29, మార్చి 2011, మంగళవారం

వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే!

ఎక్కడ చూసినా ప్రకటనలే ఇది కొను, అది కొను, మా బ్రాండ్ అంటే మా బ్రాండ్ అంటూ మనల్ని తికమక పెట్టి, మనకు పనికి వచ్చేదో , ఎక్కువసార్లు ఎందుకూ కొరగాని వస్తువులో, సర్వీసెస్ పేరిటో మన చేత అనవసరపు ఖర్చు చేయిస్తున్నాయి ఈ వ్యాపార ప్రకటనలు. వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే! అంతగా పాకిపోయ్యి కాలుష్య దశకు చేరుకున్నది ఈ వ్యాపార ప్రకటన పిచ్చి.

అవసరం ఉన్నా లేక పోయినా ప్రతి ఉత్పత్తిదారు, చివరకి మధ్య దళారులు కూడా ఎక్కడ పడితే అక్కడే ప్రకటనలను గుప్పించటం, ఒకటో రెండో గీతాలు గీసేసి వాటిని బ్రాండ్ అన్న పేరుతొ మనకు కలల్లో కూడా అవ్వే వచ్చేట్టుగా చెయ్యటం . ఏమన్నా అంటే "Top of Mind Awareness" ట, అంటే ఎల్లాప్పుడూ వాళ్ళ బ్రాండే మనకు గుర్తుకు రావాలని ప్రతివాడి తాపత్రయం.

చివరకు జరిగేది ఏమిటి. తామర తంపరలా పెరిగిపోయిన ఈ వ్యాపార ప్రకటనలు, రోడ్ల మీద, రేడియోలో, టి విల్లో సరే సరి, డివైడర్ల మీద, పత్రికల్లో , మాగాజైన్లల్లో, రైలు పెట్టెల మీద, ఇలా ఎందెందు వెదికిన అందే కలదు ఈ ప్రకటనా గరళం. మనల్ని తోచుకోనివ్వకుండా వెంటాడి వెంటాడి ఏమైనా సరే వాళ్ళు చెప్పిన వస్తువుల్ని కోనేట్టుగా ప్రేరేరింప చెయ్యటమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశ్యం.

మనచేత ఈ కాలుష్యాన్ని (శబ్ద, చిత్ర అంతకంటే ప్రమాదకరమైన మానసిక కాలుష్యం) మనకు తెలియకుండానే మన మస్తిష్కాల్లోకి మెల్లి మెల్లి గా (like slow poison) ఎక్కిస్తున్నది ఈ వ్యాపార ప్రకటనల మాఫియా.

ఈ మధ్య ఒక ప్రకటన టి విల్లో తెగ గుప్పిస్తున్నారు. అందులో ఒక బేవార్సు గాడు కార్లో దిగి పనికి రాని చెత్త డైలాగు వల్లిస్తూ, అక్కడే బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయిని తన సెల్ ఫోన్ లో ఫోటో తియ్యబోతాడు. ఆ ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు ఈ యాడ్ హీరో వచ్చి దీంట్లో తీసుకో అని తన దగ్గర ఉన్న సెల్ ఇవ్వబోతాడు. ఇది ఆ సెల్ ఫోన్ కొనమని చెప్పే వ్యాపార ప్రకటన తీరు. ఇటువంటి యాడ్ల వల్ల చిన్న పిల్లలకు ఏ విధమైన సందేశం వెళ్తున్నది అన్న జ్ఞానం అటు యాడ్ చేసినవాడికీ లేదు, ఇటు చూపించే టి వి వాళ్ళకూ లేదు . ఇది ప్రస్తుతం ఈ యాడ్ మాఫియా తీరు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది.

కామెంట్‌లు లేవు: