14, మార్చి 2011, సోమవారం

తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండుని ఆంధ్రరాష్ట్ర డిమాండుతో పోలుస్తూ చేస్తున్న ఈ అనవసరమైన పోలిక గుఱించి గత కొద్దికాలంగా వింటున్నాం. పూర్వ మద్రాసు రాష్ట్రం ఏకజాతిరాష్ట్రం కాదు. అది ప్రజాభీష్టంతో, ప్రజాస్వామికంగా ఏర్పడ్డది కాదు. వలసపాలకుల సౌలభ్యార్థం నానాజాతుల కిచిడీగా సృష్టించబడింది. ఆ కిచిడీ నుంచి బయటపడి ఏకజాతిరాష్ట్రాల్ని ఏర్పఱచాలనే ఉద్దేశంతో ప్రారంభమైనవి భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం మొదలైన ఆందోళనలు. భాషాజాతులూ, భాషారాష్ట్రాలూ ఇంగ్లీషువారీ దేశంలో అడుగుపెట్టక ముందునుంచి ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ఏర్పడక ముందునుంచి ఉన్నాయి. అవే నిఖార్సైన నిజమైన సహజమైన యూనిట్లు. పరిపాలనలో ఆ సహజత్వం, ఆ సమగ్రత్వం కోసమే భాషారాష్ట్రాలు. అంతే తప్ప ఒకే జాతికి, ఒకే మతానికీ, ఒకే భాషకూ, ఒకే సాంస్కృతిక వారసత్వానికీ చెందిన, రెండు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒకఱిని దోపిడీదారులుగా, ఇంకొకఱిని బానిసలుగా వర్ణించడం, వివాదాల పరిష్కారానికి ఉన్న అన్ని శాంతియుత మార్గాల్నీ వర్జించడం నిజంగా జాతిద్రోహమే అవుతుంది. misleading అవుతుంది. రాజకీయప్రయోజనాల కోసం – శాంతియుతంగా అన్నదమ్ముల్లా దశాబ్దాల తరబడి పక్కపక్కనే కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య లేని శత్రుత్వాల్ని పనిగట్టుకొని సృష్టించడం అవుతుంది. అదే జాతిద్రోహం. ఇతరులపై ఒకప్పుడు మనం ప్రయోగించిన ఈ “దోపిడీ” ఎట్సెటరా కమ్యూనిస్టు పదజాలాన్ని మనలో మనం మనవాళ్ళ మీద, మన స్వదేశీయుల మీద, మన స్వరాష్ట్రీయుల మీద ప్రయోగించడం పూర్తి అసహజం, అసమంజసం. ఉద్యమం వేడిలో మీకిది అర్థం కాకపోవచ్చు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఇందుకు చరిత్రగ్రంథాలే సాక్షి. ఈనాడు కొందఱు బయల్దేఱి “ఈ సెటప్పు మాకు నచ్చలేదు, మార్చండి” అంటే అది సాధ్యపడదు. సాధ్యపడ్డానికి ఇదేమీ మన వ్యక్తిగత జీవితం కాదు. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాతిద్రోహం కాకపోవచ్చు. కానీ ఇది జాతిద్రోహంగా నెమ్మదిగా పరిణమిస్తుంది. ఇప్పటికే పరిణమిస్తున్నది. ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు

కామెంట్‌లు లేవు: