19, మే 2011, గురువారం

టీఆర్‌ఎస్‌, జగన్‌ కలిస్తే మనం మటాష్‌

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో పార్టీ మనుగడ అసాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌కు ఆ పార్టీ సీనియర్‌ నేతలు స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని ముగ్గురు మంత్రులు పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికోసం చేసిన ఒప్పందాలన్ని ఉల్లంఘనకే గురయ్యాయని, ప్రత్యేక రాష్టమ్రే దానికి పరిష్కారం అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు ఆజాద్‌కు తెలియజేశారు. హైదరాబాద్‌ వచ్చిన గులాం నబీ ఆజాద్‌తో తెలంగాణ సీమాంధ్ర నేతలు భేటీ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ తెలంగాణ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు.

పిసిసి మాజీ అధ్యక్షులు పి.నర్సారెడ్డి, సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ నాశనం అవుతుందని ఆజాద్‌కు పి.నర్పారెడ్డి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో జగన్‌ పొత్తు పెట్టుకొనే అవకాశముందని, ఇదే జరిగితే తెలంగాణాలో కాంగ్రెస్‌ వాష్‌ఆవుట్‌ అవుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మాత్రం జగన్‌ను తెలంగాణాలో కాలుమోపనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ఈ ప్రాంతంలో అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని పి.నరసారెడ్డి, పాల్వాయిగోవర్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో టిడిపి ఇప్పటికే జీరోగా ఉందని, ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడే అవకాశముందని ఆజాద్‌కు వారు తెలియజేశారు.

పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తనకు ఇప్పుడు ఏ పదవిపై ఆశలేదని, పార్టీ మనుగడ కోసమే తెలంగాణను కోరుతున్నానని ఆజాద్‌తో పి.నర్పారెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ ఇవ్వకపోతే మాత్రం ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరూ తిరగలేని పరిస్థితి అని త్వరగా ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆజాద్‌కు మంత్రులు కె.జానారెడ్డి, బి.సారయ్య, డి.శ్రీధర్‌బాబులు కోరారు. సమైక్యరాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకొన్న ఒప్పందాలు, హక్కుల తీర్మానాలు అని ఉల్లంఘనకు గురయ్యాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, ఇంద్రసేన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్‌, ప్రవీణ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌కు తెలియజేశారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్పిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కొందరు కార్పోరేటర్లు తెలంగాణ అంశాన్ని తొందరగా తేల్చాలని కోరారు.

ప్రజారాజ్యం విలీనాన్ని ప్రశ్నిస్తూ అధినేత చిరంజీవికి లీగల్ నోటీసులు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీకే చెందిన ఓ కార్యకర్త లీగల్ నోటీసులు పంపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయుడు అనే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్త పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని ప్రశ్నిస్తూ లీగల్ నోటీసులు పంపించారు. పార్టీని విలీనం చేయడం ద్వారా చిరంజీవి పార్టీకి ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన కారణంగా తాను పార్టీ కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బును ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల పార్టీ విలీనంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు చిరంజీవిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.