26, ఫిబ్రవరి 2011, శనివారం

బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం

"హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో మాట్లాడుదాం. హల్లో భిక్షు! అసెంబ్లీలో ఏం జరుగుతోంది!"

"హల్లో...ఆ..హల్లో...."

"ఆ...హల్లొ! భిక్షు, నేను ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి...అసెంబ్లీలో ఏం జరుగుతోంది?"

"వెంకట్! రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ వివరాలను చదివేందుకు రాబోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా కనబడే రెడ్డిగారు ఈరోజు మరింత హుందాగా ఆఫీసు గదిలోకి అడుగుపెట్టడం మేము చూసాం. చాలా సాధారణమైన దుస్తులతో వచ్చారు."

"భిక్షు! సాధారణమైన దుస్తులు అన్నారు. అవేంటో మన ప్రేక్షకులకి వివరించగలరా?"

"వెంకట్! తెలుపు కలర్ సిల్కు చొక్కా, తెలుపు కలర్ రెమాండ్స్ ప్యాంటు, రెండు మూడు బంగారు ఉంగరాలు, ఒమేగా వాచు మొదలైనవి"

"థాంక్స్ భిక్షు! మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి మేమూ మిమ్మల్ని ఫాలో అవుతాము"

**********

"వెంకట్! అసెంబ్లీలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ఆర్థిక మంత్రి ఆనం రెడ్డి గారు తమ సిల్కు రెమాండ్స్ దుస్తుల్ని వదిలేసి తెల్ల కాటన్ పంచె, ఎర్ర చొక్కా, పసుపు తలపాగాతో భుజం మీద తంబూర మోసుకొని మైకు ముందుకు వచ్చారు. ఆయనకు ఎడంవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గులాబీ కలర్ పంచె మీద నలుపు చొక్కా వేసుకొని డప్పు పట్టుకొని నిలబడ్డారు. మరో వైపు గీతారెడ్దిగారు తామర మొగ్గలున్న కాషాయం కలర్ చీరలో డప్పు పట్టుకొని నిలబడున్నారు"

"అలాగా! అసలిదంతా దేనికి జరుగుతోంది భిక్షు?"

"ఆగండి వెంకట్! ఆనంగారేదో ఆడబోతున్నారు!"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా"

నల్లారి & గీత: "ఆహా", "ఓహో"

ఆనం: "కనరా తింగరి తెలుగువాడా! అంకెల తీరులను!

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "ఒక్కటి పక్కన సున్నాలు పేర్చి, బడ్జెట్టు కూర్చేము"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "కూర్చిన బడ్జెట్ కూర్చుని చెబితే బోరుగ ఉండేను"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "బోరే కొడితే మీరంతా బలు గురకలు పెట్టేరు"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "అందుకోసమే చిందులు వేస్తూ, వందలు వేల లక్షలు తెచ్చి, ఎలెక్షన్లలో వాగ్దానాలకు కలెక్షన్లతో కనెక్షనిచ్చి ఈ బడ్జెట్ తెచ్చాము"

నల్లారి & గీత: "తందానా...తందానా బల్ దేవ తందనానా"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా...అయ్యలారా, అమ్మలారా! సోనియా మేడమ్ ఘనమైన ఆశీర్వాదాలతో, చచ్చి పరలోకములో ప్రజా సంక్షేమం చింతిస్తున్న వైయెస్సార్ ఆత్మ సాక్షిగా, మేము ప్రతిపాదిస్తున్నాము మరో లక్ష కోట్ల బడ్జెట్...ఈ బడ్జెట్ లోని అంశాలేవయ్యా అంటే... "

నల్లారి & గీత: "ఏవయ్యా!"

ఆనం: "బోధన ఫీజులు చెల్లించలేము"

నల్లారి & గీత: "లేము"

ఆనం: "చేనేత కార్మికులనాదుకోము"

నల్లారి & గీత: "కోము"

ఆనం: "బడుగు రైతుల బకాయిలన్నీ...."

నల్లారి & గీత: "అన్నీ..."

ఆనం: "మాఫీ చెయ్యలేము"

నల్లారి & గీత: "తందాన బల్ తానె తందన...తానె తందనానా"

**********

"వెంకట్! గట్టిగట్టివన్నీ గాలికి కొట్టుకుపోతే పుల్లిస్తరాకు గతేంటన్నట్టు ఆనంగారు, వారి వంతలు వంతులేసుకుని పాడుతున్నారు. ఈ "బుర్ర" క(వ్య)ధ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. మన సాటిలైటు బిల్లు పెరక్కముందే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తే మేలు. జై హింద్!"

1 కామెంట్‌:

SHANKAR.S చెప్పారు...

నానీ బుర్రకధ అద్భుతంగా ఉంది నానీ
నానీ చెప్పండి ఈ కధ చెప్పేటప్పుడు ఆనం మొహం లో ఆందోళన, సిగ్గుశరం, బాధ లాంటి ఎమోషన్స్ ఏమయినా పొరపాటున గానీ కనబడ్డాయా
నానీ చెప్పండి ఈ బుర్రకధ విషయమై చంద్రబాబు స్పందనేంటి?
హల్లో.....
నానీ
(ప్రేక్షకుల కేసి తిరిగి) క్షమించాలి సిగ్నల్ సరిగ్గాలేదు
హల్లో
నానీ