31, మార్చి 2011, గురువారం

బాబాయ్ - అబ్బాయ్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే.

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ సీట్లకు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. దీంతో వివేకానంద రెడ్డి, జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది. ఇప్పటికే ఈ ఎన్నకలకు కాంగ్రెసు పార్టీ వ్యూహరచన చేసింది. బుధవారంనాడు కడప జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ జిల్లా నాయకులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లాలతో పాటు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.


పార్టీ బలహీనంగా ఉన్న జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో పార్టీ ఇంచార్జీలను నియమించాలని కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన వివేకానంద రెడ్డి ఇక పూర్తిగా ఉప ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. వైయస్ జగన్‌ను ఓడించేందుకు తగిన వ్యూహరచన చేస్తున్నారు. జిల్లా నాయకులతో, కార్యకర్తలతో ఆయన తన సంబంధాలను పునరుద్ధరించుకుంటారు. శాసనసభలో జరిగిన వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి లక్ష్మణుడిలా కాపు కాశానని, ఇందులో భాగంగానే వైయస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీని ఎదుర్కున్నానని ఆయన చెప్పుకునే అవకాశాలున్నాయి.

వైయస్ రాజకీయాలకు వాస్తవంగా తానే వారసుడినని చాటుకోవడానికి ఆయన ప్రయత్నిస్తారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ఆయన తన వదిన వైయస్ విజయలక్ష్మి మీద పోటీ చేయనున్నారు. కడప పార్లమెంటు సీటులో వైయస్ జగన్‌పై తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పోటీకి దించుతున్నారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తనకు పదవులపై ఆశ లేదని, అయితే వైయస్ ఆశయాలు కొనసాగాలంటే తనను గెలిపించాలని ఆయన ఓటర్లతో చెప్పే అవకాశాలున్నాయి.

వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది.

మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వ్యూహానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది. వైయస్ రాజశేఖర రెడ్డి భూ కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో శాసనసభలో వివేకానంద రెడ్డి రెచ్చిపోయారు. తెలుగుదేశం సభ్యులపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. ఈ సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వివేకానంద రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆవేశకావేశాల మధ్య జరుగుతున్నదేమిటో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు అర్థం కాలేదు. అర్థమయ్యే సరికి దృశ్యం మారిపోయింది.

త్వరలో జరిగే పులివెందుల, కడప ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను తాను తప్ప మరెవరూ కాపాడలేరని చెప్పుకోవడానికి వైయస్ వివేకానంద రెడ్డి శాసనసభలో అంతగా రెచ్చిపోయారని కాస్తా ఆలస్యంగా వైయస్ జగన్ వర్గం గుర్తించింది. దీంతో అప్పటి వరకు వివేకాకు మద్దతుగా నిలిచిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు రివర్స్ గేర్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి వివేకానంద రెడ్డితో నాటకం ఆడించారని ఆడిపోసుకోవడం ప్రారంభించారు.

అతను కనిపించేవాడు కాదు,పాత్ర మాత్రమే కనిపించేది

నటుడు నూతన్ ప్రసాద్ ఇక లేరంటే నమ్మడం కష్టమే. బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్‌లో 1989లో ప్రమాదానికి గురై వీల్ చైర్‌కే పరిమితమైనప్పుడు ఒక్కసారి తెలుగు సినీ ప్రేక్షక లోకం ఓసారి విషాద సముద్రంలో మునిగిపోతే, ఇప్పుడు ఆయన మరణవార్త విని కన్నీటి సముద్రమైంది. తెలుగు సినీరంగంపై, ప్రేక్షక లోకంపై నూతన్ ప్రసాద్ వేసిన ముద్ర చిన్నదేమీ కాదు. విభిన్న పాత్రలను పోషించిన నూతన్ ప్రసాద్ ప్రేక్షకులకు ఆయన పోషించిన పాత్ర మాత్రమే కనిపించేది, అతను కనిపించేవాడు కాదు. సునిశితమైన హాస్యంతో విలనిజాన్ని పండించిన ఘనత నూతన్ ప్రసాద్‌కు దక్కుతుంది. తనదైన డిక్షన్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో నూతన్ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. నూటొక్క జిల్లాల అందగాడు ఎవరంటే ఇప్పటికీ ఆయనే.


నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10వ తేదీన కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. 1973లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన అందాల రాముడు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. రావుగోపాల రావుతో కలిసి విలనిజాన్ని అతను పండించాడు. ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేశాడు. హాస్య నటుడిగా, కెరీర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఆయన విభిన్న పాత్రలను పోషించాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేశాడు. పాత్రకు తగిన మ్యానరిజాన్ని చూపడంలో నూతన్ ప్రసాద్‌ది అందే వేసిన చేయి. నటనలో నూతన్ ప్రసాద్ తమను మించిపోతాడేమోనని సహ నటులు భయపడి పోటీ పడి నటించేవారట.

రాజాధిరాజ సినిమాలో నూతన్ ప్రసాద్ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది. కొత్తా దేవుడండీ అనే పాటకు ఆయన నటించిన తీరును తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన నోట వచ్చిన దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే డైలాగ్ అన్ని రంగాల్లో ఓ ఊతపదంలా మారింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి పలువురు అగ్ర హీరోలతో కలిసి ఆయన నటించారు. ఎవరితోనూ నూతన్ ప్రసాద్‌కు విభేదాలు గానీ గొడవలు గానీ లేకపోవడం, ఆయనపై ఫిర్యాదులు కూడా లేవు. గాసిప్స్ లేవు. అంటే, అతని వ్యక్తిత్వమేమిటో అర్థం చేసుకోవచ్చు.
తొలి తరం కథానాయకులతో ఎంత విస్తృతంగా ఆయన నటించారో, రెండో తరం కథానాయకులతోనూ అంతే విస్తృతంగా నటించారు. పట్నం వచ్చిన ప్రతివ్రతలు, ఖైదీ, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, కథానాయకుడు, అహ నా పెళ్లంట వంటి పలు చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. 1984లో నూతన్ ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డులు ఆయన విశిష్టతను వ్యక్తం చేయలేవు. ప్రేక్షకులపై, సినీ రంగంపై ఆయన వేసిన విశిష్ట ముద్ర ఎల్లకాలం నిలబడిపోతుంది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది. మొదట్లో భారత బౌలర్లను భయపెట్టిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. బలమైన భాగస్వామ్యం నెలకొనకుండా భారత బౌలర్లు పాకిస్తాన్‌ను కట్టడి చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఏ మాత్రం ప్రభావం చూపని స్పిన్నర్ హర్భజన్ ఈ మ్యాచు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అతను రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన యువరాజ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో భారత్ ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంకను ఎదుర్కుంటుంది. పాకిస్తాన్‌పై భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీ మ్యాచును చివరి దాకా చూశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా భారత విజయాన్ని ఆస్వాదించారు.


యువరాజ్ సింగ్ 103 పరుగుల పాకిస్తాన్ స్కోరు వద్ద కమ్రాన్ అక్మల్‌ను అవుట్ చేయడంతో పరుగుల వరదకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే 106 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ యూనిస్ ఖాన్‌ను అవుట్ చేసి పాకిస్తాన్ వెన్ను విరిచాడు. తొలి ఓవర్లలో ఏ మాత్రం ప్రభావం చూపని భారత ఫాస్ట్ బౌలర్లు ఆ తర్వాతి స్పెల్స్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. నెహ్రా చివరి ఓవర్లలో బాగా రాణించాడు. పాకిస్తాన్ స్కోర్ 142 పరుగులు ఉన్నప్పుడు ఉమర్ అక్మల్ అవుట్ కావడంతో దాదాపుగా భారత విజయం ఖాయమైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఆఫ్రిదీ దూకుడుగా ఆడి 184 పరుగుల వద్ద హర్భజన్ చేతిలో అవుటయ్యాడు.
నెహ్రా 199 పరుగుల వద్ద రియాజ్ వాహబ్‌ను, 208 పరుగుల వద్ద ఉమర్ గుల్‌ను అవుట్ చేశాడు. పాకిస్తాన్ అప్పటికి 23 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. పాకిస్తాన్ చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో మిస్బావుల్ హక్ అదరగొట్టాడు. ఆ తర్వాత మునాఫ్ పటేల్ ఓవర్‌లో అతను ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఆ స్థితిలో 49 ఓవర్లలో పాకిస్తాన్ 231 పరుగులు చేసింది. ఒక ఓవరులో పాకిస్తాన్ 30 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవరులో జహీర్ ఖాన్ పాకిస్తాన్‌ను పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. ఒక బంతి మిగిలి ఉండగా జహీర్ చివరి వికెట్‌ను పడగొట్టాడు. దీంతో భారత్ విజయాన్ని అందుకుంది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో అదరగొట్టింది. వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్సు తర్వాత భారత్ ఆ వేగాన్ని ఏ సందర్భంలోనూ అందుకోలేకపోయింది. భారత బ్యాట్స్‌మెన్ పేలవమైన ఆటనే ప్రదర్సించారని చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 260 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్ టెండూల్కర్ కాస్తా మెరుగ్గా కనిపించాడు. అతనికి కూడా నాలుగు లైఫ్‌లు వచ్చాయి. సెహ్వాగ్ 38 పరుగులకు అవుట్ కాగా, టెండూల్కర్ 85 పరగులు చేశాడు. చివర్లో సురేష్ రైనా కాస్తా మెరుగ్గా ఆడి 36 పరగులు చేయడం వల్ల ఆ కాస్తా స్కోరునైనా చేయగలిగింది. ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా రాణించిన యువరాజ్ సింగ్ డకౌట్ కావడం భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోరే చేశాడు.

పాకిస్తాన్ బౌలర్ వాహబ్ రియాజ్ భారత బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచులో అతను ఐదు భారత వికెట్లు పడగొట్టాడు. షోయబ్ అక్తర్‌ను పక్కన పెట్టి తనను తీసుకున్నందుకు తగిన ప్రతిఫలాన్ని పాకిస్తాన్‌కు అందించాడు. ఎప్పటిలాగే భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగులో విఫలమయ్యాడు.