ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ?
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ?
మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే !
అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది.
దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ?
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు.
అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.
మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
Thank you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి