5, మార్చి 2011, శనివారం

సొమ్ము వెదజల్లుతున్నాడు

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్‌ చౌదరి సంస్థాపిత ఎన్‌ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో 42 శాతం, టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.

మహిళా సిగిరెట్ నీ అలవాట సరదాన?

‘ఆమె’ పొగబారుతోంది. అవును. పురుషపుంగవులతో పోలిస్తే అంతోఇంతో పొగకు దూరంగా ఉండే మహిళలను కూడా సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు నెమ్మదిగా లోబరచుకుంటున్నాయి. తద్వారా లాభాలను మూటగట్టుకునేందుకు దశాబ్దాల క్రితం నుంచే వ్యూహం ప్రకారం వ్యవహరించటం ప్రారంభించాయని అధ్యయనంలో వెల్లడయింది. అవును అక్షరాలా నమ్మలేని నిజం! పొగాకు పరిశ్రమకు చెందిన 1991 నాటి అంతర్గత వ్యవహారాల నివేదిక ఒకటి దీనిని నిర్ధారించింది కూడా. చార్మినార్‌ సిగిరెట్ల తయారీ సంస్థ ఫిలిఫ్స్‌ మోరిస్‌ 1968లో తన వర్జీనియా స్లిమ్స్‌ సిగిరెట్‌ అమ్మకాలను పెంచుకొనేందుకు ఓ ప్రకటనను రూపొందించింది. దానిలో ”అమ్మాయీ, చాలా కాలానికి నువ్వు సాధించావు” అనే నినాదం. దాని కింద అమెరికాలో మహిళా ఉద్యమాలు సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతోనూ, స్వతంత్రంగానూ వ్యవహరించే యువతులు వర్జీనియా స్లిమ్స్‌ సిగిరెట్లు తాగటం ద్వారా తమ స్వాతంత్య్రాన్ని స్పష్టంగానూ సమర్ధవంతంగా వ్యక్తీకరించవచ్చని ఒప్పించే వ్యూహం ఈ ప్రకటనలో దాగి ఉందని 1991లో వెలువడిన ఓ నివేదికలో విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ ప్రకటన అమెరికాలో ఆశించిన ఫలితాలనివ్వటంతో మిగతా దేశాలలోనూ అదే తరహా వ్యూహాన్ని అమలు జరిపారు. జపాన్‌లో 1994లో ఇదే వర్జీనియా స్లిమ్స్‌ కోసం ఓ ప్రకటనను రూపొందించారు. ‘సామాజిక నియమాలకు అనుగుణంగా నేను సరైన దారిలోనే ప్రయాణిస్తున్నా, అయితే అదే సమయంలో, నా సొంత భావాలపట్ల నిజాయితీగా ఉంటా. అందువలన నా కోరికను తీర్చుకునేందుకు సామాజిక నియమాలు ఆటంకంగా మారితే నేను లెక్కచేయను’ అంటూ ఓ యువతితో చెప్పించారు ఆ ప్రకటనలో. అంటే సిగిరెట్లు తాగాలనుకొంటే దేన్నీ లెక్కచేయనని చెప్పటమన్నమాట.
ఏడాదికి 50 లక్షల మంది పొట్టనబెట్టుకుంటున్న పొగ
పొగాకు సంబంధించి దృష్టిసారించాల్సిన పలు విషయాలు కెనడాకు చెందిన వాటర్లూ, వేవెస్ట్‌ విశ్వవిద్యాలయాలు ‘మహిళా సాధికారత – స్త్రీపురుషులలో పొగ తాగే నిష్పత్తి’ అంశంపై జరిపిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సంచిక ఈ వివరాలను ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా ప్రస్తుతం ఏడాదికి 50 లక్షల మంది పొగ తాగి మరణిస్తున్నారని ఆ నివేదిక విదితం చేసింది. 2030 నాటికి పొగ వలన 80 లక్షల మంది మరణించవచ్చని అంచనా వేశారు. అదే ఈ శతాబ్ది అంతానికి మొత్తం వంద కోట్ల మంది పొగ తాగిన కారణంగా మరణించవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాపితంగా మహిళలకంటే పురుషులు ఐదురెట్లు అధికంగా పొగ తాగుతున్నారు. అయితే స్త్రీ-పురుష నిష్పత్తి దేశదేశానికీ తేడా ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, పశ్చిమ ఐరోపాలోని అధిక దేశాలలో పురుషులతో సమంగా స్త్రీలూ పొగ తాగుతున్నారు. స్వల్ప, మధ్య ఆదాయ దేశాలలో ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. చైనాలో పొగతాగే పురుషులు 61 శాతం ఉండగా, మహిళలు కేవలం 4.2 శాతమే ఉండటం విశేషం. అర్జెంటీనాలో 34 శాతం పురుషులు, 23 శాతం మహిళలు పొగ తాగుతున్నారట. ఇప్పుడు పొగతాగే స్త్రీల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వయస్సువారీగా చూస్తే 13-15 ఏళ్ల యువతీ యువకులలో నిష్పత్తి వ్యత్యాసం 2-3 రెట్ల మధ్యనే ూండగా, మిగతా అన్ని వయస్సుల వారిలోనూ ఐదు శాతానికి పైనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.
సంప్రదాయం చట్టుబండలు
సాధారణంగా ఏ దేశంలోనూ మహిళలు పొగతాగటాన్ని సమాజం అంగీకరించదు. ఆ కారణంగానే స్త్రీలలో పొగ తాగేవారు తక్కువ. అమెరికాలో 1920 దశకంలో మహిళలు పొగతాగటం గౌరవప్రదం కాదని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్ధితి మారింది. పురుషులతో సమంగా మహిళలూ అక్కడ పొగ తాగుతున్నారు. సిగిరెట్‌ ఉత్పత్తిదారుల ప్రకటనల వ్యూహం కూడా దీనికి కారణమేనని పరిశీలనలలో తేలింది. సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు పెరుగుతున్న మహిళా సాధికారతను ఉపయోగించుకుని వారికి పొగతాగుడును అలవాటు చేయిస్తున్నాయి. ఇలా సామాజిక మార్పులను సొమ్ము చేసుకొనేందుకు సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు వేస్తోన్న ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజా అధ్యయనం హెచ్చరించింది.

దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిత్వానికి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని ఆరు దశాబ్దాలపాటు చెప్పుకుని చెప్పుకుని తుత్తిపడ్డాం. వినీ, వినీ విన్నవారి చెవులు తుప్పు పట్టిపోయాయంటే నమ్మి తీరాలి మరి. నల్లారి కిరణ్‌కుమార్‌ మంత్రివర్గంలో దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి. రాష్ట్ర మంత్రి పదవికి మార్చి మూడో తేదీన జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి త్యాగమూర్తుల సరసన చేరిపోయారు. తాను నమ్మిన విలువలకు వలువలు కట్టబూనుకున్న శాస్త్రి కంటే ప్రజల మనోభావాలకు స్పందించిన జూపూడి మిన్న అని నేను అంటే ఎవ్వరూ కాదనబోరనుకుంటాను. అయితే గియితే అంతగా ఆదాయం లేని దేవాదాయ శాఖ అంటే జూపల్లికి ఇష్టం లేకనే అధిష్టానాన్ని బెదిరించేందుకు రాజీనామా చేశాడని గిట్టనివాళ్లు, ప్రత్యేకించి సీమాంధ్రులు వాగితే వాగొచ్చుగాక. జూపల్లి పదవీ త్యాగం మామూలు వ్యవహారం కానేకాదు. అందుకనే అయన రాజ్యాంగాన్ని సైతం ధిక్కరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్ధాయి మంత్రులెవరయినా రాజీనామా చేయదలిస్తే ముఖ్యంత్రి ద్వారా గవర్నరుకు సమర్పించుకోవాలి. కానీ జూపల్లి ఏకంగా తన అధిష్టాన దేవత సోనియమ్మకు రాజీనామా పత్రాన్ని పంపేసి తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పేశారు. అదేమని అడిగిన పాత్రికేయులతో తాను ఏడాది క్రితమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తన త్యాగపూరిత ప్రణాళికను ప్రకటించానని గుర్తుచేశారాయన. మరి ఏడాది కాలంగా ఎందుకు త్యాగాలు చేయలేదేమని అడగ్గా … ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా” అంటూ జూపల్లి రాజీనామా వెనకున్న రహస్యాన్ని పరోక్షంగా విప్పకనే విప్పేశారనుకోండి. ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని ఇప్పుడూ నమ్ముతుంటే రాజీనామా ఎందుకు చేసినట్లో?” అని ఏ పాత్రికేయుడూ నోరు విప్పకపోవటం జూపల్లి తప్పుకాదుగదా! పాపం శమించుగాక! అంటే అయిపోయిందనుకోకండి. ఇంకా కొద్దిగా ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను మన్నించి తాను పదవీ త్యాగానికి పాల్పడినట్లు ఆయన తెగచెప్పేసుకున్నారు. చెప్పేసుకున్నారంటే… చెప్పులు వేసుకున్నారనుకునేరు. ఆయన చెప్పులు వేసుకున్నాడో, బూట్లే వేసుకున్నాడో, అవి ఏ సంస్థవో తేల్చి చెప్పటానికి నేనెవర్ని? ఆ మాటకొస్తే అసలు వాటినయినా, వీటినయినా వేసుకున్నాడో? లేదో? కూడా చూడకుండా చెప్పటం కుదరదుగాక కుదరదుగదా! సరే చెప్పుల సంగతి అట్లా పెడదాం. ‘ప్రజల మనోభావాలు’ అన్న మాట ఉంది చూశారూ! ఎంతటి గొప్పదనుకుంటున్నారు. ఈ శతాబ్దానికి ముందు ఆ మాట ఎప్పుడూ విన్నట్లు నాకు గుర్తులేదు. ఆ ఎనిమిది అక్షరాల అద్భుత పదం ముందు అన్నీ దిగదుడుపేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. అసలు దీన్ని ఈ శతాబ్దం పదంగా గుర్తించటమే కాకుండా, ఇటు దేశీయ లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ, అటు ప్రపంచస్ధాయి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ నమోదు చేయాలని నేను నొక్కి ఒక్కాణించదలచుకున్నాను. ఎవరికి ఏది ఇష్టమో, దాన్ని ప్రజల మనోభావంగా ప్రకటించేయవచ్చు. ఎవరికి ఏది కష్టమో దాన్ని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెగనాడనూ వచ్చు. అంటే ఈ పదం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అదే బాటలో జూపల్లి పయనించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తన పదవిని త్యాగం చేసేసి త్యాగయ్య అయ్యారు. ఇక్కడే నా పాడు మనస్సు కీడు శంకిస్తోంది. అదేమంటే… ఇతరేతర పదవుల్ని అట్లా ూంచుదాం. ఆయన వైఎస్‌ పాలనలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్నతో నా కు’శంక’ను తీర్చుకునేందుకు అంగీకరించండి. నా కుశంకను రాష్ట్రానికంతా వర్తింపజేయనులెండి. పేదలకు రేషను కార్డుల జారీ, వాటి ద్వారా చౌక దుకాణాల నిర్వహణ, వాటి ద్వారా దరిద్ర నారాయణులకు సరుకుల పంపిణీ తదితర జనోద్ధరణ కార్యక్రమాలన్నీ పౌరసరఫరాశాఖ ద్వారా జరగాల్సిన పనులు. మరి తెలంగాణ పేదలు తమకు రేషను కార్డులు వద్దనీ, ఎంత ధర పెట్టయినా తిండి గింజల్ని కొనుక్కుంటానమని మన జూపూడివారికి విన్నవించుకున్నారా? తెలంగాణలో చౌక దుకాణ యజమానులు సరుకుల్ని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే దారి మళ్లించారా? అవునని జూపూడి అంటే పేచీ లేదు. అయితే రేషను కార్డు కావాలి మహాప్రభో అంటూ లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులు తెలంగాణ ప్రాంత తహశీలుదారుల కార్యాలయాల్లో మూలుగుతున్నందున జూపూడి ధైర్యం చేసి ఆ మాట అనగల వీలులేదు. చౌక సరుకుల్లో 60 శాతానికి తక్కువ కాకుండా దారి మళ్లుతున్న వైనం పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తల రూపాన కన్పిస్తుంటే రెండో ప్రశ్నకూ జూపూడి లేదని చెప్పలేదడనుకుంటాను. మరి పౌరసరఫరాలశాఖకు సంబంధించి ప్రజల మనోభావాలను మన్నించేందుకు పూనుకోని జూపూడి అనే పెద్దమనిషి దేవాదాయశాఖ మంత్రిగా మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించటం వెనుక ఏమయినా మతలబు ఉందా? అన్నదే నా కుశంక. నా కుశంకను ఎవరు తీరుస్తారు? చెప్మా!

గంటకు పది కోట్ల రూపాయలు నల్లధనం దేశం సరిహద్దులు దాటుతుంది ?

నిత్యావరాల ధరలు పెరిగాయని ఆందోళన చేసే సామాన్య జనంపై లాఠీలతోనూ, తూటాలతోనూ విరుచుకుపడే ప్రభుత్వం నల్లధనం మదుపుదారుల పట్ల ముద్దుముద్దుగా వ్యవహరిస్తోంది.1948 నుంచీ ఇప్పటి వరకూ రూ.20 లక్షల కోట్ల నల్లధనం దేశం సరిహద్దులు దాటి ఉంటుందని అంచనా.రోజుకు రూ. 240 కోట్లు నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోంది, అంటే గంటకు పది కోట్ల రూపాయలు.కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్టు ధనబలానికి ఓ నకలు.రాజకీయ ధనబలం ముందు ప్రజాస్వామ్య విలువలు నానాటికీ కుంచించుకుపోతున్నాయి.2011-2012 బడ్జెట్టు మొత్తం కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేదిగా ఉంది.బడ్జెట్టులో వ్యవసాయ రంగానికి గతం కంటే రూ.5800 కోట్లు కోతపెట్టిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మాత్రం ఐదు లక్షల కోట్ల రూపాయలను రాయితీగా ఇచ్చింది.ఆదాయపు పన్ను మినహాయింపు ద్వారా రూ.88 వేల కోట్లు, ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు ద్వారా రూ.1.76 లక్షల కోట్లు, కస్టమ్స్‌ సుంకం తగ్గింపు ద్వారా రూ.2.24 లక్షల కోట్లు రాయితీలిచ్చింది.ఈ సొమ్ము 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దారిమళ్లిన దానికన్నా మూడు రెట్లు అధికమని లెక్క.వ్యవసాయం, ఆహారభద్రత నిధుల కేటాయింపుల్లోనూ కోతలు పెట్టింది.దీనికితోడు వ్యవసాయరంగానికి ఇచ్చిన అరకొర రాయితీలు కూడా అటుఇటు తిరిగి కార్పొరేట్‌ సంస్థలకే చేరతాయి.వ్యవసాయ రంగానికి లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నప్పటికీ వాస్తవానికి అవి కూడా పెద్దలకే దక్కుతున్నాయి.చిన్న- సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు నానాటికీ సన్నబడుతున్నాయి.ఇప్పుడు ఎన్నికలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయటమని భాష్యం.కోటీశ్వరులు మాత్రమే ఎన్నికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.తద్వారా రాజకీయ అవినీతి పెరిగిపోతోంది.ధనబలం పెరుగుతోన్న కొద్దీ ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబింపజేసే వారు కనుమరుగవుతున్న విషయాన్ని అందరూ ఆలోచించాలని నేను కోరుతునాను.