8, మే 2011, ఆదివారం

వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎటు వైపు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎటు వైపు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ ముందుకు సాగుతుంటే, వైయస్ తమ వాడేనని కాంగ్రెసు నాయకులు చెబుకుంటున్నారు. వైయస్సార్ చరిష్మాను, అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి రెండు పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ పడ్డాయి.

వైయస్ రాజశేఖర రెడ్డికి సొంత అభిమానులున్నారు. ఆయనకు సొంత ప్రజాదరణ ఉంది. ఆ ప్రజాదరణను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగానే ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా తమ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రయత్నం చేశారు. వైయస్ పథకాలన్నీ కాంగ్రెసు పార్టీవేనని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతగానే కొనసాగారని, అలా కొనసాగడానికి మాత్రమే ఇష్టపడ్డారని వారు ప్రజలకు నచ్చజెప్పి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వైయస్సార్ రాజశేఖర రెడ్డి పథకాలకు కాంగ్రెసు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సూటిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు.

వైయస్సార్ అభిమానులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, కాంగ్రెసు పార్టీకి మధ్య చీలుతాయా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. వైయస్ జగన్ చీలిక వర్గం కాంగ్రెసుకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. పులివెందుల ఓటర్లు మాత్రం వైయస్ విజయమ్మ, వైయస్ వివేకానంద రెడ్డిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనే డైలమాలో పడ్డారు. వీరిద్దరి మధ్యనే పులివెందులలో ప్రధానమైన పోటీ ఉండే అవకాశాలున్నాయి. పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవిని స్థానికంగా కొంత మంది పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో బిటెక్ రవి పోటీలో ఉంటారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. కడప లోకసభ స్థానంలో మాత్రం వైయస్సార్ అభిమానులు జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయి

కామెంట్‌లు లేవు: