20, ఏప్రిల్ 2011, బుధవారం

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తప్పదా? ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, ఈ ఉప ఎన్నికలు మార్పునకు నాంది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప అభ్యర్థి వైయస్ జగన్ తన ఎన్నికల ప్రచారం పదే పదే చెబుతున్నారు. ఆ మార్పు కాంగ్రెసును కూలదోసి తాను అధికారంలోకి రావడానికి అనువైందనేది ఆయన చెప్పకున్నా అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ సువర్ణ పాలనకు తన రాజకీయాలు పాదులు వేస్తాయని ఆయన అంటున్నారు. అయితే, కడప ఉప ఎన్నికల ఫలితాలకు అంత చేవ ఉందా అనేది ప్రశ్న.


నిజానికి కడప, పులివెందుల ఉప ఎన్నికలు వైయస్ జగన్‌కు మాత్రమే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిస్తే జగన్ రాజకీయాలు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. ఓడిపోతే మాత్రం జగన్ రాజకీయాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ విషయం వైయస్ జగన్‌కు తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే మరింత మంది శాసనసభ్యులు తన వెంట వస్తారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు సమకూరుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. బహుశా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అందుకే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని మంగళవారంనాడు వ్యాఖ్యానించి ఉంటారు.

కానీ, ఉప ఎన్నికల తర్వాత జగన్‌కు అంత సీన్ ఉంటుందా అనేది అనుమానమే. ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ జరిగే నష్టం ఏమీ లేదు. గెలిస్తే మాత్రం జాక్‌పాట్ కొట్టినట్లే. అయితే, గెలిచే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు రెండవ స్థానం కోసమే పోటీ పడవచ్చు. రెండో స్థానం సాధించే పార్టీలు కాస్తా ఆనందించడానికి, మూడో స్థానం లభిస్తే కాస్తా కుండిపోవడానికి మాత్రమే ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికలు ఉపయోగపడుతాయి. కాంగ్రెసు మూడో స్థానంలో ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీపై కూడా అటువంటి ప్రభావమే పడుతుంది. ఏమైనా, ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలను మార్చే సీన్ జగన్‌కు లేదని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది. మరో వైపు ఈ రెండు అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి బిసిలు ఏకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆధిపత్యంలో తెలంగాణ ఉద్యమం సాగుతుండడం పట్ల రెడ్డి నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పైగా, కెసిఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ ఉద్యమ నేతలుగా ముందుకు వచ్చారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వారితోనే ఉంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని తమ నాయత్వంలోకి తీసుకోవడానికి రెడ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ని ముందుకు తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన జైపాల్ రెడ్డిపై, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై తెరాస కార్యకర్తలు కోడి గుడ్లు విసిరారు. తెలంగాణ ఉద్యమం పెరిగితే కెసిఆర్ కుటుంబ సభ్యులు, వెలమ కులానికి చెందిన వారే లబ్ధి పొందుతారనే ప్రచారాన్ని రెడ్లు చాప కింద నీరులా సాగిస్తున్నారు. తెలంగాణలో వెలమల జనాభా చాలా తక్కువ. రెడ్ల జనాభా వారికన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆధిపత్యంలో కూడా వారిదే పైచేయి. అయితే, తెలంగాణ ఉద్యమం విషయంలో మాత్రం కెసిఆర్ హవా సాగుతోంది. రాజకీయంగా బలోపేతం కావడానికి కెసిఆర్ కోదండరామ్ నాయకత్వంలోని రాజకీయ జెఎసిని బాగా వాడుకున్నారు. అయితే, మిలియన్ మార్చ్ విషయంలో కోదండరామ్‌కు, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ జెఎసి స్థానంలో మరో వేదికను ఏర్పాటు చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కెసిఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య పొడసూపిన విభేదాల నేపథ్యంలో ఎస్ జైపాల్ రెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోదండరామ్ నాయకత్వంలో రెడ్డి నాయకులు పనిచేయడానికి సిద్ధపడాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా, జైపాల్ రెడ్డి కోదండరామ్‌ను ప్రశంసిస్తున్నారు కూడా. మిలియన్ మార్చ్ విజయవంతమైందని జైపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందువల్లనే తెరాస ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. కోదండరామ్ నాయకత్వంలోని జెఎసిని బలోపేతం చేయాలని జైపాల్ రెడ్డి భావిస్తున్నారట. కోదండరామ్‌ను ముందు పెట్టి రెడ్డి నాయకులను ఏకం చేయడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. జెఎసిలో కీలక పాత్ర వహించేందుకు తగిన రంగాన్ని జైపాల్ రెడ్డి సహకారంతో నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, రెడ్డి, వెలమ నాయకుల ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి బిసి నాయకులు మరో వైపు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందిన రెడ్డి నాయకులు పని చేయడానికి సిద్ధపడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు సిపిఐ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి నాయకులకు కోదండరామ్‌తో కలిసి పనిచేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమం మే నెల నాటికి కీలక మలుపు తిరుగవచ్చునని అనుకుంటున్నారు.

అపర చాణక్యుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు.

రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడు పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు నిరాఘటంగా పాలించిన చంద్రబాబు తన పాలనా కాలంలో అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో భారీ సంస్కరణలు చేశారు. రాష్ట్రం వరకే పరిమితం అయిన హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. ఐటితో యువతకు భారీగా ఉపాది కల్పించారు. రాజకీయ ఎత్తుగడల్లో తనను మించిన వారు లేరని విపక్షాలు, విమర్శకుల చేత సైతం పొగడ్తలు అందుకున్నవాడు. ఇలా తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాల్లో, దివంగత నందమూరి తారక రామారావు తర్వాత అంత పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసి సొంత పార్టీ మాత్రమే కాకుండా ఆయన వైరి పార్టీలు కూడా సైతం జాలిపడే స్థితికి దిగజారడం శోచనీయం.


ప్రస్తుత చంద్రబాబునాయుడు పరిస్థితి చూసిన వారు నాటి రాజకీయ చాతుర్యం ఎక్కడకు పోయిందని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ, మరో వైపు జగన్, ఇంకోవైపు కుటుంబ కలహాల మధ్య బాబు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిత్యం చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటూ రెండు కళ్ల సిద్దాంతంపై ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని మరింత బలపర్చాలంటే కాంగ్రెసు కన్నా టిడిపిని ముందుగా దెబ్బతీయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకే ఆయన టిడిపిని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పలువురి మాటల్లో చెప్పాలంటే కెసిఆర్‌కు ప్రత్యేక తెలంగాణ కన్నా టిడిపి దెబ్బతీయడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిని బయటకు తీసుకు వస్తున్నారు.

ఇప్పటికే బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని టిఆర్ఎస్‌లో లాగారు. ఉప ఎన్నికల కోసం రాజీనామా చేసిన చెన్నమనేని రమేష్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అంతకుముందు రమేష్ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తదుపరి లక్ష్యంగా పాల్వాయి రాజ్యలక్ష్మిని చేసుకున్నారు. ఆమెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాబుకు తెలంగాణలో ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కష్టతరంగా మారింది. అందుకే పోచారం రాజీనామా ఆమోదానికి టిడిపి కూడా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక టిఆర్ఎస్ సంగతి అలా ఉంటే పార్టీలో ఉంటూ నాగం జనార్ధన్ రెడ్డి బాబుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. పార్టీ వీడకుండానే పార్టీని ముప్పుతిప్పలు పెడుతూ కంటిలో నలుసులా మారారు. ఇక టిడిపికి గట్టి పట్టు ఉన్న కోస్తా జిల్లాల్లో జగన్ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బాబును విమర్శిస్తూ జగన్ వెంట వెళుతున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టి బాబును అధికారంలోకి రాకుండా చేశారు. 2014లో అధికారంలోకి వద్దామనుకుంటున్న బాబుకు ఇప్పుడు జగన్ అడ్డు పడేలా కనిపిస్తున్నారు.

ఇవన్నీ సమస్యలు ఇలా ఉంటే బాబుకు ఇటీవలే మరో సమస్య పట్టుకుంది. అది వారసత్వ సమస్య. బాబు తనయుడు లోకేష్ కుమార్‌ను చంద్రబాబు హైప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఉద్దేశ్యంతో హరికృష్ణ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. హరికృష్ణ ప్రత్యక్ష యుద్దానికి దిగకుండా విజయవాడ గలాటాకు తలుపులు తెరిచారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య చల్లబడింది. అయితే సహజంగా ఆవేశ పరుడు అయిన హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎప్పుడు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తారో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో త్వరలో జరగనున్న మహానాడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహానాడుకు హరికృష్ణ రాకుంటే దూరం పెరిగిందని, వస్తే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అనే భయం పచ్చదళంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారసత్వ పోరు సద్దుమణిగినప్పటికీ తెలంగాణ, జగన్, నాగం తదితర సమస్యలు హైటెక్ సిఎంను పట్టి పీడిస్తున్నాయి. అయితే సహజంగా చాణక్య తెలివిగల చంద్రబాబు వీటన్నింటిని అధిగమించగలడని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు జూ.ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసిన సందర్భాన్ని కూడా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులో ప్రయోజం ఉంటుందని కూడా బావిస్తున్నారు.