25, మార్చి 2011, శుక్రవారం

ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం.

హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు.. ఆదాయంపై ధ్యాస తప్ప! మన పట్లా, మనం చేసే పని పట్లా, సమాజం పట్లా బాధ్యతని విస్మరిస్తూనే హక్కుల కోసం ఉద్యమిస్తుంటాం. మన ధర్మాన్ని గాలికొదిలేసి నిరంతరం మన క్షేమం పట్లే మమకారం పెంచుకోవడం ఎంత దౌర్భాగ్యస్థితో అర్థమయ్యేటంత సున్నితత్వం మనలో ఇంకా మిగిలి లేదు. చేసే పని పట్ల నిర్లక్ష్యం ఎంత ఉపేక్షించరానిదో అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేము. మన పొరబాట్ల పట్ల అపరాధభావం కూడా మచ్చుకైనా కన్పించకుండా పోతోంది. పరోక్షంగా మన మనఃసాక్షికే జవాబుదారీగా ఉండడం ఎప్పుడో మానేశాం. మన శరీరాలు మందమవుతున్నాయి, బుద్ధులు సంకుచితమవుతున్నాయి. వితండవాదం, తర్కంతో మూర్ఖంగా అన్నీ నెగ్గించుకునే రాక్షస ప్రవృతి మనల్ని స్వారీ చేస్తోంది. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం. ఒకవేళ విన్పించుకునే హృదయం ఇంకా మిగిలి ఉన్నా ప్రతీ ఒక్కరూ హక్కులనూ దక్కించుకోమని ప్రబోధించేవారే.. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించమని నిర్దేశించేవారేరీ? అందరూ మనలాంటి ప్రజల పక్షాన హక్కులకై పోరాడతారు.. హక్కులను సాధించుకోమని ప్రేరేపిస్తారు.. ఏదైనా తేడా వస్తే వ్యవస్థని దుమ్మెత్తిపోస్తారు. వ్యవస్థని పతనావస్థకు చేరుస్తున్నది చేతులారా మనకు మనం కాదా? హక్కుల గురించి పోరాడేవారు బాధ్యతలను ఎందుకు ఉద్భోధించరు? సరిగ్గా పనిచేయమంటే అసలుకే మోసం వస్తుందని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతని విస్మరించడం ఎంతవరకూ సబబు? అసలు ప్రతీ మనిషీ తాను చేయాల్సిన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే వ్యవస్థలో లోపాలెందుకు ఉంటాయి?

బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి. ఇదో గొప్ప జీవనశైలీ.. దీన్ని మళ్లీ పద్ధతిగా గడుపుకొస్తున్న జీవితంగా అందరికీ చెప్పుకుని మురిసిపోవడం! ఫలానాది దక్కాలని పోరాడి.. అంతకన్నా పెద్దది మనం చేయాల్సి ఉండీ కూడా నిమ్మళంగా దాటేసి జీవితంలో ఎంతో సాధించామని మురిసిపోవడం ఎంతగా పాతాళానికి దిగజారిపోయామో తేటతెల్లం చేస్తుంది. హక్కులను వదులుకోమని ఎవరూ చెప్పరు.. కానీ హక్కుల కన్నా మన బాధ్యతలు చాలా శక్తివంతమైనవనీ.. హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.

కామెంట్‌లు లేవు: