29, మార్చి 2011, మంగళవారం

TV-గజిబిజి రిపోర్టర్ !!??!!!??

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

TV-గజిబిజి రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె TV-గజిబిజి ఆఫిస్ కి ఒక ఫొన్ వెళ్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నారు ?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విధంగా కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.


ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


బెజార్రావ్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసారా? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విధంగా కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తంగ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లేదు

బెజార్రావ్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


బెజార్రావ్: తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

బేజా... ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ

బేజా, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు బెజార్రావ్ మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)


బేజా! వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చేస్తున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

కుక్కుటెశ్వర్:స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంట్రా పిచ్చోడా . ఏమి మనిషివిరా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచ్చిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టీ మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ గజిబిజి టీవీ office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)

(ఇలా తిడుతు ఉండగానె, గజిబిజి లోగొ వచ్చి, మెరుగైన మీ బతుకులకోసం చూస్తూనే ఉండండి గజిబిజి టీవీ అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే!

ఎక్కడ చూసినా ప్రకటనలే ఇది కొను, అది కొను, మా బ్రాండ్ అంటే మా బ్రాండ్ అంటూ మనల్ని తికమక పెట్టి, మనకు పనికి వచ్చేదో , ఎక్కువసార్లు ఎందుకూ కొరగాని వస్తువులో, సర్వీసెస్ పేరిటో మన చేత అనవసరపు ఖర్చు చేయిస్తున్నాయి ఈ వ్యాపార ప్రకటనలు. వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే! అంతగా పాకిపోయ్యి కాలుష్య దశకు చేరుకున్నది ఈ వ్యాపార ప్రకటన పిచ్చి.

అవసరం ఉన్నా లేక పోయినా ప్రతి ఉత్పత్తిదారు, చివరకి మధ్య దళారులు కూడా ఎక్కడ పడితే అక్కడే ప్రకటనలను గుప్పించటం, ఒకటో రెండో గీతాలు గీసేసి వాటిని బ్రాండ్ అన్న పేరుతొ మనకు కలల్లో కూడా అవ్వే వచ్చేట్టుగా చెయ్యటం . ఏమన్నా అంటే "Top of Mind Awareness" ట, అంటే ఎల్లాప్పుడూ వాళ్ళ బ్రాండే మనకు గుర్తుకు రావాలని ప్రతివాడి తాపత్రయం.

చివరకు జరిగేది ఏమిటి. తామర తంపరలా పెరిగిపోయిన ఈ వ్యాపార ప్రకటనలు, రోడ్ల మీద, రేడియోలో, టి విల్లో సరే సరి, డివైడర్ల మీద, పత్రికల్లో , మాగాజైన్లల్లో, రైలు పెట్టెల మీద, ఇలా ఎందెందు వెదికిన అందే కలదు ఈ ప్రకటనా గరళం. మనల్ని తోచుకోనివ్వకుండా వెంటాడి వెంటాడి ఏమైనా సరే వాళ్ళు చెప్పిన వస్తువుల్ని కోనేట్టుగా ప్రేరేరింప చెయ్యటమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశ్యం.

మనచేత ఈ కాలుష్యాన్ని (శబ్ద, చిత్ర అంతకంటే ప్రమాదకరమైన మానసిక కాలుష్యం) మనకు తెలియకుండానే మన మస్తిష్కాల్లోకి మెల్లి మెల్లి గా (like slow poison) ఎక్కిస్తున్నది ఈ వ్యాపార ప్రకటనల మాఫియా.

ఈ మధ్య ఒక ప్రకటన టి విల్లో తెగ గుప్పిస్తున్నారు. అందులో ఒక బేవార్సు గాడు కార్లో దిగి పనికి రాని చెత్త డైలాగు వల్లిస్తూ, అక్కడే బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయిని తన సెల్ ఫోన్ లో ఫోటో తియ్యబోతాడు. ఆ ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు ఈ యాడ్ హీరో వచ్చి దీంట్లో తీసుకో అని తన దగ్గర ఉన్న సెల్ ఇవ్వబోతాడు. ఇది ఆ సెల్ ఫోన్ కొనమని చెప్పే వ్యాపార ప్రకటన తీరు. ఇటువంటి యాడ్ల వల్ల చిన్న పిల్లలకు ఏ విధమైన సందేశం వెళ్తున్నది అన్న జ్ఞానం అటు యాడ్ చేసినవాడికీ లేదు, ఇటు చూపించే టి వి వాళ్ళకూ లేదు . ఇది ప్రస్తుతం ఈ యాడ్ మాఫియా తీరు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది.

దేశంలో ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న నాటకాలు

"అధిష్టానం" అనే పదం గత కొన్ని దశాబ్దాలలో మన రాజకీయ జీవుల జీవితాల్లో ఒక ముఖ్యమైన మాటగా మారిపొయ్యింది. ఇది అది అని లేదు అన్ని పార్టీలకు ఈ జాడ్యం పట్టింది. పేర్లొక్కటే మార్పు, ఒకళ్ళు "అధిష్టానం" అంటె మరొకళ్ళు "పోలిట్‌బ్యూరో" . అని అదే లంపటం గురించి వ్యవహరిస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం, అధిష్టానం పాత్ర ఏమిటి? ఏమీ లేదు. అధిష్టానం అన్న మాట రాజ్యాంగంలో లేనేలేదు.

అసెంబ్లీ లో కాని, పార్లమెంటు లో కాని, ఎవరైతే ఎక్కువమందికి ఇష్టపాత్రుడో ఆ వ్యక్తి ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రి అవుతాడు. కాని రాజకీయాలు వెర్రి తలలు వేసి, మనం ఎన్నుకునే ప్రజా ప్రతినిధులు వారి నాయకులను ఎన్నుకునే పధ్ధతిలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఏ పార్టీకి ఎక్కువమంది సభ్యులు ఉంటే వాళ్ళందరూ కలసి వారికి కావలిసిన నాయకుణ్ణి ఎన్నుకోవాలి. కాని, జరుగుతున్నది ఏమిటి? వీళ్ళందరూ అసలు సమావేశమే జరగదు. వీళ్ళందరూ ఎన్నికయ్యి ఢిల్లీకో హైదరాబాదుకో వెళ్ళి అక్కడా ఇక్కడా వరండాల్లో, కారిడార్లలోనూ, గేట్ల బయట వేళ్ళాట్టమే జరుగుతున్నది.

ప్రజా ప్రతినిధులుగా వారికి రావలిసిన గౌరవం కాని, వాళ్ళ నాయకులని ఎన్నుకునే స్వాతంత్రం కాని మన చేత ఎన్నుకోబడ్డ మన ప్రతినిధులకు లేదు. వాళ్ళ జీవితంలో ఏనాడూ ప్రజలచేత ఎన్నుకోబడని, లేదా ప్రజలచేత తిరస్కరించబడినవాళ్ళే ఈ పాలిట్బ్యూరోల్లోనూ, అధిష్టానాల్లోనూ ఉంటారు. వీళ్ళు, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎం ఎల్ ఏ లకు ఎం పీ లకు వారు వారి నాయకుడిగా ఎవర్ని ఎన్నుకోవాలో చెప్తారు.

అన్నిటికంటె ఎంతో దుర్మార్గమైన పధ్ధతి, ప్రజాస్వామ్య విరుధ్ధమైన పని, పూర్తిగా చెంచాగిరిగా నడుస్తున్నది ఏమంటే, మన చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రథినిధులు, తాము తమ నాయకుణ్ణి ఎన్నుకోకుండా, ఆ పని అధిష్టానానికి ఒప్పచెప్తూ ఒక తీర్మానం ఏకగ్రీవంగా చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే అపహాస్యం, అవహేళన చెయ్యటం ఏమన్నా ఉండటానికి అవకాశం ఉన్నదా!

రాజ్యాంగం ప్రకారం పని చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ప్రజా ప్రతినిధులు, తాము చేయవలిసిన ఒక ముఖ్యమైన బాధ్యతను, మరొకరికి అప్పగించే అధికారం వారికి ఉన్నదా? ఈ విషయాన్ని రాజ్యంగా నిపుణులు తప్పనిసరిగా పరిశీలించి ఈ జాడ్యానికి మందు వెయ్యాలి.

ఒక అధికారి తాను నిర్వహించాల్సిన బాధ్యతలను మరొకరికి అప్పగించే అధికారం ఉన్నదా? లేనే లేదు. ప్రభుత్వంలో ఒక అధికారి తన బాధ్యతలను మరొకరికి ఇవ్వలేనప్పుడు, ప్రజలచేత ఎన్నుకోబడి, రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని ప్రమాణం చేసిన ఈ ప్రజా ప్రతినిధులు, తమ నాయకుణ్ణి ఎన్నుకునే ముఖ్య బాధ్యతను, రాజ్యెంగేతర శక్తులకు ధార పొయ్యటం ఎంతవరకు సమంజసం. వీళ్ళు చేస్తున్నది రాజ్యంగా ధిక్కారం కాదా అన్న విషయం ఎవరూ పట్టించుకోక పోవటం శోచనీయం.

పూర్తిగా ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో అయ్యి, మనల్ని పరిపాలించాల్సింది పోయి, ఎవళ్ళొ కుట్రలూ కుహకాలకూ అలవాటుబడ్డ కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి, వాళ్ళు చెప్పినవాడు మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వటమా. ఎంత సిగ్గుచేటు.

ఆపైన మంత్రివర్గ నిర్మాణం మరింత హాస్యాస్పదమైనది. ఏ ముఖ్యమంత్రీ లేదా ప్రధాన మంత్రీ స్వతంత్రంగా తన మంత్రివర్గ సహచరులను నియమించుకునే స్థితిలో లేడు. మంత్రివర్గ నిర్మాణం కాని, మంత్రివర్గ విస్తరణకాని, అధిష్టానం కనుసన్నలలోనే జరగాలిట.

ఏ శాఖకి ఏ ప్రజా ప్రతినిధికి ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించే అర్హత, తెలివితేటలు ఉన్నాయో చూడాల్సిన పనే లేదు. ఆ మనిషికి అధిష్టానంలో కొద్దో గొప్పో పలుకుబడి ఉంటే చాలు, కావలిసిన మంత్రి అవుతాడు. విద్యా శాఖ మంత్రికి ఆ శాఖ గురించి తెలియాల్సిన పని లేదు. రక్షణ శాఖ మంత్రికి దేశ పటం ఎలా ఉంటుందో కూడా తెలియాల్సిన పనిలేదు. అందరికీ అధిష్టానమే వడ్డిస్తుంది.

అసలు ఈ అధిష్టానాలూ, పోలిట్‌బ్యూరోలు ఎందుకు ఉంటున్నాయి, వీటి పాత్ర ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఏమిటి . అధిష్టానాల పేరుతో జరిగే పనులన్నీ కూడ రాజ్యాంగ విరుధ్ధమే అని నా అభిప్రాయం.

ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. తమ అధినాయకత్వపు కనుసన్నల్లో మెలుగుతూ, అన్నీ వారికి చెప్పే చెయ్యాలి.

ఈ అధిష్టానం ఎవరు? వాళ్ళను మన ఎన్నుకోలేదే. వాళ్ళెవరో కూడ మనకు తెలియదే. ఇలా ప్రభుత్వాల్లో కలుగచేసుకుని, ప్రజస్వామిక ప్రక్రియలో ఎప్పటికప్పుడు అనవసరంగా తమకు తామే నాయకత్వం అపాదించుకోవటం, ప్రజాస్వామ్య విరుధ్ధమని ఎవరూ అనుకోవటంకూడా లేదు.

ఘనత వహించిన మన మీడియా వాళ్ళు కిమ్మనకుండా, ఆ అధిష్టానల బయట తమ విలేఖర్లని నిలబెట్టి, ఎందుకూ కొరగాని "బ్రేకింగ్ న్యూస్" వదలటమే పరమావధిగా పెట్టుకున్నారు, ఆపైన ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంట ఈ మీడియా. ఇలా అధిష్టానాలు, పాలిట్‌బ్యూరోలు ప్రభుత్వ పనుల్లో, నాయకుల ఎన్నిక, మంత్రివర్గ కూర్పుల్లో కలుగచేసుకోకుండా, సుప్రీం కోర్టు వారు "సువ్వో మోటో" గా తమంతట తామే ఒక కేసుగా స్వీకరించి, ఈ అధిష్టానలన్నిటినీ నిషేధించాలి. ఎలెక్షన్ కమీషన్ ను ఈ కింది విధంగా అదేసించాలి:

1. ఎలెక్షన్ ప్రక్రియలో భాగంగా, ఎన్నికల కమిషనే, ప్రజా ప్రతినిధులకు ఎన్నికైనట్టుగా సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే వాళ్ళను హైదరాబాదు కాని ఢిల్లీ కాని వెంటనే తమ అధీనంలోనే తీసుకు వెళ్ళాలి. వెంటనే వారి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి.
2. ప్రజా ప్రథినిధులను సమావేశపరిచి, వారి నాయకుణ్ణి ఎన్నుకోవటం ఎలెక్షన్ కమీషన్ అధీనంలో, పర్యవేక్షణలో, అన్ని టి వి చానెళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా జరగాలి. ఈ పని ఎన్ని గంటలు/రోజులు జరిగినా సరే, ప్రత్యక్ష ప్రసారం ఆపకూడదు, ప్రజా ప్రతినిధులు బయటకు వెళ్ళకూడదు. వారికి కావలిసిన సర్వ సౌకర్యాలు అక్కడే కలిగించాలి. సాధ్యమైనంత వరకూ, ప్రజాప్రతినిధిగా అప్పటికే ఎన్నిక ఐన మనిషే వారి నాయకుడిగా ఎన్నుకోవాలి. అలా కాకుండ, ఎం ఎల్ ఏ కాని ఎం పి కాని వ్యక్తిని వారి నాయకుడిగా ఎన్నుకోవల్సివస్తే, అటువంటి వ్యక్తిని మామూలుగా ఒకరు ప్రపోజ్ చెయ్యటం మరొకరు తూ తూ మంత్రంగా సెకండ్ చెయ్యటం కాకుండా, మొత్తం ప్రజా ప్రతినిధుల్లో మూడో వంతుమంది ప్రపోజ్ చెయ్యాలి.
3. ఈ ఎన్నిక కూడ సీక్రెట్ బాలెట్ పధ్ధతిలో ఎలెక్షన్ కమీషనే జరిపించాలి. ఒకవేళ ఇలా ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రభుత్వం పడిపోతే, ఇదే ప్రక్రియ మళ్ళి ఎలెక్షన్ కమీషన్ ఆధ్వర్యంలోనే జరగాలి తప్ప మరెవ్వరూ కలుగ చేసుకోకూడదు.
4. ప్రజా ప్రతినిధులు వారి నాయకుణ్ణి ఎన్నుకోంగానే, ఆ నాయకుడి చేత ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రిగా వెనువెంటనే, ప్రమాణ స్వీకారం గవర్నర్ లేదా రాష్ట్రపతి చేయించాలి.
5. ఈ పని పూర్తయ్యిన తరువాత మాత్రమే ఎలెక్షన్ కమిషన్ పని పూర్తయ్యినట్టు.
6. ఏ పార్టీ అధ్యక్షుడుకాని, అధిష్టానం పేరుతోకాని, ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష విధానంలో కలిగించుకున్నా అటువంటి వ్యక్తులను వెంటనే రాజద్రోహం నేరం కింద అరెస్టుచేసి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వెనువెంటనే వేసే అధికారం ఎన్నికల కమీషనర్లకు ఉండాలి.
7. సమాజంలో అన్ని రంగాలలోనూ నిష్ణాతులైన నిపుణుల కమిటీలు తయారుచెయ్యాలి, ఆ నిపుణులను లాటరీ పధ్ధతిలో ఎంపిక చెయ్యాలి. ప్రతి మంత్రివర్గ శాఖకు నియామక కమిటీని ఎన్నికల అయిన వెంటనే లాటరీ పద్ధతిన ఆ కమిటీలో ఉండటానికి అర్హతలున్న వారిని ఎలెక్షన్ కమీషన్ సభ్యులే తీస్తారు.ఆ కమిటీ సభ్యులందరూ కూడ అప్పటికి ఏ పదవిలోనూ ఉండి ఉండకూడదు. అందరూ అరవై ఐదు సంవత్సరాలు దాటినా వారై ఉండాలి. వారి జీవితంలో ఎక్కడా కూడ రాజకీయ వాసన ఉండి ఉండకూడదు, వారి బంధువులలో కూడ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు.
8. ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రి తమ మంత్రివర్గంలో మంత్రులను నియమిస్తూ వారి శాఖలను వెంటనే ప్రకటించాలి.
9. ఆ విధంగా ప్రకటించబడ్డ మంత్రివర్గ అబ్యర్ధులను, పైన చెప్పిన కమిటీ పూర్తిగా ఇంటర్వ్యూ చేసి, వారికి కేటాయించబడ్డ శాఖను సమర్ధవంతంగా నిర్వహించగలడా లేదా అన్న విషయం పరిశీలించి నిర్ణయిస్తారు. ఆ కమిటీ ఆమోదం ఇచ్చిన తరువాతే ఆ ప్రజా ప్రతినిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన పని మొదలు పెట్టాలి. అనర్హుడని కమిటీ భావిస్తే ఎం ఎల్ ఏ గానో, ఎం పీ గానో మాత్రమే ఉండాలి లేదా తనకు తగ్గ మత్రిత్వ శాఖను మళ్ళి ఆ శాఖకు చెందిన కమిటీ ముందు తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని మంత్రి అవ్వాలి.
10. పైన చెప్పిన ఇంటర్‌వ్యూలన్ని కూడ లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ప్రజలు ఎప్పుడైనా సరే ఆ ఇంట్రవ్యూలను సీదాగా వెళ్ళి చూసే అవకాశం కల్పించాలి. ఇంటర్వ్యూ కు అక్కడ నిలబడ్డ ప్రజా ప్రతినిధులు, తమ అనుచరులచేత గలాభా చేయించటం, నినాదాలు చేయించటం, బ్రూట్ ఫోర్సు ను చూపించటం జరిగితే వెనువెంటనే అటువంటి ప్రజా ప్రతినిధిని ప్రకటించి, ఆ నియోజకవర్గంలో మళ్ళి ఎన్నికలు జరిపించాలి.ఆ మనిషి ఆ ఎన్నికల్లో నిలబడకుండా అనర్హుడిగా ప్రకటించాలి.
11. అన్నిటికన్న ముఖ్యంగా ఓటువెయ్యటం తప్పనిసరి చెయ్యాలి. ఓటు వెయ్యని వారికి ఇంకంటాక్సులో రాయితీలన్ని తొలగించాలి, రేషన్ ఆరునెలలపాటు ఇవ్వకూడదు, ఉద్యోగి ఐతే వెంటనే సంవత్సరం పాటు సస్పెండు చెయ్యాలి. సస్పెన్షన్ పూర్తయిన తరువాత ప్రస్తుతం ఉన్న చోటునుండి వేరొక చోటుకు తప్పనిసరిగా బదిలీ చెయ్యాలి.

ఇవి నాకు తోచిన కొన్ని సూత్రాలు. ఈ విషయాలమీద కూలంకషంగా దేశంలో ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న నాటకాలన్నిటిని చూసి బాధపడుతున్న వారందరూ స్పంధించి సంస్కరణలను ప్రవేశ పెట్టటానికి చర్చలు జరుపుతూ తప్పనిసరిగా ఒక మంచి విధానాన్ని రూపొందించుకునే పని చెయ్యగలగాలి. అప్పుడే భావి పౌరులు మనల్ని గౌరవించే అవకాశం ఉన్నది