14, ఏప్రిల్ 2011, గురువారం

తమిళనాడులో కరుణానిధి జయలలిత ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ భారతంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉప ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ఇన్ని రోజులు తమ తమ గెలుపు కోసం ప్రచారంలో మునిగి తేలిన ఆయా పార్టీల భవితవ్యం నేడు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే, జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకే కూటమి ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఈవిఎంలలో నిక్షిప్తమవుతున్న సమయంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం జయలలిత, విజయ్‌కాంత్‌లు తమ కూటమి విజయం ఖాయమని ప్రకటించాయి. కాంగ్రెసు, డిఎంకె అవినీతిలో కూరుకు పోయినందని, పాలనలో డిఎంకే విఫలం అయినందున ప్రజలు తమకే పట్టం కడతారని చెప్పింది.


కాగా ఎన్నికల సంఘం తీరును ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పు పట్టారు. ప్రతి పక్ష పార్టీకి లాభం చేకూర్చేలా ఐసి వ్యవహరించిందని నిందించారు. అయినా విజయం తమదే అని చెప్పారు. ఓటమి భయంతోనే జయలలిత తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ముఖ్యమంత్రి కరుణానిధి అంటున్నారు. డిఎంకే ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కడం ఖాయమని చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈసారి సర్వే ఫలితాలు మాత్రం డిఎంకెకు అనుకూలంగా లేవు. అన్నాడిఎంకెకే విజయావకాశాలు ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో డిఎంకెకు ప్రత్యక్ష పాత్ర ఉండటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని సర్వేలు వెల్లడి చేస్తున్నాయి.

అన్నాడిఎంకె పదేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తోంది. అయితే సర్వేలను బట్టి ఇప్పుడు జయలలిత కోరిక నెరవేరనున్నట్టుగా తెలుస్తోంది. సర్వే ఫలితాలలో సుమారు 51 శాతం మంది ఓటర్లు మార్పు కోరుకుంటుండగా, 36 శాతం మంది ఓటర్లు మాత్రమే కరుణానిధికి మద్దతు పలికారు. సర్వే ఫలితాల ప్రకారం డిఎంకె కూటమికి ఈసారి 60 - 70 సీట్లకు మధ్యగా ఉండవచ్చని తెలుపుతున్నాయి. అయితే తమిళ ఓటర్ల తీర్పు గతంలో ఎప్పుడూ సర్వేలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. గతంలో సర్వేలు గెలుస్తాయని చెప్పిన పార్టీ ఓటమి చవి చూడటం విశేషం.

ఇక కేరళ విషయానికి వస్తే ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ కూటమిలలో ఏ కూటమికి గత ముప్పయి అయిదేళ్లుగా కేరళ ఓటర్లు వరుసగా పట్టం కట్టలేదు. ఎల్‌డిఎఫ్‌కు ఆ భయం పట్టుకోగా, యుడిఎఫ్‌కు అది కలిసి వస్తున్న అంశం. అయినప్పటికీ జాతీయస్థాయిలో యుపిఏ తీవ్ర అవినీతిలో కూరుకు పోయిన ఈ సమయంలో కేరళ ఓటర్ల తీర్పులో మార్పు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. కేరళ ఓటర్లలో 25 శాతం మంది క్రిస్టియన్లు, 22 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాబట్టి వారిని మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయాస పడ్డారు. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కూడా మార్పు దిశగా ఓటర్లు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 404 నియోజకవర్గాలు ఉండగా, 3932 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. మూడు రాష్ట్రాలలో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేక పోవడం విశేషం. కాగా ఈ ఎన్నికల సందర్భంగా ఈసీ భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బు సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. కేరళ ప్రవాస భరతీయులకు కూడా ఓటు హక్కు కల్పించింది. మూడు రాష్ట్రాల్లో కలిపి ఏడు కోట్ల వరకు ఓటర్లు ఉంటారు. తమిళనాడు అయినా, కేరళ అయినా, పుదుచ్చేరి అయినా ప్రతి పార్టీకి గెలుపు ముఖ్యమే కావడం విశేషం. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న జయలలిత పీఠం ఎక్కాలని, కుంభకోణాల్లో కూరుకు పోయిన కరుణానిధి తమిళ ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడానికి, కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లు తమ తమ విజయం కోసం చేసిన కృషి ఈ రోజు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. దాని ఫలితం కోసం మాత్రం వచ్చే నెల 13వ తారీఖు వరకు ఆగాల్సింది.

తెలంగాణ ఉద్యమానికి చెక్??

తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. తాజా, నో వర్క్ - నో పే జీవోను విడుదల చేసింది. గతంలో తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా, వారు అటువంటి ఆందోళనను తిరిగి చేపట్టకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసినట్లు కనిపిస్తోంది.

పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

గో గ్రీన్...

వేసవికాలం వచ్చిందంటే చాలు వేడిపై యుద్ధం ప్రకటించాల్సిందే. అందుకు ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, వట్టివేళ్లు అంటూ ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత చల్లదనం ఇవ్వాలంటే ఇంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మీ కోసం...

వేసవిలో ఇంటి పై కప్పుకు వైట్ పెయింట్ వేయించుకోవాలి. తెలుపు రంగు పెయింట్‌కి ఉన్న పరావర్తన గుణం వల్ల గదులు చల్లగా ఉంటాయి. ఈ ఇంట్లోకి నేరుగా సూర్యకిరణాలు పడే సమయంలో కిటికీ తలుపులు మూసేసి... సాయంత్రం వాతావరణం కాస్త చల్లపడిన తరువాత కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గదుల్లో వేడి బయటకు పోయి ఇల్లు చల్లగా ఉంటుంది.



తెలుపు రంగు వేడిని పరావర్తనం చేస్తుంది కనుక అదే రంగు విండో షేడ్లు, కర్టెన్లు, బ్లైండ్స్ కిటికీలకు పెడితే వేడి లోపలికి రాకుండా నిరోధించొచ్చు. బ్లైండ్స్, షేడ్స్, కర్టెన్లను అమర్చిన తూర్పు వైపు కిటికీలను ఉదయం, పడమర వైపు కిటికీలను సాయంత్రం మూసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడి బయటనే ఉండి ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు తక్కువ శక్తిని వినియోగించుకుని ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి.


ఇంటి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి

ఎలక్ట్రిక్ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైట్లు ఇంటి లోపల వేడిని జనింపచేస్తాయి. అందుకని ల్యాంప్స్, టెలివిజన్ వంటి ఉష్ణాన్ని జనించే పరికరాలను ఎయిర్ కండిషనింగ్ థర్మోస్టాట్ పక్కన లేకుండా చూసుకోవాలి.

ఎక్కువ కాంతిని ఇచ్చే లైట్లు వాడకపోవడం మంచిది. అలాగే ఉష్ణాన్ని జనింపచేసే పరికరాలను కూడా వాడకూడదు. ఎక్కువ వెలుగు కోసం ఫ్లోరోసెంట్ బల్బులు వాడొచ్చు. ఇవి ఐదో వంతు శక్తిని వినియోగించుకుని తక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తాయి.

వేసవిలో వంట విషయంలో కూడా జాగ్రత్తవహించాలి. వాతావరణం వేడెక్కకముందే వంట పూర్తిచేసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో వేడిని తగ్గించుకోగలిగితే అప్పుడు తక్కువ ఎనర్జీతో ఇంటిని చల్ల పరుచుకునే అవకాశం ఉంటుంది.

మొక్కలతో మ్యాజిక్ చేయొచ్చు

దక్షిణ, పడమర దిశల్లో మొక్కలు నాటితే ఇల్లు చల్లగా ఉంటుంది.

చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా.

మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోపల స్థలం ఉంటే డెకరేటివ్ పాట్స్ లేదా స్టాండుల్లో ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకోవచ్చు.

ఇండోర్‌ప్లాంట్స్ వేరు భాగాల్ని శుభ్రం చేసి నీళ్లు నింపిన వేజుల్లో కూడా ఉంచొచ్చు.

మొక్కలు ఉన్న దగ్గర పగటి ఉష్ణోగ్రతలు మొక్కలు లేని ప్రాంతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అందుకని గో గ్రీన్...