29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట.

కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరిలో జగనే పందెం కోడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేస్తున్న జగన్, డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి, పులివెందుల నుండి పోటీ చేస్తున్న విజయమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, బిటెక్ రవిలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరి నుండి జగన్ గెలిస్తాడనే దానికంటే ఆయన ఆధిక్యత(మెజార్టీ) పైనే జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.


జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట. ఐపిఎల్ మ్యాచ్‌లపై కూడా ఇంతలా బెట్టింగులు జరగడం లేదంట! బెట్టింగులు కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా జగన్ ఆధిక్యతపై జోరుగానే బెట్టింగులు సాగుతున్నాయంట. జగన్ 2 లక్షల ఆధిక్యం సాధిస్తే, ఇంత, మూడు లక్షల ఆధిక్యం సాధిస్తే ఇంత అని బెట్టింగులు కాస్తున్నారంట.

జగన్ లక్ష మెజార్టీతో గెలిస్తే లక్షకు రెండు లక్షల రూపాయలు, కోటికి రెండు కోట్ల రూపాయల తీరులో బెట్టింగులు సాగుతున్నాయని తెలుస్తోంది. జగన్‌పై బెట్టింగులు ఇలా ఉంటే ఇక తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయంట. అయితే ఈ రెండు పార్టీలలో ఏది రెండవ ప్లేసులో ఉంటుందనే విషయంపై బెట్టింగులు జరుగుతున్నాయంట. దీంతో బెట్టింగకు పాల్పడుతున్న వారికి జగన్ గెలుపుపై గట్టి ధీమా ఉండటంతో పాటు, కాంగ్రెసు, టిడిపిలు గెలవడం కష్టమనే భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జగన్ బిజెపి ??

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా మద్దతు ఇస్తుందనే వాదనలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఇటు జగన్, అటు బిజెపి తమ అంతర్గత మద్దతు విషయంపై ఖండించినప్పటికీ దానిని ఎవరూ నమ్మె స్థితిలో కనిపించడం లేదు. అందుకు పలు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ పార్టీ నేతలు చేస్తున్న కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయన్న మాటలు కూడా ఎవరూ నమ్మినట్లుగా కనిపించడం లేదు. కేవలం ఉప ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కలిసి పోయాయని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇటు తండ్రి మరణించడం, కాంగ్రెసు పార్టీ నుండి బయటకు రావడం వంటి పలు సానుభూతిలతో పాటు కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయని చెబితే తనకు మరింత సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఆ పార్టీలపై ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్, బిజెపి అంతర్గత మద్దతు తెరపైకి రావడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.


రెండు నెలల క్రితమే జగన్ బిజెపి జాతీయ నేతలను కలిసినట్లుగా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెసు, టిడిపి పార్టీ నేతలే కాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా బిజెపి జాతీయ నాయకులను జగన్ రెండు నెలల క్రితం కలిశారని శుక్రవారం కడపలో చెప్పారు. బిజెపి నేతలతో కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని జగన్ సమర్థవంతంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. దీంతో జగన్ ఆ నాయకులను కలిసినట్లుగా స్పష్టమవుతోందని కొందరు భావిస్తున్నారు. బిజెపితో కలవడం అనే విషయంపై జగన్ మరో తప్పిదం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. బిజెపితో కలవనే కలవనని చెబుతూ ఒకవేళ కలిస్తే కనుక ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌లు కోరతానని చెప్పారు. దానిపై వెంటనే వివాదం చెలరేగడంతో సాయంత్రానికి మాట మార్చారు. తాను అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెప్పారు. ఆ తర్వాత శుక్రవారం జగన్‌కు చెందిన సాక్షి పత్రికలోనే జగన్ తాను బిజెపితో కలవనని చెప్పడానికే ఆ వ్యాఖ్యల చేశారంటూ వార్తను ప్రచురించారు. అంటే ఏది నిజం. ఇలాంటి అస్పష్ట వ్యాఖ్యల ద్వారా బిజెపితో అంతర్గతంగా పొత్తు కుదిరిందని చెప్పకనే చెప్పారు.

ఇక కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో జగన్ సంబంధాలు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీలు వేరైనప్పటికీ గతంలో కూడా ఇరువురు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. సాక్షాత్తూ కాంగ్రెసు నేత అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కర్ణాటకలో గాలి తరఫున బిజెపికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్టు అప్పట్లో వివాదం చెలరేగింది. ఇప్పుడు కూడా జగన్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా భారీ ఆధిక్యంతో గెలుస్తాడని గాలి ఇటీవల అన్నట్లుగా తెలుస్తోంది. ఇక జగన్ సంగతి ఇలా ఉంటే బిజెపి కూడా జగన్‌కు మద్దతు పలుకుతుందని చెప్పడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బిజెపి - జగన్ మద్దతుపై పిసిసి చీఫ్ డిఎస్ వ్యాఖ్యలు చేస్తే జగన్ కంటే ముందుగానే బిజెపి స్పందించడం గమనార్హం. తమ మధ్య అవగాహన లేదని చెప్పడం కంటే ముందుగా తమను మైనార్టీ వ్యతిరేకులుగా పేర్కొన్న దానికి సమాధానం చెప్పాలి. కానీ బిజెపి తమను మైనార్టీ వ్యతిరేకులుగా చూపిస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పడానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంత విడ్డూరం. తమను మైనార్టీ వ్యతిరేకులుకు సృష్టిస్తున్న వారిపై విరుచుకు పడకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పి ఆయనకు అంతర్గత మద్దతు ఉందని చెప్పకనే చెప్పినట్టుగా పలువురు భావిస్తున్నారు.

ఇక మరో విషయం ఉప ఎన్నికలలో అభ్యర్థిని బరిలో నిలపక పోవడం, అందుకు బలం లేదని కారణం చెప్పడం మరింత విచారకరం. గత సాధారణ ఎన్నికల్లో తమకు బలం లేదనే విషయం బిజెపికి తెలియదా. మరి అప్పుడు కడప పార్లమెంటు నుండి ఎందుకు పోటీ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కడపలో వైయస్‌ను తట్టుకోవడానికి హేమాహేమీలైన పార్టీలో ఆలోచిస్తున్న సమయంలో బిజెపి 2009లో కడప నుండి అభ్యర్థిగా బరిలో దింపిందని సమాచారం. అంతేకాదు గతంలో నంద్యాల నుండి పోటీ చేసిన పివి నరసింహారావుపై ఏ పార్టీ పోటీ చేయనప్పటికీ బిజెపి బరిలోకి దించింది. అప్పటికి బిజెపికి రాష్ట్రంలో అసలు ఇప్పుడున్న ప్రాధాన్యత కూడా లేదంట. మరి ఎందుకు బరిలోకి దింపింది. అంటే సమాధానం గెలవకున్నా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి. మరి ఇప్పుడు కడపలో తమ ఓటు బ్యాంకును కాపాడుకొని పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యం బిజెపికి ఎందుకు లేదు. జగన్‌తో కలిసినందుకేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి స్థానిక బిజెపి నేత కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరి ఆ నాయకున్ని పోటీ చేయకుండా ఎందుకు నిలువరించింది. ఇవన్నీ చూస్తుంటే జగన్, బిజెపి మద్దతు అంతర్గంతంగా కనిపిస్తున్నందునే అనే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుండి వస్తుంది.

వైయస్ జగన్‌పై తన ఈనాడు దినపత్రికను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు

కడప ఉప ఎన్నికల సందర్భంగా రామోజీ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తన ఈనాడు దినపత్రికను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ వ్యవహారాలను వెలికి తీసే పని పెట్టుకున్నారు. వైయస్ జగన్ పేరు ప్రస్తావించకుండా ఈనాడు దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ఓ వార్తా కథనాన్ని అందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే శీర్షిక కింద ఎవరి పేరు పెట్టకుండా ఓ వార్తాకథనాన్ని ప్రచురించారు. చదివినవారికి ఆ వార్తాకథనం ఎవరిని ఉద్దేశించి రాశారో వెంటనే అర్థమైపోతుంది. అది తప్పకుండా వైయస్ జగన్‌ను ఉద్దేశించి రాశారనేది వేరుగా చెప్పనక్కర్లేదు.

కడప జిల్లాలో పార్టీ నాయకులను జగన్ వర్గీయులు బెదిరిస్తున్నారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం చెప్పకనే చెబుతోంది. వస్తే మా పార్టీలోకి రండి, వేరే పార్టీల్లోకి వెళ్లొద్దని బెదిరిస్తున్నట్లు ఈనాడు దినపత్రిక రాసింది. ఏజెంట్లుగా కూర్చుంటే మీ సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించింది. కడపలో ఓ పార్టీ నేతలు హల్‌చల్ చేస్తున్నారని రాసింది. దీన్ని బట్టి, రామోజీ రావు పద్ధతి ప్రకారం ఇటువంటి వార్తాకథనాలను కడప ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు తన పత్రికలో రాస్తూ పోతారనేది అర్థమవుతూనే ఉన్నది.

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 2011 సంవత్సరానికి గాను మొట్టమొదటి వనితా వేదిక కార్యక్రమం ఈ శనివారం డల్లాస్‌లోని రుచి ప్యాలెస్ రెస్టారెంట్‌లో జరిగింది. వనితా వేదిక కమిటీ చైర్ శిరీష బావిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చర్చా వేదిక, పాటలు, వీణా వాదన కార్యక్రమాలు సభికులను అలరించాయి. మధుమతి, దేవి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటతో సభ ప్రారంభమైంది. సుష్మ ముగడ వీణాగానం, అపర్ణ వేదుల లలిత సంగీతం వీనుల విందుగా సాగాయి.


ఆ తర్వాత కమిటీ సభ్యులు మంజులత కన్నెగంటి, హిమ రెడ్డి, నీరజ పడిగెల, శారద పడాల, శ్రీదేవి అరవపల్లి చర్చా వేదికను నిర్వహించవలసిందిగా ప్యానల్ సభ్యులను ఆహ్వానించారు. మాతృత్వపు మధురిమలు, - టీనేజ్ పిల్లల పెంపకం అనే అంశంపై జరిగిన చర్చలో ఉష షేరి, సీత ములుకుట్ల, సురేఖ గంగసాని, సునీత కోసూరి, సంధ్య గవ్వా, రమా కాసెట్టి, మాధవీ రెడ్డి, సుగాత్రీశర్మ, లీల పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని, బారతదేశంలో పెరిగే పిల్లలకు సహజంగా తెలిసే కుటుంబ విలువలు విదేశాలలో నివసించే పిల్లలకు తెలియజేయాలంటే తల్లదండ్రులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు సభ్యులు వ్యక్తీకరించారు. పరిమితులు పాటిస్తూ చక్కని మార్గాన్ని పిల్లలకు నిర్దేశించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలని అన్నారు. సుమారు గంటకు పైగా వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలో పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం చక్కటి నడవడికతో పిల్లలు పెరగడానికి గట్టి పునాది అనే అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. సుజన పాలూరి, సుష్మీ కోసూరి ఈ చర్చను ఆద్యంతం ఆసక్తికరంగా, సభికులందరినీ అనుసంధానం చేస్తూ నిర్వహించారు.

వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు

అనాలోచితంగా అన్నారో, మనసులో మాటను బయట పెట్టారో గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాను బిజెపితో పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన ఇరకాటంలో పడ్డారు. దాంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అవకాశంగా తీసుకుని వైయస్ జగన్‌ను లక్ష్యం చేసుకున్నాయి. దీని నుంచి బయటపడడానికి వైయస్ జగన్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోబోమంటూ తాను చేసిన ప్రకటనను పట్టించుకోకుండా, ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలనే కాకుండా రామోజీ రావును కూడా తప్పు పడుతూ సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

బిజెపితో పొత్తు ఎంత అసాధ్యమో చెప్పడానికి వైయస్ జగన్ ఆ మాట అన్నారని, ఒక్క వ్యాఖ్యకు తెలుగుదేశం, కాంగ్రెసు, ఎల్లో మీడియా (ఈనాడు) వక్రభాష్యాలు అల్లుతున్నాయని సాక్షి ఆడిపోసుకుంది. దశాబ్దం పాటు బిజెపితో అంట కాగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్‌పై విమర్శలు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బిజెపి అగ్రనేత అద్వానీతో చంద్రబాబు, రామోజీ రావు ఉన్న ఫొటోను వార్తాకథనంలో ప్రచురించింది. బిజెపి మతతత్వాన్ని పక్కన పెట్టి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా అని సాక్షి ప్రశ్నించింది. మొత్తం మీద, సాక్షి మీడియా వార్తాకథనాన్ని బట్టి వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు