి ఒకరు అన్నారు. పులివెందుల నుంచి బరిలో ఉన్న వివేకానందరెడ్డి గట్టి పోటీ ఇస్తుండడంతోనే సెంటిమెంట్ అనే రాజకీయ ఎత్తుగడకు జగన్ కుటుంబం దిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లో తమకు భారీ మెజారిటీ వస్తుందని జగన్ అంచనాలు వేస్తున్నారు. మైదుకూరు, కడప, కమలాపురం, పులివెందులలో తాము ఆధిక్యతను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరులపై తెలుగుదేశం నేతలు ధీమాతో ఉన్నారు. మరో వైపు తాను పులివెందులలో విజయం సాధిస్తానని తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి చెబుతున్నారు. కడప లోక్‌సభ పరిధిలో తనకున్న మంచి పేరే గెలిపించి తీరుతుందన్న విశ్వాసంతో మైసూరా రెడ్డి ఉన్నారు

అమెరికాతో పాటు భారత్‌పైనా పాక్ తన ఆగ్రహాన్ని చూపించింది

తమ దేశంలోనే తమకు తెలియకుండా అమెరికా ఆపరేషన్ జరిపి అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడంపై పాకిస్తాన్ ఆగ్రహం ఇంకా చల్లారనట్టే కనిపిస్తోంది. లాడెన్ చంపిన తరహా ఆపరేషన్‌లు మరిన్ని పాకిస్తాన్‌లో జరుపుతామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పాక్ తీవ్రంగా స్పందించింది. ఆలాంటి ఆపరేషన్‌లు మరిన్ని జరిపితే తాము తీవ్రంగా స్పందిస్తామని చెప్పింది. అలా చేస్తే అమెరికాను వదిలే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. అవసరమైతే అమెరికాతో సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికాతో పాటు భారత్‌పైనా పాక్ తన ఆగ్రహాన్ని చూపించింది. అమెరికా లాంటి ఆపరేషన్లు భారత్ తమ దేశంలో నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ దాడులను తిప్పికొడతామని ప్రకటించింది.