నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంభాదాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.
అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి