8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఈటెల్లాంటి మాటలు వల్ల కలిగే బాధ ఎలాటిదో తెలిసి కూడా మాటలు విసురుతూ ఉంటారు...

..ఎందుకిలా..
ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు..
ఇదేమి న్యాయం అని అడగకోడదంటారు...
కొన్ని సార్లు నిజాలు చెప్పకూడదంటారు...
ఒక వేలు మనవైపు చూపితే,తమ మూడు వేళ్ళు తమనే చూపుతాయని తెలిసినా
భూతద్దంలోంచి మన తప్పులెంచుతూంటారు...
ఎవరి తప్పువు వారికెందుకు కనబడవు?
ఇతరుల విషయాల్లో జోక్యాలెందుకు?

ఈటెల్లాంటి మాటలు వల్ల కలిగే బాధ ఎలాటిదో తెలిసి కూడా మాటలు విసురుతూ ఉంటారు...
విరిగిన మనసుని మళ్ళీ మళ్ళీ ముక్కలు చేస్తూనే ఉంటారు...
పొందిన సాయాన్నీ మరుస్తూనే ఉంటారు...
మంచితనాన్ని వాడుకుంటూనే ఉంటారు...
నమ్మకాన్ని విరిచేస్తూనే ఉంటారు...
ఎవరి పని వారెందుకు చేసుకోరు?
ఎవరిష్టం వారిదని ఎందుకు వదిలెయ్యరు?
ఎవరి దారినవారెందుకు పోరు?

ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు...
ఎందుకిలా...

కాంగ్రెసు, తెలుగుదేశం,వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమాయత్తమయ్యాయి.

కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సమాయత్తమయ్యాయి. పులివెందుల శాసనసభా స్థానానికి అభ్యర్థులను ఖరారు చేయడంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పెద్దగా ఆలోచన చేయలేదు. పులివెందులలో వైయస్ విజయమ్మపై కాంగ్రెసు అభ్యర్థిగా మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎం. రవీంద్రనాథ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. అయితే, వైయస్ జగన్‌పై పోటీకి దించేందుకు సరైన అభ్యర్థులపైనే రెండు పార్టీలు కూడా తీవ్రంగా కసరత్తు చేశాయి.


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోకసభ స్థానానికి పలువురు అభ్యర్థులను పరిశీలించి ఎట్టకేలకు మైసురా రెడ్డి పేరును ఖరారు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డికి, మైసురా రెడ్డికి మొదటి నుంచి పడదు. కాంగ్రెసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం పెరగడంతో మైసురా రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వైయస్ కుటుంబంతో మైసురాకు ఉన్న వైరాన్ని ఈ ఎన్నికలో వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకోవచ్చు. మైసురా రెడ్డి గతంలో కూడా కడప లోకసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

కాగా, కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఖరారు కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దఫాలు దఫాలుగా కసరత్తు చేస్తున్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పేరుతో పాటు పలువురి పేర్లను వారు గత రెండు మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. కానీ బుధవారం సాయంత్రం వరకు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. అయితే, ప్రస్తుతం వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసులోకి వస్తున్న కందుల రాజమోహన్ రెడ్డిని వైయస్ జగన్‌పై కడప లోకసభ స్థానంలో పోటీకి పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కందుల రాజమోహన్ రెడ్డితో డిఎస్, కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం చర్చలు జరిపారు. మొత్తం మీద, కడపలో పోటీకి మూడు పార్టీల అభ్యర్థులు మోహరించినట్లే భావించాలి.

సత్య సాయి సెంట్రల్ ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనంలోకి !!??

సత్యసాయిబాబా ఆరోగ్యం కోసం వేలాది మంది భక్తులు పూజలు, హోమాలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. సత్యసాయి ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ట్రస్టు సభ్యుల్లో సత్య సాయి సోదరుడు జానకీరామ్ కుమారుడు రత్నాకర్ మాత్రమే ఉన్నారు. సత్య సాయి బాబా తన వారసుడిని కూడా ప్రకటించలేదు. ఈ స్థితిలో పుట్టపర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని మంగళవారం సాయంత్రమే పంపింది. ఈ బృందం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాలను అధ్యయనం చేస్తోంది.


ప్రభుత్వ ప్రతినిధి బృందంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రఘు రాజు, ఉస్మానియా ఆస్పత్రి కార్డియోలజిస్టు డాక్టర్ లక్ష్మణ రావు, ఉస్మానియా ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భాను ప్రసాద్ ఉన్నారు. ఈ బృందం సత్యసాయి బాబా ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతుందని అంటున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలను కొ నసాగించడానికి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయనే విషయాన్ని ట్రస్టు సభ్యులతో మాట్లాడి సభ్యులు పరిశీలిస్తున్నారు.

ఆదాయం పన్ను శాఖ అంచనాల ప్రకారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 40 వేల కోట్ల విలువ చేస్తుంది. ట్రస్టుకు వచ్చే విరాళాలపై పూర్తిగా పన్ను రాయితీ ఉంది. విదేశాల నుంచి ట్రస్టుకు ఏటా వందలాది కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. జమాఖర్చుల వ్యవహారాలకు సంబంధించిన సరైన యంత్రాంగం ఉందా, లేదా అనే విషయంతో పాటు ట్రస్టును స్వాధీనంలోకి తీసుకునే విషయంపై కూడా సుబ్రహ్మణ్యం దృష్టి పెడతారని అంటున్నారు.

సత్య సాయి సెంట్రల్ ట్రస్టు స్వాధీనంలో పుట్టపర్తిలో విశ్వవిద్యాలయ సముదాయం, స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రపంచ మత సంబంధం మ్యూజియం చైతన్య జ్యోతి, ప్లానిటోరియం, రైల్వే స్టేషన్, హిల్ వ్యూ స్టేడియం, సంగీత కళాశాల, పాలనా భవనం, విమానాశ్రయం, ఇండోర్ స్టేడియం, క్రీడాప్రాంగణం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో 1,200 సత్య సాయిబాబా కేంద్రాలున్నాయి. ఇవి పాఠశాలలను, ఆరోగ్య, సాంస్కృతిక కేంద్రాలను నడుపుతున్నాయి

జ 'గన్' ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ విషయం జగన్‌కు తెలుసు. అందుకే, ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనవి అని ఆయన చెబుతూనే ఉన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జగన్ రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసేయాలనే పట్టుదలతో కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ ఉప ఎన్నికలపై దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.


ముఖ్యంగా ఆయన కడప లోకసభ స్థానంపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీని సాధ్యమైనంత ఎక్కువగా బలహీనపరిచి, జగన్‌కు దీటుగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇందులో భాగంగానే కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి సోదరులను తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోకసభ టికెట్ ఇవ్వాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు.

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి పోటీకి సిద్ధపడడంతో కాంగ్రెసు ఓట్లు చీలిపోతాయని, దాని ద్వారా లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ కొట్టి, జగన్‌పై ఆధిపత్యం సాధించడానికే కందుల బ్రదర్స్‌ను ముఖ్యమంత్రి కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నారు.

కడప లోకసభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంటున్న స్థితిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను చిత్తు చేసి, విజయం సాధించాలని జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగు ఉండదని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు తన పార్టీలో పెద్ద యెత్తున చేరుతారని జగన్ భావిస్తున్నారు. ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయం కూడా ఆయనకు తెలుసు. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఓడించేందుకు జగన్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు.