22, మే 2011, ఆదివారం

కాంగ్రెసు వైపు వైయస్ జగన్?

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి కాంగ్రెసులోకి రప్పించేందుకు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీకి అత్యంత ప్రధాన రాష్ట్రంగా పేరుపడ్డ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ దెబ్బ తినకూడదంటే జగన్‌ను దరి చేర్చుకోక తప్పదని ఆజాద్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్‌తోనే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆజాద్ పార్టీని నడిపించే నాయకుడు ఎవరు కూడా లేరవి నిశ్చయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన పలువురు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. ఎవరి వలన పార్టీ బలపడుతుంది అనే విషయంపై రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అందరి ఆలోచనలతో న్యూడిల్లీ వెళ్లిన ఆజాద్ జగన్‌ను పార్టీలోకి అహ్వానించడం అనే కొత్త వాదనను అధిష్టానం ముందు ఉంచినట్లుగా సమాచారం.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బలహీనపడ్డారని, ఆయన పార్టీని సరిగా నడపలేక పోతున్నారనే భావనకు ఆజాద్ వచ్చారని, మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడంతో ఆయన సిఎంపై మరింత అసంతృప్తితో వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆజాద్ రాక కారణంగా రాష్ట్రంలో కొత్త సమీకరణాలు వచ్చే అవకాశం లేక పోలేదని, పెను మార్పులు జరిగే అవకాశమున్నదని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారంట. కడప జిల్లాలో జగన్‌కు గట్టిపోటీ కూడా ఎవరూ ఇవ్వక పోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తోంది. జగన్‌ను అడ్డుకోవడంలో అందరూ విఫలమవడంతో జగనే ఆజాద్‌కు సమాధానంగా కనిపిస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మహారాష్ట్రలో శరద్ పవార్, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టి కాంగ్రెసును పూర్తిగా దెబ్బ తీసిన వైనాన్ని అధిష్టానానికి ఆజాద్ గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే జగన్ పార్టీలోకి రావడానికి ఆసక్తి కనబర్చకున్నా కనీసం జగన్ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని ఆజాద్ మదిలో ఉన్నదని తెలుస్తోంది. అయితే సెంటిమెంట్ కారణంగా ఇప్పటికిప్పుడు జగన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి 2014 వరకు చూసి అప్పటి ఎన్నికలలో జగన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో గమనించి జగన్‌ను పార్టీలోకి తిరిగి రప్పించడము ఆయన కాదంటే కలిసి వెళ్లడమా అనే నిర్ణయానికి వచ్చే అవకాశాలను ఆజాద్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి నుండే వ్యూహం రచిస్తున్నట్లుగా సమాచారం. కేంద్రంలో కాంగ్రెసు బలపడాలంటే 2014 ఎన్నికలలో జగన్ మద్దతు తప్పనిసరి అని ఆజాద్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావు కూడా తెరపైకి వస్తారనే వాదనలు కూడా ఆజాద్ వచ్చి వెళ్లిన తర్వాత వినిపిస్తుండటం విశేషం. అయితే ఆయన ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెసును దెబ్బతీయాలనుకుంటే జగన్‌ను అణగదొక్కడం అనే అంశంపై కూడా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తన లక్ష్యం అయిన ముఖ్యమంత్రి అయినా కాకున్నా కాంగ్రెసును దెబ్బతీయడం మాత్రం ఖాయం కాబట్టి ఆజాద్ అన్ని కోణాలలో దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది

బైబిల్ లెక్కల ప్రకారం.. మే 21, 2011 (శనివారం)న ఈ ప్రపంచం అంతరించిపోతుందని అమెరికాలో డప్పుకొట్టి మరీ ప్రచారం చేసిన కొందరు ప్రీచర్లకు చేదు అనుభవమే ఎదురైంది. కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన "ఫ్యామిలీ రేడియో" అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ తెలిపిన దాని ప్రకారం.. మే 21, 2011న అమెరికాలో స్థానిక సమయం ప్రకారం, శనివారం సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు పెను భూకంపం సంభవించి ఈ ప్రపంచం అంతరించి పోతుందని విశ్లేషించి శనివారాన్ని ‘జడ్జిమెంట్ డే’ అని అభివర్ణిస్తూ భారీ ప్లకార్డులు, బ్యానర్లతో న్యూయార్క్ మొత్తం ప్రచారం సాగించారు. కానీ ఆయన చెప్పినట్లుగా ఏమీ జరగలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది.

‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదించారు. ఇంకా ఏసు ప్రభువుకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. అలాగే అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ పేర్కొన్నారు.

గత 1994లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. 1994లో ఓ రోజు సరిగ్గా 6 గంటలకు భూమి అంతరించి పోతుందని, ఇది తొలుత న్యూజిలాండ్ నుంచి ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు 6 గంటల సమయం వచ్చి వెళ్లపోయింది. భూకంపం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎక్కడా కనిపించలేదు. కేవలం మీడియా అటెన్షన్ తప్ప. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి. ప్రజలను రక్షించాల్సిన దేవుడే ప్రపంచాన్ని అంతం చేస్తాననడం ఎంత వరకూ సమర్థనీయమైనదో సదరు ప్రచారకులే తెలుసుకోవాలి. కాబట్టి ఏం జరిగినా అంత మన మంచికే అనుకుంటూ ప్రజలందరూ ముందుకు సాగిపోతూ, ఇలాంటి మూఢ నమ్మకాలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు.